TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

Download TS Board Solutions for Class 10 Telugu Lesson 02 Evari Bhasha Vallaku Vinasompu (Everyone's Own Language Is Sweet to Them)

Review structured textbook solutions for Class 10 Telugu Lesson 02 Evari Bhasha Vallaku Vinasompu (Everyone's Own Language Is Sweet to Them). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 10 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

చదవండి – ఆలోచించి చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ నం. 13)

తెలంగాణ భాషంతా ‘తౌరక్యాంధ్ర’మని ఎవడో అన్నడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష ? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడ, గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్లల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్నం జేయి.
మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలె, దానికి, బాస చాన ముఖ్యమయింది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాషగావాలె.
– కాళోజి నారాయణరావు

Question 1: పై పేరాలోని మాటలు ఎవరన్నారు?

Answer:

పై పేరాలోని మాటలు కాళోజి నారాయణరావు గారు అన్నారు.

Exam Tips:

a) పేరా చివర ఉన్న పేరు (కాళోజి నారాయణరావు) చూసి జవాబు రాయండి; పూర్తి వాక్యంగా రాయండి.

 

Question 2: ఇట్లా ఎందుకు అని ఉంటాడు ?

Answer:

తెలంగాణ భాషను ఎవరో ‘తౌరక్యాంధ్ర’మని అన్నారు. దానితో కాళోజీగారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా తమ భాషను, యాసను, పలుకుబడిని చాలా ఇష్టపడతారు. తాము ఉగ్గుపాలతో నేర్చిన భాషను ఎవరైనా హేళన చేసినా, కించపరిచినా, విమర్శించినా సహించలేరు. అందునా కవులకు, రచయితలకు భాషాభిమానం, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే కాళోజీగారు అలా అని ఉంటారు.

Exam Tips:

a) ‘తౌరక్యాంధ్రం’ అని తెలంగాణ భాషను హేళన చేయడమే కాళోజీ కోపానికి కారణం అని తప్పక పేర్కొనండి.
b) కవులకు ఉండే భాషాభిమానం, ఆత్మాభిమానం అనే మాటలు వాడితే జవాబు బలంగా ఉంటుంది.

 

Question 3: ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం, రాయడం అంటే ఏమిటి ?

Answer:

ఎవరి భాషలో వాళ్లు మాట్లాడడం, రాయడం అంటే తమ మాతృభాషలో వ్యవహరించడం. తల్లి నుండి ఉగ్గుపాలతో నేర్చుకొన్న భాషను మాతృభాష అంటారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పరిసరాల వారు, స్నేహితులు మొదలైన వారు ఉపయోగించే భాష, యాస, పదజాలం, మాండలికాలు మొదలైనవి ఎవరికైనా ఇష్టంగా ఉంటాయి. అదే వారి వ్యవహారభాష. ఎవరి వ్యవహార భాషలో వారు మాట్లాడితే, రాస్తే ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది.

Exam Tips:

a) ‘మాతృభాష’, ‘వ్యవహారభాష’ అనే రెండు పదాలను నిర్వచిస్తూ జవాబు రాయండి.
b) తల్లిదండ్రులు, కుటుంబం, పరిసరాల నుండి నేర్చిన భాష అని ఉదాహరణతో చెప్పండి.

 

Question 4: ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది ?

Answer:

ఎవరి భాష వాళ్లకు చాలా మధురంగా, హాయిగా, తియ్యగా ఉంటుంది. పద ప్రయోగంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎవరి భాష వాళ్లకు తల్లిలా అనిపిస్తుంది. తమ మాండలిక పదజాలాన్ని చూసి వారు గర్వంగా అనుభూతి చెందుతారు.

Exam Tips:

a) మధురంగా, హాయిగా, తల్లిలా అనిపిస్తుంది అనే భావాలను క్లుప్తంగా రాయండి; 2–3 వాక్యాలు చాలు.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ నం. 17)

“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని ……… ఉద్యోగ విరమణ చేసినారు.

Question 1: “ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.

Answer:

ఏ ప్రాంతం వారైనా, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు తాము ఉపయోగించే భాషలో ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారిపోతుంది. ఉపయోగించే మాండలికాలు మారిపోతాయి. ఇతర ప్రాంతాల మాండలికాలు, కొన్ని పదాలు అర్థం కావు. అందుచేత అవి కొత్తగా ఉంటాయి.
తమ ప్రాంతపు మాండలికాలపైనా, భాషపైనా, యాసపైనా పట్టు ఉంటుంది. అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది.

Exam Tips:

a) ‘సమర్థించండి’ అనే ప్రశ్నకు మొదట మీ అభిప్రాయం చెప్పి, తర్వాత కారణాలు (యాస, మాండలికాలు, పట్టు) రాయండి.
b) ప్రతి జిల్లాకు యాస మారుతుంది అని ఒక ఉదాహరణ ఇవ్వగలిగితే మంచి మార్కులు వస్తాయి.

 

Question 2: రచయిత కొందరు పండితులను గురు స్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్ళలో ఏయే ప్రత్యేకతలుండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి.

Answer:

‘మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ’ అని గురువుకు తల్లిదండ్రులతో సమాన స్థానం ఇచ్చారు. గురువును దైవంగా భావించే సంప్రదాయం మనది.
అటువంటి గురువు ఆదర్శవంతంగా ఉండాలి. సమయానికి పాఠశాలకు రావాలి. విద్యార్థులకు అర్థం అయ్యేలా ప్రతి పాఠం చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. కోప్పడకూడదు. మంచి మంచి కథలు చెప్పాలి. మా గురువుగారిలా ఉండాలి.

