Solutions for Class 8 Telugu: Lesson 07 Manjira (the river Manjira)
Access comprehensive textbook solutions for Lesson 07 Manjira (the river Manjira) using the official curriculum guides for Class 8 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 8 Telugu Solutions: Lesson 07 Manjira (the river Manjira)
View or download the dedicated Lesson 07 Manjira (the river Manjira) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
పాఠం ప్రారంభంలో చర్చించవలసిన అంశాలు
Question 1: పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు?
Answer:
పై బొమ్మలో ప్రవహిస్తున్న నది, నదికి అవతలిగట్టున స్నానాల రేవు, ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తున్నాయి. బొమ్మలోని బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక చూస్తున్నది. నది అంత అందంగా ఎలా పరుగెట్ట గలుగుతుందా అని ఆలోచిస్తుండవచ్చు.
Exam Tips:
a) బొమ్మలోని వస్తువులను (నది, రేవు, ఆలయం) వరుసగా చెప్పి, తరువాత బాలిక ఆలోచనను ఊహించి రాయండి.
Question 2: ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
Answer:
నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు కృష్ణానదిని చూశాను. ఆ నదిని చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కణ్ణుంచి వచ్చాయి, వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెడతాయి, నది నీళ్ళు అంత స్వచ్ఛంగా, తియ్యంగా ఎందుకు ఉంటాయి, చలికాలం వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఎలా ఉంటాయి. అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటికోసం మనుషులు ఏం చేసేవారో కదా! మొదలైన భావాలు కలిగాయి.
Exam Tips:
a) మీరు చూసిన నది పేరు, దాని ప్రత్యేకత, మీ భావన – మూడూ రాయండి.
Question 3: మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి.
Answer:
మా ప్రాంతంలో కృష్ణా, గోదావరి, మంజీర, మూసీ, మొదలైన నదులు ప్రవహిస్తాయి.
Exam Tips:
a) మీ ప్రాంతానికి వర్తించే నదుల పేర్లు మాత్రమే రాయండి.
Question 4: నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
Answer:
నదులు ప్రాణులన్నింటికీ తాగు నీటిని ఇస్తాయి. పంటలు పండించడానికి సాగు నీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు ఉపయోగపడతాయి. విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను ఇస్తాయి.
Exam Tips:
a) తాగునీరు, సాగునీరు, రవాణా, విద్యుత్తు, ఇసుక – ఐదు ఉపయోగాలు పాయింట్లుగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 70)
Question 1: “పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి?
Answer:
మంజీర నది చల్లని తల్లివంటిది. అది పంట పొలాలకు తీయని నీరు అందిస్తుంది. మంజీరనది ప్రవాహపు సవ్వడి, గాజుల గలగలల వంటి ఆ నది తరంగాల శబ్దం వినగానే రైతు నాగలితో పొలం పనులు మొదలవుతాయి. ఆ నది మంచితనం చూడగానే రెప్పపాటులోనే పచ్చని పైరులు కనుల పండుగగా ప్రకాశిస్తాయి.
Exam Tips:
a) నది నీరు → పొలాల పచ్చదనం అనే కార్యకారణ సంబంధాన్ని స్పష్టంగా చెప్పండి.
Question 2: మంజీర నదిని కవి “ఎంత తీయని దానవే” అని అనడంలో ఆంతర్యమేమిటి?
Answer:
మంజీర నది తన పరిసరాలలో నివసించే ప్రజలకు తాగటానికి తీయని మంచినీరు ఇస్తుంది. ఆ నది నీటి వల్ల పండిన రుచికరమైన పంటలు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అందువల్ల కవి మంజీర నదిని “ఎంత తీయని దానవే” అని అన్నారు.
Exam Tips:
a) తీయని నీరు, తీయని (రుచికరమైన) పంటలు – రెండు కోణాలలో రాయండి.
Question 3: ఈ “గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు?
Answer:
మంజీర నది నీరు చేరగానే అప్పటి వరకూ ఎండిపోయి బిగుసుకుపోయిన నేల మృదువుగా, పంటలు పండడానికి వీలుగా తయారవుతుంది. అందువల్ల కవి మంజీర గురించి “గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు” అని అన్నాడు.
Exam Tips:
a) “గిడసబారిన” అంటే ఎండి బిగుసుకుపోయిన అని అర్థం చెప్పి, నీటి వల్ల నేల మెత్తబడుతుందని రాయండి.
