Official TS Board Solutions for Class 9 Telugu: Lesson 10 Vagbhushanam
Explore reliable textbook solutions for Lesson 10 Vagbhushanam tailored for Class 9 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Telugu: Lesson 10 Vagbhushanam
View or download the dedicated Lesson 10 Vagbhushanam solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
ప్రారంభ ప్రశ్నలు
Question 1: ఈ కవితను ఎవరు రాశారు ? ఇది దేని గురించి చెప్పుతుంది ?
Answer:
ఈ కవితను వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారు. ఇది ‘వాక్ఛక్తి’ ని గురించి చెపుతోంది.
Exam Tips:
a) కవి పేరు (వేముగంటి నరసింహాచార్యులు), కవిత విషయం (వాక్ఛక్తి) – రెండు భాగాలకూ విడివిడిగా జవాబు రాయండి.
b) రెండు వాక్యాల్లో ముగిస్తే సరిపోతుంది.
Question 2: మాటల గొప్పతనం ఏమిటి ?
Answer:
1. మాటలు బాటలు వేస్తాయి.
2. మాటలు పాటలు రాస్తాయి.
3. మాటలు లేకపోతే కవిత్వం లేదు.
4. మాటలు లేకపోతే సంగీతం లేదు.
5. మాటలు లేకపోతే నాగరికత, నవ్యత లేవు.
6. జాగృతి, చైతన్యం లేవు.
Exam Tips:
a) కవిత నుండి ‘మాటలు బాటలు వేస్తాయి’ వంటి పంక్తులను వరుసగా పాయింట్లుగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.
Question 3: మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి?
Answer:
మంచిగా మాట్లాడడం అంటే, శ్రోతల మనస్సులకు ఆనందాన్ని కలిగించేలా, మంచి విషయంతో, మంచి కంఠధ్వనితో, ఎక్కువ సేపు కాకుండా, క్లుప్తంగా మాట్లాడడం.
Exam Tips:
a) ‘మంచిగా’ అంటే ఏమిటో మూడు అంశాలు (మంచి విషయం, మంచి కంఠధ్వని, క్లుప్తత) తప్పక పేర్కొనండి.
Question 4: వాక్ఛక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది ?
Answer:
వాక్ఛక్తి మాటలోని శక్తి. వాగ్రక్తి – మాట యందు ఆసక్తి. ఈ వాక్ఛక్తి, వెలుగును చూపించి, ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందువల్ల వాక్కునందు రక్తి అనగా ఆసక్తిని కలిగియుండాలి.
Exam Tips:
a) వాక్ఛక్తి (మాటలోని శక్తి), వాగ్రక్తి (మాట యందు ఆసక్తి) – రెండు పదాలకు వేర్వేరు అర్థాలు రాయండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 101)
Question 1: “సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటే భాషణం మంచి సాధనం” – దీనిపై చర్చించండి.
Answer:
ఈ రోజు సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, జనాభా సమస్య, బాలకార్మిక వ్యవస్థ, చంటి పిల్లల ఆరోగ్య సమస్య, వివాహాలలో అధిక ఖర్చులు మొదలైనవి.
ఎవరి మట్టుకు వారు ఇటువంటి సమస్యలను గురించి వాటి పరిష్కార మార్గాలను గురించి తమకు తెలిసినా, మాకెందుకులే అని మాట్లాడక ఊరుకుంటున్నారు. తామొక్కరూ ఏమి చేయలేమని నిశ్శబ్దం వహిస్తున్నారు. అట్లా కాకుండా, కర్తవ్యాన్ని గూర్చి, పరిష్కారాలను గూర్చి, ప్రతివ్యక్తి గొంతెత్తి మాట్లాడితే. క్రమంగా ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది.
Exam Tips:
a) పర్యావరణ కాలుష్యం, జనాభా వంటి ఒకటి రెండు ఉదాహరణలతో మీ అభిప్రాయాన్ని సమర్థించండి.
b) ‘మౌనం’ వల్ల నష్టం, ‘భాషణం’ వల్ల లాభం అని పోలిక చూపండి.
Question 2: “మనిషికీ, పశువుకీ ప్రధాన భేదం వాక్కు” అన్నాడు. రచయిత – అటువంటి వాక్శక్తిని ఎట్లా పెంపొందించు కుంటారు?
Answer:
కొంత సాహసించి, కొంత ప్రయత్నించి, తనలోని పఠనశక్తిని వెలికితీసి ప్రయోగించాలి. ప్రతివ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల వక్తృత్వ కళలో నేర్పు సంపాదించగలుగుతాడు.
Exam Tips:
a) ‘కొంత సాహసం, కొంత ప్రయత్నం, నిరంతర సాధన’ అనే మూడు సూత్రాలు జవాబులో ఉండాలి.
Question 3: “వక్తృత్వశక్తి ఆత్మశక్తికి మరో పేరు” ఎట్లాగో చెప్పండి.
Answer:
వక్తృత్వం చెప్పగల శక్తి తనకున్నదని, ముందుగా అతడు తన ఆత్మలో గట్టిగా నమ్మకం కలిగి ఉండాలి. తనకు మాట్లాడే శక్తి ఉన్నదని ఆత్మ విశ్వాసం కలిగియుండాలి. తనలో ఆ శక్తి ఉందని గుర్తిస్తే, మానవ జీవితం సఫలం అవుతుంది.
Exam Tips:
a) ‘ఆత్మవిశ్వాసం’ అనే పదాన్ని తప్పక వాడండి; ఆత్మశక్తికి, వక్తృత్వానికి సంబంధం చూపండి.
Question 4: వాక్శక్తిని అర్థం చేసుకుంటే ఏ.ఏ రంగాల్లో రాణించ వచ్చు? చర్చించండి.
Answer:
వాక్శక్తిని అర్థం చేసుకుంటే, గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వేపనివారు, ప్రచురణకర్తలు, ఇంకా ఎన్నో వృత్తులలో ఉన్నవాళ్ళు రాణింపవచ్చు. వారు తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.
