Official TS Board Solutions for Class 10 Telugu: Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam
Access comprehensive textbook solutions for Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam using the official curriculum guides for Class 10 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Telugu: Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam
View or download the dedicated Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 2)
కర్ణుని పూజామందిరంలో ‘సూర్యుడు’ ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అంటాడు.
సూర్యుడు : పుత్రా ! కర్ణా ! బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. నాయనా జాగ్రత్త !
కర్ణుడు : తండ్రీ ! ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని “దేహి” అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే, నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తాను. కాని నన్ను వారించకండి.
Question 1: సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణమేమిటి ?
Answer:
కవచకుండలాలు ఉన్నంతవరకు కర్ణుని ప్రాణానికి ముప్పు ఉండదు. అవి దానం చేస్తే ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకే దానం చేయకుండా ఆపాలనుకొన్నాడు సూర్యుడు. కర్ణుడు ఆయన కొడుకు కదా !
Exam Tips:
a) కారణాన్ని స్పష్టంగా రాయండి: కవచకుండలాలు కర్ణునికి రక్షణ, వాటిని దానం చేస్తే ప్రాణానికి ముప్పు.
b) ‘తండ్రి కొడుకు’ అనే సంబంధాన్ని (వాత్సల్యం) ప్రస్తావిస్తే జవాబు పూర్తవుతుంది.
Question 2: కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది ?
Answer:
ఎటువంటి ఆపద వచ్చినా దానం చేస్తానని కర్ణుడు చెపుతాడు. దీనివల్ల కర్ణుని దానగుణం యొక్క గొప్పతనం తెలుస్తుంది.
Exam Tips:
a) కర్ణుని మాటల నుండి గ్రహించిన గుణాన్ని (దానగుణం, ఆపదకు వెరవని స్వభావం) ఒక్క వాక్యంలో చెప్పండి.
b) ‘ఈ శరీరం శాశ్వతం కాదు’ అనే కర్ణుని మాటను ఉదహరించండి.
Question 3: ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు ?
Answer:
శరీరం శాశ్వతం కాదని, ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని “దేహి” అని అడిగితే కాదనలేనని కర్ణుడు అంటాడు. అందుకే ప్రాణానికి ముప్పని తెలిసినా కవచకుండలాలను దానం చేశాడు.
Exam Tips:
a) రెండు కారణాలు రాయండి: శరీరం శాశ్వతం కాదు; ఇంద్రుడంతటివాడు ‘దేహి’ అంటే కాదనలేను.
b) కర్ణుని వాత్సల్యం కంటే దానధర్మానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చెప్పడం మంచిది.
Question 4: ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ? ఎవరు ?
Answer:
ఇటువంటి దానవీరులు చాలామంది ఉన్నారు.
1. బలి : వామనుడికి మూడడుగుల నేల దానం చేశాడు. తన గురువు శుక్రాచార్యుడు వద్దన్నా వినలేదు. దానివలన తన రాజ్యాన్నంతా కోల్పోయి పాతాళలోకానికి వెళ్ళవలసి వచ్చింది.
2. శిబి : పావురాన్ని కాపాడడానికి శిబిచక్రవర్తి తన శరీరంలోని మాంసం కోసి డేగకు ఇచ్చాడు.
3. దధీచి : రాక్షసుడైన వృత్రాసురుని సంహరించడానికి ఇంద్రునికి వజ్రాయుధం కావలసి వచ్చింది. వజ్రాయుధం తయారీకి దధీచి తన వెన్నెముకను ఇచ్చాడు.
4. రంతిదేవుడు : తన రాజ్యం మొత్తం దానధర్మాలకు వినియోగించాడు. తనకు తినడానికి మిగిలిన అన్నం కూడా దానం చేశాడు. తాను త్రాగడానికి ఉంచుకొన్న నీటిని కూడా దానం చేశాడు.