Question 4: ‘మంజీర’ పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు?
Answer:
ఆహార పంటలు పండించడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అటువంటి పల్లెటూళ్ళలో పంటలు పండటానికి నదుల నీరే ఆధారం. మంజీరా నది పల్లెవాసులకు స్నానాలకూ, తాగడానికీ, సాగు చేయడానికీ నీళ్ళను అందించి కన్నతల్లి లాగా వారిని లాలిస్తుంది. అందువల్ల కవి మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని అన్నాడు. పిల్లల అన్ని అవసరాలను తల్లి తీర్చినట్లు పల్లె ప్రజల సాగునీటి, తాగునీటి మొదలైన అవసరాలను అన్నింటినీ మంజీర నది తీరుస్తుంది అని తాత్పర్యం.
Exam Tips:
a) తల్లి–పిల్లల పోలికను వివరించండి: స్నానం, తాగునీరు, సాగునీరు తీర్చడం.
Question 5: ఈ పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు?
Answer:
మంజీర నదికి పల్లెలు బిడ్డల వంటివి, పట్టణాలు తోబుట్టువుల వంటివి. బిడ్డలైన పల్లె ప్రజల అన్ని అవసరాలను తన తియ్యని నీటితో తీరుస్తుంది మంజీర తల్లి. తన బిడ్డలు పండించిన ఆహార పంటలను పంపించి తన తోబుట్టువులైన నగరాలను కూడ పోషిస్తుంది. అంటే పల్లెటూళ్ళలో ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ పంటలు పండుతాయి అని భావం. అంతేకాక ఆ ధాన్యం రవాణాకు కూడా మంజీర నది నీరు ఉపయోగపడుతుందని తాత్పర్యం.
Exam Tips:
a) పల్లెలు = బిడ్డలు, పట్టణాలు = తోబుట్టువులు అనే రూపకాన్ని మొదట చెప్పండి.
Question 6: “పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
Answer:
మంజీరానది ప్రవహించడం వల్లనే పల్లెటూళ్ళలో ఆహారపంటలు అధికంగా పండుతున్నాయి. తమ మిగులు పంటలను పల్లె ప్రజలు పట్టణాలకు పంపిస్తారు. ఈ అధిక దిగుబడికి మంజీర నది అందిస్తున్న తియ్యని నీరే కారణం. అందువల్ల పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది అని చెప్పవచ్చు.
Exam Tips:
a) పల్లెల్లో మిగులు పంట → పట్టణాలకు చేరడం అనే క్రమం రాయండి.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
I. (i)
నీ కంకణక్వణము నినదించినంతనే
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!
(ii)
గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు
చేదైన నేలలో చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!
II. (i)
ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము
భాగ్యనగరములోన వసియించు పౌరులకు
పంచదారను బోలు మంచి నీరొసగెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!
(ii)
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి
స్నానపానాదులను సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములను తోబుట్టువలె ప్రేమించి
ధాన్యరాసుల నంపి తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!
Answer:
విద్యార్థి కృత్యం. (గేయాన్ని రాగయుక్తంగా, భావానికి తగిన స్వరంతో పాడాలి.)
Exam Tips:
a) మాత్రా ఛందస్సు గేయం కాబట్టి లయ దెబ్బతినకుండా పాడండి; ప్రతి చరణం చివర పల్లవిని పునరావృతం చేయండి.
Question 2: నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
Answer:
భూమి మీద నివసించే అన్ని రకాల జీవుల దాహార్తిని తీర్చే నదులు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే స్నానానికి, సాగునీటికి ఉపయోగపడుతున్న నదులు నేడు విద్యుత్తు ఉత్పత్తికి, పర్యాటక కేంద్రాలుగా, రవాణా సౌకర్యాలకూ, ఇసుక ఇవ్వడం మొదలైన ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి.
నేటి కాలంలో ప్రవహించే నది నీటిని ఆపే ఆనకట్టలు, నీటిని నిలవ ఉంచే రిజర్వాయర్ల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల నది నీటిని గొట్టాలద్వారా నేరుగా ఇంటిదగ్గరకే పంపించగలుగుతున్నారు. దీనితో అందరూ నది నీటిని తాగునీరుగా ఉపయోగించుకోగలుగుతున్నారు. నదుల నుంచి నీరు పెద్ద కాలువలోకి, అందులోనుంచి చిన్న కాలవలలోకి, వాటి నుంచి బోదెలలోకి, నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాక నది నీటి తలానికి ఎత్తులో ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలవల ద్వారా పంపేచోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం.