Exam Tips:

a) ‘ఆచార్యదేవోభవ’ అనే సూక్తితో మొదలుపెడితే జవాబు ఆకర్షణీయంగా ఉంటుంది.
b) గురువుకు ఉండవలసిన లక్షణాలను (సమయపాలన, సత్యం, ఓర్పు, బోధనా నైపుణ్యం) వరుసగా రాయండి.

 

Question 3: ‘పసందైన ప్రాంతీయ భాష’ – దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి.

Answer:

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు. వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. అటువంటి శాస్త్రిగారు, తిరుమల రామచంద్రగారికి తిరుపతి లడ్డు ఇస్తూ, “వారీ రామచంద్రా” అని సంబోధించి ‘ఇగపటు’ అనటం వింతగా అనిపిస్తుంది. ‘ఇగపటు’ అనగా ‘ఇదిగో తీసుకో’ అని అర్థం. ‘ఇగపటు’ అనడం, ‘వారీ రామచంద్రా’ అని పిలవడం లక్ష్మణశాస్త్రిగారికి పసందైన తమ ప్రాంతీయ భాషపై గల అభిమానాన్ని తెలియజేస్తాయి.

Exam Tips:

a) ‘ఇగపటు’ అంటే ‘ఇదిగో తీసుకో’ అని అర్థం తప్పక రాయండి.
b) మహాపండితుడైనా ప్రాంతీయ భాషను ఇష్టంగా వాడారనే అంశమే జవాబులోని కీలకం.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ నం. 17)

మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం ……….. ప్రభుత్వం జప్తు చేస్తుంది.

Question 1: “వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది” దీని గురించి చర్చించండి.

Answer:

మహబూబ్‌నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డిగారిది కూడా మహబూబ్‌నగర్ జిల్లానే. వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. వారి స్వగ్రామం నీళ్ళులేని ఇటిక్యాలపాడు.

Exam Tips:

a) సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లావారని, స్వగ్రామం ఇటిక్యాలపాడు అని పేర్కొనండి.

 

Question 2: ‘ఏకలవ్య శిష్యుడ’నే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.

Answer:

కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పాడు. ఆయనకు పాండవులంటే ఇష్టం. అందులోనూ తను చెప్పినది చెప్పినట్లు చేసే అర్జునుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడిని మహావీరుడిగా తయారుచేయాలని విలువిద్య నేర్పుతున్నాడు.
ఇంతలో ‘ఏకలవ్యుడు’ అనే గిరిజన బాలుడు తనకూ విలువిద్య నేర్పమన్నాడు. కాని, ద్రోణుడు నేర్పను అన్నాడు. అయినా ఏకలవ్యుడు తన పంతం విడిచిపెట్టలేదు. ద్రోణుని బొమ్మను తయారు చేసుకొన్నాడు. దానిని గురువుగా భావించి విలువిద్యను తనకు తానే సొంతంగా నేర్చుకొన్నాడు. అర్జునునితో సమానమైన వీరుడయ్యాడు. అందుచేత గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా, ఆయనపై గురుభావన ఉంచి నేర్చుకొనే వారిని ఏకలవ్య శిష్యులు అంటారు. రచయిత కూడా లక్ష్మణశాస్త్రిగారి దగ్గర శిష్యరికం చేయకపోయినా వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నందున తనను ఏకలవ్య శిష్యుడని చెప్పుకున్నారు.

Exam Tips:

a) ఏకలవ్యుని కథను క్లుప్తంగా చెప్పి, ‘ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా గురుభావనతో నేర్చుకునేవాడు’ అనే అంతరార్థాన్ని స్పష్టంగా రాయండి.
b) రచయిత లక్ష్మణశాస్త్రిగారికి ఏకలవ్య శిష్యుడని పాఠంతో అనుసంధానం చేస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 3: “పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాలవంటివి” ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.

Answer:

పలుకుబడి : పలుకుబడి అంటే మాట తీరు, అంటే మాట్లాడబడేది. మాట్లాడబడేది భాష, భాషకు ‘యాస’ ప్రధానం. మాండలికాలు, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పదజాలం పలుకుబడి అనవచ్చు. ఈ పలుకుబడి వలన భాషకు చాలా అందం వస్తుంది. వినసొంపుగా ఉంటుంది. ఇది వినగానే ఆనందం కలుగుతుంది.
నుడికారం : మాటలోని చమత్కారాన్ని నుడికారం అంటారు. ఎవరి భాషలోని చమత్కారాలు వారికే బాగా తెలుస్తాయి. చమత్కారం వలన కూడా భాషకు చాలా అందం వస్తుంది. చమత్కారంగా మాట్లాడే వారంటే ఎవరికైనా ఇష్టమే కదా ! ఇది కొద్దిగా ఆలోచిస్తేనే ఆనందం కలుగుతుంది.
జాతీయం : ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు. వాటి పూర్వకథలు తెలియకపోతే ఆనందం కలగదు. అంటే బాగా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు భగీరథ ప్రయత్నం, శ్రీరామరక్ష మొదలైనవి.
ఆభరణాలు మనిషికి అందాన్ని ఇచ్చినట్లే, ఇవి భాషకు అందాన్ని ఇస్తాయి. కాబట్టి పలుకుబడి, నుడికారం, జాతీయాలు భాషకు అలంకారాల వంటివి.

Exam Tips:

a) పలుకుబడి, నుడికారం, జాతీయం – మూడింటికీ విడివిడిగా అర్థం, ఉదాహరణ రాయండి.
b) జాతీయాలకు ఉదాహరణలు (భగీరథ ప్రయత్నం, కొట్టినపిండి, చేతికి ఎముకలేదు) గుర్తుంచుకోండి.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ నం. 18)

ఆడవాళ్ళ నోట అసలైన భాష – మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ ……… విశేషమే కదా !