5. సక్తుప్రస్థుడు : పేద బ్రాహ్మణుడు. తాను, తన కుటుంబీకులు తినబోయిన సత్తుపిండిని కూడా ఆకలితో వచ్చిన అతిథికి దానం చేశాడు.
Exam Tips:
a) కనీసం మూడు పేర్లు, ప్రతి ఒక్కరి దానం ఏమిటో ఒక్కో వాక్యంలో రాయండి (బలి, శిబి, దధీచి, రంతిదేవుడు, సక్తుప్రస్థుడు).
b) దానం చేసిన వస్తువును సరిగ్గా రాయండి: శిబి – మాంసం, దధీచి – వెన్నెముక, బలి – మూడడుగుల నేల.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 4)
Question 1: శుక్రుడు బలిచక్రవర్తితో “వలదీ దానము గీనమున్” అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి.
Answer:
శుక్రుడు రాక్షసులకు వంశ గురువు. శుక్రుడు ఎప్పుడూ రాక్షసుల క్షేమాన్నే కోరుకుంటాడు. శుక్రుడు తపస్సంపన్నుడు. వచ్చిన పొట్టివాడు విష్ణుమూర్తి అని శుక్రునికి తెలుసు. విష్ణుమూర్తి ఆ మూడడుగులతో తేలికగా పోడని శుక్రుడికి తెలుసు. అతడు మూడడుగులతో మూడు లోకాలనూ కొలిచే త్రివిక్రముడు అవుతాడనీ, బ్రహ్మాండం అంతా నిండిపోతాడనీ ఆయనకు తెలుసు. ఎవ్వరూ విష్ణుమూర్తిని ఆపలేరని కూడా శుక్రాచార్యుడికి తెలుసు.
అందుకే శుక్రుడు బలిని దానము చేయవద్దని హెచ్చరించాడు.
Exam Tips:
a) శుక్రుడు వచ్చినవాడు విష్ణువని గుర్తించడం, వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలను కొలుస్తాడని తెలియడం – ఈ రెండు అంశాలు తప్పక రాయండి.
b) శుక్రుడు రాక్షసుల గురువు కాబట్టి శిష్యుని క్షేమం కోరి హెచ్చరించాడని ముగించండి.
Question 2: “మానధనులు” ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు ?
Answer:
మానధనులు అంటే అభిమానమే ధనముగా గలవారు. వారికి పదవితో గాని, ధనముతో గాని సంబంధం లేదు. వారు ప్రాణం కంటే తమ గౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరిచేతా ‘ఇది తప్పు’ అని చెప్పించుకోరు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాట తప్పరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొంటారు. ప్రాణం కంటే తాము ఇచ్చిన మాటకే విలువ ఇస్తారు.
Exam Tips:
a) మానధనులు = అభిమానమే ధనంగా గలవారు – అర్థాన్ని ముందు చెప్పి, తర్వాత లక్షణాలు (మాట తప్పరు, గౌరవానికి ప్రాణం కంటే విలువ) రాయండి.
b) ఇది అభిప్రాయ ప్రశ్న; మీ మాటల్లో ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వవచ్చు.
Question 3: “కీర్తిని సంపాదించడమే గొప్పదని” చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు ?
Answer:
కీర్తిని సంపాదించడమే గొప్పదని బలిచక్రవర్తి చెప్పిన మాట ఉత్తమమైనది. అది అందరికీ శిరోధార్యమైనది.
1. సిరిసంపదలూ, రాజ్యమూ శాశ్వతమైనవి కావు.
2. సత్యవంతుడని పేరు పొందిన హరిశ్చంద్ర మహారాజు వంటి వారికి లభించిన కీర్తి శాశ్వతమైనది.
3. దేశం కోసం తమ సర్వస్వాన్నీ అర్పించి, త్యాగం చేసిన గాంధీజీ, నెహ్రూజీ, పటేలు, సుభాష్ చంద్రబోస్ వంటి వారి త్యాగాన్నీ, దేశసేవనూ నేటికీ లోకులు కీర్తిస్తున్నారు.