నదులలో ముఖ్యంగా ఆనకట్టల ప్రాంతాలలో బోటులు, మరపడవలలో విహారయాత్రలకు వీలు కలుగుతున్నది. ఇది ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది. తక్కువ ఖర్చుతో ఎంతో బరువున్న వస్తువులను నది నీళ్ళలో రవాణా చేయడం సులువు. దీనివల్ల ఖర్చు, శ్రమ, కలిసివస్తాయి. కొండల్లో నుంచి, గుట్టల్లోనుంచి ప్రవహించే నదులు తమతోపాటు తెచ్చిన ఇసుకను ఒడ్డుల్లో, మధ్యలో, మేటలు వేస్తాయి. ఆ ఇసుక భవన నిర్మాణాలకూ, వంతెన నిర్మాణాలకూ ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ విధంగా ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నదులు మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి.
Exam Tips:
a) ప్రయోజనాలను సంప్రదాయ (తాగు, సాగునీరు) – ఆధునిక (విద్యుత్తు, పర్యాటకం) అని రెండు వర్గాలుగా రాయండి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
Question 1: కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.
(అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
(ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
(ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
(ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
Answer:
(అ) కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు
(ఆ) గిడసబారిన పుడమి; ఎడద కరిగించెదవు
(ఇ) భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.
(ఈ) పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి
Exam Tips:
a) ప్రశ్నలోని భావానికి సరిపోయే గేయ పంక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎత్తి రాయండి.
Question 2: గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
లంటి వాని ని
ర్ఝరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా
అ. ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
ఇ. కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు?
ఈ. ‘దరులు’ అనే పదానికి అర్థమేమిటి ?
ఉ. దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
Answer:
అ. ఈ గేయం దుందుభి నది ప్రవాహం గురించి చెప్పింది.
ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలయేఱుతో పోల్చాడు.
ఇ. తెల్లగా ఉండే కొత్త జాజిపూల రంగుతో ప్రవహించడం వల్ల కవి దుందుభి నదిని పాలయేఱు అని అన్నాడు.
ఈ. దరులు అంటే ఒడ్డులు అని అర్థం.
ఉ. దుందుభి జలం అమృతపు తుంపరల వలె ఉన్నదని కవి ఉద్దేశం.
Exam Tips:
a) గేయంలోని ఉపమాన పదాలను (పాలయేఱు, అమృతశీకరాలు) గుర్తించి సమాధానం రాయండి.
III. స్వీయరచన
Question 1: “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ? (ఐదు వాక్యాల్లో)
Answer:
తియ్యని నదుల నీటితో పొలాలలో రుచికరమైన పంటలు పండుతాయి. కొండలు, అడవులలో నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులలో ఒండ్రుమట్టి, వన మూలికలు, ఆకులు అలములు మొ||వి కొట్టుకు వస్తాయి. ఇవి పొలాలలోకి చేరి పంటమొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తాయి. పంటల అధిక దిగుబడికి కారణం అవుతాయి.
అందువల్లనే “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని కవి అన్నాడు.
Exam Tips:
a) ఒండ్రుమట్టి, వనమూలికలు, ఆకులు కొట్టుకు వచ్చి ఎరువుగా మారడం ముఖ్య కారణం.
Question 2: భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి. (ఐదు వాక్యాల్లో)
Answer:
భాగ్యనగరం అంటే హైదరాబాదు. ఈ నగరాన్ని కులీకుతుబ్‌షా అనే సుల్తాను నిర్మించాడు. ఈ భాగ్యనగరంలో నివసించే ప్రజలకు మంజీర నది పంచదార వంటి తీయని మంచినీటిని అందిస్తుంది. నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం వల్ల మంజీర నదికి భాగ్యనగరంతో విడదీయరాని సంబంధం ఉన్నది.
Exam Tips:
a) “కులీకుతుబ్‌షా – భాగ్యనగరం – తీయని తాగునీరు” అనే మూడు అంశాలు ఉండాలి.
