Solutions for Class 10 Telugu: Lesson 05 Nagara Geetham (City Song)
Review structured textbook solutions for Class 10 Telugu Lesson 05 Nagara Geetham (City Song). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Practice Class 10 Telugu Solutions: Lesson 05 Nagara Geetham (City Song)
View or download the dedicated Lesson 05 Nagara Geetham (City Song) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
ఆలోచించండి – చెప్పండి
Question 1: “చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగు తున్నప్పుడు” వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ?
Answer:
అర్ధాంగి ఇంట్లో సరుకులన్నీ ఉన్నప్పుడు సంతోషంగా వంటావార్పులు చేస్తుంది. ఇంట్లో సరుకులు లేనప్పుడు కన్నీళ్ళతో ఖాళీ చేటనే చెరుగుతుంది. చూచేవారికి ఇంట్లో అన్నీ ఉన్నట్లు అనుకుంటారు. దీనిద్వారా సంసారాన్ని నిర్వహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలని కవి సూచించాడు.
Exam Tips:
a) కవి ఇక్కడ ‘చేటలో కన్నీళ్ళు చెరగడం’ అనే ప్రతీకతో ఇంట్లో సరుకులు లేని స్థితిని సూచించాడని మొదట చెప్పి, తరువాత దాని నుండి గ్రహించిన విషయాన్ని రాయండి.
b) ఇలాంటి ప్రశ్నలలో ‘ఏమి గ్రహించారు’ అంటే పాఠం సారాన్ని మీ మాటల్లో చెప్పాలి; ఒకటి రెండు వాక్యాలు చాలు.
Question 2: కవి నివాసం ఎట్లా ఉన్నది ?
Answer:
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం లేనటు వంటి పగలూ, రాత్రి ఆస్బెస్టాస్రేకుల షెడ్లో రచయిత నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో సకల కష్టాలను అనుభవిస్తున్నాడు.
Exam Tips:
a) కవి నివాసం గురించి చెప్పేటప్పుడు ‘ఆస్బెస్టాస్ రేకుల షెడ్డు’, ‘పచ్చదనం లేకపోవడం’ అనే రెండు ముఖ్య విషయాలు రాయండి.
Question 3: నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు ? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
Answer:
నగర నాగరికత నరకప్రాయమని కవి చెప్పాడు. ఇది యదార్థమే. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండదు. కలుషితమైన వాతావరణం ఉంటుంది. శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మానవీయ సంబంధాలు అంతగా ఉండవు. జీవితం ఉరుకులుపరుగులతో కూడి ఉంటుంది. అందువల్ల నగర నాగరికతను నరకప్రాయమని కవి చెప్పాడు.
Exam Tips:
a) ఇది అభిప్రాయ ప్రశ్న; ‘శబ్ద, నీటి, వాయు కాలుష్యం’, ‘ఉరుకుల పరుగుల జీవితం’ వంటి కారణాలు ఇస్తూ మీ అభిప్రాయం రాయండి.
b) ముందు ‘నరకప్రాయం’ అంటే ఏమిటో ఒక వాక్యంలో చెప్పి, తరువాత కారణాలు వరుసగా రాయండి.
Question 4: కవితాత్మక వాక్యాలు చదివారు కదా! ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ?
Answer:
జీవితాన్ని నిరాశానిస్పృహలతో గడపకూడదని, సాధించాల్సిన దానిని సాధించాలని, నరకప్రాయమైన నగర నాగరికతను కూడా జీర్ణించుకోవాలనే సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమవుతుంది.
Exam Tips:
a) ఈ ప్రశ్నకు కవి పేరు (అలిశెట్టి ప్రభాకర్), ఆయన భావాలు (నగరజీవితంపై చురకలు) రెండింటినీ ప్రస్తావించండి.
b) సొంత మాటలలో ‘కవి నగరజీవితాన్ని వాస్తవికంగా, వ్యంగ్యంగా చూపాడు’ అని ముగించండి.
ఆలోచించండి – చెప్పండి – I (T.B. P.No. 50)
Question 1: పల్లెసీమల్ని కవి తల్లిఒడితో ఎందుకు పోల్చాడు ?
Answer:
పల్లెసీమలు ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. మరువలేని, మరుపురాని ఆత్మీయతాను బంధాలు పల్లెల్లో ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. తల్లి ఒడిలోని పిల్లవానికి ఎంత రక్షణ ఉంటుందో, పల్లెసీమలో ఉండే మనిషికి కూడా అంతటి రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో పల్లెసీమల్ని తల్లిఒడితో పోల్చాడు.
Exam Tips:
a) ‘తల్లి ఒడి’ ఉపమానానికి గల లక్షణాలు (రక్షణ, ఆత్మీయత, ప్రశాంతత) చెప్పి, పల్లెలకు అవి ఎలా సరిపోతాయో వివరించండి.
Question 2: పట్టణాలను ‘ఇనప్పెట్టెలు’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
Answer:
ఇనప్పెట్టెలను డబ్బు దాచుకోవడానికి వాడతారు. అవి చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయి. ఇనప్పెట్టెలో ఊపిరి పీల్చుకోడానికి కూడా గాలి రాదు. నగరాలలోని ఇళ్ళలో కూడా తగినంత ఖాళీ ప్రదేశం లేక ఇరుకుగా ఉంటుంది. ఆ దృష్టితోనే కవి నగరాలను ఇనప్పెట్టెలతో పోల్చాడు.
Exam Tips:
a) ‘ఇనప్పెట్టె’ లక్షణాలు (ఇరుకు, గాలి ఆడకపోవడం) పట్టణాల ఇళ్ళతో పోల్చి రాయండి.
b) కవి పోలిక ఎందుకు సరైనదో కారణం చెప్పడం మరచిపోకండి.
Question 3: ‘నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే’ అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది ?
Answer:
పఠనీయ గ్రంథంలో ఎన్నో విషయాలు చదివి తెలుసుకోవలసినవి ఉంటాయి. వాటిలో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. అలాగే నగరంలో నివసించే ప్రతి మనిషికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తుల జీవన చరిత్రలు తప్పక తెలుసుకోతగ్గట్టుగా ఉంటాయి. అందుకే నగరంలో ప్రతి మనిషిని పఠనీయ గ్రంథం అని కవి చెప్పాడు.