4. అక్రమ సంపాదనలతో లోకకంటకులైన వారిని లోకం నేటికీ నిందిస్తోంది.
కాబట్టి కీర్తి సంపాదన ముఖ్యమన్న బలిచక్రవర్తి మాటను నేను సమర్థిస్తాను.
Exam Tips:
a) సమర్థనకు కనీసం మూడు కారణాలు ఇవ్వండి: సంపదలు శాశ్వతం కావు, హరిశ్చంద్రుని వంటివారి కీర్తి శాశ్వతం, త్యాగమూర్తులను నేటికీ స్మరిస్తున్నాం.
b) చివరి వాక్యంలో ‘కాబట్టి నేను సమర్థిస్తాను’ అని స్పష్టంగా తీర్మానించండి.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 5)
Question 1: “తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనినిబట్టి మీకేం తెలిసింది ?
Answer:
“వచ్చినవాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మ అయినా సరే, నా నాలుక ఇచ్చిన మాట నుండి వెనుదిరగదు” అని బలిచక్రవర్తి అంటాడు. దీనిని బట్టి ఆడినమాట తప్పకూడదని అర్థమైంది.
Exam Tips:
a) పద్యంలోని భావాన్ని (వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా మాట తప్పను) మీ మాటల్లో రాసి, ‘ఆడినమాట తప్పకూడదు’ అనే నీతిని తీర్మానించండి.
Question 2: “శిబి గొప్ప దాత”. ఎందుకు ?
Answer:
శిబి చక్రవర్తి చాలా గొప్పదాత. ఒకసారి ఒక పావురాన్ని కాపాడడానికి తన శరీరంలోని మాంసం కోసి డేగకు ఇచ్చాడు. ఆ మాయా పావురం బరువుకు ఎంతకూ సరితూగకపోతే చివరకు తానే త్రాసులో కూర్చొని తన శరీరాన్నే సమర్పించిన దానశీలి.
Exam Tips:
a) శిబి కథను క్లుప్తంగా రాయండి: పావురాన్ని కాపాడడం, డేగకు మాంసం ఇవ్వడం, త్రాసులో తనను తానే సమర్పించుకోవడం.
b) ‘శరణు కోరినవారిని రక్షించడం’ అనే గుణంతో ముగించండి.
Question 3: ఎదుటివారు అడిగిన దానిని ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది ? మీ అనుభవాలు చెప్పండి.
Answer:
చాలా తృప్తి ఉంటుంది. దానినే త్యాగం అంటారు. నాకు జన్మదినానికి ఒక “పార్కర్ పెన్ను” బహుమతిగా వచ్చింది. దానిని నా “ప్రాణస్నేహితుడు” అడుగగా ఇచ్చివేసాను. నాకు చాలా తృప్తి కలిగింది.
Exam Tips:
a) ఇది అనుభవ ప్రశ్న: మీ సొంత అనుభవాన్ని ఒక చిన్న సంఘటనగా రాయండి (వస్తువు, ఎవరికి ఇచ్చారు, ఎలా అనిపించింది).
b) ‘త్యాగం’ అనే మాటతో తృప్తిని వివరిస్తే జవాబు బలంగా ఉంటుంది.
Question 4: “పొడవు పొడవున గుఱుచై” అని కవి ఎవరిని ఉద్దేశించి, ఎందుకట్లా అని ఉంటాడు ?
Answer:
వామనుని (విష్ణుమూర్తిని) ఉద్దేశించి అన్నాడు. గొప్పవాడైన విష్ణువు చిన్నవానిగా మారి (వామనుడిగా) అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటె నావంటివానికి ఇంకేం కావాలని బలిచక్రవర్తి అంటాడు.
Exam Tips:
a) ‘ఎవరిని’ (వామనుడు = విష్ణువు), ‘ఎందుకు’ (గొప్పవాడు చిన్నవానిగా మారి అడగడం) అనే రెండు భాగాలకూ సమాధానం ఇవ్వండి.
ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: దానాలన్నీ వేటికవే గొప్పవి. అయితే నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు కదా ! వాటి యొక్క ప్రాధాన్యాన్ని చర్చించండి.
Answer:
దానం అంటే మనకున్నది ఇవ్వడం. అది కూడా కావలసిన వారికే ఇవ్వాలి. అడిగిన వారికే ఇవ్వాలి. ధనం దానం చేస్తాం. దానివలన అడిగిన వారికి కొన్ని అవసరాలు తీరతాయి. అన్నదానం చేస్తే గ్రహీతకు ఆకలి తీరుతుంది. విద్యాదానం చేస్తే గ్రహీతకు జ్ఞానం వస్తుంది. అంటే మనం ఏ దానం చేసినా స్వీకరించడానికి గ్రహీత ఉండాలి కదా ! గ్రహీత కూడా ఎంత గొప్పవాడైనా ప్రాణం లేకపోతే ఏమీ చేయలేడు. అందుచేత ప్రాణదానం అన్ని దానాలకంటే ఉత్తమమైనది.
ప్రాణం నిలబడాలంటే రోగాలు తగ్గాలి. కొన్ని రకాల రోగాలకు కారణం రక్తం లేకపోవడం. ఆపరేషన్లు జరిగినపుడు రోగికి రక్తం కావాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయాల పాలవుతారు. అప్పుడు కూడా రోగి ప్రాణాలు కాపాడడానికి రక్తం కావాలి. ఒక్కొక్కసారి కావలసిన గ్రూపు రక్తం దొరకక రోగి ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. దానివలన దాతకు కూడా నష్టమేమీ లేదు. మళ్ళీ వెంటనే కొత్త రక్తం ఏర్పడుతుంది. వైద్యుల సలహాననుసరించి ఆరు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. అత్యవసర పరిస్థితులలో కూడా వైద్యుల సలహాతో రక్తదానం చేయవచ్చు. మనకు తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. ఆరోగ్యానికీ మంచిదే.
కొంతమంది కొన్ని అవయవాలు పనిచేయక మరణిస్తారు. అటువంటివారిలో ఎక్కువమంది మూత్రపిండాల వ్యాధితో మరణిస్తుంటారు. వారిని ఆదుకోవాలంటే మూత్రపిండం దానం చేయవచ్చు. ప్రతి మనిషికీ రెండు మూత్రపిండాలు ఉంటాయి. వైద్యుల సలహాతో ఒకటి దానం చెయ్యవచ్చు.
బ్రెయిన్‌డెడ్ అయిన వారి కళ్ళు, కాలేయం, గుండె మొదలైనవి ఆయా అవసరాలున్నవారికి మార్పిడి చేయవచ్చు. దానివలన మరొకరి అవయవాల రూపంలో జీవించవచ్చు. వారికి అవయవదానం చేసిన పుణ్యం కూడా వస్తుంది. అందుకే తన మరణానంతరం తన అవయవాలను దానం చేయవలసినదిగా వీలునామా రాయాలి. దానిని బంధువులు కూడా ఆటంకపరచకూడదు. పోయిన ప్రాణం తిరిగిరాదు. శరీరం కూడా నశించిపోతుంది. అవయవాలు దానం చేస్తే మరొకరి జీవితంలో వెలుగు వస్తుంది.
Exam Tips:
a) జవాబును పరిచయం, రక్తదానం, అవయవదానం, ముగింపు అనే భాగాలుగా రాయండి.
b) ప్రాణదానమే అన్నిటికంటే గొప్పదనే పాయింట్‌ను ప్రధానంగా చెప్పండి; వైద్యుల సలహా అనే జాగ్రత్తను కూడా పేర్కొనండి.
Question 2: పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి.
Answer:
పువ్వు గుర్తు గల 1, 4, 6 సంఖ్యల పద్యాల భావం ఇది.
1వ పద్యం : దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా ? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
4వ పద్యం : ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !
6వ పద్యం : ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?