Exam Tips:
a) గణకులు, వైద్యులు, న్యాయవాదులు వంటి కనీసం నాలుగు రంగాలను పేర్కొనండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 103)
Question 1: ‘అన్ని కళలకెల్లా ఉత్తమమైనది వక్తృత్వకళ” దీని ప్రయోజనాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
Answer:
సహృదయులైన వక్తలు వక్తృత్వాన్ని సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉపన్యాసాల వల్ల ప్రజల హృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది.
అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. ఏడ్పు వస్తుంది. వారు కార్యం చేయడానికి సిద్ధమవుతారు. నవరసాలతో నిండిన హృదయాలు కలవారవుతారు.
Exam Tips:
a) వక్తృత్వం సాహిత్య ప్రచారానికి, ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి ఉపయోగపడుతుందని ఉదాహరణలతో రాయండి.
Question 2: ‘మాట్లాడటం సాహసమే’ అని రచయిత ఎందుకు అన్నాడు?
Answer:
శ్రోతల ఎదుట మాట్లాడడం, నవ్వులాటగాదు. అది సాహసం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు భయం కలుగుతుంది. మనం పెద్దగా చదువుకోలేదనే జంకు కల్గుతుంది. ఒకప్పుడు సభలో వక్త కంటే ఎక్కువగా చదువుకున్నవారు ఉంటారు. వారు వక్త ఉపన్యాసంలో దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఉపన్యాసానికి బాగా సన్నద్ధత కావాలి. ఒకప్పుడు సన్నద్ధం అయినా, నిలబడేటప్పటికి వక్తలు విషయం మరచిపోతూ ఉంటారు. ఒకప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అందువల్లనే రచయిత మాట్లాడడం సాహసమే అని చెప్పాడు.
Exam Tips:
a) భయం, న్యూనతాభావం, విషయం మరచిపోవడం – ఈ కారణాలను పాఠం ఆధారంగా వరుసగా రాయండి.
Question 3: ‘భయాన్ని – అనుమానాన్ని వదులుకున్నవాడు వక్త కాగలడు’ – దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
Answer:
భయంలేనివాడు అజేయుడు. భయాన్ని వదలుకుంటే భాషలో స్పష్టత వస్తుంది. వక్త తాను ఎలా మాట్లాడుతున్నానో అనే చింతను విడిచిపెట్టాలి. సభలో నిలబడి తన మనస్సులో ఉన్న భావాన్ని జడుసుకోకుండా, సిగ్గుపడకుండా ధారాప్రవాహంగా చెప్పాలి.
భయాన్ని, అనుమానాన్ని వదిలిపెట్టి మాట్లాడితే నిజంగానే గొప్ప వక్త అవుతాడని నా అభిప్రాయము.
Exam Tips:
a) ‘భయంలేనివాడు అజేయుడు’ అనే పాఠంలోని మాటను ఉదహరించి మీ సొంత అభిప్రాయం రాయండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 104)
Question 1: “విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం ఒక ఇతిహాసఘట్టం” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
Answer:
నిజమే. ఆనాడు విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి “భారతీయధర్మం, అన్ని మతాల్నీ గౌరవిస్తుందనీ, అంగీకరిస్తుందనీ, అన్ని మతాలూ సత్యాలేననీ, అన్ని మతాలూ భగవంతుడిని చేరుకోడానికి మార్గాలేననీ చెప్పాడు. తన మతమే నిలవాలని అనుకొనేవారు, బావిలో కప్పలాంటి వారని సత్యాన్ని ప్రకటించాడు. అందువల్ల ఆ ఉపన్యాసం, నిజంగానే ఒక ఇతిహాసిక ఘట్టం.
Exam Tips:
a) వివేకానందుని చికాగో ఉపన్యాసంలోని ముఖ్యాంశం (అన్ని మతాల పట్ల గౌరవం) తప్పక రాయండి.
Question 2: ఉపన్యాసానికి ముందు ప్రణాళిక అవసరం. ఎందుకు?
Answer:
ఉపన్యాసం చెప్పేటప్పుడు వక్తలు, అప్పుడప్పుడు చెప్పే విషయాన్ని వదలి, ఇతర విషయాలను గూర్చి. మాట్లాడుతూ ఉంటారు. వక్త యొక్క వాగ్ధార ఎక్కడైనా ఆగిపోవచ్చు. వక్త ఒక్కొక్కసారి చెపుతూ చెపుతూ ఆగిపోతాడు. అతడు మధ్య మధ్య అనుమానాలు వచ్చి, నీళ్ళు నమలవలసి వస్తుంది. అందువల్ల ప్రసంగించడానికి ముందు ప్రణాళిక అవసరం.
Exam Tips:
a) ప్రణాళిక లేకపోతే విషయం తప్పడం, నీళ్ళు నమలడం జరుగుతాయని కారణాలను స్పష్టంగా రాయండి.
Question 3: వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం. ఎందుకో చెప్పండి ?
Answer:
వక్తకు సమానార్థక పదాలతోనూ, పర్యాయవాచకాలతోనూ మంచి పరిచయం ఉండాలి. అప్పుడే అతడు యథోచితంగా వాటిని ప్రయోగించగలడు. సభలోని సభ్యుల జ్ఞాన పరిమితికి తగిన పదజాలం వక్త ఉపన్యాసంలో వాడాలి. పెద్దల సభలో, విజ్ఞుల సభలో కఠిన పదాలు, వ్యంగ్యార్థాల పదాలు వాడితే రమణీయంగా ఉంటుంది. చిన్న పిల్లల సభల్లో, సామాన్యుల సభల్లో అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. కాబట్టి వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం.
Exam Tips:
a) పెద్దల సభ, పిల్లల సభ – శ్రోతలకు తగిన పదజాలం మార్చుకోవాలనే విషయాన్ని ఉదాహరణగా చూపండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 106)
Question 1: వక్తకు జ్ఞాపకశక్తి ఎట్లా ఉపయోగపడుతుంది ?