Question 3: మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
జీవులన్నింటికీ మంచినీరు ప్రాణాధారం. నదులు మంచినీరు అందించి ప్రాణాలను కాపాడతాయి. కనుక నదులను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నది నీటిని వ్యర్థాలతో, మలినాలతో కలుషితం చేయకూడదు. ప్రాణాలు నిలబెట్టే నదులలోని మంచినీటిని వృథా చేయకూడదు. భవన నిర్మాణాల కోసమో, నగర నిర్మాణాల కోసమో నదులను దారి మళ్ళించ కూడదు. అట్లా చేయడం వల్ల నదులు కనుమరుగు కావడమే కాక వరదలు, ముంపులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
అందువల్ల నదులను కాపాడుకోవాలి.
Exam Tips:
a) కాలుష్యం చేయకపోవడం, నీటి వృథా నివారణ, దారి మళ్ళించకపోవడం – మూడు జాగ్రత్తలు రాయండి.
Question 4: నదులు ‘నాగరికతకు ఆలవాలం’ ఎందుకు ? (ఐదు వాక్యాల్లో)
Answer:
నాగరీకరణం చెందిన మానవ జీవన విధానమే నాగరికత. మానవుడు కొండల్లో, గుహల్లో తలదాచుకున్న దశ నుంచి వ్యవసాయం చేయడం నేర్చుకొని స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాడు. అవే గ్రామాలు. గ్రామ దశ నుంచి వర్తక వాణిజ్యాల అభివృద్ధితో నగరాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో నదులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ మాటకొస్తే నదుల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది.
ప్రపంచ ప్రసిద్ధ నగరాలు అన్నీ దాదాపు నదుల ఒడ్డున ఏర్పడినవే. ఉదాహరణకు మూసీనది ఒడ్డున హైదరాబాదు, గోదావరి ఒడ్డున రాజమండ్రి, యమునా నది ఒడ్డున ఆగ్రా, గంగానది ఒడ్డున కాశీ, నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, సీన్ నది ఒడ్డున రోమ్ మొదలైనవి. కనుక నదులు నాగరికతకు నిలయమైనవని చెప్పవచ్చు.
Exam Tips:
a) నది ఒడ్డున ఏర్పడిన నగరాల ఉదాహరణలు (హైదరాబాదు–మూసీ, కాశీ–గంగ, కైరో–నైలు) తప్పక రాయండి.
Question 5: మంజీర నది మానవులకు చేసే మేలు ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
మంజీర నది జీవులను కన్నతల్లిలా పోషిస్తుంది. తియ్యని మంచినీరు అందిస్తుంది. రుచికరమైన ఆహార పంటలు పండటానికి తోడ్పడుతుంది. ఎండిపోయిన, బీడుబోయిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా తయారు చేస్తుంది. ఎటువంటి నేలలో అయినా తీయని చెరకు వంటి పంటలు పండటానికి తోడ్పడుతుంది. తన ప్రవాహంతో పాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి పంటకు బలాన్ని ఇస్తుంది. భాగ్యనగర్ వాసులకు తీయని మంచినీరు అందిస్తుంది. స్నానం, తాగునీరు, సాగునీరు మొదలైన పల్లెవాసుల అవసరాలన్నీ తీరుస్తుంది. పల్లెల్లో పండించిన ధాన్యాన్ని పట్టణాలకు పంపడానికి దోహదపడుతుంది.
Exam Tips:
a) తాగునీరు, సాగునీరు, సారవంతమైన మట్టి, భాగ్యనగరానికి నీరు, ధాన్య రవాణా – వీటిని వరుసగా రాయండి.
Question 6: మానవ నాగరికత పరిణామంలో నదుల పాత్ర ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
మానవ నాగరికత పరిణామంలో నదులు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.
ప్రపంచంలో విలసిల్లిన నాగరికతలు అన్నీ నదుల ఒడ్డున ఏర్పడి అభివృద్ధి చెందినవే. ఉదాహరణకు నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, యమునానది ఒడ్డున ఆగ్రా, మూసీనది ఒడ్డున హైదరాబాదు, సీన్ నది ఒడ్డున రోమ్‌నగరం, గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, గంగానది ఒడ్డున కాశీనగరం మొదలైనవి. ప్రాచీనకాలం నుంచి నదులు జీవుల దాహం తీరుస్తున్నాయి. వ్యవసాయానికీ, రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఆధునికకాలంలో విద్యుత్తయారీకి, పర్యాటకుల్ని ఆకర్షించడానికీ కూడా ఉపయోగపడుతూ మానవులకు ఎంతో మేలు చేస్తున్నాయి.