Exam Tips:
a) ఈ ప్రశ్నలో 1, 4, 6 సంఖ్యల పద్యాల భావాన్ని చదివి చెప్పాలి; ప్రతి పద్యానికి ఒక్క వాక్యంలో సారాంశం రాస్తే సరిపోతుంది.
b) పద్యం చదివేటప్పుడు యతి, ప్రాసలను పాటించి భావానికి తగిన స్వరం వాడండి.
Question 3: ఒకటో పద్యానికి ఇక్కడ ప్రతిపదార్థం ఉంది. ఇదే విధంగా నాలుగు, ఆరు సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
1వ పద్యం ప్రతిపదార్థము :
వదాన్య + ఉత్తమా ! = దాతల్లో శ్రేష్ఠుడా ! (ఓ బలిచక్రవర్తీ !)
కులమున్ = (రాక్షస) కులమును
రాజ్యమున్ = (రాక్షస) రాజ్యమును
తేజమున్ = తేజస్సును
నిలుపుము = నిలబెట్టుము
ఈ కుబ్జుండు = ఈ పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విష్ణుమూర్తి (జగత్తును భరించువాడు హరి)
అలఁతిన్ + పోడు = అంత తేలికగా వదలిపెట్టడు
త్రివిక్రమ స్ఫురణన్ = ముల్లోకములను ఆక్రమించెడి స్ఫూర్తి కలవాడు
ఐ = అయ్యి
నిండున్ = నిండిపోవును
బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును
మాన్పన్ = ఆపుటకు
ఒకండు = ఒకడైన
కలడే = సమర్థుడు ఉన్నాడా ?
నా పలుకులున్ = నా మాటలను
ఆకర్ణింపుము = వినుము
కర్ణంబులన్ = చెవులారా
వలదు = వద్దు
ఈ దానమున్ గీనమున్ = ఈ దానము గీనము
వర్ణిన్ = బ్రహ్మచారిని
పనుపుమా = పంపివేయుము (పంపించవయ్యా !)
Answer:
4వ పద్యం ప్రతిపదార్థము :
భార్గవా = ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు కారే = ఎంతో మంది రాజులు కాలేదా ?
రాజ్యముల్ కలుగవే = రాజ్యములు పొందలేదా ఏమి ?
గర్వ ఉన్నతిన్ పొందరే = అహంకారముతో గొప్పదనాన్ని పొందలేదా ఏమి ?
వారు ఏరి = వాళ్ళందరు ఎక్కడ ఉన్నారు ?
సిరిని మూటగట్టుకొని = సంపదలను కూడగట్టుకొని
పోవన్ చాలిరే = తీసుకెళ్ళగలిగారా ? (లేదు)
భూమిపైన్ = నేలపైన (ఈ భూలోకంలో)
పేరు + ఐనన్ కలదే = కనీసము పేరైనా ఉన్నదా ? (లేదు)
శిబి ప్రముఖులున్ = శిబిచక్రవర్తి మొదలగువారు
యశః కాములు + ఐ = కీర్తిని కోరువారై
కోర్కులు = (అడిగినవారి) కోరికలను, దానములను
ప్రీతిన్ ఈరే = సంతోషంతో ఇవ్వలేదా ?
ఈ కాలమున = ఇప్పటి కాలమునందును
వారలన్ మఱచిరే = వారిని మరిచిపోయారా ? (లేదు)
6వ పద్యం ప్రతిపదార్థము :
ధీవర్య = ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా !)
నిరయంబు + ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన = బంధనము (చెరసాల) ప్రాప్తించినా
ధరణీ నిర్మూలనంబు + ఐన = భూమండలమే నాశనమైనా
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన = వంశం నాశమైనా
నిజమున్ = నిజంగానే పైవన్నీ
రానిమ్ము = వస్తే రానీ
కానిమ్ము = జరిగేది జరగనీ
వేయేటికిన్ = వేయి మాటలు దేనికి ?