Question 1: “మొదలు మీ కళ్లకు నీళ్లు పెట్టుకోండి” అని మరాఠీ పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి.

Answer:

భాష చాలా విలువైనది. పద ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఒకే మాటకు వేర్వేరు భాషల్లో వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఒకసారి ఒక సభలో నేను అందర్నీ ‘రండి, రండి’ అని పిలుస్తున్నాను (అనగా రమ్మని అర్థం). అదే మాట ఉర్దూలో ఒక చెడ్డ అర్థం ఇచ్చే పదంలా నా ముస్లిం స్నేహితునికి వినిపించింది. అతను వెంటనే కోపపడ్డాడు. తెలుగులో ఆ మాటకు అర్థం ‘రమ్మని పిలవడం’ అని వివరించాను. అతను నా స్నేహితుడే కావటం వల్ల సమస్య సమసిపోయింది.

Exam Tips:

a) ఒకే మాటకు వేర్వేరు భాషల్లో వేర్వేరు అర్థాలు ఉంటాయనే అంశం చుట్టూ మీ సొంత అనుభవాన్ని రాయండి.
b) సంఘటన, దాని ఫలితం, మీరు నేర్చుకున్న పాఠం – ఈ క్రమంలో రాయండి.

 

Question 2: “ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం” దీన్ని సమర్థిస్తూ చర్చించండి.

Answer:

సాధారణంగా పిల్లలంతా ‘అమ్మ’ నుండే మాట్లాడడం నేర్చుకొంటారు. స్త్రీలు ఇంటి వద్ద ఉండి ఎక్కువ మందితో మాట్లాడతారు. మగవారి కంటే స్త్రీలు నుడికారాలు, పలుకుబళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. ప్రాంతీయమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగిస్తారు. అందుకే అసలైన భాషను ఆడవాళ్ళ నోటనే వినగలం.

Exam Tips:

a) పిల్లలు అమ్మ నుండే భాష నేర్చుకుంటారని, స్త్రీలు నుడికారాలు, పలుకుబళ్ళు ఎక్కువ వాడతారని రెండు కారణాలు తప్పక రాయండి.

 

Question 3: కవిసమ్మేళనం అంటే మీకు తెలుసా ? ఎపుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా ? మీ అనుభవాన్ని తెలుపండి.

Answer:

కవులందరూ ఒక చోట చేరి తమ కవితలను వినిపించే, తమ అభిప్రాయాలను, రచనలను చర్చించే వేదికను “కవి సమ్మేళనం” అంటారు. నాకు తెలుసు. నేను హైదరాబాదులోని “రవీంద్ర భారతి”లో కవి సమ్మేళనం చూశాను. తరువాత మా పాఠశాలలో స్నేహితులందరం కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మా తెలుగు పంతులుగారి ఆధ్వర్యంలో దానిని నిర్వహించాము. అందరం మేము రాసిన చిన్న చిన్న కవితలు వినిపించాము. ఆ అనుభవం చాలా బాగుంది.

Exam Tips:

a) మొదట ‘కవి సమ్మేళనం’ అంటే ఏమిటో నిర్వచించి, తర్వాత మీ అనుభవాన్ని రాయండి.
b) ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో, ఏం జరిగింది అనే వివరాలు ఇస్తే జవాబు సజీవంగా ఉంటుంది.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ నం. 20)

“ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి ……… సామాన్య ప్రజలతోనే” అని.

Question 1: “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని రచయిత అనడంలో ఆంతర్యమేమిటి?

Answer:

ఒక షేర్‌లో “ఖాస్ – ఆమ్” అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమయినది. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు – కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.
అంటే కవి తన కవితను పండితుల కోసం కాకుండా సామాన్య ప్రజల కోసం, వారి భాషలోనే రాస్తున్నాడని ఆంతర్యం.

Exam Tips:

a) ఖాస్ – ఖవాస్ (ప్రత్యేక వ్యక్తులు), ఆమ్ – అవామ్ (సామాన్య ప్రజలు) అర్థాలు తప్పక రాయండి.
b) కవి సామాన్య ప్రజల కోసం, వారి భాషలో రాస్తాడనేదే ఆంతర్యం అని ముగించండి.

 

Question 2: “పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు.” అనడం నిజమా ? కాదా ? కారణాలు చర్చించండి.
(లేదా)
తెలుగు “పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు.” అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (June 2017)

Answer:

ఇది నిజమే. గ్రాంథిక భాష రాసే కాలంలో పిల్లలకు బడిలో గ్రాంథిక భాష నేర్పేవారు. పిల్లలకు తెలుగు చెప్పే పంతులు కాబట్టి రచయిత వ్యావహారికం గురించి మాట్లాడేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఇది చాలా ఘోరం. వ్యావహారిక భాషావాదం వచ్చి, వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఈ భేదం చాలావరకు సమసిపోయింది. ఇది వాస్తవం.

Exam Tips:

a) ‘నిజమే’ అని స్పష్టంగా చెప్పి, గ్రాంథిక – వ్యావహారిక భాషల భేదాన్ని కారణంగా వివరించండి.
b) ఉర్దూ, మరాఠీ పిల్లలతో పోలికను ఉదాహరణగా రాయండి; ఇది జూన్ 2017 పరీక్షలో అడిగిన ప్రశ్న.

 

Question 3: ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరిచేసుకోవాలి ? మాట్లాడండి.

Answer:

మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే వాటిని తొలగించటమూ కాదు, దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటమే సరైన మార్గం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది, ఉంటుంది.

