Step-by-Step Textbook Solutions for Class 10 Telugu Lesson 03 Veera Telangana
Access comprehensive textbook solutions for Lesson 03 Veera Telangana using the official curriculum guides for Class 10 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Lesson 03 Veera Telangana Textbook Solutions PDF
View or download the dedicated Lesson 03 Veera Telangana solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 27–28)
Question 1: ఈ గేయాన్ని రాసిందెవరు ?
Answer:
ఈ గేయాన్ని కొత్తపల్లి రంగారావుగారు రాశారు.
Exam Tips:
a) గేయాన్ని రాసిన కవి పేరును పాఠ్యపుస్తకంలోని పేజీ నుండి చూసి ఒక్క వాక్యంలో సూటిగా రాయండి.
b) కవి పేరు తప్పుగా రాస్తే మార్కులు పోతాయి; పేరుకు ముందు ‘శ్రీ / గారు’ వంటి గౌరవ పదం చేర్చడం మంచి అలవాటు.
Question 2: ఈ గేయం దేని గురించి తెలియజేస్తున్నది ?
Answer:
ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి తెలియజేస్తున్నది.
Exam Tips:
a) గేయం ఇతివృత్తం (తెలంగాణ పోరాటం) ఒక వాక్యంలో చెప్పి, అది దేనికి సంబంధించినదో (పోరాటం, త్యాగం) ఒక్క మాటలో చేర్చండి.
Question 3: ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు ?
Answer:
ఈ గేయాన్ని తెలంగాణ రాష్ట్రసాధన కోసం రాసి ఉంటాడు.
Exam Tips:
a) కారణాన్ని అడిగే ప్రశ్నలకు ‘ఎందుకంటే’ అనే పదంతో సమాధానం ప్రారంభించండి.
b) “రాష్ట్రసాధన” వంటి పదాలను విడగొట్టకుండా ఒకే పదంగా స్పష్టంగా రాయండి.
Question 4: ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు ? ఎందుకు రచనలు చేసి ఉంటారు ?
Answer:
తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు కాళోజి, డా॥ సినారె, సామల సదాశివ, అలిశెట్టి ప్రభాకర్, డా॥ దాశరథి కృష్ణమాచార్య మొదలగు వారు. వీరంతా తెలంగాణ సాధన కోసం రచనలు చేసారు.
Exam Tips:
a) తెలంగాణ గురించి రాసిన కనీసం మూడు పేర్లు (కాళోజి, సినారె, దాశరథి) తప్పక రాయండి.
b) రెండు భాగాల ప్రశ్న కాబట్టి ‘ఎవరు’ అనే భాగానికి పేర్లు, ‘ఎందుకు’ అనే భాగానికి కారణం – రెండూ రాయడం మరచిపోకండి.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 28)
Question 1: ఈ భూమండలమంతా ఎందుకు ప్రతిధ్వనించింది ?
Answer:
తెలంగాణలో రజాకార్ల దుర్మార్గాలు మితిమీరి పోయాయి. మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా ఏకమైంది. తన శత్రువులైన రజాకార్లపై ఎదురు తిరిగింది.
పొలికేకలు పెట్టింది. ఆ బొబ్బలు ఎలా ఉన్నాయంటే తెలంగాణ మొత్తం ఒకేసారి యుద్ధ శంఖం పూరించినట్లుగా ఉంది. ఈ భూమండలంలో ప్రతిచోటా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నుండే సమరశంఖం పూరించారు. అందుకే అది భూమండలమంతా ధ్వనించిందని కవి చెప్పాడు.
Exam Tips:
a) ఈ ప్రశ్నకు మూలం మొదటి పద్యం; ‘శంఖ మహారవమ్ములు – బొబ్బలు పెట్టినట్లు’ అనే భావాన్ని ప్రస్తావించండి.
b) రజాకార్ల దౌర్జన్యం, ప్రజల ఏకతా పోరాటం అనే రెండు అంశాలను కలిపి రాస్తే జవాబు పూర్తవుతుంది.
Question 2: బ్రతుకుతోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి ?
Answer:
రజాకార్లు తెలంగాణను అభివృద్ధి చెందనివ్వలేదు. తరతరాల నుండి తెలంగాణ దోపిడీకి గురయ్యింది. తెలంగాణ ప్రజలు జీవనోపాధులను కోల్పోయారు. దెయ్యాలు, పిశాచాల వంటి దోపిడీదారుల ఉక్కుపాదాల కింద నలిగిపోయారు.
ఇప్పుడు క్రొత్త బ్రతుకు తోవ ఏర్పడే కాలం వచ్చింది. అంటే స్వేచ్ఛగా తమ బ్రతుకు నిర్ణయాలు తామే తీసుకొనే మంచి సమయం వచ్చిందని అర్థం.
Exam Tips:
a) ‘బ్రతుకుతోవ’ అంటే జీవనమార్గం అని మొదట అర్థం చెప్పి, తరువాత పాఠంలోని సందర్భంతో వివరించండి.
b) రెండవ పద్యంలోని ‘బ్రతుకుత్రోవల్ జూపు కాలమ్ములున్ మళ్ళెన్’ అనే పాదాన్ని ఉదహరించండి.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 29)
Question 1: “తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా !” అని కవి ఎందుకన్నాడు ?
Answer:
కోటిమంది తెలుగు పిల్లలను తెలంగాణ ఒడిలో పెంచింది. కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడుతుంది. కావున ఈ తెలుగునేలలో ఎంత బలం (కాంతి) ఉన్నదని అర్థం.
Exam Tips:
a) మూడవ పద్యంలోని ‘కోటి తెలుంగు కుర్రలన్ … కృపాణములిచ్చితి’ అనే భావాన్ని ఆధారంగా చేసుకొని జవాబు రాయండి.
b) ‘ఈ తెలుగు రేగడిలో జిగి మెండు’ (నేలలోని బలం) పాదాన్ని ప్రస్తావిస్తే జవాబుకు బలం చేకూరుతుంది.
Question 2: ‘గడ్డి పోచకూడా కత్తిలా మారటం’ అంటే ఏమిటి ?
Answer:
సాధారణంగా గడ్డి మనం నడిస్తే పాదాల కింద పడినలిగి తలవంచి నిలబడుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గడ్డి పోచలే బిరుసెక్కి అరికాళ్ళలో ముళ్ళలా గుచ్చుకుంటున్నప్పుడు ఒక్క అడుగు కూడా సరిగా వేయలేం. అట్లాగే పిల్లలుగా పుట్టిన తెలంగాణ బిడ్డలు యుక్తవయసు రాగానే కత్తి చేపట్టి నిర్దయుడైన రాజుతో యుద్ధం చేయటానికి సిద్ధమవటాన్ని కవి అలా పోల్చాడు.
Exam Tips:
a) ఇది ఒక భావాత్మక (వ్యంజనార్థ) ప్రశ్న; ‘అతి చిన్నదైన గడ్డిపోచ కూడా కత్తి పట్టింది’ అని అర్థం చెప్పి దాని అంతరార్థం (చిన్నవారి కూడా పోరాట స్ఫూర్తి) వివరించండి.
b) నాలుగవ పద్యంలోని ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ పాదాన్ని తప్పక రాయండి.