Exam Tips:
a) ‘పఠనీయ గ్రంథం’ అంటే చదవదగిన పుస్తకం అని అర్థం చెప్పి, ‘ప్రతి మనిషి వెనుక ఒక జీవితకథ ఉంటుంది’ అనే భావాన్ని వివరించండి.
b) కవి చెప్పిన ‘పేజీలు తిరగేసేదెవరో’ అనే పంక్తిని కూడా ప్రస్తావించండి.
Question 4: “పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి” అని కవి ఎవరి గురించి అన్నాడు ? దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
Answer:
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లో చదువుల పుప్పొడి రాలుతుంది. విరబూసిన పువ్వులతో పిల్లలను పోల్చాడు. పిల్లలు సుకుమార మనస్కులు. వారి నవ్వులు ఆహ్లాదంగా ఉంటాయి.
Exam Tips:
a) ‘కాన్వెంటు పువ్వులు’ అంటే స్కూలు పిల్లలు, ‘చదువుల పుప్పొడి’ అంటే వారి మాటలు – ఈ రెండు అర్థాలు స్పష్టంగా రాయండి.
b) రెండు భాగాల ప్రశ్న కాబట్టి ‘ఎవరి గురించి’, ‘మీ అభిప్రాయం’ అని రెండు భాగాలకు జవాబు ఇవ్వండి.
ఆలోచించండి – చెప్పండి – II (T.B. P.No. 50)
Question 1: “సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు!” ఇది వాస్తవమేనా ? ఎందుకు ?
Answer:
సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఒకవైపు ఖరీదైన భవంతులు పక్క పక్కనే చిన్న చిన్న పూరిపాకలు సమాంతర గీతలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్త్వాలతో కనిపిస్తుంది. అనగా నగరంలో అందమైన భవనాలేకాదు, మురికివాడలు కూడా ఉంటాయని చెప్పడమే కవి ఉద్దేశ్యం.
Exam Tips:
a) ‘ఒకవైపు భవంతులు – మరోవైపు పూరిళ్ళు’ అనే వైరుధ్యాన్ని చూపుతూ మీ అభిప్రాయం రాయండి.
b) ‘వాస్తవమే’ అని స్పష్టంగా చెప్పి కారణాలు ఇవ్వండి.
Question 2: రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి ?
Answer:
రెండుకాళ్ళు అంటే కాలినడక, మూడుకాళ్ళంటే రిక్షా, నాలుగుకాళ్ళంటే కారు అని అర్థం. అనగా వారివారి ఆర్థిక స్తోమతనుబట్టి మానవులు ప్రయాణం సాగిస్తారని భావం.
Exam Tips:
a) రెండు కాళ్ళు = నడక, మూడు కాళ్ళు = రిక్షా/ఆటో, నాలుగు కాళ్ళు = కారు – ఈ మూడు అర్థాలను తప్పక రాయండి.
b) ఆర్థిక స్థితి వల్ల ప్రయాణ సాధనాలలో తేడా అనే అంతరార్థాన్ని చివరి వాక్యంగా రాయండి.
Question 3: “మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు” అంటే ఏమిటి ?
Answer:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగుదిక్కుల్లోని రోడ్లో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
Exam Tips:
a) ‘మరణం నాలుగువైపులు’ అంటే నాలుగు దిక్కుల నుండి వాహనాల ప్రమాదం పొంచి ఉంటుందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని రాయండి.
Question 4: నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
Answer:
రసాయనశాల అంటే రసాయనద్రవ్యాలు, ఆమ్లాలు ఉన్న ప్రయోగశాల అని అర్థం. ప్రయోగశాలలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలూ, ఆమ్లాలు ఉంటాయి. ఆ ద్రవాలకు వేర్వేరు చర్యలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే నగరాన్ని కవి “రసాయనశాల” అన్నాడు.
ఇక పద్మవ్యూహం సంగతి. పద్మవ్యూహంలో ప్రవేశించినవాడు తిరిగి తేలికగా బయటకు రాలేడు. అక్కడే జీవనపోరాటం చేస్తూ మరణిస్తాడు.
నగరం కూడా ఇటువంటిదే, బతుకు కోసం నగరానికి వచ్చిన సామాన్యులకు ఉపాధి దొరకక పోయినా వారు ఏదో ఒక రోజున దొరుకుతుందనే ఆశతో, నగరంలోనే ఉండి దానికై ఎదురుచూస్తూ ఉంటారు. నగరంలోని సౌకర్యాలకూ, వినోద విలాసాలకూ, పైపై మెరుగులకూ వారు లొంగిపోతారు. మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలు భయపెడుతున్నా నగరాన్ని విడిచి వారు వెళ్ళలేరు. వారిని కాలుష్యం కలవరపెట్టినా, వింత వింత జబ్బులు పీడిస్తున్నా, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటున్నా వారు నగరాన్ని విడిచి ప్రశాంతమైన తమ పల్లెలకు వెళ్ళలేరు. అందుకే కవి నగరాన్ని “పద్మవ్యూహం” అని పిలిచాడు.
Exam Tips:
a) రసాయనశాల (అర్థంకాని చర్యలు), పద్మవ్యూహం (బయటకు రాలేని చిక్కు) – రెండు ఉపమానాలను వేరువేరుగా వివరించండి.
b) అభిమన్యుని పద్మవ్యూహ ప్రస్తావన తెస్తే జవాబు బలపడుతుంది.
ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.
అ) మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు ? మీరు చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలు తెలుపండి.
Answer:
నేను ఇప్పటి వరకు ఎన్నో నగరాలు చూశాను. వాటిలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాను.