Exam Tips:

a) తొలగించడం, దిద్దడం కాదు – అన్ని ప్రాంతాల పలుకుబళ్లను కలుపుకోవడమే మార్గం అనే రచయిత అభిప్రాయాన్ని రాయండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: కింది అంశాన్ని గూర్చి చర్చించండి.
అ) మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడండి. ఐతే ఒక్క ఆంగ్లపదం కానీ, హిందీ, ఉర్దూ ….. ఇలా ఇతర భాషాపదాలు వాడకుండా మాట్లాడాలి. ప్రయత్నం చేయండి. ఎవరు బాగా మాట్లాడుతారో చూద్దాం.

Answer:

నేను లంగర్ హౌజ్ పాఠశాలలో చదువుతున్నాను. ఒకసారి మా పాఠశాలలో “ఒక నిమిషం” అనే కార్యక్రమం నిర్వహించారు. మా తరగతిలో అందరూ మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను “తెలుగు భాష తేనె కంటే తీయనిది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. తెలుగులో అజంత పదాలు ఎక్కువ. అందుకే దీనిని ‘ఇటలీ భాష వలె తూర్పు దేశపు భాష’ అంటారు. పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అందాలు” అని అచ్చ తెలుగులో మాట్లాడాను. ఒక్క ఆంగ్ల, ఉర్దూ, హిందీ పదం రాకుండా మాట్లాడినందుకు నాకు బహుమతి ఇచ్చారు. మీరూ ప్రయత్నించండి.

Exam Tips:

a) అచ్చ తెలుగు పదాలు మాత్రమే వాడాలి; ‘స్కూల్’, ‘టైమ్’ వంటి ఆంగ్ల పదాలు రాకుండా జాగ్రత్తపడండి.
b) ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ వంటి ప్రసిద్ధ వాక్యాలు వాడితే జవాబు బలపడుతుంది.

 

Question 2: క్రింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.
గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సే హై
“ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది (స్పెషల్). దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్). కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.
అ) ‘ఖాస్’ అనే ఉర్దూ పదానికి అర్థం
ఎ) కవిత బి) ప్రత్యేకమైన సి) సాధారణమైన డి) సామాన్యం
ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ?
ఎ) అవామ్ బి) ఆమ్ సి) ఖాస్ డి) ఖవాస్
ఇ) నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు. గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూపదం
ఎ) సంబంద్ బి) అవామ్ సి) ఖవాస్ డి) పసంద్
ఈ) పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు ?
ఎ) గ్రాంథికభాష బి) ఉర్దూభాష సి) ప్రజలభాష డి) ఏవీకాదు

Answer:

అ) బి) ప్రత్యేకమైన
ఆ) ఎ) అవామ్
ఇ) సి) ఖవాస్
ఈ) సి) ప్రజలభాష

Exam Tips:

a) గద్యాన్ని జాగ్రత్తగా చదివి ఏకవచనం (ఖాస్, ఆమ్), బహువచనం (ఖవాస్, అవామ్) తేడా గమనించండి – ఇక్కడే తప్పులు ఎక్కువ జరుగుతాయి.
b) జవాబులో ఆప్షన్ అక్షరంతో పాటు పదాన్ని కూడా రాయండి (ఉదా: ఎ) అవామ్).

 

Question 3: క్రింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష. కాని ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ తరం వాళ్లందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్లు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను.
మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్‌మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు. ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్లు. అయితే, పై తరగతిలో చదివే మాకు రామనాథరావుసార్ ఉర్దూ చెప్పేవారు. వారు మంథెన బ్రాహ్మణులు. ఎఫ్.ఎ. (ఇంటర్మీడియట్) చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పాండిత్యం వుండేదనేవాళ్లు.
ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాసయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ సాహెబులెవరూ అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్థం కుదరని ఉర్దూ షేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావుసార్‌తో చెప్పించుకునేవాళ్లు.
ప్రశ్నలు
అ) రఫియా సుల్తానా తరం వాళ్ళు ఏమని అనుకున్నారు ?
ఆ) రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు ?
ఇ) రామనాథరావుసార్ ఎక్కడివారు ? ఏ విషయాన్ని బోధించేవారు ?
ఈ) ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్‌ను ఏ విషయమై సంప్రదించేవాళ్లు ?

Answer:

అ) ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష అని, అది ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదని అనుకున్నారు.
ఆ) ఉర్దూతో తమకు గల సంబంధాన్ని యాది చేసుకున్నాడు.
ఇ) రామనాథరావు సార్ మంథెనకు చెందిన బ్రాహ్మణులు. వారు ఉర్దూ బోధించేవారు.
ఈ) తమకు సరిగా అర్థం కుదరని ఉర్దూ షేర్ల తాత్పర్యం కోసం సంప్రదించేవాళ్లు.

Exam Tips:

a) ప్రతి జవాబు గద్యంలోని వాక్యాల ఆధారంగానే ఉండాలి; సొంత ఊహలు రాయవద్దు.
b) ప్రశ్నలోని పదాలనే జవాబులో వాడి పూర్తి వాక్యంగా రాయండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు ?
(లేదా)
మనుమరాలి మాటలు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి ?
ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి.
ఇ) “అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది ?
ఈ) రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ వ్రాయండి.