Question 3: నవోదయం రావడమంటే మీరేమని అనుకొంటున్నారు ?
Answer:
ఉదయం అనేది రోజుకు మొదలు. ఉదయంతో రోజు ప్రారంభం అవుతుంది. అంటే ఉదయం అనేది రోజు మొత్తానికి తొలి అడుగు.
ప్రతిరోజూ ఉదయం జరుగుతూనే ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి. కాని, నవోదయం అంటే క్రొత్త ఉదయం. అంతవరకూ జరిగిన దానికి భిన్నంగా రోజు ప్రారంభమవడం. పాత రోజులలో ఉండే కష్టాలు, బాధలు లేకుండా క్రొత్త ఉత్సాహం, అభివృద్ధి చెందే ఆలోచనలకు అవకాశం కల్పించేది నవోదయం. అటువంటి అభివృద్ధే నవోదయం రావడమంటే అని అనుకొంటున్నాము.
Exam Tips:
a) ఇది అభిప్రాయ ప్రశ్న; ‘నవోదయం’ అంటే కొత్త ఉదయం – కొత్త ఆశ అని స్వీయ వాక్యాలలో రాయండి.
b) పాఠంలోని ఉదాహరణ (తెలంగాణ విముక్తి, స్వేచ్ఛ) ఇస్తే జవాబు గట్టిగా ఉంటుంది.
ఆలోచించండి – చెప్పండి
Question 1: తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి ?
Answer:
తెలంగాణా వీరులు భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన, కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్తకాంతి సముద్రాలు నింపారు. వీరులు, యోధులు మరియు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు తెలంగాణ వీరులు.
Exam Tips:
a) ఆరవ పద్యంలోని ‘వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్’ అనే భావాన్ని ఆధారంగా రాయండి.
b) ‘వీరులు, యోధులే కాక పరోపకారులు’ అనే రెండు లక్షణాలను తప్పక చెప్పండి.
Question 2: బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది ?
Answer:
మత పిశాచం విజృంభిస్తే బ్రతుకులు దుర్భరం అవుతాయి. స్వేచ్ఛ లేకపోతే బ్రతుకు భరించలేము. మతకల్లోలాలు జరిగితే చాలామంది బ్రతుకులు నాశనం అవుతాయి. ఏ దిక్కూ మొక్కూ లేకపోయినా బ్రతకడం కష్టం. నీతి, న్యాయం, ధర్మం, విద్య లేని సమాజంలో బ్రతుకు దుర్భరం.
Exam Tips:
a) ఏడవ పద్యంలో ‘మతపైశాచి … బ్రతుకే దుర్భరమైన’ అనే పంక్తులను ఆధారంగా చేసుకొని రాయండి.
b) ‘ఎప్పుడు’ అనే ప్రశ్నకు ‘……. అయినప్పుడు’ అనే రూపంలో వాక్యం ముగించండి.
Question 3: ఆకాశాన జెండాలు రెపరెపలాడటం దేనికి సంకేతం ?
Answer:
రుద్రమదేవి పరాక్రమించినపుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. ఇది రుద్రమదేవి పరాక్రమానికి నిదర్శనం. తెలంగాణ విజయానికి సంకేతం.
Exam Tips:
a) ఎనిమిదవ పద్యంలోని ‘రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట’ పాదాన్ని ఆధారంగా చేసుకోండి.
b) ‘సంకేతం’ అనే పదానికి తగ్గట్టు ‘విజయానికి / పరాక్రమానికి చిహ్నం’ అని ముగించండి.
ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: కింది అంశాలను గూర్చి చర్చించండి.
అ) ‘వీర తెలంగాణ’ అనే పాఠం పేరు వినగానే మీకు ఎటువంటి అనుభూతి కలిగింది ? దాశరథి తెలంగాణను వీర తెలంగాణ అనడాన్ని తగిన ఉదాహరణలతో సమర్థించండి.
Answer:
‘వీర తెలంగాణ’ పేరు వినగానే గొప్ప పోరాటాలు కనుల ముందు మెదిలి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గడచిన బాధల మబ్బులు ఒక్కసారిగా తొలిగి వెలుతురు వచ్చినట్లు అయింది. తెలంగాణ పేరు ముందు ఉన్న ‘వీర’ అను పదం తెలంగాణలో ఉన్న పోరాటాల చరిత్రను గుర్తు చేసి ఆలోచింపచేసింది.
దాశరథి రాసిన ‘రుద్రవీణ’ అనే పేరుతోనే ఆవేశము, పోరాటము, ఉద్యమము వినిపిస్తాయి. అందులోనూ ఈ పాఠంలో ప్రతి పద్యపాదంలోని పదాలు చరిత్ర చెబుతూ స్ఫూర్తిని ఇస్తాయి. తెలంగాణ పెదవుల మీది నుంచి వచ్చిన శంఖపు చప్పుడు నాలుగు చెరగులా ప్రతిధ్వనించింది అనటం వల్ల తెలంగాణ పోరాటం ఎంత ఉద్వేగభరితంగా జరిగిందో చెప్పవచ్చు.
కోటిమంది తెలుగు పిల్లలు తెలంగాణ యోధులై కత్తులు దూసే వజ్రాయుధమంతటి భుజ పరాక్రమం కలిగి నిజాం రాజుతో తలపడమని తెలంగాణ నేల చెప్పినదన్నప్పుడు తెలంగాణ వీరుల పరాక్రమం అక్షరాల్లో కనిపించి ‘వీర తెలంగాణ’ అనటం సరియైనదే అనిపిస్తుంది.
తెలంగాణలో మొలచిన గడ్డిపోచ కూడా కత్తిపడుతుందని, తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రంలాగా ఉప్పొంగుతున్నదని, నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయిందనీ అనటం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
కాకతీయుల పోరాటాలు గుర్తుకు తెస్తూ రుద్రమనూ, కాపయ్య నాయకుడినీ గుర్తు చేసినపుడు, దొంగ దెబ్బలకు భయపడకుండా శత్రురాజుల గుండెలు ఆగేలా ఉరిమిన తెలంగాణ మేఘపు గర్జనలను గుర్తుచేసినపుడు, దాశరథి ఈ పాఠాన్ని ‘వీర తెలంగాణ’ అనటం సబబే అనిపించి తీరుతుంది.
Exam Tips:
a) ఈ ప్రశ్నకు ‘అనుభూతి’ (మీ భావన) మరియు ‘సమర్థన’ (పాఠం నుండి ఉదాహరణలు) అనే రెండు భాగాలుంటాయి; రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వండి.
b) గడ్డిపోచ కత్తి పట్టడం, కాకతీయుల కంచుగంట, రుద్రమదేవి, కాపయ్య నాయకుడు వంటి ఉదాహరణలను పేర్కొనండి.
Question 2: కింది అపరిచిత కవితను చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీనగలవు
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
ఆకాశానికి శోభ చందమామ
మిణుగురుతో విద్యుత్కాంతులు ప్రసరించవు
మారాలి నేటి నాటువ్యక్తి
కాకుంటే లే దెన్నటికి విముక్తి
మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవజాతికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
(కవిరాజ మూర్తి)
ప్రశ్నలు
అ) పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగల్గుతాయి ?
ఆ) ఎవరిని తిట్టగూడదు ?