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు + ఐనన్ = శివుడయినా
హరి + ఐన = విష్ణువయినా
నీరజభవుండు + ఐన = బ్రహ్మదేవుడయినా
నాదు జిహ్వ = నా యొక్క నాలుక
తిరుగన్ = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు = చేయలేదు
Exam Tips:
a) ప్రతిపదార్థం రాసేటప్పుడు పద్యంలోని పదాల వరుసలోనే ‘పదం = అర్థం’ అని రాయండి; సంధి పదాలను విడదీసి (నిర్మూలనంబు + ఐన) చూపండి.
b) ఒక్క పదాన్నీ వదలకండి; ప్రతి వదిలిన పదానికీ మార్కులు తగ్గుతాయి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : ఐదేసి వాక్యాల్లో జవాబులు
Question 1: “ఈ కుబ్జుండు అలఁతింబోడు” అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ‘ఉద్దేశమేమై’ ఉంటుంది ? దానితో మీరు ఏకీభవిస్తారా ?
Answer:
“వామనుడు (పొట్టివాడు) సామాన్యుడు కాదు. విష్ణువు, విశ్వంభరుడు కొంచెం మాత్రం తీసుకొనిపోయేవాడు కాదు. మూడడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవ్వరూ అతడిని ఆపలేరు”. నా మాట వినమని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. శిష్యుడ్ని రక్షించడం కొరకు అలా చెప్పాడు. ఇదే ఆయన ఉద్దేశం. ఇంతకంటె వేరు లేదు. నేను కూడా దీనిని ఏకీభవిస్తాను.
Exam Tips:
a) శుక్రుని ఉద్దేశం (శిష్యుని రక్షించడం), మీ ఏకీభావం – రెండూ ఐదు వాక్యాల్లో రాయండి.
b) ‘ఏకీభవిస్తాను / ఏకీభవించను’ అని ఒక స్పష్టమైన అభిప్రాయం ఇవ్వండి.
Question 2: హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు ?
Answer:
హాలికుడు అంటే వ్యవసాయదారుడు. రైతును దేశానికి వెన్నెముక అంటారు. అంతేగాని సౌకర్యాలేమీ కల్పించరు. రైతును ప్రభుత్వాలు పట్టించుకోవాలి.
రైతులకు కావలసిన సౌకర్యాలు :
1. తగినంత నీటి సదుపాయం కల్పించాలి.
2. మంచి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి.
3. వడ్డీలేని అప్పులను ఇవ్వాలి.
4. ఎరువులు, పురుగుమందులు మొదలైనవి సబ్సిడీ ధరలపై ఇవ్వాలి.
5. భూసార పరీక్షలు చేసి, సూచనలు సలహాలు ఇవ్వాలి.
6. నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలి.
7. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన కలిగించాలి.
8. తను పండించిన దానికి ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ రైతుకు కల్పించాలి.
9. దళారీ వ్యవస్థను నిర్మూలించాలి.
10. పండించిన పంట నిల్వ చేసుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
Exam Tips:
a) రైతుకు కావలసిన సౌకర్యాలను సంఖ్యలతో జాబితాగా రాయండి (నీరు, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, గిట్టుబాటు ధర).
b) మొదట ‘హాలికుడు = వ్యవసాయదారుడు’ అని అర్థం చెప్పడం మంచిది.
Question 3: ‘సిరి మూట గట్టుకొని పోవం జాలిరే ?’ అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది ?
(లేదా)
“సంపదలు శాశ్వతం కాదు. వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతం”. వివరించండి.
(లేదా)
సంపదలు గొప్పవా ? కీర్తిప్రతిష్టలు గొప్పవా ? చర్చించండి.
Answer:
పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. బలి ఆంతర్యంలో ఈ క్రింది కారణాలు ఉన్నాయి.
1. సంపదను అనుభవించాలి లేదా దానం చేయాలి.
2. అనుభవించడం వలన కీర్తి ప్రతిష్టలు రావు.