Answer:
వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఉపన్యాసానికి ముందే బాగా ప్రణాళిక ప్రకారం సిద్ధమైనా, మాటిమాటికీ కాగితం చూస్తూ మాట్లాడితే ఉపన్యాసం రంజుగా సాగదు. మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. చెప్ప దలచుకున్న విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను చీటీపై వ్రాసుకొని, ఏ అంశాన్నీ మరిచి పోకుండా, క్రమబద్ధంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి ఉంటే విషయాన్ని ధారాప్రవాహంగా, పూర్వకవుల పద్యాలు, శ్లోకాలు ఉదాహరిస్తూ, వాటిని వ్యాఖ్యానిస్తూ, సొగసుగా మాట్లాడగలుగుతాడు.
Exam Tips:
a) చీటీ పై ముఖ్యాంశాలు రాసుకోవడం, పద్యాలు శ్లోకాలు ఉదహరించగలగడం – జ్ఞాపకశక్తి ప్రయోజనాలుగా రాయండి.
Question 2: మంచి వక్త కావడానికి ఏం చేయాలి?
Answer:
1. చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను చీటీపై వ్రాసుకొని, ఏ విషయమూ మరచిపోకుండా క్రమంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పాలి.
2. ముందుగా చిన్న పిల్లల సభల్లో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
3. నదీ తీరంలోనో, కొండ మీదో, నిలబడి, ఒంటరిగా ‘కొండనూ, నదినీ, ప్రకృతినీ ఉద్దేశించి మాట్లాడితే సభాకంపనం తగ్గుతుంది.
4. శ్రోతలను శిలామూర్తులని భావించి ప్రసంగం చేయాలి.
5. శ్రోతల సంఖ్యను బట్టి తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.
6. భావానుగుణమైన ధ్వని ప్రసారం వల్ల లాభం ఉంటుంది.
7. ఉపన్యాస వాక్యాలు చిన్నవిగా ఉండాలి.
8. వేగంగా మాట్లాడరాదు.
9. సమయాన్ని ఉల్లంఘించరాదు.
10. తర్కబద్ధంగా క్లుప్తంగా మాట్లాడాలి.
Exam Tips:
a) సూచనలను 1, 2, 3… సంఖ్యలతో వరుసగా రాయడం ప్రశ్నకు తగిన పద్ధతి.
Question 3: ‘బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడుతాడు’ దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
Answer:
బాగా ఆలోచించేవాడు ఏ మాటలు మాట్లాడితే బాగుంటుందో ముందే బాగా ఆలోచించుకొని, అవసరమైన మాటలే తక్కువగా మాట్లాడుతాడు. దీర్ఘమైన అనవసర ప్రసంగాలు చేయడు. బాగా ఆలోచించనివాడు . అవసరమైనవీ, లేనివీ కలిపి, సుదీర్ఘంగా మాట్లాడుతాడు. అందుకే వేమన ‘కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు’ అన్నాడు.
Exam Tips:
a) వేమన పద్యం ‘కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా’ ను ఉదాహరణగా వాడండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 107)
Question 1: “అయిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంట సేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం”. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
Answer:
అయిదే నిమిషాలలో ఉపన్యాసం ముగించాలంటే, కేవలం ఆ సభకు అనుగుణమైన, అతి ముఖ్యమైన మాటలే క్లుప్తంగా, తర్కబద్ధంగా రసానుభూతి కల్గించేటట్లు, మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలో బాగా గంటలసేపు ఆలోచించ వలసివస్తుంది.
గంటసేపు మాట్లాడాలంటే ముఖ్య విషయాన్ని ఆ గంటలో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. వక్తకు కావలసిన సమయం అతని చేతిలో ఉంటుంది. కాబట్టి నేను పై మాటలను సమర్థిస్తున్నాను.
Exam Tips:
a) 5 నిమిషాలకు ఎక్కువ సన్నద్ధత అవసరం, గంటసేపుకు తక్కువ అనే వైరుధ్యాన్ని వివరిస్తూ మీ అభిప్రాయం రాయండి.
Question 2: ‘వాక్కు మనిషికి అలంకారం’ దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
Answer:
“వాగ్భూషణం భూషణం” అన్నాడు భర్తృహరి మనిషికి నిజమైన అలంకారము వాక్కే. కేయూరములు, హారములు, విలేపన ద్రవ్యములు, పూలు, మనిషికి నిజమైన అలంకారాలు కాదు. మాట మాత్రమే నిజమైన అలంకారం. చక్కగా మాట్లాడే వ్యక్తిని, అందరూ గౌరవిస్తారు. మంచివాక్కు గలవారి మాటకు మన్నన లభిస్తుంది.
మంచివాక్కు ఉంటే ఎదుటివారికి నచ్చచెప్పగలరు. మంచిగా మాట్లాడేవారు, ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు.
Exam Tips:
a) ‘వాగ్భూషణం భూషణం’ (భర్తృహరి) ఉటంకింపు జవాబులో ఉంటే మార్కులు వస్తాయి.
ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: ‘నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది.’ – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
Answer:
కోయిల తియ్యగా కూస్తుంది. చిలుక చక్కగా మాట్లాడుతుంది. ఆ రెండింటినీ మనం ఆదరిస్తాము. కాకి “కాకా” అంటూ పరుషంగా మాట్లాడుతుంది. ఆ కాకిని మనం తరిమి పారవేస్తాము. దానిని బట్టి నోరు మంచిదైతే, ఊరు మంచిదౌతుందని గ్రహించగలం. మనం పొరుగూరికి వెళ్ళి, అక్కడి వారితో మంచిగా, గౌరవంగా మాట్లాడితే, ఆ ఊరి ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఆ ఊరులో జనం అంతా మనలను మంచిగా చూస్తారు. అలాగే నిత్యజీవితంలో కూడా, మనం ప్రక్కవారితో మంచిగా, మన్ననగా, కలుపుగోలుగా మాట్లాడితే అక్కడి వారు మనలను మంచిగా చూస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కనుక మనిషి తియ్యగా, చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి.