| నేను చూసిన నగరం | నచ్చిన అంశం | నచ్చని అంశం |
| హైదరాబాద్ | జులాజికల్ పార్కు, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, అవుటర్ రింగ్ రోడ్డు, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెక్రెటేరియట్, అసెంబ్లీ భవనం, ప్రధాన రోడ్లు, పరిశుభ్రత, రోడ్ల ప్రక్క మొక్కలు | ట్రాఫిక్‌జామ్; మురికివాడల్లో కంపు; పేవ్మెంట్లు చిన్నవర్తకులతో నిండిపోవడం; జనసమ్మర్దం |
| బెంగళూరు | బృందావన్ గార్డెన్స్, జంతుప్రదర్శనశాల, విధాన సౌధ భవనాలు, హైకోర్టు, పార్కులు, మహారాజ ప్యాలెస్, నంది విగ్రహం, చాముండేశ్వరి దేవాలయం మొ॥వి., పార్కులలో పరిశుభ్రత, ప్రధాన రోడ్ల శుభ్రత | సిటీబస్సుల సౌకర్యం సరిగా లేకపోవడం; ఆటోరిక్షాల వారి అధిక వసూళ్ళు; జనసమ్మర్దం |
| కోల్‌కతా | పశ్చిమ బెంగాల్ రాజధాని; దేశంలోనే ఎక్కువ జనాభా గల నగరం; వరి తింటారు; అంతర్జాతీయ విమానకేంద్రం ఉంది; పెద్ద రైల్వే కూడలి; దుర్గా భక్తులు ఎక్కువ; రామకృష్ణ మఠం చాలా బాగుంటుంది | రోడ్లు ఇరుకుగా ఉంటాయి; ట్రాఫిక్ ఎక్కువ; జనాభా చాలా ఎక్కువ |
| ముంబై | మహారాష్ట్ర రాజధాని, భారత్‌కు వాణిజ్య రాజధాని; ప్రజలు మరాఠీ, హిందీ మాట్లాడతారు; వరి, గోధుమ తింటారు; వస్త్ర పరిశ్రమ కేంద్రం; చూడవలసిన నగరం | వీధులు కిక్కిరిసి ఉంటాయి; ధరలు చాలా ఎక్కువ; ఖాళీ స్థలం తక్కువ |
| విశాఖపట్నం | రామకృష్ణా బీచ్; షిప్‌యార్డు; ఆంధ్ర విశ్వవిద్యాలయం; సింహాద్రి అప్పన్న దేవాలయం; మెయిన్ రోడ్డు – అందాలు; కె.జి. హాస్పిటల్ | సముద్రతీరంలో బెస్తపేటలో చేపల కంపు; ఇరుకు వీధులు; పూరిళ్ళు – అశుభ్రత; మంచినీటి కొరత |
| గుంటూరు | వివిధ పరిశ్రమలు, భవనాలు; కార్పోరేషన్ భవనాలు; విద్యాసంస్థలు; హోటళ్ళలో టిఫిన్లు సాంబారు ఇడ్లీలు | లాడ్జి గదుల అసౌకర్యం; దొంగతనాలు; నగరం అశుభ్రత; సిటీబస్సుల కొరత మొ॥వి. |
Exam Tips:
a) మీరు చూసిన నగరాల పేర్లు, నచ్చిన – నచ్చని అంశాలను పట్టిక రూపంలో రాస్తే స్పష్టంగా ఉంటుంది.
b) ప్రతి నగరానికి కనీసం రెండు నచ్చిన, రెండు నచ్చని అంశాలు రాయండి.
Question 2: క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.
ఆ) మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా ? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ?
Answer:
మా ఊరు నుండి ఎంతోమంది యువతీయువకులూ, వివిధమైన చేతివృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు.
వలస వెళ్ళడానికి కారణం : మా గ్రామంలో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడ వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు నగరానికి వలస పోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలిపనుల కోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలసవెళ్ళారు. మరికొందరు యువకులు, సినీమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా కళాకారులుగా అభివృద్ధి చెందాలని. నగరానికి వలస వెళ్ళారు.
కొందరు యువకులు అక్కడ కూలీ పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘుపరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.
ఇంజనీరింగ్ చదివిన యువతీ యువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.
Exam Tips:
a) వలసకు కారణాలు (ఉపాధి లేకపోవడం, విద్య, వైద్య సౌకర్యాలు లేకపోవడం), వారు చేస్తున్న పనులు అనే రెండు భాగాలు రాయండి.
b) ఒక ఉదాహరణ (హైదరాబాద్‌కు వలస) ఇస్తే జవాబు సహజంగా ఉంటుంది.
Question 3: పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.
అ) నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే.
ఆ) నగరం మహావృక్షంమీద ఎవరికి వారే ఏకాకి.
ఇ) మహానగరాల రోడ్లకు మరణం నాలుగు వైపులు.
Answer:
అ) పట్టణాల్లో నివసిస్తున్న ప్రతిమనిషి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. వారంతా ఏదో వృత్తిని అన్వేషిస్తూ అక్కడకు వచ్చినవారే అయి ఉంటారు. వారిలో కొందరు నిరుద్యోగులు, కొందరు చిరుద్యోగులు, కొందరు విద్యార్థులుగా, బీదవారుగా, కొందరు మధ్యతరగతి వారుగా ఉంటారు. వారు ఎన్నో రకాల సమస్యలలో చిక్కుపడి ఉంటారు. వారందరిని గూర్చి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని పై వాక్య సారాంశము.
గ్రంథం అట్ట చూసినంత మాత్రాన ఆ గ్రంథంలోని విషయం ఏమిటో తెలియదు. అలాగే నగరవాసి పై వేషభాషల్ని బట్టి అతడి చరిత్రను గ్రహించలేము. నగరవాసిని అడిగి తెలుసు కోవాలి. అతడు చదివి తెలుసుకోవలసిన పుస్తకం వంటి వాడని భావం.
ఆ) వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.
ఇ) నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. కావున రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలని కవి స్పష్టం చేయదలచుకున్నాడు.
Exam Tips:
a) కవితా పంక్తుల అంతరార్థం రాసేటప్పుడు మొదట పంక్తి సామాన్య అర్థం, తరువాత దానిలో దాగిన భావం (వ్యంగ్యం, విమర్శ) చెప్పండి.
b) ప్రతి పంక్తికీ విడివిడిగా ‘అ), ఆ), ఇ)’ గా జవాబు రాయండి.
Question 4: క్రింది వచన కవితను చదవండి.
నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!
చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ
అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్లా దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు!
కవిత చదివారు కదా ! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి.
ఆ) కవితలో కవి ఏయే పండుగలు ప్రస్తావించాడు ?
ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు ?
ఈ) కవితకు శీర్షిక పెట్టండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించండి.
Answer:
అ) ప్రాస పదాలు:
మమతల ముల్లె – ఎదమల్లె (నా పల్లె)
పాతాళ గరిగె – పెరుగు గురిగి (నా పల్లె)
పేర్చుకొన్న బతుకమ్మ – పల్లెపడతి బొమ్మ
పీరీల పండుగ – దసరా పండుగ
నా పల్లె – మా ఇళ్ళు – పంచే లోగిళ్ళు
ఆ) కవి ప్రస్తావించిన పండుగలు: బతుకమ్మ, బోనాలు, పీరీల పండుగ, అలాయ్ బలాయ్, దసరా పండుగ.
ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి పాతాళ గరిగెతో, అనుబంధాల పెరుగు గురిగితో పోల్చాడు.
ఈ) ఈ కవితకు శీర్షిక “నా పల్లె”. ఈ వచన కవితలో కవి అంతా చక్కని పల్లె గురించి, అక్కడి మమతలు, పండుగలు, అనుబంధాల గురించి రాశాడు. కాబట్టి “నా పల్లె” అనే శీర్షిక తగినది.
Exam Tips:
a) ప్రాస పదాలు అంటే రెండవ అక్షరం (ప్రాస) సమానంగా ఉన్న పదాల జంటలు (ముల్లె – మల్లె, గరిగె – గురిగి).
b) శీర్షిక కవితలోని ప్రధాన భావాన్ని సూచించాలి; ఎందుకు పెట్టారో ఒక వాక్యంలో వివరించండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
Question 1: అలిశెట్టి ప్రభాకర్ గురించి వ్రాయండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
కరీంనగర్ జిల్లా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీనటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వార్తాపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన ఆయన మొదటి కవిత. ఎర్రర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం.
మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్‌గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.
Exam Tips:
a) అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం (జగిత్యాల), వృత్తి (చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్), మొదటి కవిత (పరిష్కారం), ప్రసిద్ధ రచన (సిటీలైఫ్) – ఈ నాలుగు వివరాలు తప్పక రాయండి.
Question 2: ‘నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లాలి. ట్రాఫిక్ జామ్‌లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది.
అలాగే కూలిపనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.
ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికి, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.
Exam Tips:
a) తీరిక దక్కదు (ఉరుకులు పరుగులు, ట్రాఫిక్), కోరిక చిక్కదు (చిరు సంపాదన) అని రెండు భాగాలుగా వివరించండి.
Question 3: నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగం ద్వారా కవి నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించాడు. నగరంలోని కష్టాలను వివరించాడు. ప్రమాదాల గురించి, అసమానతల గురించి కూడా కవి చక్కగా తెలియజేశాడు.
కవి ఇంత కఠినంగా నగర జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో ఆంతర్యం లేకపోలేదు. ముఖ్యంగా నగర జీవన విధానంలో మార్పు రావాలని, ప్రజలమధ్య అసమానతలు తొలిగి, ఐకమత్యం వర్థిల్లాలని, మురికి వాడలులేని సుందర నగరం ఉండాలని కవి ఆకాంక్షించాడు. అందుకోసమే నగర ప్రజలను జాగృతం చేయదలిచాడు.
Exam Tips:
a) కవి ఆంతర్యం: నగర జీవన విధానంలో మార్పు రావాలి, అసమానతలు తొలగాలి, మురికివాడలు లేని నగరం కావాలి – ఈ ఆశయాలను రాయండి.
Question 4: నగరంలో మనిషి జీవన విధానం గురించి పాఠం ఆధారంగా వివరించండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు. నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. నగర ప్రజలు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఇబ్బందులు పడతారు. ఇరుకైన ఇళ్ళలోను, మురికివాడల్లోను జీవనం సాగిస్తారు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. నగర ప్రజలకు ఏనాడు విశ్రాంతి దొరకదు. సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలుపడతారు. చిక్కు విడదీయలేని పద్మవ్యూహంలాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది.
Exam Tips:
a) నగరజీవనం యొక్క కష్టాలు (రణగొణ ధ్వనులు, ఇరుకిళ్ళు, ప్రమాదాలు), ప్రత్యేకతలు (ఆసక్తికరమైన గాథలు) రెండింటినీ ప్రస్తావించండి.
b) ముగింపుగా ‘నగరం పద్మవ్యూహం’ అనే కవి భావాన్ని రాయండి.
Question 5: నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
(లేదా)
నేడు నగర జీవితం ఎలా ఉన్నదో తెలుపండి.
(లేదా)
‘నగర జీవనం’ పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి. (పది వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.
నీటి సమస్య : చెరువుల భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.
ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం.
విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతులు ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.
సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణతో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది.
Exam Tips:
a) పది వాక్యాల జవాబులో కారణాలను శీర్షికలతో (వలసలు, జనాభా, రద్దీ, నీటి సమస్య, కాలుష్యం, ధరలు) వరుసగా రాస్తే స్పష్టత పెరుగుతుంది.
b) చివరగా ‘సగటు మనిషి పడే పాట్లు’తో ముగిస్తే జవాబు పూర్తవుతుంది; ‘(లేదా)’ ప్రశ్నలలో ఒకదానికే జవాబు రాయండి.
Question 6: మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి. (సృజనాత్మకంగా రాయండి.)
Answer:
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ స్పృహ
ఉపోద్ఘాతము :
మనము నివసించు భూమిపై మానవులే గాక గాలి, నీరు, చెట్లు, పర్వతాలు మొదలైనవి ఉంటాయి. ఈ మొత్తాన్నే వాతావరణం లేదా పర్యావరణం అంటారు. మనము ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే వీటిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఇట్లు అవగాహన కలిగి ఉండుటనే “పర్యావరణ స్పృహ” అని అంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనం పీల్చేగాలి, త్రాగేనీరు, నివసించు స్థలం ఇవన్నీ కలుషితమే. రోజురోజుకీ మన ఆరోగ్యాన్ని హరిస్తూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది.
1. వాయు కాలుష్యం
2. జల కాలుష్యం
3. ధ్వని కాలుష్యం
4. భూమి కాలుష్యం
1) వాయు కాలుష్యం : మనం ఎంతటి సౌకర్య వంతమైన జీవితం గడుపుతున్నా మనం ఉదయం పూట పీల్చే రెండు గంటల గాలి తప్ప మిగిలిన గాలంతా విషతుల్యమే. ఫ్యాక్టరీలు, వాహనాలు వదిలే పొగతో పాటు బొగ్గు, వంటచెరకు, చెత్తా చెదారం వంటివి కాల్చడం వలన మన ఎముకలకు, మూత్ర పిండాలకు, ఊపిరితిత్తులకు హాని జరిగి, అనేక రకాల భయంకరమైన రోగాలు వచ్చు ప్రమాదం ఉంది.