Exam Tips:
a) ప్రాచీన పాత్ర (తాగునీరు, వ్యవసాయం) – ఆధునిక పాత్ర (విద్యుత్తు, పర్యాటకం) అని రెండు భాగాలు చేయండి.
Question 7: “నీ కంకణ క్వణము నినదించినంతనే” దీన్ని వివరించండి.
Answer:
కంకణం అంటే గాజు, క్వణం అంటే ధ్వని. కంకణకణము అంటే గాజులు కదలేటప్పుడు వినిపించే గలగలల శబ్దం. సాధారణంగా నదిని స్త్రీతో పోలుస్తారు. ఇక్కడ కవి మంజీర నదిలోని అలల సవ్వడిని స్త్రీ గాజుల గల గలల లాగా ఉన్నాయని ఊహించాడు. ‘నీ కంకణ క్వణము నినదించినంతనే’ అంటే నీ (మంజీర నది) గాజుల సవ్వడి గలగలలు (అలల సవ్వడి) ధ్వనులు విన్న వెంటనే అని తాత్పర్యం.
Exam Tips:
a) కంకణం = గాజు, క్వణం = ధ్వని అని పదార్థాన్ని చెప్పి, నదిని స్త్రీతో పోల్చిన భావాన్ని రాయండి.
Question 8: నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి. (పది వాక్యాల్లో)
Answer:
నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగు కావడానికి వాతావరణ కాలుష్యం, జలకాలుష్యం, నీటివృథా, అజాగ్రత్త, నిర్వహణాలోపం మొదలైనవి ముఖ్యకారణాలు.
1. వాతావరణ కాలుష్యం : మేఘాలు వర్షించినప్పుడు భూమిపైన ఎత్తుమీద పడిన నీరు పల్లానికి ప్రవహించి చిన్న చిన్న వాగులై అవి మహానదిలా మారి చివరికి సముద్రంలో కలుస్తాయి. భూమి మీద వృక్షసంపద తగ్గిపోతూండడం వల్ల తగినంత వర్షం పడటంలేదు. అందువల్ల నదుల్లో ప్రవహించే నీటి శాతం క్రమంగా తగ్గుతున్నది.
2. జలకాలుష్యం : ప్రవహించే నీటిలో అనేక పరిశ్రమల వ్యర్థాలు, మలిన పదార్థాలు కలిసిపోవడం వల్ల ఆ నీరు కలుషితమై పోతున్నది. ఆ నీరు తన సహజగుణాన్ని కోల్పోతున్నది.
3. నీటి వృథా : నీటిని వృథా చేయడం వల్ల కూడా కొంతకాలానికి నదుల్లో నీరు కనుమరుగైపోతుంది.
4. అజాగ్రత్త : నదుల్లో ప్రవహించే నీటిని జాగ్రత్త చేసుకోలేక పోవడం వల్ల ఎక్కువ శాతం నీరు సముద్రంలో కలిసిపోతున్నది.
5. నిర్వహణాలోపం : నది నీటికి శాస్త్రీయ పద్ధతులలో నిర్వహణ లేకపోవడం వల్ల కూడా నదినీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
6. ముగింపు : ఈ విధంగా మన నాగరికతకు మూలాధారాలైన నదులను జాగ్రత్తగా కాపాడకపోతే మానవ జీవనం ప్రశ్నార్థకమౌతుంది.
Exam Tips:
a) కారణాలను శీర్షికలతో (కాలుష్యం, వృథా, అజాగ్రత్త, నిర్వహణ లోపం) రాసి, చివర ముగింపు వాక్యం చేర్చండి.
Question 9: గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)
Answer:
డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన ‘మంజీర’ అనే పాఠ్యభాగంలో మంజీరనది మానవాళికి చేసే మేలును గురించి తేలికైన తేటతెలుగు పదాలలో వివరించారు. మాత్రాఛందస్సులో రచించిన ఈ గేయంలో మంజీరానది సాగునీటిగా తాగు నీరుగా ఉపయోగపడుతూ ప్రజలకు చేసే మేలును వివరించారు.