Exam Tips:
a) కోయిల – కాకి ఉదాహరణ, పొరుగూరిలో మంచిగా మాట్లాడితే లభించే ఆదరణ – ఈ రెండు పాయింట్లు చాలు.
b) చివరి వాక్యంలో నీతిని (తియ్యగా మాట్లాడడం నేర్చుకోవాలి) తప్పక రాయండి.
Question 2: కింది పదాలు ఈ పాఠంలో ఏ ఏ పేరాల్లో ఎన్నో పంక్తిలో ఉన్నాయో గుర్తించి, వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి.
అ) ధారాశుద్ధి ఆ) వక్తృత్వ కళోపాసనం ఇ) ఊనిక ఈ) వచశ్శైలి ఉ) వ్యంగ్యార్థం ఊ) తపస్సు
Answer:
అ) ధారాశుద్ధి : ‘ధారాప్రవాహం’ అనే పదం, పాఠంలోని 9వ పేరాలో 6వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం చెప్పేటప్పుడు భయం సిగ్గు లేకుండా మాటలు ధారాప్రవాహంగా మాట్లాడాలని రచయిత చెప్పాడు. తడుముకోకుండా నదీ ప్రవాహంలా మాట్లాడాలన్నమాట.
ఆ) వక్తృత్వ కళోపాసనం : ఈ పదం పాఠంలో 28వ పేరాలో మూడవ పంక్తిలో ఉంది. వక్తృత్వం అనేది ‘కళ’ అని, నిద్రాణమై ఉన్న మనశ్శక్తి మేల్కోవాలంటే, వక్తృత్వకళోపాసన ముఖ్యం అనీ రచయిత చెప్పాడు. ఉపన్యాసం చెప్పడాన్ని కళగా గౌరవించి, దానిని ఆదరించాలని కవిగారి అభిప్రాయం.
ఇ) ఊనిక : ఈ పదం, పాఠంలో 19 వ పేరాలో 25 వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం ‘చెప్పేటప్పుడు వక్త కొన్ని వాక్యాలను ఊనికతో ఒత్తి పలకాలి. కొన్ని వాక్యాలను మందంగా పలకాలి. వక్తృత్వంలో భావానికి తగిన ధ్వని ప్రసారం ఉండాలని రచయిత చెప్పాడు. రసానుగుణంగా పదాలు పలకాలి. రౌద్రరస పదాలను నసుగుతూ గొణుగుతూ పలకరాదు. దయ, శాంతి, కరుణ వంటి మాటలను గంభీరంగా పలకరాదు.
ఈ) వచశ్శైలి : ఈ పదం పాఠంలో 8 వ పేరాలో 2 వ పంక్తిలో ఉంది. ప్రతి వ్యక్తికి తాను మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. అతడికి ఒక ఆలోచనా పద్ధతి ఉంటుంది. వారు మాట్లాడే పద్ధతినే ‘వచశ్శైలి’ అంటారు.
ఉ) వ్యంగ్యార్థం : ఈ పదం పాఠంలో 13 వ పేరాలో 3వ పంక్తిలో ఉంది. ఉపన్యాసంలో కావ్యంలోలాగే వ్యంగ్యార్థం ప్రాధాన్యం వహిస్తుంది. వ్యంగ్యార్థ ప్రతిపాదన లేని భావాలు, వక్తకు గౌరవం తీసుకురావు. కావ్యంలాగే ఉపన్యాసం కూడా, వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించినప్పుడు అది ఉత్తమ ఉపన్యాసం అవుతుంది.
ఊ) తపస్సు : ఈ పదం పాఠంలో 22 వ పేరాలో మొదటి పంక్తిలో ఉంది. ఈ తపస్సును ఋషులు, మునులు భగవంతుని అనుగ్రహం పొందడానికి చేస్తారు.
అలాగే ఉపన్యాసంలో తాను కోరుకున్న విషయాన్నే చెప్పేశక్తి, కేవలం తపస్సు వల్లనే సాధ్యమవుతుందని రచయిత చెప్పాడు.
Exam Tips:
a) పేరా, పంక్తి సంఖ్యతో పాటు ఆ పదం పాఠంలో ఏ సందర్భంలో వచ్చిందో ఒకటి రెండు వాక్యాల్లో రాయండి.
b) ప్రతి పదానికి విడిగా అ), ఆ) … క్రమంలో జవాబు రాయండి.
Question 3: కింది అంశాన్ని చదివి, తప్పొప్పులను గుర్తించండి.
మహాత్ములు ఒక విషయాన్ని సంకల్పించుకొని దానిని మాటల ద్వారా చెప్పి, చెప్పిన దానిని చేసి చూపిస్తారు. తలచింది చెప్పడం, చెప్పింది చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అది యెంతటి మహాత్ములకో గాని సాధ్యపడదు.
“మనసు, మాట, నడత మనిషికి ఒకటైన
మనిషి కాదు వాడు మహితుడౌను”
మనసులోని ఆలోచన, మాట్లాడేమాట, నడిచే నడత ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మహాత్ముడు. మన మాటలకు మన చేతలకు మూలం మన ఆలోచనలు. కాబట్టి మన ఆలోచనలు సదాలోచనలు కావాలి. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆలోచన ఈ మూడు ఏకం కావాలి.