ఇ) ఎవరు మారాలి ? ఎందుకు మారాలి ?
ఈ) మానవుడు ఏవిధంగా ప్రయాణం చేయాలి ?
ఉ) పై కవితకు శీర్షిక నిర్ణయించండి.
ఊ) పై కవితను రాసింది ఎవరు ?
Answer:
అ) తోటమాలి బలిదానం చేస్తేనే (కష్టపడి పెంచితేనే) పువ్వులు పరిమళాలను వెదజల్లగల్గుతాయి.
ఆ) కనిపించని దేవుణ్ణి తిట్టగూడదు (తిట్టడం వల్ల ఏ లాభమూ లేదు).
ఇ) నేటి నాటువ్యక్తి (సామాన్యుడు) మారాలి. ఎందుకంటే మారకపోతే మానవునికి అజ్ఞానం నుండి, బాధల నుండి విముక్తి కలగదు.
ఈ) మానవుడు ఈ భూమిని (ధరిత్రిని) వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలి. అంటే భూమికంటే వేగంగా అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలి.
ఉ) పై కవితకు శీర్షిక “మానవత్వం”.
ఊ) ఈ కవితను కవిరాజ మూర్తిగారు రచించారు.
Exam Tips:
a) అపరిచిత కవిత ప్రశ్నలకు కవితలోని పంక్తులనే ఆధారంగా చేసుకొని, ఒకటి రెండు వాక్యాలలో సూటిగా జవాబివ్వండి.
b) శీర్షిక ఎంచుకున్నప్పుడు కవితలోని ప్రధాన భావం (మానవత్వం) ప్రతిబింబించేలా రెండు మూడు పదాలలో రాయండి; కవి పేరు ప్రశ్నకు కవిత చివర ఉన్న బ్రాకెట్ చూడండి.
Question 3: రెండో పద్యానికి ప్రతిపదార్థం క్రింద ఉంది. ఇదే విధంగా 3, 4, 6 సంఖ్య గల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం ప్రతిపదార్ధము
తల్లీ = అమ్మా !
నీ = నీ యొక్క
ప్రతిభా విశేషములు = ప్రజ్ఞా విశేషాలు
కొన్ని తరాలదాక = కొన్ని తరాల వరకు
భూతప్రేత = చెడు శక్తుల (భూతప్రేతాల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = పడిపోయినవి (చిక్కుకున్నవి)
ఇపుడు = ఇప్పుడు
అడ్డుల్ + పోయెన్ = అడ్డంకులు తొలగిపోయాయి
సౌదామనీవల్లీ = మెరుపుతీగల
పుల్ల = విచ్చుకున్న
విభా + ఆవళుల్ = కాంతులవరుసలు
బ్రతుకుత్రోవల్ = బ్రతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములున్ = సమయములు
మళ్ళెన్ = తిరిగివచ్చినవి (అదిగో)
స్వచ్ఛతర = అత్యంత స్వచ్ఛమైన
ఉజ్జ్వల = ప్రకాశవంతమైన
ప్రథమ సంధ్యా = తొలి పొద్దు
భానువు = సూర్యుడు
ఏతెంచెడిన్ = వస్తున్నాడు (ఉదయిస్తున్నాడు)
Answer:
3వ పద్యం ప్రతిపదార్థం:
మాతరో = అమ్మా !
కోటి = కోటిమంది
తెలుంగు కుర్రలన్ = తెలుగు పిల్లలను
నీ ఒడిలోన = నీ ఒడిలో
పెంచితివి = పోషించావు
ప్రాయము వచ్చినంతనె = వయసు రాగానే
కృపాణములు ఇచ్చితి = చేతులకు కత్తులనిచ్చి
వజ్రాయిత = వజ్రాయుధమంతటి కఠినమైన
భుజాబలమ్ము = భుజపరాక్రమాలను
దరిసింప = చూపేటట్లు
జగమ్ము = లోకం
నవాబుతో = నిజాం నవాబుతో
సవాల్ = ఎదురొడ్డి ప్రశ్నించుట
యుద్ధము + ఆడి = తలపడి
చేయుము + అట + అంటివి = చేయమన్నావు
ఈ తెలుగు రేగడిలో = సారవంతమైన ఈ తెలుగు నేలలో
జిగి = బలం
మెండు = ఎక్కువగా ఉన్నది కదా !
4వ పద్యం ప్రతిపదార్థం:
తెలగాణమ్మున = తెలంగాణలో
గడ్డిపోచయును = గడ్డిపోచ కూడా
కృపాణమ్ము = కత్తి
సంధించెన్ = బట్టి ఎదిరించింది
రాజలలాముండు + అనువాని = గొప్ప రాజుగా పేరొందినవాని
పీచమున్ = గర్వాన్ని
అడచన్ = అణచేటట్లుగా
యుద్ధమ్ము సాగించె = యుద్ధం సాగించింది
ఏమి + అగునో = ఏమి జరుగుతుందో
తెల్యంగరాకన్ = తెలియక
జగము + ఎల్లన్ = జగమంతా
భీతిలిపోయెన్ = భయపడిపోయింది
దిశ + అంచలమున్ = దిగంతాలన్నీ
దివిన్ = ఆకాశంలో
శక్రధనుః పరంపరలతో = ఇంద్రధనుస్సుల పరంపరలచేత
సయ్యాటలు + ఆడెన్ = సయ్యాటలాడాయి
6వ పద్యం ప్రతిపదార్థం:
తెలగాణా = అమ్మా తెలంగాణా !
భవదీయ పుత్రకులలో = నీ పిల్లలో
తీండ్రించు = ప్రకాశించే
వైప్లవ్య సంచలనమ్ము = విప్లవాత్మకమైన కదలిక
ఊరక పోవలేదు = ఊరికే పోలేదు
వసుధాచక్రము = భూమండలాన్నంతా
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభాతిక = కాంతివంతమైన
భానునిన్ = సూర్యుడిని
పిలిచి = పిలిచి
దేశంబు + అంతటన్ = దేశమంతా
కాంతివార్ధులు = కొత్త కాంతి సముద్రాలు
నిండించిరి = నింపారు
వీరు = వారంతా
వీరులు = వీరులు, యోధులే కాదు
పరార్థుల్ = న్యాయం తెలిసిన పరోపకారులైన
తెల్గుజోదుల్ = తెలుగు వీరులు
బళా ! = సుమా !
Exam Tips:
a) ప్రతిపదార్థం రాసేటప్పుడు పద్యంలోని పదక్రమంలోనే ‘పదం = అర్థం’ రూపంలో రాయండి; సంధి పదాలను (భూతప్రేత, డుల్లెన్) విడదీసి చూపండి.
b) ప్రతి పద్యానికి ఉదాహరణగా ఇచ్చిన రెండవ పద్యం విధానాన్ని అనుసరించండి; పద్యంలోని ప్రతి పదానికి అర్థం ఉండాలి – ఏ పదమూ వదలకండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
Question 1: “తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
తెలంగాణ ఎంతో సాంస్కృతిక వికాసం కలది. భాషా సంస్కృతులు ఎంతో గొప్పవి. కానీ ఇవన్నీ చరిత్రలో ఇనుప పద ఘట్టనల కింద నలిగిపోయాయి. తెలంగాణ నేలమీద విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్రమహోద్యమాలు సముద్రంలో అలల మాదిరిగా పొంగాయి.