సాగునీరు : మంజీర నది చల్లని తల్లి వంటిది. గాజుల గలగలలు వంటి ఆమె ప్రవాహపు సవ్వడి వింటేనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. ఆమె చల్లని చూపు వంటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో కనుల పండుగలాగా ప్రకాశిస్తాయి. మంజీర నది ఎండిపోయిన నేలను కూడా తన తీయని నీటితో కరిగించి పంట పండటానికి అనువుగా తయారుచేస్తుంది. ఎటువంటి నేలలో అయినా చెరుకు వంటి తీయని పంటలు పండేటట్లు చేస్తుంది. అంతేకాక తన ప్రవాహంతోపాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తుంది. పంట మొక్కలకు బలాన్ని ఇస్తుంది.
తాగునీరు : మంజీర నది కులీకుతుబ్‌షా నిర్మించిన భాగ్యనగరం (హైదరాబాదు)లో నివసించే వారికి తీయని మంచి నీరు అందిస్తుంది. తన పరీవాహక పరిసరాలలో నివసించే పల్లె ప్రజలను ప్రేమగా లాలిస్తుంది. వారి సాగునీటి అవసరాలతో పాటు స్నానాల, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది.
పట్టణానికి తోబుట్టువులా : మంజీరనది పల్లె ప్రజలను తల్లిలా లాలిస్తుంది. పట్టణ ప్రజలను తోబుట్టువులా ఆదరిస్తుంది. పల్లె ప్రజలకు అవసరమైన దానికంటే అధికంగా దిగుబడిని అందిస్తుంది. పల్లె ప్రజలు తమ మిగులు పంటను పట్టణాలకు పంపించడానికి తోడ్పడుతుంది. ధాన్యాన్ని, ఇతర వస్తువులనూ తరలించడానికి రవాణా కోసం కూడా నది ఉపయోగపడుతుంది.
ముగింపు : ఈ విధంగా మంజీర నది సకల జీవులకూ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మానవులకు సాగునీటి అవసరాలను తీర్చి ఎంతో మేలు చేస్తున్నదని ‘మంజీర’ పాఠ్యభాగంలో కవి వర్ణించాడు.
Exam Tips:
a) సాగునీరు – తాగునీరు – పట్టణానికి తోబుట్టువులా అనే మూడు శీర్షికలతో సారాంశం రాయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత / గేయాన్ని రాయండి.
Answer:
పల్లవి : మా వూరు వచ్చింది మా మంచి ఏరు
మనసార నివ్వింది సిరిమల్లె తీరు
మా దాహమును తీర్చి మా పంట పండించ ॥మా వూరు॥
చరణం 1 : పగటి ఎండల్లోన పరవళ్ళు తొక్కింది
తెల్ల మబ్బుల వంటి నురగల్లు తెచ్చింది.
పండు వెన్నెల్లోన నిండుగా పారింది
ఎండు బీడుల్లోన గుండె ఉప్పొంగంగ ॥మా వూరు॥
చరణం 2 : గలగలా పారుతూ గిలిగింత పెట్టింది.
హలము పొలము దున్న రైతును తట్టింది
తీయని నీటితో తేనెను పోలింది
చక్కని పంటతో సిరులు కురిపించంగ ॥మా వూరు॥
చరణం 3 : జలపాతములతోన జలకాలు ఆడింది
గులకరాళ్ళల్లోన సెల పాటపాడింది
మంచి నీటితోన చెరువు ముంచెత్తింది.
తేటనీటితోన ఏరై పరుగెత్తంగ ॥మా వూరు॥
Exam Tips:
a) పల్లవి, చరణాలు స్పష్టంగా విడదీసి, అంత్యప్రాస (ఒకే రకమైన పదాంతాలు) పాటిస్తూ రాయండి.
V. పదజాల వినియోగం
Question 1: కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.
(అ) రైతు (ఆ) చల్లదనం (ఇ) నేల (ఈ) స్నేహం (ఉ) పంపి (ఊ) ప్రకాశించు
| పుడమి | నాగలి | అంపి | విలసిల్లు |
| చలువ | కర్షకుడు | కంకణము | సోపతి |
Answer:
(అ) రైతు – కర్షకుడు
(ఆ) చల్లదనం – చలువ
(ఇ) నేల – పుడమి
(ఈ) స్నేహం – సోపతి
(ఉ) పంపి – అంపి
(ఊ) ప్రకాశించు – విలసిల్లు
Exam Tips:
a) పట్టికలోని పదాలను అర్థం బట్టి జంటగా చేర్చండి; ఒక పదాన్ని ఒక్కసారే వాడండి.