Answer:
అ) మాటల ద్వారా చెప్పి, చెప్పిందాన్ని చేసేవారు మహాత్ములు – ఒప్పు
ఆ) చెప్పింది చేయడం చాలా సులభం. – తప్పు
ఇ) ఆలోచనలు సదాలోచనలు కావాలి. – ఒప్పు
ఈ) మనసు – మాట – నడత ఒకటైనవాడు మహితుడు కాడు. – తప్పు
Exam Tips:
a) గద్యంలో ‘కష్టమైన విషయం’, ‘మనసు, మాట, నడత ఒకటి’ అనే వాక్యాలే తప్పొప్పులకు ఆధారం – వాటితో సరిచూడండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
Question 1: “జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం” దీనిపై మీ అభిప్రాయం రాయండి. (ఐదు వాక్యాల్లో)
Answer:
చక్కగా పొందికగా ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మాట్లాడగలవాడికి, అన్నీ విజయాలే సిద్ధిస్తాయి. మంచి ఉపన్యాసకుడు పార్టీ నాయకుడైతే ప్రజలు ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తారు. మంచిగా నేర్పుగా మాట్లాడగలిగితే, ఉద్యోగాల ఇంటర్వూలలో నెగ్గి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. రాజకీయ నాయకులు చక్కగా వాగ్దానాలు వరదగా పారించి, ఎన్నికలలో గెలుస్తారు. మన జీవితంలో సైతమూ, ప్రక్కవారితో పొందికగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోవచ్చు.
భార్యాబిడ్డలతో కూడా నేర్పుగా, ఓర్పుగా మాట్లాడి వారి ప్రేమను పొందవచ్చు. ఒకరి వద్ద పనిచేసినపుడు యజమానికి అనువుగా మాట్లాడి, ఆ యజమాని మన్ననలను పొందవచ్చు. చక్కగా మాట్లాడడం, సరసంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు హాయి కలిగేటట్లు మాట్లాడడం అనే వాటి ద్వారా జీవితంలో ఏదైనా సాధింపగలరు.
Exam Tips:
a) ఉపన్యాసకుడు, ఇంటర్వ్యూ, కుటుంబం, యజమాని – రోజువారీ ఉదాహరణలు ఇవ్వండి.
b) ఐదు వాక్యాల పరిమితిని మించకుండా సంక్షిప్తంగా రాయండి.
Question 2: శాస్త్రమర్యాదలకు లోబడిన వాక్కు ‘పవిత్రమైనది’, ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? (ఐదు వాక్యాల్లో)
Answer:
‘వాక్కు’ అంటే మాట. వాక్కు సరస్వతీ స్వరూపము. మాట్లాడే మాట, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్రసమ్మతంగా ఉండాలి. మాట, సభ్యతా సంస్కారాలు కలిగి ఉండాలి. భారతీయులు, వాక్కును సరస్వతీ దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం, పుణ్యం అని పెద్దలు అన్నారు. కాబట్టి వ్యాకరణ శాస్త్రమర్యాదకు అనుగుణంగా తప్పులు లేని భాషను మాట్లాడాలి.
వాక్కు మనిషికి అలంకారం వంటిది. భాష మనిషికి ఎన్నడూ కళ తగ్గని అలంకారం. చక్కని భాషలేని వాడికి, మంచి వేషం ఉన్నా వ్యర్థమే. వాగ్ధార, కత్తి అంచు కంటే పదునైనది. భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి, ఆయా అక్షరాల ధ్వనులను స్పష్టంగా, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్రసమ్మతంగా ఉచ్చరించడం మనం అలవాటు చేసుకోవాలి.
భాష పవిత్రమైనది. కాబట్టి దానిని శాస్త్రసమ్మతంగానే మాట్లాడాలి. మంచి భాష అలవడడం కోసం, పుస్తకాలలోని ప్రసిద్ధుల ఉపన్యాసాలను అధ్యయనం చెయ్యాలని రచయిత అభిప్రాయము.
Exam Tips:
a) వాక్కు సరస్వతీ స్వరూపం, వ్యాకరణ శుద్ధి – ఈ రెండు ముఖ్యాంశాలు తప్పక రాయండి.
Question 3: వక్తృత్వంలో శరీర కదలికల (అంగవిన్యాసం) పాత్ర ఎట్లాంటిది? (ఐదు వాక్యాల్లో)
Answer:
మహోత్సాహంతో మాట్లాడేటప్పుడు, ఉత్తేజకర భావాలను ప్రకటించేటప్పుడు, పండితుడైన వక్త కండ్లలో, కనుబొమ్మల్లో. చేతుల్లో, ముఖంలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న దానికి సరైన సమాధానం దొరకడం కష్టం.
ఈ అంగాంగ సంచలనం అన్నది, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వక్త తన భావాలను ప్రకటించేటప్పుడు, అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీలేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ మాత్రం కదలకుండా పరిమితమైన అంగవిన్యాసం చేస్తూ, స్తంభంలా నిలబడి మాట్లాడేవారు కూడా ఉంటారు.
Exam Tips:
a) అంగవిన్యాసం సహజంగా జరుగుతుంది, దానికి ప్రత్యేక నియమం లేదు అనే పాఠ సారాంశాన్ని రాయండి.
Question 4: ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన “వాగ్భూషణం” పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది? (ఐదు వాక్యాల్లో)
Answer:
నేటి విద్యార్థులు అన్ని కళల కంటె, ఉదాత్తమైన ఈ వక్తృత్వం పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. విద్యార్థులకు ఈ ఉపన్యాస కళ చాలా ముఖ్యము. వారు ఉద్యోగాలు సంపాదించడానికి, ఇంటర్వ్యూలను ఎదుర్కోడానికి, ఈ ఉపన్యాసశక్తి వారికి ఉపయోగపడుతుంది. సిగ్గు, భయం లేకుండా ఇంటర్వ్యూలలో వచ్చే ప్రశ్నలకు వారు ధైర్యంగా జవాబులు చెప్పగలరు.
ఇరివెంటి కృష్ణమూర్తిగారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకొనే పద్ధతులను గూర్చి, చెప్పారు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసం చెప్పడానికి ఎలా సంసిద్ధం కావాలో చెప్పారు. వక్తకు కావలసిన పాండిత్యం గురించి ఈ వ్యాసంలో చెప్పారు. వక్త ఎటువంటి శబ్దార్థాలను ప్రయోగించాలో చెప్పారు. వక్తకు కావలసిన జ్ఞాపకశక్తిని గూర్చి చెప్పారు. ఉపన్యాసం చెప్పే పద్ధతిని ఎలా అలవాటు చేసుకోవాలో దీనిలో చెప్పారు.