తెలంగాణ గొప్పతన విశేషాలు అన్నీ కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అడ్డంకులు తొలగి పోయాయి అన్నాడు దాశరథి. కవి మాటలను నేను సమర్థిస్తున్నాను. “నేను నా తెలంగాణ నిగళాలు తెగద్రొచ్చి ఆకాశమంత ఎత్తు అరచినాను” అన్నాడు కవి. ఈ విధంగా ఎందరో వీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. ఎన్నో పోరాటాల ఫలితంగా 2014 జూన్ రెండవ తేదీన పరిపూర్ణ స్వాతంత్య్రం పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానితో తెలంగాణ ఆశలు నెరవేరాయి.
Exam Tips:
a) ఐదు వాక్యాల జవాబుకు ‘కవి అభిప్రాయం – నా సమర్థన – ఉదాహరణ’ అనే క్రమం పాటించండి.
b) 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఉదాహరణగా చెబితే జవాబు బలపడుతుంది.
Question 2: “తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని దాశరథి ఎందుకన్నాడు ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరలచేత సయ్యాటలాడాయి.
కాబట్టి “ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలది”. “తెలంగాణలో చాలా చిన్నదయిన గడ్డి పోచకు కూడా కత్తిబట్టి యుద్ధం చేయగల సత్తా ఉందని” కవి చెప్పాడు.
Exam Tips:
a) మొదట పద్యంలోని ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ పాదాన్ని రాసి, ఆ తరువాత దాని భావాన్ని వివరించండి.
b) ‘చిన్నదానికి కూడా పోరాట శక్తి ఉంది’ అనే అంతరార్థాన్ని చివరి వాక్యంలో చెప్పండి.
Question 3: తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)
Answer:
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసూర్యుడు మొదటి సారి ఉదయించాడు. కాబట్టి కాంతి జ్ఞానానికి సంకేతం – విముక్తికి సంకేతం. కాంతివంతము, స్వచ్ఛమయిన సూర్యకాంతి తెలంగాణకు వచ్చిందని కవి భావన.
Exam Tips:
a) ‘సంధ్యాభానువు’ అంటే తొలిపొద్దు సూర్యుడు అని అర్థం చెప్పి, అది ‘విముక్తికి సంకేతం’ అని ముగించండి.
b) రెండవ పద్య భావంలోని ‘అడ్డంకులు తొలగాయి’, ‘బ్రతుకు తోవ చూపే కాలం వచ్చింది’ అనే అంశాలను ప్రస్తావించండి.
Question 4: వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి.
(లేదా)
వీర తెలంగాణ పాఠం ఆధారంగా తెలంగాణ వీరుల ఘనతను వర్ణించండి. (June ’16) (పది వాక్యాలలో జవాబు రాయండి.)
Answer:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలచే, చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన, కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజపరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా ! ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా ! ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరలచేత సయ్యాటలాడాయి.
తెలంగాణా స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది.
నాలుగువైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్త కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అమ్మా తెలంగాణా ! నీ పిల్లలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగువీరులు సుమా !
అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధ రంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రు రాజులకు గుండెలు ఆగిపోయాయి.
చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.
Exam Tips:
a) సారాంశాన్ని పద్యాల వరుస క్రమంలో (1 నుండి 8 వరకు) రాస్తే ఏ భావమూ తప్పిపోదు.
b) పది వాక్యాల జవాబులో ఉద్యమ స్ఫూర్తి, కాకతీయుల పరాక్రమ ప్రస్తావన (రుద్రమ, కాపయ్య నాయకుడు), ముగింపుగా తెలంగాణ ముందుకు సాగడం – ఈ మూడూ ఉండాలి.
c) ప్రశ్నలో ‘(లేదా)’ ఉంటే రెండింటిలో ఒకదానికే జవాబు రాయండి.
Question 5: ‘తెలంగాణ తల్లి’ తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయం రాసి ప్రదర్శించండి. లేదా ఆత్మకథ రాయండి.
Answer:
ఏకపాత్రాభినయం:
ఏంది అట్టా సూత్తుండ్రి ? నేనే మీ యమ్మను. అదే బిడ్డా ! మీ తెలంగాణా తల్లిని. ఏందట్లో నవ్వుతుండావే ఎన్నేళ్ళయింది బిడ్డల్లారా ! మీ మొగాన నగవు చూసి, మీరు నా కోసం ఎన్ని బాదలు పడ్డారో ? ఎంతమంది నా బిడ్డల ఉసురు కోల్పోయేరో ?
వాళ్ళందర్నీ తల్చుకొంటే కడుపు చెరువయ్యేను. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగె పట్టు పట్టారు, సాధించారు.
ఇదిగో ఇయ్యేల నాకు పూలకాలం తియ్యటి తీపులదినం. ఏమనుకున్నవో ? ఓ బిడ్డా ! ఇయ్యేల నా తెలంగాణాలో అదేనో మనింట్లో ఎక్కడ జూసిన కమ్మటి వాసన. ఇను సొంపైన రొద. అదో ! అక్కడి దిక్కు జెర నా చెవు వారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరుపెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు.
మంగళార్తులు ఈయడానికి ముత్తైదలొత్తన్నారు. జర ఆనందంగా ఉండండి. ఇగ మనకు కష్టాలు లేవు. సల్లగా నవ్వాలి నా వోళ్ళంతా.
ఆత్మకథ:
ఎన్నో కష్టాలు పడ్డాను. నా కళ్ళ ముందే నా బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చాను. పరాయి పాలనలో ఎన్ని బాధలు పడ్డానో ? తలుచు కొంటే ఒళ్ళు జలదరిస్తుంది. పాల్కురికి సోమన, బమ్మెర పోతన వంటి భక్త కవులను తలచుకొంటే భక్తి భావంతో పరవశించి పోతాను. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని చూసినప్పుడల్లా అనుకొంటాను కష్టాలు అశాశ్వతమని. ఆయన హిరణ్య కశిపుడిని చంపాక ప్రహ్లాదుడిని కాపాడాడు కదా !
అలాగే ఏదో రోజు పరాయి పాలన అనే హిరణ్య కశిపుడు అంతమౌతాడు. ప్రహ్లాదుడు లాంటి నా తెలంగాణా బిడ్డలు రక్షించబడతారు అని నా నమ్మకం. అది నెరవేరింది. దాశరథిలాంటి విప్లవ కవులు పుట్టడం నా అదృష్టం. తెలంగాణ పోరాటాలలో నా ‘కవి కుమారుల’ గొప్పతనాన్ని మరిచిపోగలనా? ఎంతోమంది కళా కారులను కన్నాను. మీకెవ్వరికీ అన్నానికి లోటులేదు. ఇది తెలుగు మాగాణి. నేనెప్పుడూ పదిమందికి పెట్టాను. అందుకే మీకూ నా లక్షణాలే వచ్చాయి.
ఇది మన ఇల్లు. మనం అభివృద్ధి చేసుకోవాలి. మీరంతా బాగా చదువండి. నా పేరు ప్రఖ్యాతులు పెంచండి. తెలంగాణ తల్లి దీవెనలు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకా మాట్లాడుకొందాం.