2) జలకాలుష్యం : నేడు మన భారతదేశంలోని ముఖ్యమైన 14 నదులతో పాటు అనేక ఉపనదులు, సరస్సులు, చెరువులు, తీవ్రమైన కాలుష్యానికి గురి అవుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడు మలినాలు, విషపదార్థాలు అనేకం నీటిలో కలవడం వలన జలకాలుష్యం జరుగుతున్నది. ప్రస్తుతం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఈ నీటి కాలుష్యం వల్లనే బాధలు అనుభవిస్తున్నారు. దీని వలన మనకు కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.
3) ధ్వని కాలుష్యం : ధ్వని కాలుష్యం నేడు పెద్ద పెద్ద పట్టణాలలో తీవ్రతరం అగుచున్నది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, విమానాలు, రైల్వేలు, లౌడుస్పీకర్లు మొదలైనవి ధ్వని కాలుష్యానికి కారణాలు. దీని వలన మనకు చెవుడు, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఏకాగ్రత లోపించుట, తలనొప్పి, జీర్ణశక్తి తగ్గుట, రక్తపోటు గుండెదడ వంటి జబ్బులు వస్తాయి.
4) భూమి కాలుష్యం : ప్రాణులన్నీ భూమిపైనే నివసిస్తాయి. మనం జీవించడానికి కావలసిన ఆహారం భూమిపైనే లభిస్తుంది. అటువంటి భూమి రసాయన ఎరువుల వాడకం వల్ల నిస్సారమై పోతోంది. చెత్త, చెదారం, ప్లాస్టిక్ సంచుల వాడకం మొదలైన కారణాల వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింటోంది.
కాలుష్య నివారణ మార్గాలు : వాతావరణం మనకు రక్షణ కవచం వంటిది. కాబట్టి చక్కని ఆరోగ్యం అందరికి కావలెనన్న ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మనం మనందరి బాధ్యతగా గుర్తించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. వాహనాలు పొగను తగ్గించాలి.
నీరు కలుషితం కాకుండా చెరువులు, బావుల యందలి నీటిలో క్లోరిన్ వంటి క్రిమి సంహారక మందులు కలపాలి. మొక్కలు విస్తారంగా నాటి, సాధ్యమైనంత విశాల భూమిని పచ్చపచ్చగా ఉంచాలి. దంపతులైన వారు విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. ఎల్లరూ కూడ “వన రక్షణే జన రక్షణ” అన్న సూక్తిని మరువరాదు. “వృక్షో రక్షతి రక్షితః” “చెట్లు పెంచితే క్షేమం – నరికితే క్షామం”.
Exam Tips:
a) కరపత్రంలో ‘శీర్షిక – ఉపోద్ఘాతం – సమస్యలు – నివారణ మార్గాలు – నినాదం’ అనే క్రమం పాటించండి.
b) చివరలో ‘వన రక్షణే జన రక్షణ’ వంటి ఆకర్షణీయమైన నినాదం చేర్చండి.
III. భాషాంశాలు – పదజాలం
Question 1: క్రింది పదాలకు అర్థాలు రాయండి.
అ) నగారా
ఆ) సందడి
ఇ) ఘోష
ఈ) పఠనీయ గ్రంథం
Answer:
అ) నగారా : పెద్ద ఢంకా
ఆ) సందడి : జన సమూహధ్వని
ఇ) ఘోష : ఉరుము, ఆవులమంద, కంచు
ఈ) పఠనీయ గ్రంథం : చదువదగిన గ్రంథము
Exam Tips:
a) ‘నగారా’ = ఢంకా, ‘సందడి’ = కోలాహలం వంటి పదాల సరైన అర్థాలను పాఠం నుండి గుర్తుంచుకోండి.
b) బహుళార్థాలు ఉన్న పదాలకు (ఘోష) పాఠంలోని సందర్భానికి సరిపడే అర్థాన్ని ముందుగా రాయండి.
Question 2: క్రింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
అ) నరుడు
ఆ) అరణ్యం
ఇ) రైతు
ఈ) పువ్వు
ఉ) మరణం
ఊ) వాంఛ
ఎ) వృక్షం
(ఉదా : పల్లె – గ్రామం, జనపదం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.)
Answer:
అ) నరుడు – మానవుడు, మనిషి
నరుడు జ్ఞానవంతుడని, లోకంలో మానవుడు సాధించలేనిది ఏదీ లేదన్నారు. మనిషి తన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి.
ఆ) అరణ్యం – విపినం, అడవి
అరణ్యంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది. సింహాలు విపినంలో నివసిస్తాయి. అడవి జంతువులకు రక్షణ కావాలి.
ఇ) రైతు – కర్షకుడు, కృషీవలుడు
రైతు లేనిదే రాజ్యం లేదు. కర్షకుడు పండిస్తేనే పంటలు పండుతాయి. అందువల్ల మనమంతా కృషీవలునికి ఋణపడి ఉన్నాము.
ఈ) పువ్వు – కుసుమం, పుష్పం
ఉద్యానవనంలో గులాబీపువ్వు, మందార కుసుమం, మల్లెపుష్పం ఉన్నాయి.
ఉ) మరణం – మృత్యువు, చావు
పుట్టినవానికి మరణం తప్పదని తెలిసినా మానవుడు మృత్యువుకు భయపడతాడు. చావును ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఊ) వాంఛ – కోరిక, ఇచ్ఛ
రవి తీరని వాంఛను పొందలేక, వేరొక కోరిక కోరాడు. తన ఇచ్ఛ నెరవేరలేదని దిగులు చెందాడు.
ఎ) వృక్షం – చెట్టు, తరువు
ఇంటి ముందు వృక్షం ఉంటే ఆ చెట్టు గాలికి పరవశిస్తాము. తరువులపై జీవనం నిలిచి ఉంది.
Exam Tips:
a) పర్యాయపదాలు (ఒకే అర్థం) రాసిన తరువాత ప్రతి పదంతో అర్థవంతమైన సొంత వాక్యం రాయాలి; ఉదాహరణలోని విధానాన్ని అనుసరించండి.
b) ఒక వాక్యంలో రెండు పర్యాయపదాలనూ ఉపయోగిస్తే సమయం ఆదా అవుతుంది.
వ్యాకరణాంశాలు
Question 1: క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
అ) నగారా మోగిందా
నయాగరా దుమికిందా
ఆ) కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
Answer:
అ) ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పాదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది. అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.
లక్షణం: ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
ఆ) ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణలోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే అక్షర సముదాయం అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.