3. దానం చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పుణ్యం వస్తుంది.
4. అనుభవించినా, దానం చేసినా తను బ్రతికి ఉండగానే చేయాలి.
5. ఎప్పటికైనా మరణం తప్పదు. మరణించాక సంపద ఎవరెవరో పట్టుకొని పోతారు.
6. తన చేతులతో తను దానం చేసుకోవాలని బలి ఉద్దేశం.
7. వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు.
8. శ్రీమహావిష్ణువుకు దానం చేసే అదృష్టం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా అటువంటి అవకాశం రాదు.
9. తన సంపద కంటే, ప్రాణం కంటే శ్రీమహావిష్ణువుకు దానం చేయడమే విలువైనదని బలి ఉద్దేశం.
10. శ్రీమహావిష్ణువు (గ్రహీత) ఉన్నంతకాలం మహాదాత అయిన బలి కీర్తి ఉంటుంది. అదే బలిచక్రవర్తి కోరిక.
Exam Tips:
a) పద్యంలోని భావంతో మొదలుపెట్టి (సంపదను మూటగట్టుకొని పోలేరు), తర్వాత కారణాలను క్రమంగా రాయండి.
b) ‘లేదా’ ప్రశ్నలలో ఏ ప్రశ్న వచ్చినా ఇదే జవాబును సందర్భానికి తగ్గట్టు ఉపయోగించవచ్చు.
Question 4: “ఆడినమాట తప్పగూడదు” ఎందుకు ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అనే మాటను సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
“మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమే మాన ధనులకు మేలు” అని బలి ఎందుకన్నాడు ?
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఎందుకన్నాడు ? ఆ మాటలో గల సామంజస్యమెట్టిదో వివరించండి.
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనిని బట్టి మీకేం తెలిసింది ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అన్న మాటను మీరు సమర్థిస్తారా ? ఎందుకు ?
Answer:
పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసినవాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేను” అని చెప్పిందట. అంతేకాదు, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమానధనులైన వారికి ఉత్తమమార్గం.
ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించినా, ధన ప్రాణాలకు చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. ఇచ్చినమాట తప్పటం కన్నా మహాపాపం లేదు.
సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుంది. సత్యం మాట్లాడేవారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడినమాట తప్పగూడదు.
Exam Tips:
a) భూదేవి మాటలు (చెడ్డపని చేసినవాడిని భరిస్తాను, మాట తప్పినవాడిని మోయలేను) ఉదహరించండి.
b) ‘లేదా’ ప్రశ్నలలో ఒకే జవాబును వివిధ రూపాల్లో వాడవచ్చు; ప్రశ్నలోని మాటలను జవాబు మొదటి వాక్యంలో ఉపయోగించండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : పది వాక్యాల్లో జవాబులు
Question 1: నేటి సమాజానికి దాతృత్వంగల వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.
(లేదా)
దానశీలము కలిగిన వ్యక్తుల వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి ?
(లేదా)
దాతృత్వమే నేటి సమాజానికి అవసరం. వివరించండి.
Answer:
1. నేటి సమాజంలో ఒకరినొకరు పట్టించుకోవడం తగ్గుతోంది.
2. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే దానగుణం రావాలి.
3. దానగుణం వలన ఆపదలో ఉన్నవారికి సహాయం దొరుకుతుంది.
4. మోసం తగ్గుతుంది. దొంగతనాలు తగ్గుతాయి.
5. మనిషిలో స్వార్థం తగ్గుతుంది.
6. సమాజంలో క్రూరత్వం తగ్గుతుంది.
7. స్నేహం పెరుగుతుంది.
8. కలిసిమెలసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాలుపంచుకొంటారు.
9. ప్రపంచమంతా ఒకే కుటుంబం. అందరూ నావాళ్ళే అనే భావాలు పెంపొందుతాయి.
10. అవిద్య, పేదరికం, రోగాలు, యుద్ధాలు మొదలైనవి అంతమౌతాయి. సంపద, ఆరోగ్యం, శాంతి మొదలగునవి పెరుగుతాయి.