Answer:

అ) మనుమరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మనుమరాలు కావ్య. సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. వాళ్ళు హిందీ మాట్లాడుతారు. తెలుగు రాదు. హిందీలోంచి అనువదించుకొని మాట్లాడుతారు. తెలుగు పలుకుబడి, నుడికారము వాళ్ళకు తెలియదు. అటువంటి 4 సంవత్సరాల లావణ్య “తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని తాత చేతికిచ్చింది. లావణ్య ‘ఇగపటు’ అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుపడ్డందుకు తాత అబ్బురపడ్డాడు.
ఆ) సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండపండితులు, సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్పకవి శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితులు రాసిన ప్రశంసాపూర్వకమైన అభిప్రాయాలను డా॥ సామల సదాశివగారు చదివారు. వారి దగ్గర శిష్యరికం చేయకపోయినా, ఆయన సన్నిధానంలో కూర్చొని తరచుగా జాబులు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి శాస్త్రిగారిని సదాశివగారు గురుస్థానీయులుగా భావించారు.
ఇ) ఇది వరంగల్లు తెలుగు గురించి చెప్పిన విషయం. పెద్ద కాళోజీ వర్ధంతి సభ జరుగుతోంది. రచయిత కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవారు. ఆ సభల్లో చిన్నపాటి కవిసమ్మేళనం, చిన్నపాటి ముషాయిరా ఉండేవి. కొన్ని ప్రసంగాలు జరిగేవి. షాద్ గజళ్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూకవి. కలం పేరు షాద్. రచయిత వెళ్ళేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు కవితలు వినిపిస్తున్నారు.
ఆ సాహిత్యసభకు ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారు రచయితకు తెలియదు. అక్కడ తెలుగు విద్వాంసులు, యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటమేమిటి అని రచయిత అనుకున్నారు. కాళోజీకి ఆప్తుడేమో అనుకున్నారు. రెవెన్యూవాళ్ళకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదని ఒకప్పుడు రచయిత అనుకునేవారు. కాని ఉత్తమ కవితలూ, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ‘యాది’ శీర్షిక కిందే ప్రస్తావించారు.
ఈ) రచయిత డా॥ సామల సదాశివగారు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితులు. అనేక భాషల రచయితల, కవుల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయీలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. అంజద్ రుబాయీల అనువాదానికి ‘ఉత్తమ అనువాద రచనా పురస్కారం’, “స్వరలయలు” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ – కర్ణాటక సంగీతాలకు సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది.

Exam Tips:

a) ఒక్కో ఉపప్రశ్నకు కనీసం ఐదు వాక్యాలు రాయాలి; ఉపప్రశ్న అక్షరం (అ, ఆ, ఇ, ఈ) తప్పక రాయండి.
b) రచయిత రచనలు (యాది, మలయమారుతాలు, స్వరలయలు), పురస్కారాలు గుర్తుంచుకోండి – శైలి ప్రశ్నకు ఇవి అవసరం.

 

Question 2: క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
(లేదా)
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలచుకున్నారు ?

Answer:

ఈ పాఠం ద్వారా సామల సదాశివగారి వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం మొదలైన ఎన్నో విషయాలు తెలిశాయి.
1. వ్యక్తిత్వం : సామల సదాశివగారు అల్పసంతోషి, ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవారు. అందుకే తమ మనుమరాలు ‘ఇగపటు’ అనగానే చాలా ఆనందించారు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని యాది చేసుకొన్నారు. ఎంత గొప్ప పండితుడైనా తమ ప్రాంతీయతను, ప్రాంతీయ భాషను విడిచిపెట్టకూడదని సామల సదాశివగారి అభిప్రాయంగా తెలిసింది.
2. పాండిత్యం : మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో “మాకూ మరాఠీ వచ్చు కదా” అనే రచయిత మాటలను బట్టి, ఆయన మరాఠీలో మంచి పండితుడని తెలిసింది.
“పెద్ద కాళోజీ వర్ధంతి సభలో ఉర్దూలో ప్రసంగించాన”న్నారు. అందుచేత ఉర్దూలో కూడా గొప్ప పండితుడని తెలిసింది.
“నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాడినే” అని రచయిత అన్నారు. దీనిని బట్టి సదాశివగారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మంచి పండితులని తెలిసింది.
3. వినయం : తను బహుభాషాపండితుడైనా గర్వం లేనివాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి వద్ద తను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకొన్నానని వినయంగా చెప్పారు. లక్ష్మణశాస్త్రిగారికి తను ఏకలవ్య శిష్యుడినని వినయంగా ప్రకటించుకొన్నారు. పండితుల గురించి చెప్పవలసి వచ్చినపుడు గొప్ప గొప్ప మాటలలో చెప్పారు. “తెలుగులోను, ఉర్దూలోనూ ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకొన్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకమవుతుంది” అనడంలో ఆయన వినయం తెలిసింది. వీటన్నిటినీ బట్టి సదాశివగారి దగ్గర పాండిత్యంతో బాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు.

Exam Tips:

a) వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం అనే ఉపశీర్షికలతో జవాబు రాస్తే పది వాక్యాలు సులువుగా పూర్తవుతాయి.
b) ప్రతి అంశానికి పాఠంలోని ఒక సందర్భాన్ని ఉదాహరణగా ఇవ్వండి.

 

Question 3: క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా వ్రాయండి.
(లేదా)
ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా వ్రాయండి.