లక్షణం: ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
Exam Tips:
a) అంత్యానుప్రాసం: పాదాల చివర ఒకే అక్షరం/అక్షర సముదాయం పునరావృతం; లక్షణం రాసి, ఉదాహరణలో ఏ అక్షరాలు వచ్చాయో చూపండి.
b) ‘గుర్తించండి’ అనే ప్రశ్నకు అలంకారం పేరు + లక్షణం + సమన్వయం మూడూ రాయాలి.
Question 2: క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి.
అ) అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ
యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
ఆ) రంగదరాతిభంగ; ఖగరాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ, దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! భద్రగిరి దాశరథీ! కరుణా పయోనిధీ !
Answer:
అ) ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం: ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తము చెందినది. కావున దీనిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఆ) ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, ‘రంగ’ అనే అక్షర సముదాయం వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.
లక్షణం: ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
Exam Tips:
a) వృత్త్యనుప్రాసంలో ఒకే హల్లు అనేకసార్లు (పద్యంలో చాలా చోట్ల) వస్తుంది; అంత్యానుప్రాసంలో పాదాల చివర వస్తుంది – ఈ తేడా గుర్తుంచుకోండి.
b) లక్షణం తప్పక రాయండి.
Question 3: రూపకాలంకారం అంటే ఏమిటి ? ఉదాహరణతో వివరించండి. కింది వాక్యాలలో (ii), (iii), (iv) లను సమన్వయం చేయండి.
1. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
2. బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
3. వానజాణ చినుకుపూలను చల్లింది.
4. నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం.
Answer:
లక్షణం: ఉపమేయానికి, ఉపమానానికి భేదం ఉన్నా భేదం లేనట్లు (అభేదంగా) చెప్పడాన్ని ‘రూపకాలంకారం’ అంటారు. ఉదా : మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం, జ్యోతి ఉపమానం.
ఉదాహరణ: నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.
సమన్వయం: ఇందులో నగరం ఉపమేయం, అరణ్యం ఉపమానం. ఉపమేయమైన నగరానికి, ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
ii) బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
సమన్వయం: ఈ వాక్యంలో బతుకు ఉపమేయం, ఆట ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
iii) వానజాణ చినుకుపూలను చల్లింది.
సమన్వయం: వాన ఉపమేయం – జాణ ఉపమానం; చినుకు ఉపమేయం – పూలు ఉపమానం. వాన, జాణ వేరైనప్పటికీ అభేదంగా (భేదం లేనట్లు) చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
iv) నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం.
సమన్వయం: నవ్వులు ఉపమేయం, వాన ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
Exam Tips:
a) రూపకాలంకారంలో ఉపమేయానికి, ఉపమానానికి భేదం ఉన్నా భేదం లేనట్లు చెప్పబడుతుంది; సమన్వయంలో ఉపమేయం, ఉపమానం పేర్లు తప్పక చూపండి.
b) ‘ఏదైనా ఒక వాక్యానికి’ అని అడిగినా మూడింటినీ నేర్చుకోండి.
Question 4: ఇలాంటి (రూపకాలంకార) ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సమన్వయం చేయండి.
1. చదువుల పుప్పొడి
2. నగరం మహావృక్షం
Answer:
1వ వాక్యం : చదువుల పుప్పొడి
సమన్వయం : ఇందులో ‘చదువులు’ అనేది ఉపమేయం, ‘పుప్పొడి’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన చదువులకు, ఉపమానమైన పుప్పొడికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
2వ వాక్యం : నగరం మహావృక్షం
సమన్వయం : ఇందులో ‘నగరం’ అనేది ఉపమేయం, ‘మహావృక్షం’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికీ, ఉపమానమైన మహావృక్షానికీ భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
Exam Tips:
a) పాఠంలోని ‘చదువుల పుప్పొడి’, ‘నగరం మహావృక్షం’ వంటి సమాస పదాలు (ఉపమేయం + ఉపమానం) రూపకాలంకారానికి మంచి ఉదాహరణలు.
ప్రాజెక్టు పని
Question 1: పల్లెలు / పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
Answer:
| పల్లె | పట్నం |
| ఆప్యాయపు పలకరింపులు, సహాయపడే తత్త్వం కనిపిస్తాయి. | కృత్రిమపు నవ్వులు, అవకాశ మనస్తత్వాలు కనిపిస్తాయి. |
| స్వచ్ఛమైన గాలి, పువ్వులమైన వెలుతురులతో, తేట నీటి పంటకాలవలతో స్వచ్ఛంగా ఉంటుంది. | ఇనప్పెట్టెలో ఇరికించినట్లు, గాలి వెలుతురు లేకుండా మురుగు కాలువలతో ఊపిరాడదు. |
| బతుకు పోరాటంలో అందరూ చేదోడు వాదోడుగా ఉంటారు. | బతుకు తెరువు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నా పట్టించుకొనే వారే ఉండరు. |
| పేద ధనిక భేదాలు ఉన్నా కలిసిమెలిసే జీవిస్తారు. | ఖరీదైన భవంతుల పక్కనే పూరి గుడిసెలు ఉంటాయి. అయినా పేద ధనిక భేదాలు ఎప్పటికీ కలుసుకోలేనంతగా సమాంతరంగా ఉంటాయి. |
| పైర గాలుల నాదాలతో, పక్షుల కిలకిలరావాలతో, సెలయేరుల గలగలలతో వినసొంపుగా ఉంటుంది. | ధంకానాదంలా, జలపాత ఘోషలా, అరణ్య రోదనలా, సముద్రపు హోరులా రణగొణ ధ్వనులు వినిపిస్తాయి. |
| అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. | పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారే యమునాతీరేలాగా ఏకాకులుగా జీవిస్తారు. |
| తల్లి ఒడిలా స్వచ్ఛమైన ప్రేమ స్వరూపంలా ఉంటుంది. | ప్రవేశిస్తే విడిచిపెట్టలేనట్లు మోహింపజేస్తూ పద్మవ్యూహంలాగా ఉంటుంది. |
| పల్లె తల్లి వంటిది. | పట్నం ప్రియురాలి వంటిది. |
Exam Tips:
a) పల్లె – పట్నం పట్టికలో ఎదురెదురు పాయింట్లను (ఆప్యాయత – కృత్రిమ నవ్వులు, స్వచ్ఛమైన గాలి – కాలుష్యం) సరిపోలేలా రాయండి.
b) నివేదికలో ‘సమస్య – కారణాలు – సూచనలు’ ఉండాలి.