ఉపన్యాసం చెప్పేటప్పుడు తమ కంఠధ్వనిని ఎలా నియంత్రించుకోవాలో, రసానుగుణంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసంలో క్లుప్తతతో, స్పష్టత అవసరం అని చెప్పారు. వక్తృత్వం అనేది ఒక కళ అనీ, దాన్ని ఆరాధించాలనీ చెప్పారు. మొత్తంపై విద్యార్థులు ఈ వ్యాసం చదివితే, ఉపన్యాసకళపై మక్కువ పెంచుకొని, ఉపన్యాసం మాట్లాడే పద్ధతులు గ్రహించి వారు మహోపన్యాసకులు కాగలరు. గొప్ప రాజకీయ నాయకులు కాగలరు.
Exam Tips:
a) ఇంటర్వ్యూలలో ధైర్యంగా మాట్లాడడం, ఉపన్యాస కళ నేర్చుకునే పద్ధతులు – పాఠం నుండి నేర్చుకునే అంశాలుగా రాయండి.
Question 5: ‘ఉపన్యాసం – ఒక గొప్పకళ’ దీన్ని వివరిస్తూ రాయండి. (పది వాక్యాల్లో)
Answer:
ఉపన్యాసం ఒక గొప్పకళ. మాట్లాడడం, మనిషికి మాత్రమే లభించిన వరం.
మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అల్లుకొని మాట్లాడితే, అది ఉపన్యాసం అవుతుంది. వక్తృత్వ కళలో అందరూ నేర్పును సాధింపవచ్చు. మాట్లాడడం నేర్చుకొని, తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.
వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలి. చదువు ఎంత వస్తే, అతడి ఉపన్యాసం అంతగా రాణిస్తుంది. అతడి మాటల్లో గాంభీర్యం, సంస్కారం ఉంటుంది. భయాన్నీ, అనుమానాలను వదలి, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే వారు మంచి ఉపన్యాసకులు అవుతారు. భయాన్ని విడిచి, ధారాప్రవాహంగా మాట్లాడాలి. ఉపన్యాసం, శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది.
కొన్ని ఉపన్యాసాలు మంచి పేరు పొందుతాయి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణుడి ఉపన్యాసం, విశ్వమతమహాసభలో వివేకానంద స్వామి ఉపన్యాసం పేరుకెక్కాయి. వక్త తాను చెప్పదలచిన విషయంపై తన్మయత్వంతో గంభీరంగా మాట్లాడాలి. వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.
వక్త చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన సామగ్రిని బాగా సేకరించాలి. దానికోసం ఎన్నో పుస్తకాలు చదివి, విషయాలు సేకరించాలి. మొదట పిల్లల వద్ద మాట్లాడాలి. ఒంటరి ప్రదేశాలలో మాట్లాడాలి. అలాచేస్తే సభాకంపం పోతుంది. విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.
శ్రోతల ముఖాలను చూస్తూ, మాట్లాడాలి. రసానికి అనుగుణంగా తన కంఠాన్ని సవరించి హెచ్చుతగ్గులు చేస్తూ మాట్లాడాలి. దీర్ఘపన్యాసాలు చేయరాదు. ఉపన్యాస కాలాన్ని అతిక్రమించరాదు. తర్కబద్ధమైన క్లుప్తమైన ఉపన్యాసం చాలా గొప్పది. ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, ముగించే ముందు, ఎంతో పదిలంగా మనోరంజకంగా, మాట్లాడాలి. ఇతరుల మనస్సులకు హాయి కల్గించేటట్లు, చీకటిలో దీపం వెల్గించినట్లు, అజ్ఞానం పారిపోయేటట్లు, మాట్లాడడం, బుద్ధిమంతుడి లక్షణం. 3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.
Exam Tips:
a) ప్రారంభంలో ‘ఉపన్యాసం ఒక కళ’ అని నిర్వచించి, తర్వాత పాండిత్యం, ధైర్యం, పదజాలం, కంఠధ్వని, క్లుప్తత అనే అంశాలను వరుసగా రాయండి.
b) కృష్ణుని, వివేకానందుని ఉపన్యాసాలను ఉదాహరణలుగా చేర్చండి.
Question 6: ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడవలసిన అంశమయిన ‘మాటగొప్పదనం’ మీద ప్రసంగ వ్యాసం రాయండి.
Answer:
‘మాటగొప్పదనం’
మిత్రులారా! ఈ రోజు ప్రపంచభాషా దినోత్సవం. ఈ సందర్భంగా ‘మాటగొప్పదనం’ గురించి ముచ్చటిస్తాను.. భర్తృహరి వాగ్భూషణం భూషణం అన్నాడు. అంటే మనిషికి వాక్కే అలంకారం. దానిని బట్టి మాటకు ఉన్న శక్తిని మనం గుర్తించవచ్చు. ‘పలుకే బంగారం’ అని పెద్దలంటారు. మాట మనిషికి దేవుడిచ్చిన వరప్రసాదం. మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసి, గొప్పవాడిగా నిలబెట్టినది మాట మాత్రమే. ఎప్పటికేది ప్రస్తుతమో, అప్పటికి ఆ మాటలాడగలవాడు ధన్యుడు. అతడే గొప్పకార్యసాధకుడవుతాడు. మంచివాక్కు, కల్పవృక్షం వంటిది. మనిషి స్థాయి, అతడి మాట వల్ల తెలుస్తుంది. మాధుర్యం గల మాటలు కార్యసాధకములు. మంచి మాటలు, స్నేహాన్ని పెంచుతాయి. ఆనందాన్ని ఇస్తాయి: బాధలో ఉపశమనాన్ని ఇస్తాయి. మాటలలో కాఠిన్యం పనికిరాదు. కోయిలలా మాట్లాడాలి. కాకిలా మాట్లాడరాదు.