Answer:

అ) నా ప్రాథమిక విద్యాభ్యాసం నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మాకు తెలుగుకు వేమూరి విజయశ్రీగారు వచ్చేవారు. ఆమె చక్కటి వేషధారణ, భాషపై పట్టు కల వ్యక్తి. వారు తెలుగు పద్యాలను ధారాళంగా చెప్పేవారు.
ఒకసారి వేమన, సుమతీ శతక పద్యాలకు కంఠస్థ పోటీ నిర్వహించారు. దానిలో నేను ప్రథమ బహుమతిని పొందాను. మునగాల మండల విద్యాశాఖాధికారిగారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఆ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన పోటీదారులను సత్కరించారు. నాకు తెలుగు నిఘంటువు ఇచ్చారు. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరచిపోలేని సంఘటన.
(లేదా)
ఆ) (మేము ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవారము. మా ఇంటి ప్రక్కన కిరణ్ గారి కుటుంబం ఉండేది. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు. కిరణ్‌కు తాగుడు అలవాటు అయింది. ఒకరోజు ఆయన పడిపోతే ఆసుపత్రిలో చేర్చారు. మా నాన్నగారు రక్తదానం చేశారు. అయినా కిరణ్ గారు బతకలేదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు. ఈ సంఘటన నాకు ఎంతో బాధ కలిగించింది. దీనిని సంభాషణగా రాస్తాను.)
శ్రావ్య : అన్నయ్యా ! ప్రక్క ఇంటిలో జనం గోలగా ఉన్నారు. ఏమయింది ?
రవి : అవును శ్రావ్యా ! చూసివస్తాను ఉండు. (చూసి వస్తాడు)
శ్రావ్య : ఏం జరిగిందన్నయ్యా ?
రవి : ప్రక్క ఇంటిలో కిరణ్ గారు పడిపోయారు. అందరూ గుమిగూడారు. నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను. సరేనా ?
శ్రావ్య : సరే ! నేనూ వస్తాను పద ! (ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళతారు. డాక్టర్‌గారు పరీక్షించి రక్తం అవసరం అన్నారు.)
డాక్టర్ : రవి, శ్రావ్య మీరు వెళ్ళి రక్తదానం చేసేవారిని తీసుకురండి. (రవి వాళ్ళ నాన్నగారితో చెపుతాడు.)
రవి : నాన్నా ! కిరణ్ గారికి రక్తం ఎక్కించాలని అన్నారు. నువ్వు ఇస్తావా నాన్నా !
రాజు : ఓ ! అలాగే ! ఇప్పుడే వెళ్ళి రక్తదానం చేసి వస్తాను. (ఆసుపత్రికి వెళతాడు)
డాక్టర్ : పేషెంట్‌కి రక్తదానం చేయటానికి ఎవరు వచ్చారు ?
రాజు : నేను సార్ ! నేను స్కూల్ మాష్టార్ని. ఇంతకు పూర్వం చాలాసార్లు రక్తం ఇచ్చాను.
డాక్టర్ : సరే పదండి. (రాజు రక్తం ఇస్తాడు)
రాజు : డాక్టర్‌గారూ ! ఇక నేను వెళ్ళవచ్చా ? కిరణ్ పరిస్థితి ఎలా ఉంది ?
డాక్టర్ : ఓ వెళ్ళవచ్చు. కానీ పేషెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
రాజు : అయ్యో ! (అంటూ బాధపడుతూ ఇంటికి వెళతాడు)
శ్రావ్య, రవి : నాన్నా ! రక్తం ఇచ్చావా ?
రాజు : ఇచ్చానమ్మా ! కానీ కిరణ్ పరిస్థితి బాగోలేదని చెప్పారు.
(కిరణ్ చనిపోయాడని ఇంటికి తీసుకువస్తారు. అందరూ ప్రక్క ఇంటికి వెళతారు.)
శ్రావ్య : నాన్నగారూ ! కిరణ్ గారు ఎందుకు చనిపోయారు ?
రాజు : తాగుడు వల్ల చనిపోయాడమ్మా.
రవి : తాగుడుకు బానిసలైతే జీవితం ఇలా అవుతుందా ?
రాజు : అవును రవీ ! ఫలితం ఇలా దారుణంగా ఉంటుంది. మీ స్నేహితులకు చెప్పండి. “మద్యపానం మనిషికి శత్రువు” అని.
శ్రావ్య, రవి : సరే నాన్నగారూ ! మా స్నేహితులకు చెబుతాం.

Exam Tips:

a) సంభాషణలో పాత్రల పేర్లు ముందు రాసి, కోలన్ (:) తర్వాత మాటలు రాయండి; వాడుక భాష వాడండి.
b) వ్యాసం రాస్తే పరిచయం, సంఘటన, ముగింపు అనే క్రమం పాటించండి; చివరిలో సందేశం ఇస్తే మంచిది.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : యాదిచేసుకొను = గుర్తు చేసుకొను
నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం.
అ) పసందు = ఇష్టం
ఆ) రమ్యం = అందమైన
ఇ) క్షేత్రం = చోటు

Answer:

అ) పసందైన మామిడి పండ్లను మేము ఇష్టంగా తింటాం.
ఆ) రమ్యమైన ప్రకృతికి, సుందర జలపాతాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ధి చెందినది.
ఇ) నా తెలంగాణ క్షేత్రం ఉద్యమాలకు ఆలవాలమైంది.

Exam Tips:

a) పదం అర్థం స్పష్టంగా తెలిసేలా వాక్యం రాయండి; ఇచ్చిన పదాన్ని మార్చకుండా వాడండి.

 

Question 2: నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వ్రాయండి.
అ) కవి
ఆ) క్షేత్రం

Answer:

అ) కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, ఋషి, నీటికాకి
ఆ) క్షేత్రం = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం

Exam Tips:

a) ‘నానార్థాలు’ అంటే ఒకే పదానికి ఉండే వేర్వేరు అర్థాలు; ప్రతి పదానికి కనీసం రెండు అర్థాలు రాయండి.
b) పర్యాయపదాలు (ఒకే అర్థం గల వేర్వేరు పదాలు) తో కలపకండి.