పాఠ్యభాగ పరిచయం
Question 1: ‘నగరగీతం’ పాఠ్యభాగ నేపథ్యం / ఉద్దేశం ఏమిటి ?
Answer:
ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి.
ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అందనంత దూరంగా కదిలిపోతున్నది. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయీకరణకు గురవుతున్నాడు.
ఈ నేపథ్యంలో నగరజీవితంలోని యథార్థదృశ్యాల్ని మన కళ్ళముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
Exam Tips:
a) నేపథ్యం: వలసలు, నగరీకరణ, ప్రపంచీకరణ ప్రభావం; ఉద్దేశం: నగరజీవిత వాస్తవాలను కఠినంగా చూపడం – ఈ రెండింటిని వేరు వేరుగా రాయండి.
Question 2: ‘నగరగీతం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
Answer:
అనేకరకాల వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిన్న వ్యాపారుల అరుపులతో నాలుగురోడ్ల కూడలి దద్దరిల్లిపోతుంది. నిజానికి ఆ శబ్దం నయాగరా జలపాతం హోరులా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉంది. అమ్మఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం కొందరు పట్టణాలకు వలసవెళ్తున్నారు. పేద రైతులు నగరంలో ఇనుప పెట్టెల వంటి ఇళ్ళల్లోను, మురికివాడల్లోను నివసిస్తుంటారు. నగరంలో ప్రతి మనిషి చదువవలసిన ఒక పుస్తకంలాంటివాడు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తిదాయకమైన ఆనంద, విషాదగాథలు ఉంటాయి. పిల్లలు చదువులతో సందడిచేస్తుంటారు.
నగరంలో అందమైన ఎత్తైన భవనాలు ఒకపక్క ఉన్నా, మరొకపక్క మురికివాడలు కూడా ఉంటాయి. నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. కొందరు కాలినడకతో, మరికొందరు ఆటోరిక్షాల్లో, ధనవంతులు కార్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
నగరంలో ప్రమాదాలు అన్ని వైపులా పొంచి ఉన్నాయి. నగర ప్రజలు పరస్పరం పలకరించుకోకుండా ఏకాకిగా బతుకుతారు. నగరం అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు.
Exam Tips:
a) సారాంశాన్ని పాఠంలోని క్రమంలో (కూడలి శబ్దం – వలసలు – ఇనప్పెట్టెలు – పఠనీయ గ్రంథం – భవంతులు, పూరిళ్ళు – ప్రమాదాలు – ఏకాకితనం – పద్మవ్యూహం) రాయండి.
Question 3: అలిశెట్టి ప్రభాకర్ కవి పరిచయం రాయండి.
Answer:
కవి పేరు : అలిశెట్టి ప్రభాకర్
జననం : 12-01-1954
మరణం : 12-01-1993
జన్మస్థలం : పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి జగిత్యాల జిల్లా
తల్లిదండ్రులు : అలిశెట్టి చినరాజం, లక్ష్మి
వ్యాసంగం : మొదట ఆర్టిస్ట్‌గా ఎదిగాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో ‘పరిష్కారం’ అనే మొదటి కవిత అచ్చయింది. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1976), కరీంనగర్లో ‘స్టూడియో శిల్పి’ (1979), హైదరాబాద్‌లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.
రచనలు : ఎర్రపావురాలు (1978) మొదటి కవితా సంకలనం, మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990), సిటీలైఫ్ (1992). ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్‌గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.
శైలి : కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.
Exam Tips:
a) కవి పరిచయంలో జననం, జన్మస్థలం, వృత్తి, ప్రసిద్ధ రచనలు, శైలి అనే వరుస పాటించండి.
b) సిటీలైఫ్ (1992) వంటి ముఖ్య రచనల సంవత్సరాలను గుర్తుంచుకోండి.
Question 4: ‘మినీ కవిత’ / ‘వచన కవిత’ అనే ప్రక్రియల గురించి రాయండి.
Answer:
మినీ కవిత : ఈ పాఠం “మినీ కవిత” అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీలైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’గా కూర్చడమైనది.
వచన కవిత : ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘వచన కవిత’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇది పద్య, గేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవిత. చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వనిగర్భితంగా ఉండే కవిత వచన కవిత.
Exam Tips:
a) మినీ కవిత: కొసమెరుపు, వ్యంగ్యం, చురకలు, తక్కువ పంక్తులు; వచన కవిత: ఛందస్సు లేకుండా వ్యావహారిక భాషలో – ఈ లక్షణాలను రాయండి.
Question 5: ‘పద్మవ్యూహం’ అంటే ఏమిటి ?
Answer:
పద్మవ్యూహం అనే మాట మహాభారతంలో ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం ఇది. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీర మరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే “అతడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు” అంటారు.
Exam Tips:
a) పద్మవ్యూహం భారతంలో అభిమన్యుని కథతో ముడిపడిన యుద్ధ వ్యూహం; దాని నుండి బయటకు రావడం కష్టం – ఈ రెండు అంశాలు తప్పక రాయండి.
అర్థ తాత్పర్యాలు
Question 1: క్రింది కవితా పంక్తులకు ప్రతిపదార్థం (అర్థాలు), తాత్పర్యం రాయండి.
I
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగురోడ్ల కూడలిలో ఏమది ?
అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష
తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ
నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో !
ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి !
Answer:
అర్థాలు:
నగారా, మోగిందా = పెద్ద ఢంకా, శబ్దం చేసిందా
నయాగరా దుమికిందా = నయాగరా (అమెరికాలోని పెద్ద జలపాతం) కిందికి దుమికిందా ? (దుమికినప్పుడు పెద్ద ధ్వని వస్తుంది)
నాలుగురోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లూ కలిసే చోట
ఏమది = ఏమిటది ?