Exam Tips:
a) ఏకపాత్రాభినయం రాసేటప్పుడు ‘నేనే మీ తెలంగాణ తల్లిని’ అని ఉత్తమ పురుషలో, మాండలిక పదాలతో సంభాషణ రూపంలో రాయండి.
b) ఆత్మకథ అయితే కష్టాలు – పోరాటం – విజయం అనే క్రమం పాటించండి; ‘లేదా’ ఉంది కాబట్టి ఒక్కదానికే పూర్తి జవాబు రాస్తే చాలు.
III. భాషాంశాలు – పదజాలం
Question 1: క్రింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి. – అర్థం : పరిహాసాలాడు
ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. – అర్థం : అలజడి
ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు. – అర్థం : ఆగిపోరు
ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం. – అర్థం : ఏమీ పాలుపోనప్పుడు
Answer:
అ) రవి తన స్నేహితులతో పరిహాసాలాడాడు.
ఆ) పరీక్షా ఫలితాల రోజున మా విద్యార్థుల మనస్సులో అలజడి రేగుతుంది.
ఇ) దేశభక్తులైన భారతీయ సైనికులు యుద్ధంలో శత్రువుల బలాన్ని చూసి ఆగిపోరు.
ఈ) విశాఖలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు ఏమీ పాలుపోలేదు.
Exam Tips:
a) ఇచ్చిన అర్థాన్ని (ఉదా: అలజడి) తప్పకుండా వాక్యంలో ఉపయోగించి సొంత వాక్యం రాయండి; పాఠంలోని వాక్యాన్ని అలాగే కాపీ చేయకండి.
b) వాక్యం అర్థవంతంగా, వ్యాకరణ దోషాలు లేకుండా ఉండాలి.
Question 2: క్రింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) ఉదయము
ఆ) ఆశ
ఇ) అభ్రము
Answer:
అ) ఉదయము = పుట్టుక, తూర్పుకొండ, ప్రాతఃకాలం, వడ్డీ, సృష్టి, సూర్యోదయం
ఆ) ఆశ = కోరిక, దిక్కు
ఇ) అభ్రము = మేఘం, ఆకాశం, స్వర్గం
Exam Tips:
a) నానార్థాలు అంటే ఒకే పదానికి ఉండే వేర్వేరు అర్థాలు; ‘ఉదయము’కు పుట్టుక, తూర్పుకొండ, సూర్యోదయం వంటివి రాయండి.
b) పర్యాయపదాలు (ఒకే అర్థం ఉన్న వేర్వేరు పదాలు)తో నానార్థాలను కలపకండి.
Question 3: క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) మురళీరవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది.
ఆ) రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది.
ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
ఈ) జాతీయ జెండాను గౌరవించాలి.
ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
Answer:
అ) రవము – ధ్వని, కంఠధ్వని, శబ్దం, రవళి
ఆ) కృపాణము – ఖడ్గము, కత్తి, అసి
ఇ) జలధి – వార్థి, సముద్రం, అంబుధి, పయోధి
ఈ) జెండా – పతాకం, టెక్కెం, కేతనం, ధ్వజం
ఉ) లంఘించు – దూకు, దాటు, ఎగురు, అతిక్రమించు
Exam Tips:
a) పర్యాయపదాలు రాసేటప్పుడు గీత గీసిన పదానికి సమానార్థం ఉన్న పదాలే రాయండి; కనీసం మూడు పదాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
b) ‘కృపాణము – ఖడ్గము – కత్తి – అసి’ వంటి పాఠంలోని పదాలను గుర్తుంచుకోండి.
వ్యాకరణాంశాలు
Question 1: కింది పదాలను విడదీసి రాసి, సంధిపేరు రాయండి.
అ) జగమెల్ల
ఆ) సయ్యాటలాడెన్
ఇ) దారినిచ్చిరి
ఈ) ధరాతలమెల్ల
ఉ) దిశాంచలము
ఊ) శ్రావణాభ్రము
ఋ) మేనత్త
Answer:
అ) జగమెల్ల = జగము + ఎల్ల – ఉత్వసంధి
ఆ) సయ్యాటలాడెన్ = సయ్యాటలు + ఆడెన్ – ఉత్వసంధి
ఇ) దారినిచ్చిరి = దారిని + ఇచ్చిరి – ఇత్వసంధి
ఈ) ధరాతలమెల్ల = ధరాతలము + ఎల్ల – ఉత్వసంధి
ఉ) దిశాంచలము = దిశ + అంచలము – సవర్ణదీర్ఘ సంధి
ఊ) శ్రావణాభ్రము = శ్రావణ + అభ్రము – సవర్ణదీర్ఘ సంధి
ఋ) మేనత్త = మేన + అత్త – అత్వసంధి
Exam Tips:
a) సంధి విడదీసేటప్పుడు ముందు పదం చివరి అచ్చు, తరువాత పదం మొదటి అచ్చు గుర్తించండి: ఉకారం (ము/లు) ముందు అచ్చు పరమైతే ఉత్వసంధి.
b) అ + అ = ఆ వచ్చినచోట సవర్ణదీర్ఘ సంధి అని రాయండి (దిశ + అంచలము, శ్రావణ + అభ్రము).
Question 2: క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
అ) కాకతీయుల కంచుగంట
ఆ) కళ్యాణ ఘంటలు
ఇ) బ్రతుకుత్రోవ
ఈ) మహారవము
ఉ) వికారదంష్ట్రలు
ఊ) కాంతివార్ధులు
ఋ) తెలంగాణ రాష్ట్రం
ౠ) మతపిశాచి
Answer:
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) కళ్యాణ ఘంటలు – కళ్యాణప్రదమైన ఘంటలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) బ్రతుకుత్రోవ – బ్రతుకు యొక్క త్రోవ – షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) మహారవము – మహాయైన (గొప్పదైన) రవము – విశేషణ పూర్వపద కర్మధారయం
ఉ) వికారదంష్ట్రలు – వికారమైన దంష్ట్రలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఊ) కాంతివార్ధులు – కాంతి అనెడి వార్ధులు – రూపక సమాసం
ఋ) తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అను పేరుగల రాష్ట్రం – సంభావనా పూర్వపద కర్మధారయం
ౠ) మతపిశాచి – మతమనెడు పిశాచి – రూపక సమాసం
Exam Tips:
a) షష్ఠీ తత్పురుష సమాసంలో ‘యొక్క’ అనే విభక్తి ప్రత్యయం విగ్రహవాక్యంలో వస్తుంది.
b) ‘……. అనెడి’ అని విగ్రహవాక్యం ఉంటే అది రూపక సమాసం; విశేషణం ముందు ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం.
Question 3: ఛేకానుప్రాసాలంకారం అంటే ఏమిటి ? కింది వాక్యాలలో ఛేకానుప్రాసాలంకారాన్ని సమన్వయం చేయండి.
అ) అరటితొక్క తొక్కరాదు.
ఆ) నిప్పులో పడితే కాలు కాలుతుంది.
ఇ) తమ్మునికి చెప్పు ! చెప్పు తెగిపోకుండా నడువుమని.
Answer:
లక్షణం: హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా (వెంటవెంటనే) వస్తే దానిని ‘ఛేకానుప్రాసాలంకారం’ అంటారు.