మాటలతో కోటలు కట్టి, మనిషి మహారాజు కాగలడు. దేశప్రధాని కాగలడు. మాటలు పాటలు రాస్తాయి. మాటలు స్నేహానికి బాటలు వేస్తాయి. మాటల వల్లే కవిత్వ సంగీతాలు నిలిచాయి. మాటల వల్లే నవ్యత, నాగరికత, చైతన్యం వెలుగు చూశాయి. విశ్వాన్ని వాక్శక్తి నడిపిస్తుంది. తన బాట బలిమితోనే, మాట నేర్పుతోనే, మోదీ మనకు ప్రధానికాగలిగాడు.
భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యం అన్నారు. మాట మనిషికి అలంకారం చక్కని భాషలేనివాడు అందమైన వేషం వేసుకొన్నా వ్యర్థమే. వాగ్ధార కత్తి అంచు కంటే పదునైనది. వాక్కు విశాలమైనది.
ఒక మంచిమాట లోకాన్ని జయిస్తుంది. వివేకానందుని చిన్న ఉపన్యాసం, ప్రపంచాన్ని జయించింది. భారతదేశం పట్ల ప్రపంచానికి గౌరవాదరాలను తెచ్చిపెట్టింది. మాట పదునైన ఆయుధం. దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత, మానవుడిపైనే ఉంది. ఒక తియ్యటి మాటతో, ప్రపంచం అంతా మనకు మిత్రరాజ్యం అవుతుంది. మాటకు కల గొప్పదనం చెప్పడం అసాధ్యం.
Exam Tips:
a) ‘మిత్రులారా!’ అనే సంబోధనతో ప్రారంభించి, నీతి వాక్యంతో ముగించండి.
b) సామెతలు, పద్యపాదాలు (‘పలుకే బంగారం’, ‘వాగ్భూషణం భూషణం’) ఉపయోగిస్తే ప్రసంగం రాణిస్తుంది.
III. భాషాంశాలు – పదజాలం
Question 1: కింది వాక్యంలో గీత గీసిన ‘అప్రతిహతంగా’ అనే పదం అర్థాన్ని గ్రహించి, సొంత వాక్యంలో ప్రయోగించండి.
భారత క్రికెట్ జట్టు విజయాలు అప్రతిహతంగా సాగుతున్నాయి.
Answer:
అప్రతిహతంగా = (అడ్డులేకుండా) (నిరాటంకంగా)
వాక్యప్రయోగం : రోదసీ విజ్ఞాన ప్రయోగాల్లో మనదేశం అప్రతిహతమైన విజయాలు సాధిస్తోంది.
Exam Tips:
a) అర్థం కుండలీకరణాల్లో, వాక్యప్రయోగం విడిగా రాయండి; వాక్యంలో పదం రూపం మారకుండా చూడండి.
Question 2: కింది వాక్యంలో గీత గీసిన ‘అమేయమైన’ అనే పదం అర్థాన్ని గ్రహించి, సొంత వాక్యంలో ప్రయోగించండి.
అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం.
Answer:
అమేయమైన = లెక్కింపవీలుకాని
వాక్యప్రయోగం : మనకు రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణ పండితుడు, అమేయమైన బుద్ధిశాలి.
Exam Tips:
a) ‘అమేయం’ = కొలవడానికి వీలుకానిది; సొంత వాక్యంలో విశేషణంగా వాడండి.
Question 3: కింది వాక్యంలో గీత గీసిన ‘ఉదాసీనత’ అనే పదం అర్థాన్ని గ్రహించి, సొంత వాక్యంలో ప్రయోగించండి.
జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్టం.
Answer:
ఉదాసీనత = ఉపేక్షాభావం
వాక్యప్రయోగం : మేధావుల ఉదాసీనత వల్లనే దేశం నేడు నష్టపోతుంది.
Exam Tips:
a) ఉదాసీనత = పట్టించుకోకపోవడం; వాక్యంలో ‘ఉదాసీనత వల్ల కలిగే నష్టం’ అనే భావం ఉండాలి.
Question 4: కింది వాక్యంలో గీత గీసిన ‘ఆచరణ’ అనే పదం అర్థాన్ని గ్రహించి, సొంత వాక్యంలో ప్రయోగించండి.
ఆచరణ అన్నింటి కన్న గొప్పది.
Answer:
ఆచరణ = ఆచరించడం
వాక్యప్రయోగం : ఆచరణ లేని ప్రబోధాలు, చిలుకపలుకులవలె వట్టిదండుగ.
Exam Tips:
a) ‘ఆచరణ లేని మాటలు వ్యర్థం’ అనే భావంతో వాక్యం రాయండి.
Question 5: కింది పర్యాయపదాలను పదవిజ్ఞానం ఆధారంగా జతపర్చండి.
అ) కృపాణం – మది, హృదయం, ఎద
ఆ) వాక్కు – చప్పుడు, శబ్దం
ఇ) స్నేహం – కత్తి, ఖడ్గము, అసి
ఈ) మనసు – మాట, పలుకు, నుడుగు
ఉ) విశ్వాసం – చెలిమి, మైత్రి, నెయ్యము
ఊ) ధ్వని – నమ్మకం, నమ్మిక
Answer:
జతపరచడం – పర్యాయపదాలు
అ) కృపాణం – కత్తి, ఖడ్గం,అసి
ఆ) వాక్కు – మాట, పలుకు, నుడుగు
ఇ) స్నేహం – చెలిమి, మైత్రి, నెయ్యము
ఈ) మనసు – మది, హృదయం, ఎద
ఉ) విశ్వాసం – నమ్మకం, నమ్మిక
ఊ) ధ్వని – చప్పుడు, శబ్దం
Exam Tips:
a) పాఠంలో ఆ పదం ఎక్కడ వచ్చిందో గుర్తుచేసుకొని జతపరచండి; ఒక్కో పదానికి మూడు పర్యాయపదాలను పూర్తిగా రాయండి.