అదే = ఆ ధ్వని
నగరారణ్యహోరు (నగర + అరణ్య, హోరు) = పట్టణం అనే అరణ్యంలో వినిపించే ధ్వని
నరుడి జీవనఘోష = మానవుడి బ్రతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము వంటి శబ్దం
తల్లి ఒడివంటి = అమ్మ ఒడిలాంటి
పల్లెసీమల్నొదిలి = గ్రామసీమలను విడిచిపెట్టి
తరలివచ్చిన పేదరైతులు = బయలుదేరి వచ్చిన బీద రైతులు
ఇనప్పెట్టెల్లాంటి = ఇనుముతో చేసిన పెట్టెల్లా ఇరుకుగా ఉన్న
ఈ పట్టణాల్లో = ఈ నగరాలలోని ఇళ్ళలో
ఊపిరాడని = శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరకని
మీ బతుకులూ = మీ జీవితాలు
నగరంలో ప్రతిమనిషి = పట్టణంలో నివసించే ప్రతి మనిషి
పఠనీయ గ్రంథమే = చదువదగిన పుస్తకం వంటివాడే (నగరజీవి చరిత్రను పరిశీలిస్తే ఎన్నో జీవన సత్యాలు వెల్లడి అవుతాయని భావం)
మరి నీ బతుకు = మరి నీ జీవితం అనే పుస్తకం యొక్క
పేజీలు తిరగేసేదెవరో = పుటలు ఎవరు తెరచి చదువుతారో ! (ఎవ్వరూ నగరజీవి చరిత్రను పట్టించుకోరని భావం)
ఉదయమే = ప్రొద్దున్నే
బస్సుల్లో, రిక్షాల్లో = స్కూలు బస్సులలో, సిటీబస్సులలో, ఆటోరిక్షాలలో
పేవ్మెంట్లపై = రోడ్లు ప్రక్కన రాళ్ళు పరచి చదును చేసిన నడకదారులపై
విరబూసిన = సమృద్ధిగా పూసిన
కాన్వెంటు పువ్వుల సందడి = కాన్వెంటు బడులలో చదువుకొనే పువ్వుల వంటి పిల్లల గోల
రాలే చదువుల పుప్పొడి = ఆ పిల్లల మాటలు, ఆ పిల్లలనే పువ్వుల నుండి రాలిపడే పుప్పొడి లాంటివి
తాత్పర్యం:
అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు.
అమ్మఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచుకోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.
నగరంలో ప్రతిమనిషీ చదువవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకములోని పేజీలను చదివేవారు ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.
Exam Tips:
a) ‘అర్థాలు’ ఇచ్చినప్పుడు పాదంలోని ప్రతి పదానికి అర్థం రాయాలి; తరువాత మొత్తం భావాన్ని తాత్పర్యంగా రాయండి.
b) నయాగరా, ఇనప్పెట్టె, పఠనీయ గ్రంథం, కాన్వెంటు పువ్వులు – కీలక పదాల అర్థాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి.
Question 2: క్రింది కవితా పంక్తులకు ప్రతిపదార్థం (అర్థాలు), తాత్పర్యం రాయండి.
II
సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు !
ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం !
ఎంతచేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు
మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు !
నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
‘మరణం నాలుగువైపులు !’
నగరం మహావృక్షంమీద
ఎవరికి వారే ఏకాకి !
నగరం అర్థంకాని రసాయనశాల !
నగరం చిక్కు వీడని పద్మవ్యూహం !!
Answer:
అర్థాలు:
సిటీ = నగరం, పట్టణం
అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు = అక్కడ ఉన్నవన్నీ అందమైన భవనాలు కావు
అటు భవంతులూ, ఇటు పూరిళ్ళూ = ఒకపక్క భవనాలు, మరోపక్క గడ్డితో నేసిన ఇళ్ళు
దారిద్ర్యం = బీదతనం
సౌభాగ్యం = ధనవైభవం
సమాంతర రేఖలు = సమానమైన మధ్యదూరం గల రేఖలు (ఎంత దూరం పొడిగించినా కలవవు)
ఇది = ఈ పట్టణం
వెరైటీ సమస్యలు = నానావిధాలైన చిక్కులు
సమ్మేళన కోలాహలం = కలయికల పెద్ద చప్పుడు
ఎంతచేసినా = ఎంత కష్టపడి పనిచేసినా
తీరిక దక్కదు = విశ్రాంతి లభించదు
కోరిక చిక్కదు = సంపాదించిన ధనంతో కోరికలు తీరవు
మెర్క్యూరీ నవ్వులు = పాదరసం నవ్వులు (కృత్రిమపు, అసహజపు నవ్వులు)
పాదరసం నడకలు = పాదరసంలా వేగంగా పరుగువంటి నడకలు
కొందరికి రెండు కాళ్ళు = కొందరు కాలినడకన ప్రయాణం చేస్తారు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు = రిక్షాలు, ఆటోలు (మూడు చక్రాల వాహనాలు) వారి ప్రయాణ సాధనాలు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు = డబ్బు ఉన్నవారికి నాలుగు చక్రాల కార్లు
సారించాలి మన చూపులు = అన్ని వైపులకూ చూస్తూ ప్రయాణం సాగించాలి
మహానగరాల రోడ్లకి = పెద్ద పట్టణాలలోని రోడ్లకు
మరణం నాలుగువైపులు = నాలుగు వైపుల నుండి మరణం రావడానికి అవకాశం ఉంటుంది
నగరం మహావృక్షంమీద = పట్టణం అనే పెద్ద చెట్టు మీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరికి వారే ఒంటరిగా ఉంటారు
రసాయనశాల = ప్రయోగశాల (Laboratory)
చిక్కువీడని పద్మవ్యూహం = చిక్కులో తగిలిన నగరవాసులు తప్పించుకొని బయటకు రాలేని పద్మవ్యూహం వంటిది
తాత్పర్యం:
నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం, దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.
ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా, ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.
ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకకపోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి.
మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కువిడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.
Exam Tips:
a) రెండు కాళ్ళు – మూడు కాళ్ళు – నాలుగు కాళ్ళు, రసాయనశాల, పద్మవ్యూహం వంటి ప్రతీకల అర్థాలను తాత్పర్యంలో తప్పక వివరించండి.
b) తాత్పర్యాన్ని మీ సొంత వాక్యాలలో, సులభమైన భాషలో రాయండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 10 Telugu Lesson 05 Nagara Geetham (City Song)
Textbook Solutions for Class 10 Telugu Lesson 05 Nagara Geetham (City Song)
Review comprehensive exercise answers for Class 10 Telugu Lesson 05 Nagara Geetham (City Song). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 05 Nagara Geetham (City Song) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Telugu.
FAQs
The complete and updated TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం in both English and Hindi medium.
Yes, you can download the entire TS 10th Class Telugu Guide 5th Lesson నగరగీతం in printable PDF format for offline study on any device.