 

Question 3: క్రింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని వ్రాయండి.
అ) ఇల్లు, గృహం
ఆ) పొగడ్త, స్తోత్రం

Answer:

అ) ఇల్లు, గృహం = ఆలయం
ఆ) పొగడ్త, స్తోత్రం = ప్రశంస

Exam Tips:

a) పర్యాయపదాలు అంటే ఒకే అర్థం గల వేర్వేరు పదాలు; పాఠంలో వచ్చిన పదాన్నే జవాబుగా రాయండి.

 

Question 4: క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి – వికృతులను వ్రాయండి.
అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ వున్నది.
ఆ) నాది ప్రజా కవిత కద !
ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది.
ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది.

Answer:

ప్రకృతి – వికృతి
అ) భాష – బాస
ఆ) కవిత – కైత
ఇ) కథ – కత
ఈ) స్త్రీ – ఇంతి

Exam Tips:

a) ఎప్పుడూ ‘ప్రకృతి – వికృతి’ క్రమంలోనే రాయండి (కథ – కత, భాష – బాస).
b) సంస్కృత పదం ప్రకృతి, దాని తెలుగు మార్పు రూపం వికృతి అని గుర్తుంచుకోండి.

 

Question 5: క్రింది వ్యుత్పత్త్యర్థాలకు తగిన పదాలు వ్రాయండి.
అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు
ఆ) భాషింపబడునది

Answer:

అ) గురువు
ఆ) భాష

Exam Tips:

a) వ్యుత్పత్త్యర్థం అంటే పదం ఏర్పడిన విధానాన్ని చెప్పే అర్థం; ‘గురువు’, ‘భాష’ వంటి సామాన్య పదాలు గుర్తుంచుకోండి.

 

వ్యాకరణాంశాలు

Question 1: క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.
అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు.
ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
ఇ) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.

Answer:

అ) 1. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.
2. తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు.
ఆ) 1. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
2. నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
ఇ) 1. ఇంట్లో మాట్లాడే భాష వేరు.
2. బడిలో చదివే భాష వేరు.

Exam Tips:

a) ఒక వాక్యంలో రెండు కర్తలు లేదా రెండు కర్మలు ఉంటే, వాటిని విడదీసి రెండు సామాన్య వాక్యాలుగా రాయండి.
b) ప్రతి సామాన్య వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉండాలి.

 

Question 2: క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.

Answer:

అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేకరులు ఉన్నారు.
ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, చదివి పోతుంటారు.

Exam Tips:

a) సంయుక్త వాక్యంలో రెండు సమాన ప్రాధాన్యం గల వాక్యాలను ‘మరియు, కానీ, కాబట్టి’ వంటి పదాలతో కలుపుతాం.
b) పునరుక్తమైన కర్తను (నల్గొండ జిల్లాలో) ఒక్కసారే రాయండి.

 

Question 3: క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.

Answer:

అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.
ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.
ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

Exam Tips:

a) సంక్లిష్ట వాక్యంలో మొదటి క్రియను క్త్వార్థకంగా (రాసి, సంపాదించి) మార్చి, చివరి క్రియ మాత్రమే సమాపక క్రియగా ఉంచండి.

 

Question 4: రుగాగమ సంధి – ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.
అ) పేదరాలు ఆ) బీదరాలు ఇ) బాలింతరాలు

Answer:

అ) పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు
పై మూడు సందర్భాలలో పరపదం ‘ఆలు’. ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే ‘ఆగమం’. పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను ‘పేదాదులు’ అంటారు. పేదాది పదాలకు ‘ఆలు’ అనే పదం కలిసినప్పుడు ‘ర్’ అనే అక్షరం అదనంగా వచ్చింది. ‘ర్’ అదనంగా రావడాన్ని ‘రుగాగమం’ అంటారు.
పై మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం). ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన సమాసాన్ని కర్మధారయమంటారు.
సూత్రం: కర్మధారయమందు పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.
ఇదే పద్ధతిలో మరికొన్ని:
ముద్దరాలు = ముద్ద + ఆలు
జవరాలు = జవ + ఆలు
మనుమరాలు = మనుమ + ఆలు
కొమరాలు = కొమ + ఆలు
తత్సమ పదాలలో:
గుణవంత + ఆలు → గుణవంత + ఉ + ఆలు → గుణవంతు + ఆలు → గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ + ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు → శ్రీమంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ + ఆలు → బుద్ధిమంతు + ఆలు → బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు
పై మూడుచోట్ల తత్సమ పదాలకు ‘ఆలు’ కలిస్తే మొదటిపదం చివర ఉన్న ‘అ’కారానికి బదులు ‘ఉ’కారం వచ్చి, తరువాత రుగాగమం అయింది.
సూత్రం: కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగాగమం అవుతుంది.

Exam Tips:

a) సూత్రం తప్పక రాయండి: ‘కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమమౌతుంది’.
b) విడదీసేటప్పుడు మధ్యలో ‘ర్’ రావడం చూపిస్తేనే పూర్తి మార్కులు; తత్సమ పదాలలో ‘ఉ’ కారం కూడా వస్తుందని గుర్తుంచుకోండి.

 

ప్రాజెక్టు పని

Question 1: గాంధీజీ “సత్యశోధన”, సామల సదాశివ “యాది”, కాళోజి “నా గొడవ”, దాశరథి రంగాచార్య “జీవనయానం”, గడియారం రామకృష్ణశర్మ “శతపత్రము” మొదలగు వాటిలో వారివారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదవండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక వ్రాయండి.