సమన్వయం:
అ) ఈ వాక్యంలో ‘తొక్క’ (అరటిపండు పై పొర), ‘తొక్క’రాదు (కాలుపెట్టరాదు) అనే రెండు పదాలు వేరువేరు అర్థాలతో వెంటవెంటనే వచ్చాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
ఆ) ఇక్కడ ‘కాలు’ (పాదం), ‘కాలు’తుంది (దహించుకుపోతుంది) అనే పదాలు భిన్నార్థాలతో వెంటవెంటనే వచ్చాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
ఇ) ఇక్కడ ‘చెప్పు’ (తెలియజేయి), ‘చెప్పు’ (పాదరక్షలు) అనే పదాలు భిన్నార్థాలతో వెంటవెంటనే వచ్చాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
Exam Tips:
a) ఛేకానుప్రాసంలో రెండు పదాలు ఒకేలా కనిపించినా అర్థాలు వేరుగా ఉండాలి (కాలు – కాలు); ఈ రెండు అర్థాలను వేర్వేరుగా రాయండి.
b) లక్షణం (నిర్వచనం) తప్పక రాసి, తరువాత సమన్వయం చేయండి.
ప్రాజెక్టు పని
Question 1: తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా రెండు మూడు పాటలు సేకరించండి. వాటిని పాడి వినిపించండి.
(లేదా)
దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకం / పాట / కవిత చదువండి. దాని ఆధారంగా నివేదిక రాసి చదివి వినిపించండి.
Answer:
గద్దర్ గానం చేసిన తెలంగాణ గేయాలు
1. బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా
పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా
2. పల్లె పల్లెను లేపి
గుండె గుండెను ఊపి
నిండుశక్తిని జూపి, నింగినేలను దాచే
దుంకో దుంకర దుంకో ॥ దుర్గ దుంకిన దుంకో !
కాశ్మీర్ చూడరో ! కథ మారిపోయరా
అస్సామీ నాడురో ! నెత్తురు మడుగాయరా
ఖలిస్తాన్ మాటరో ! కడుపున చిచ్చాయరో
ముడుచుకు కూర్చుంటెరో ! ముక్కలేను దేశమ్మురో ॥ పల్లె ॥
3. పహరా హుషార్ పహరా హుషార్ పహరా ॥ హుషార్ ॥
నీవు లేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా ॥ హుషార్ ॥
స్వార్థబుద్ధి రాజ్యమేల ప్రగతి శూన్య మాయరా !
అన్యాయం అక్రమాలు పెచ్చుమీరిపోయరా ! ॥ పహరా ॥
నీతికి న్యాయానికీ నేతవు నీవై
జాతికి నవశక్తి దాతవు కాగా ॥ నీవులేచి ॥
దాశరథి కవిత:
ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో ?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో ?
భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళాలెన్నో ?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో ?
ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో ?
శ్రమజీవుల పచ్చినెత్తురులు
త్రాగని ధనవంతులెందరో ?
అన్నార్తులు అనాథలుండని
ఆ నవయుగ మదెంత దూరమో ?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో ?
అణగారి అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో ?
కులమతాల సుడిగండాలకు
బలియైన పవిత్రులెందరో ?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో ?
నివేదిక:
ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలను రేకెత్తించే గేయం ఇది. ఇరవై నాలుగు చరణాల్లో సమస్త మానవ ప్రపంచాన్ని, విశ్వవిజ్ఞానశాస్త్ర విషయాల సారాన్ని కవిత్వంలో సంక్షిప్తీకరించాడు. మొదటి చరణం సముద్రం, ఖగోళశాస్త్రాల సమ్మేళనం. రెండో చరణం భూమి, మనిషి పుట్టుకల తీరుని వివరిస్తుంది. ఇందులో విశ్వ ఆవిర్భావం, మానవ పరిణామక్రమం కనిపిస్తుంది. మిగిలిన చరణాలు కవి లోకానుభవంనుండి వచ్చిన చారిత్రక వాస్తవాలు. కవి కలలు, అందమైన ఊహలు, మరో కొత్త ప్రపంచపు ఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో ఉద్వేగంగా నడుస్తుంది. కవి సున్నితమైన భావాలు మనల్ని ఆనందానికి, ఆగ్రహానికి గురిచేస్తాయి. కవి అన్నీ ప్రశ్నలే వేశాడు. ఇవి మానవాళికి సంబంధించిన ఆత్మవిమర్శనాత్మక అస్త్రాలు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్రశ్నలకు సమాధానం, సమస్యలకు పరిష్కారం మనలోనే, మన దగ్గరే ఉంది. కవి వేసే ప్రశ్న మనకు గుచ్చుకుంటుంది. ఇలాంటి ప్రశ్నలకు చోటులేని ‘నవయుగం’ కోసం కవి చేసిన అక్షరయాగమే ఈ గేయం.
Exam Tips:
a) ప్రాజెక్టు పనిలో సేకరించిన పాట / కవిత పేరు, రచయిత పేరు రాసి, దానిలోని ముఖ్య భావాన్ని రెండు మూడు వాక్యాలలో చెప్పండి.
b) నివేదికలో ‘పరిచయం – ముఖ్యాంశాలు – ముగింపు’ అనే మూడు భాగాలు ఉంచండి.
పాఠ్యభాగ పరిచయం
Question 1: డా॥ దాశరథి కృష్ణమాచార్య కవి పరిచయం రాయండి.
Answer:
కవి : డా॥ దాశరథి కృష్ణమాచార్య
జననం : 22.7.1925
మరణం : 05.11.1987
జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు
రచనలు : అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైనవి. నవమి (నాటికలు), యాత్రాస్మృతి (స్వీయచరిత్ర) వంటి గ్రంథాలను కూడా రచించారు. సినిమాలకు చక్కని పాటలు రాశారు. గాలిబ్ గజళ్ళను అనువదించారు.
కవితారీతి : నాటి పాలకులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలలో పాల్గొని, తన కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ కవి దాశరథి. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడలపై రాసిన ధీరుడు. ఆయన కవిత్వంలో అక్షరాలకు ఆవేశం ఎక్కువ. ఆయన కవిత్వం అభ్యుదయ మార్గంలో నడుస్తుంది; సున్నితమైన భావుకతతో, ప్రాచీన పద్యశైలిలో ఉంటుంది. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనొ అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద’ నన్నారు.
విశేషాలు : తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినవాడు. 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించాడు. సినీగేయ కవి; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవి.
పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974).
Exam Tips:
a) కవి పరిచయంలో పేరు, జన్మస్థలం, కాలం, రచనలు, బిరుదులు/పురస్కారాలు, కవితారీతి అనే క్రమంలో రాయండి.
b) అగ్నిధార, రుద్రవీణ వంటి ముఖ్య రచనల పేర్లు, 1974 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి వివరాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి.
Question 2: ‘వీర తెలంగాణ’ పాఠ్యభాగ నేపథ్యం / ఉద్దేశం ఏమిటి ?
Answer:
తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాసమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కారస్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడినవారు కొందరైతే, అక్షరాయుధంతో పోరాడినవారు మరికొందరు. సాహితీ యోధుడు డా॥ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు.
వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
Exam Tips:
a) నేపథ్యం అంటే పాఠం రాసిన నాటి పరిస్థితులు (రజాకార్ల దౌర్జన్యం, విముక్తి పోరాటం); ఉద్దేశం అంటే పాఠం ద్వారా చెప్పదలచినది (వీరుల త్యాగ స్మరణ) అని వేరువేరుగా రాయండి.
Question 3: ‘ఆధునిక పద్యం’ అనే ప్రక్రియ గురించి వివరించండి.
Answer:
‘వీర తెలంగాణ’ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఆధునిక పద్యం ఒకటి. చారిత్రక, వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణతో రాసిన పద్యాలివి. ఇవి గ్రాంథిక భాషకు దూరంగా ఉంటాయి; ఆధునిక భాష పద్యాలలో ఎక్కువగా ఉంటుంది. సమాజాభ్యుదయం ప్రధానాంశంగా ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలు డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన “దాశరథి సాహిత్యం” ఒకటవ సంపుటి ‘రుద్రవీణ’ లోనివి.
Exam Tips:
a) ‘ఆధునిక పద్యం’ లక్షణాలు: చారిత్రక, వాస్తవిక వస్తువు; ఆధునిక భావ వ్యక్తీకరణ; గ్రాంథిక భాషకు దూరం – ఈ మూడింటిని రాయండి.
ప్రతిపదార్థ తాత్పర్యాలు
Question 1: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
1. ఉ.
ఓ తెలంగాణ ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ
భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె; ఓ
హో ! తెలవార్చివేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రు
క్ప్రీత జలేజసూన తరళీకృత దేవనదీతరంగముల్
Answer:
ప్రతిపదార్థం:
ఓ తెలంగాణ = ఓ తెలంగాణమా !
నీ పెదవుల = నీ పెదవులతో
ఒత్తిన = ఊదిన
శంఖమహారవమ్ములు = శంఖధ్వనులు
ఈ భూతలము ఎల్లన్ = ఈ భూమండలమంతా
ఒక్కమొగి = ఒక్కమారుగా
బొబ్బలు పెట్టిన + అట్లు = బొబ్బలు పెట్టినట్లుగా
తోచె = అనిపించింది
ఓహో = ఆహా !
తెల్లవార్చి వేసినవి = తెల్లవారేటట్లు చేశాయి
ఒక్కొక్క దిక్కు = అన్ని దిక్కులను
నవోదయ + అర్క = ఉదయించిన సూర్యుని
రుక్ = కిరణాలచేత
ప్రీత = ప్రీతి పొందిన
జలేజసూన = పద్మాలచే
తరళీకృత = చలించిన
దేవనదీతరంగముల్ = ఆకాశగంగా తరంగాలు
తాత్పర్యం:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖ ధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా అనిపించింది. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో, చలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
c) శంఖ ధ్వని భూమండలమంతా ప్రతిధ్వనించిందనే అంశం ఈ పద్య భావానికి కేంద్రం.
Question 2: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
2. శా.
తల్లీ ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
డుల్లెన్ కొన్ని తరాలదాక; ఇపుడడ్డుల్ వోయె; సౌదామనీ
వల్లీ పుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవల్ జూపు కాలమ్ములున్
మళ్ళెన్; స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్
Answer:
ప్రతిపదార్థం:
తల్లీ = అమ్మా (తెలంగాణమా)
నీ = నీ యొక్క
ప్రతిభా = గొప్పతనపు
విశేషములు = విశేషాలు
భూతప్రేత = దుర్మార్గుల (చెడుశక్తుల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = చిక్కుకున్నాయి
కొన్ని తరాలదాక = కొన్ని తరాలవరకు
ఇపుడు = ఇప్పుడు (ఆ రోజులు గతించాయి)
అడ్డుల్ = అడ్డంకులు
పోయెన్ = తొలగిపోయాయి
సౌదామనీవల్లీ = మెరుపు తీగల
పుల్ల = విచ్చుకున్న
విభావళుల్ (విభా + ఆవళుల్) = కాంతి రేఖల వరుసలు
బ్రతుకుత్రోవల్ = బతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములున్ + మళ్ళెన్ = కాలం (సమయం) వచ్చింది
స్వచ్ఛతర = స్వచ్ఛమైన
ఉజ్జ్వల = కాంతివంతమైన
ప్రథమ సంధ్యా = తొలిపొద్దు
భానువు = సూర్యుడు
ఏతెంచెడిన్ = ఉదయించాడు (వస్తున్నాడు)
తాత్పర్యం:
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యాసూర్యుడు ఉదయించాడు.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 3: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
3. ఉ.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్;
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వ
జ్రాయిత భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో !
Answer:
ప్రతిపదార్థం:
మాతరో = అమ్మా !
కోటి = కోటిమంది
తెలుంగు కుర్రలన్ = తెలుగు పిల్లలను
నీ ఒడిలోన = నీ ఒడిలో
పెంచితివి = పోషించావు
ప్రాయము వచ్చినంతనె = వయసు రాగానే
కృపాణములు ఇచ్చితి = చేతులకు కత్తులనిచ్చి
వజ్రాయిత = వజ్రాయుధమంతటి కఠినమైన
భుజాబలమ్ము = భుజపరాక్రమాలను
దరిసింప = చూపేటట్లు
జగమ్ము = లోకం
నవాబుతో = నిజాం నవాబుతో
సవాల్ = ఎదురొడ్డి ప్రశ్నించుట
యుద్ధము + ఆడి = తలపడి
చేయుము + అట + అంటివి = చేయమన్నావు
ఈ తెలుగు రేగడిలో = సారవంతమైన ఈ తెలుగు నేలలో
జిగి = బలం
మెండు = ఎక్కువగా ఉన్నది కదా !
తాత్పర్యం:
అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్ర సమానమైన భుజపరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా !
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 4: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
4. మ.
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్
Answer:
ప్రతిపదార్థం:
తెలగాణమ్మున = తెలంగాణలో
గడ్డిపోచయును = గడ్డిపోచ కూడా
కృపాణమ్ము = కత్తి
సంధించెన్ = బట్టి ఎదిరించింది
రాజలలాముండు + అనువాని = గొప్ప రాజుగా పేరొందినవాని
పీచమున్ = గర్వాన్ని
అడచన్ = అణచేటట్లుగా
యుద్ధమ్ము సాగించె = యుద్ధం సాగించింది
ఏమి + అగునో = ఏమి జరుగుతుందో
తెల్యంగరాకన్ = తెలియక
జగము + ఎల్లన్ = జగమంతా
భీతిలిపోయెన్ = భయపడిపోయింది
దిశ + అంచలమున్ = దిగంతాలన్నీ
దివిన్ = ఆకాశంలో
శక్రధనుః పరంపరలతో = ఇంద్రధనుస్సుల పరంపరలచేత
సయ్యాటలు + ఆడెన్ = సయ్యాటలాడాయి
తాత్పర్యం:
ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 5: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
5. ఉ.
నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె ! క
ల్లోలము రేపినారు భువిలో ! నలుదిక్కుల గండికొట్టి సం
ద్రాలకు దారినిచ్చిరి ! ధరాతలమెల్ల స్వతంత్ర వారిధా
రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్
Answer:
ప్రతిపదార్థం:
నాలుగువైపులన్ = నాలుగు వైపుల నుండి
జలధి = సముద్రం
నాల్కలు సాచుచు = నోరు తెరచినట్లుగా
కూరుచుండె = ఉప్పొంగుతున్నది
భువిలో = భూమిలో
కల్లోలము = అలజడి
రేపినారు = కలిగించారు
నలుదిక్కులన్ = నాలుగు దిక్కులా
గండికొట్టి = గండికొట్టి
సంద్రాలకు = సముద్రాలకు
దారినిచ్చిరి = దారిని ఇచ్చారు
స్వతంత్ర వారిధారా = స్వాతంత్ర్యపు నీటి ధారలతో
ధరాతలము + ఎల్ల = తెలంగాణ నేలంతా
లులితమ్ము (కాదొడగె) = తడుపుతున్నారు
రాజు = నవాబుల
రివాజులు = ఆజ్ఞలకు
బూజుపట్టగన్ = కాలం చెల్లిపోయింది
తాత్పర్యం:
తెలంగాణా స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగు వైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 6: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
6. మ.
తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు ! వసుధాచక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా !
Answer:
ప్రతిపదార్థం:
తెలగాణా = అమ్మా తెలంగాణా !
భవదీయ పుత్రకులలో = నీ పిల్లలో
తీండ్రించు = ప్రకాశించే
వైప్లవ్య సంచలనమ్ము = విప్లవాత్మకమైన కదలిక
ఊరక పోవలేదు = ఊరికే పోలేదు
వసుధాచక్రము = భూమండలాన్నంతా
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభాతిక = కాంతివంతమైన
భానునిన్ = సూర్యుడిని
పిలిచి = పిలిచి
దేశంబు + అంతటన్ = దేశమంతా
కాంతివార్ధులు = కొత్త కాంతి సముద్రాలు
నిండించిరి = నింపారు
వీరు = వారంతా
వీరులు = వీరులు, యోధులే కాదు
పరార్థుల్ = న్యాయం తెలిసిన పరోపకారులైన
తెల్గుజోదుల్ = తెలుగు వీరులు
బళా ! = సుమా !
తాత్పర్యం:
అమ్మా తెలంగాణా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులు కూడా.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 7: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
7. మ.
మతపైశాచి వికార దంష్ట్రికలతో మా భూమి లంఘించి మా
కుతుకల్ గోసెడి వేళ గూడ, యెటు దిక్కున్ తోచకున్నప్పుడున్
బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్ము పోనాడలే
దు, తుదిన్ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చగ నాంధ్రాంబికా !
Answer:
ప్రతిపదార్థం:
ఆంధ్రాంబికా ! = అమ్మా !
మతపైశాచి = మతం అనే పిశాచి
వికార దంష్ట్రికలతో = తన క్రూరమైన కోరలతో
మా భూమి = మా నేలను
లంఘించి = ఆక్రమించి
మా కుతుకల్ = మా గొంతులు
గోసెడివేళ కూడ = కోస్తున్నప్పుడు కూడా
ఎటు దిక్కున్ = ఏ దిక్కూ
తోచకున్నప్పుడున్ = తోచనప్పుడు
బ్రతుకే = బ్రతకడమే
దుర్భరమైన + అప్పుడును = భారమైనప్పుడు
ఆంధ్రత్వమ్ము = తెలుగుదనాన్ని
పోనాడలేదు = కోల్పోలేదు
యుద్ధమున = యుద్ధరంగంలో
రుద్రుల్ = రుద్రాదులు
మెచ్చగన్ = మెచ్చేటట్లు
తుదిన్ = చివరికి
గెల్చితిమమ్మ = విజయాన్ని సాధించాం
తాత్పర్యం:
అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం.
Exam Tips:
a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వండి; సంధి లేదా సమాస పదాలు ఉంటే వాటిని విడదీసి చూపండి.
b) తాత్పర్యం మొత్తం పద్యభావాన్ని సొంత వాక్యాలలో సరళంగా చెప్పాలి; ప్రతిపదార్థాన్ని వరుసగా కలిపి చదివితే అదే తాత్పర్యం అవుతుంది.
Question 8: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
8. సీ. + తే.గీ.
కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిన నాడు
తెలుగు జెండాలు నర్తించె మింట
కాపయ్య నాయకుం డేపు సూపిన నాడు
పరరాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణగణమనె
తే.గీ. నాడు నేడును తెలగాణ మోడలేదు
శత్రువుల దొంగదాడికి; శ్రావణాభ్ర
మటుల గంభీర గర్జాట్టహాస మలర
నా తెలంగాణ పోవుచున్నది పథాన
Answer:
ప్రతిపదార్థం:
కాకతీయుల కంచుగంట = కాకతీయ రాజుల కంచుగంట
మ్రోగిననాడు = మ్రోగినప్పుడు
కరకురాజులకు = దుర్మార్గులైన శత్రురాజులకు
తత్తరలు పుట్టె = కలవరం కలిగింది
వీరరుద్రమదేవి = వీర రుద్రమదేవి
విక్రమించిననాడు = పరాక్రమించినప్పుడు
తెలుగు జెండాలు = తెలుగు జెండాలు
మింటన్ నర్తించె = ఆకాశాన రెపరెపలాడాయి
కాపయ్య నాయకుండు = కాపయ్య నాయకుడు
ఏపు + చూపిననాడు = విజృంభణం చూపినప్పుడు
పరరాజులకు = శత్రురాజులకు
గుండె పట్టుకొనియె = గుండెలు ఆగిపోయాయి
చాళుక్య = చాళుక్య రాజులు
పశ్చిమ + ఆశా పాలనమ్మున = పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు
కళ్యాణఘంటలు = మంగళకరమైన జయధ్వనులు
గణగణమనె = గణగణమంటూ మోగాయి
నాడు = నాటినుండి
నేడును = నేటివరకు
తెలగాణము = తెలంగాణం
శత్రువుల దొంగదాడికి = శత్రువుల దొంగదెబ్బలకు
ఓడలేదు = ఓడిపోలేదు
శ్రావణాభ్రము అటుల = శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా
గంభీర గర్జాట్టహాస = గంభీరమైన గర్జనలు
అలర = అలరారుతుండగా
నా తెలంగాణ = నా తెలంగాణం
పథాన = ముందుకు
పోవుచున్నది = సాగుతూనే ఉన్నది
తాత్పర్యం:
ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు గణగణమంటూ మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.
Exam Tips:
a) కాకతీయుల కంచుగంట, రుద్రమదేవి, కాపయ్య నాయకుడు, చాళుక్యులు – ఈ నాలుగు చారిత్రక ప్రస్తావనలను తాత్పర్యంలో తప్పక రాయండి.
b) ఇది సీసపద్యం + తేటగీతి కలిసిన పద్యం; చివరి పాదాల ‘శ్రావణాభ్రము’ ఉపమాన భావాన్ని విడిచిపెట్టకండి.
Free study material for Telugu
Telugu Class 10 Curriculum Solutions: Lesson 03 Veera Telangana
Textbook Solutions for Class 10 Telugu Lesson 03 Veera Telangana
Explore reliable textbook solutions for Lesson 03 Veera Telangana tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 03 Veera Telangana concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 03 Veera Telangana with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ in both English and Hindi medium.
Yes, you can download the entire TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ in printable PDF format for offline study on any device.