Question 2: కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.
“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.”
Answer:
| వికృతి | ప్రకృతి |
| ఎడద | హృదయం |
| రాసులు | రాశులు |
Exam Tips:
a) తెలుగు రూపం (వికృతి) నుండి సంస్కృత రూపం (ప్రకృతి) రాయాలి.
Question 3: కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
(అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది.
(ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది.
(ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం.
Answer:
(అ) విలసిల్లింది = ప్రకాశించింది
(ఆ) కూర్మి = స్నేహం, సోపతి
(ఇ) పుడమి = భూమి, ధరణి
Exam Tips:
a) వాక్య సందర్భానికి సరిపడే అర్థమే ఎంచుకోండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది ఖాళీలను పూరించండి.
ఉదా : సీతజడ = సీత యొక్క జడ – షష్ఠీ తత్పురుషము
(చెట్టునీడ, వయోవృద్ధుడు, రాజశ్రేష్ఠుడు, అమంగళం, తిలకధారి)
Answer:
| సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
| సీతజడ | సీత యొక్క జడ | షష్ఠీ తత్పురుషము |
| చెట్టునీడ | చెట్టు యొక్క నీడ | షష్ఠీ తత్పురుషము |
| వయోవృద్ధుడు | వయసు చేత వృద్ధుడు | తృతీయా తత్పురుషము |
| రాజశ్రేష్ఠుడు | రాజులలో శ్రేష్ఠుడు | షష్ఠీ తత్పురుషము |
| అమంగళం | మంగళం కానిది | నఞ తత్పురుషము |
| తిలకధారి | తిలకమును ధరించినవాడు | ద్వితీయా తత్పురుష సమాసం |
Exam Tips:
a) విగ్రహవాక్యంలో విభక్తి (యొక్క, చేత, లో, ను) ఆధారంగా సమాస రకం చెప్పండి; “కాని” అని వస్తే నఞ తత్పురుషం.
ఆలోచించండి – చెప్పండి (అలంకారాలు)
Question 1: కింది కవితను చదువండి.
ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతీదేవి ఒడి
మనకు నేర్పును నడవడి
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది?
Answer:
ఈ కవిత చదువుతుంటే చెవికి ఇంపుగా ఉన్నది.
Exam Tips:
a) మీ అనుభూతిని (చెవికి ఇంపు, లయ) ఒక వాక్యంలో రాయండి.
Question 2: ఎందుకని వినసొంపుగా ఉన్నది?
Answer:
ప్రతి పాదం ‘డి’ అనే అక్షరంతో ముగియడం వల్ల వినసొంపుగా ఉన్నది.
Exam Tips:
a) పాదాంతంలో పునరావృతమయ్యే అక్షరాన్ని గుర్తించండి.
Question 3: దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది?
Answer:
దీనిలో ‘డి’ అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది. పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.
కింది వాక్యాలు పరిశీలించండి.
(అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
(ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యనుప్రాస’ అలంకారం అంటారు.
Exam Tips:
a) ఒకే హల్లు అనేకసార్లు రావడం = వృత్త్యనుప్రాస; శబ్దంలోని అందం = శబ్దాలంకారం అని గుర్తుంచుకోండి.
Question 4: మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.
Answer:
1. పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
2. గిడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
Exam Tips:
a) పాఠంలో ఒకే హల్లు పునరావృతమైన పంక్తులను (ఇక్కడ “డ”, “ప”, “వ”) వెతకండి.
భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని
Question 1: తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
Answer:
(అ) ప్రాథమిక సమాచారం:
(1) ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ రాష్ట్రంలో నదులు – వాటిపై ప్రాజెక్టులు – తీరాల్లో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకాలు, పెద్దల నుండి సమాచార సేకరణ
(ఆ) నివేదిక:
| నది పేరు | ప్రాజెక్టు పేరు | పుణ్యక్షేత్రం (నదీతీరపు) | దర్శనీయ స్థలాలు |
| 1. గోదావరి | (1) నిజాంసాగర్ ప్రాజెక్టు – అచ్చంపేట (2) సింగూరు ప్రాజెక్టు – సింగూరు (3) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు – పోచంపాడు (4) దుమ్ముగూడెం పవర్ ప్రాజెక్టు – పాములపల్లి, ఖమ్మం జిల్లా | (1) సత్యనారాయణ స్వామి దేవాలయం, లక్షెట్టిపేట్ (గూడెంగుట్ట), ఆదిలాబాద్ జిల్లా (2) జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర, ఆదిలాబాద్ జిల్లా (3) నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా (4) శివాలయం, కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా | (1) కొయ్యబొమ్మల పరిశ్రమ, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా (2) చేతి బొమ్మల పరిశ్రమ, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా |
| 2. కృష్ణా | (1) నాగార్జున సాగర్ ప్రాజెక్టు (నల్గొండ), నాగార్జున కొండ (2) జూరాల ప్రాజెక్టు – రేవులపల్లి, మహబూబ్‌నగర్ | (1) శ్రీ జోగులాంబ దేవి దేవాలయం, ఆలంపూర్, మహబూబ్‌నగర్ జిల్లా (2) శ్రీరంగనాయక స్వామి దేవాలయం, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా | (1) పిల్లలమర్రి, మహబూబ్‌నగర్ జిల్లా (2) గద్వాల్ పోర్టు, మహబూబ్‌నగర్ జిల్లా |
(ఇ) ముగింపు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యనదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు మరియు ఆ నదుల పరీవాహక ప్రాంతాలలోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాల వివరాలను పట్టికలో పొందుపరిచాను. పెద్దల ద్వారా వాటి గూర్చి తెల్సుకొంటున్నప్పుడు ఆ స్థలాలను దర్శిస్తే బాగుండుననిపించింది.
ఉదా : మహబూబ్‌నగర్ లోని పిల్లలమర్రిలో 700 సం||ల క్రితపు మఱివృక్షం ఉందట. అలాంటి వింతలు విశేషాలు గల స్థలాలను సెలవులలో మా కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని నిర్ణయించుకొన్నాను.
Exam Tips:
a) పట్టికలో నది, ప్రాజెక్టు, పుణ్యక్షేత్రం, దర్శనీయ స్థలం – నాలుగు నిలువు వరుసలు తప్పక ఉండాలి.
పాఠ్యభాగ వివరాలు
Question 1: మంజీర పాఠం ఉద్దేశం తెల్పండి.
Answer:
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణా రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, సింగూర్, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
Exam Tips:
a) “నదులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తాయి” అనే సారాంశాన్ని తప్పక రాయండి.
Question 2: గేయ ప్రక్రియ గురించి రాయండి.
Answer:
మంజీర పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం / పాట అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.
Exam Tips:
a) గేయం = పాడుకోవడానికి వీలైన కవిత్వం; మాత్రా ఛందస్సు; “మంజీర నాదాలు” కావ్యం – ఈ మూడు పాయింట్లు చెప్పండి.
కవి పరిచయం
Question 1: వేముగంటి నరసింహాచార్యుల పరిచయం రాయండి.
Answer:
పాఠ్యభాగం పేరు : మంజీర
కవి పేరు : డా॥ వేముగంటి నరసింహాచార్యులు
జననం : 30-06-1930
మరణం : 29-10-2005
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట
తల్లిదండ్రులు : తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క
రచనలు : తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం మొదలైన 40కిపైగా రచనలు.
బిరుదులు : కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి.
సత్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్‌తో సత్కరించింది.
విశేషాంశాలు : వీరు ‘సాహితీ వికాస మండలి’ అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశారు.
శైలి : వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.
Exam Tips:
a) పేరు, జననం–మరణం, జన్మస్థలం, రచనలు, బిరుదులు – క్రమంగా రాయండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 8 Telugu Lesson 07 Manjira (the river Manjira)
Textbook Solutions for Class 8 Telugu Lesson 07 Manjira (the river Manjira)
Review comprehensive exercise answers for Class 8 Telugu Lesson 07 Manjira (the river Manjira). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Telugu.
FAQs
The complete and updated TS 8th Class Telugu 7th Lesson మంజీర Questions and Answers is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 8th Class Telugu 7th Lesson మంజీర Questions and Answers as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu 7th Lesson మంజీర Questions and Answers will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu 7th Lesson మంజీర Questions and Answers in both English and Hindi medium.
Yes, you can download the entire TS 8th Class Telugu 7th Lesson మంజీర Questions and Answers in printable PDF format for offline study on any device.