Answer:

కాళోజి నారాయణరావు రచించిన ‘నా గొడవ’ కావ్యం నాకు నచ్చింది. దానిలో ‘కోరిక’ (ఈప్స) అనే గేయం నాకు బాగా నచ్చింది. దాని సారాంశాన్ని నివేదికగా రాస్తున్నాను.
నివేదిక
నాకున్నది ఒక కోరిక. నేను రాసే కవిత నా మనసులోని భావాల అలజడిని మిత్రుడికి రాసిన ఆత్మీయ ఉత్తరంగా ఉండాలి. పుస్తక ప్రియులను ఆహ్లాదపరిచే కవిత్వంగా, సౌందర్యారాధకులను ఆలోచింపజేసేదిగా, మేధావుల మనసులను కదిలించేదిగా, తార్కికుల్లో సైతం భావోద్వేగాలు పుట్టించేలా, అమాయకులు ప్రమాదాల్లో పడిపోకుండా కాపాడేదిగా ఉండాలనేది నా కోరిక. సాహిత్యవిలువలు, రస సౌందర్యం, కవి సమయాల గురించి తెలియనివారి వెక్కిరింతలు ఆగిపోయే విధంగా భావగాఢత గల కవితగా ఉండాలని, ఆడంబర మనస్తత్వాల్ని సైతం ఆకర్షించేదిగా ఉండాలని, జడత్వం ఆవరించిన స్నేహరాహిత్య హృదయాలకు ప్రాణం పోసే సంజీవనిగా ఉండాలని, కోపంతో నిండిన కనులను శాంతపరచేదిగా, విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ అమాయకులను గాయపరిచే ఆంబోతుల్లాంటి మనుష్యుల అకృత్యాలకు కళ్ళెం వేసేలా నా కవిత ఉండాలి.
కవిత్వం గాలిలో తేలివచ్చే సువాసనలాగా, మధురమైన భావాలను మోసుకు రావాలి. పొదుగుల నుండి కారుతున్న పాలధారలా కవిత ఉపయోగకరంగా ఉండాలి. అమ్మ కంటి చూపుల్లోంచి కురిసే మమతానురాగాలు, పంటను సంరక్షించే రైతు చూపుల్లోని జాగ్రదావస్థ కవిత్వంలో నిక్షిప్తమై ఉండాలి.
నిరాశతో కుంగిపోయిన మనసుకు ఆనందాన్ని కలిగించి, జీవితంలోని అభద్రతాభావాన్ని తొలగించి జీవనానికి ఆధారంగా కవిత ఉండాలి. అనవసరపు మృత్యుభయాల్ని తొలగిస్తూ యమునికే మృత్యుభీతి కలిగించే విశ్వాసాన్ని కవిత్వం అందించాలి.
దాహంతో గొంతెండిపోయిన వారికి చెలిమనీరులా, చలికి వణికిపోయేవారికి ఆరిపోని కుంపటి వెచ్చదనంలా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టనష్టాలలో ఆదుకునేలా కవిత్వం ఉండాలి.
పక్షిప్రాణాన్ని కాపాడటం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి దాతృత్వాన్ని, ఆడిన మాట నిలబెట్టుకోవడానికి సర్వస్వాన్నీ ధారపోసిన బలిచక్రవర్తి త్యాగాన్ని ప్రబోధించేలా కవిత ఉండాలి. దేశ సరిహద్దుల్ని నిరంతరం పరిశీలిస్తూ పహారా కాసే సైనికుడిలా, చావంటే భయం వదలిపెట్టి పోరాడే వీరుడిలా, అమరవీరుడి మెడలో మెరిసే పూలదండలా కవిత ఉండాలి.
పవిత్రమైన వేదం చదివితే కలిగే బహుళ ప్రయోజనాల్లా కవితలోని వేదన పఠితలో గుణాత్మకమయిన మార్పుల్ని కలిగించాలి. నిర్మల గంగానదిలా మనిషి జీవనం నిత్యచైతన్యంతో ముందుకు కదలాలని, నదిలో కొట్టుకుపోతున్న వాడికి తీరం తగిలినట్లుగా, కష్టాల్లో, బాధల్లో మునిగిపోయిన వారికి ఓదార్పు, ఉపశమనం కలిగించే తీరంలా కవిత్వపు తీరు ఉండాలి.
పాతాళాన్ని పైకి లాగేదిగా, ఆకాశాన్ని భూమ్మీదికి దించేదిగా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగే ఉత్తేజాన్ని కవిత్వం కలిగించాలి. అనేక సహజ వనరులతో, ప్రకృతి సౌందర్యంతో, విభిన్న ప్రాణుల జీవనానికి అనుగుణంగా ఉన్న అమూల్యమైన భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడుకునేలా కవిత్వం స్ఫూర్తి కలిగించాలి.
నాకు ఎందుకు నచ్చింది: మనిషి మానవీయ విలువలతో మంచి మనిషిగా ఎదిగేలా కవిత్వం నేర్పాలని కాళోజీ గాఢంగా కోరుకున్నారు. కవిత్వం కేవలం అందం కోసం కాక ప్రజల మేలు కోసం ఉండాలనే ఈ భావన నాకు ఎంతో నచ్చింది.

Exam Tips:

a) నివేదికలో గ్రంథం పేరు, రచయిత, నచ్చిన సంఘటన/కవిత సారాంశం, ఎందుకు నచ్చిందో – ఈ నాలుగు అంశాలు తప్పక ఉండాలి.
b) సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి; చివర్లో మీ అభిప్రాయం రాయండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 10 Telugu Lesson 02 Evari Bhasha Vallaku Vinasompu (Everyone's Own Language Is Sweet to Them)

Textbook Solutions for Class 10 Telugu Lesson 02 Evari Bhasha Vallaku Vinasompu (Everyone's Own Language Is Sweet to Them)

Explore reliable textbook solutions for Lesson 02 Evari Bhasha Vallaku Vinasompu (Everyone's Own Language Is Sweet to Them) tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 10 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 10 Telugu.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు in printable PDF format for offline study on any device.