Question 6: ‘వాగ్మి, ధ్వని’ అనే పదాలకు కింది వాక్యాలలో నానార్థాలున్నాయి. వాటిని గుర్తించండి.
అ) యుక్తియుక్తంగా మాట్లాడే ఉపన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు.
ఆ) ఆయన మాటల్లోని వ్యంగ్యార్థాన్ని గ్రహించి అభినందన పూర్వకంగా బల్లలు చరుస్తూ శబ్దం చేశారు.
Answer:
వాగ్మి (నానార్థాలు):
1. యుక్తియుక్తంగా మాట్లాడేవాడు
2. చిలుక
ధ్వని (నానార్థాలు):
1. వ్యంగ్యార్థము
2. శబ్దం
Exam Tips:
a) వాక్యంలో ఏ అర్థంలో పదం వాడారో చూసి, ఆ అర్థాన్నే నానార్థంగా రాయండి.
Question 7: కింది పట్టిక నుండి ప్రకృతి – వికృతులు గుర్తించి రాయండి.
స్నేహం, భాష, ప్రాణం, శక్తి, హృదయం, సద్దు, నెయ్యం, దివ్వె, సత్తి, పానం, శబ్దం, ఎడద, దీపం, శాస్త్రం, బాస, చట్టం
Answer:
ప్రకృతి – వికృతి
1) స్నేహం – నెయ్యం
2) హృదయం – ఎడద
3) భాష – బాస
4) ప్రాణం – పానం
5) శక్తి – సత్తి
6) దీపం – దివ్వె
7) శాస్త్రం – చట్టం
8) శబ్దం – సద్దు
Exam Tips:
a) సంస్కృత పదం ప్రకృతి, దాని తెలుగు రూపం వికృతి అని గుర్తుంచుకోండి.
b) ఎనిమిది జతలు కావాలి – అన్ని పదాలు జతపడేలా చూసుకోండి.
వ్యాకరణాంశాలు
Question 1: కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) కళోపాసనం ఆ) అభ్యుదయం ఇ) తనకెంతో ఈ) ఉన్నతమైన ఉ) రసానందం
Answer:
అ) కళా + ఉపాసనం – గుణసంధి
ఆ) అభి + ఉదయం – యణాదేశ సంధి
ఇ) తనకున్ + ఎంతో – ఉత్వసంధి
ఈ) ఉన్నతము + ఐన – ఉత్వసంధి
ఉ) రస + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి
Exam Tips:
a) అ/ఆ + ఉ/ఊ = ఓ అయితే గుణసంధి; ఇ/ఈ + అచ్చు = య్ అయితే యణాదేశ సంధి; సవర్ణాచ్చులు కలిస్తే సవర్ణదీర్ఘ సంధి – సూత్రాలు గుర్తుంచుకోండి.
b) విడదీయడం, సంధి పేరు – రెండింటికీ మార్కులు ఉంటాయి.
Question 2: కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
అ) శక్తిసామర్థ్యాలు ఆ) పఠనశక్తి ఇ) అభ్యుదయపథం ఈ) ఆత్మశక్తి ఉ) అద్భుతశక్తి
Answer:
అ) శక్తియు, సామర్థ్యమును – ద్వంద్వ సమాసం
ఆ) పఠనమునందు శక్తి – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అభ్యుదయమైన పథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ఆత్మ యొక్క శక్తి – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) అద్భుతమైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
Exam Tips:
a) ‘యొక్క’ వస్తే షష్ఠీ, ‘యందు’ వస్తే సప్తమీ తత్పురుషం; ‘మైన’ వస్తే విశేషణ పూర్వపద కర్మధారయం; ‘యు, ను’ తో కలిపితే ద్వంద్వం.
ప్రాజెక్టు పని
Question 1: ‘వాక్కు’ గొప్పదనాన్ని తెలిపే ఐదు పద్యాలు సేకరించి, భావాలు రాయండి. నివేదికను రాసి ప్రదర్శించండి.
Answer:
1) నిండునదులు పారు నిలిచి గంభీరమై
వెట్టివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. కాని, చిన్నవాగు గట్లుదాటి పొర్లి ప్రవహిస్తుంది. అలాగే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడుతాడు. నీచుడు బడబడ వాగుతాడు.
2) అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం: తక్కువ బుద్ధిగలవాడు ఎప్పుడునూ గొప్పలు చెపుతాడు. మంచి బుద్ధిగలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతాడు. కంచు మ్రోగేటట్లు బంగారం మ్రోగదు కదా!
3) మాటలాడ నేర్చి మనసు రంజిలఁజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం: ఒకరి సొత్తు ఇంకొకరికి చెందాలంటే, కష్టపడి పనిచేసి, అవతలి వారి మనస్సుకు ఆనందం కలిగేటట్లు మాట్లాడడం నేర్చుకోవాలి.
Exam Tips:
a) పద్యాన్ని తప్పులు లేకుండా రాసి, దాని కింద భావాన్ని విడిగా రాయండి.
b) వేమన, సుమతీ వంటి శతకాల్లో ‘మాట’ గురించి ఉన్న పద్యాలను ఎంచుకోండి.
Free study material for Telugu
Free TS Board Textbook Explanations: Class 9 Telugu Lesson 10 Vagbhushanam
Textbook Solutions for Class 9 Telugu Lesson 10 Vagbhushanam
Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 10 Vagbhushanam. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Telugu.
FAQs
The complete and updated TS 9th Class Telugu Lesson 10 వాగ్భూషణం is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 9th Class Telugu Lesson 10 వాగ్భూషణం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Lesson 10 వాగ్భూషణం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Lesson 10 వాగ్భూషణం in both English and Hindi medium.
Yes, you can download the entire TS 9th Class Telugu Lesson 10 వాగ్భూషణం in printable PDF format for offline study on any device.