11. పగ, ప్రతీకారం, ద్వేషం మొదలైనవి పోతాయి.
12. గౌరవం, ప్రేమ, వాత్సల్యం, అభిమానం, బంధుత్వాలు, స్నేహాలు మొదలైనవి పెరుగుతాయి.
Exam Tips:
a) పది వాక్యాలు స్పష్టంగా సంఖ్యలతో రాయండి; ప్రతి వాక్యంలో ఒక ప్రయోజనం ఉండాలి.
b) సమాజానికి కలిగే మార్పులను (స్నేహం, శాంతి, పేదరికం తగ్గడం) వరుసగా చెప్పండి.
Question 2: పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
Answer:
శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో “నీ కులాన్ని, రాజ్యాన్ని నిలబెట్టుకో. ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. మూడు లోకాలనూ మూడడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. నా మాట విను. ఈ దానం గీనం వద్దు” అని మేలుకోరి చెప్పగా, క్షణకాలం కళ్ళుమూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
‘ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే. నేను ఈ లోకంలో అర్థమూ, కామమూ, కీర్తీ, జీవనోపాయమూ ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇచ్చినమాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా మోస్తాను. కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వారికి మేలైన మార్గాలు.
రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా ! ఆచార్యా ! పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి. ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొనిపోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా !
ఎడతెగని యజ్ఞాలు చేసినా, పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడటానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి ? నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే ! నేను ఆడినమాట తప్పను. జరగవలసింది జరగనీ ! భయం లేదు. వచ్చినవాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే ! ఎందుకు పలుమాటలు ? నా నాలుకకు మారుమాట రాదు.
బాగా బ్రతికినా, పెక్కుకష్టాలకు గురియైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికీ చేటువచ్చినా, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాటతప్పలేరు.
బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ఆ సందర్భంలో భర్తసైగ గమనించి, బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి “ఓ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది ఇస్తాను. నీ పాదాలు కడుగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి ?” అన్నాడు.
అనగానే బలిచక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేదీ, కలకాలం మేలు కల్గించేదీ, అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైనదీ, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేదీ అయిన కుడిపాదాన్ని కడిగాడు. అలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు.
బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. “బ్రాహ్మణుడవు, విష్ణుస్వరూపుడవూ, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను” అని పలికి, “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే ధారపోశాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షిన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులూ కళకళలాడినాయి. పంచభూతాలు “బళిబళి” అని పొగిడినాయి.
Exam Tips:
a) సారాంశాన్ని సంఘటనల క్రమంలో రాయండి: శుక్రుని హెచ్చరిక → బలి సమాధానం → పాదప్రక్షాళన → దానం.
b) ‘సొంతమాటల్లో’ అన్నారు కాబట్టి పద్యాలను అలాగే కాపీ చేయకుండా సరళ వచనంలో రాయండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయడం
Question 1: ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి.
Answer:
నేటికీ మన సమాజం ఈ విధంగా మంచిగా ఉందంటే కారణం, ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కల్గిన వారు నేటి సమాజంలో ఉండటమే. కాబట్టి ఆడిన మాట తప్పటం కన్నా మరణించటం మేలు. దానగుణం అన్ని గుణాల్లో గొప్పది.
ఆడినమాట తప్పకపోవడం – నినాదాలు :
1. ఆడి తప్పకండి – పలికి బొంకకండి.
2. ఇచ్చినమాట నిలబెట్టుకొండి – నీతిగా బ్రతకండి.
3. మితంగా మాట్లాడండి – అమితంగా విలువివ్వండి.
4. మాటమీద నిలబడండి – పౌరుషంగా బ్రతకండి.
సూక్తులు :
1. ఆడి తప్పరాదు. పలికి బొంకరాదు.
2. మాటకు ప్రాణం సత్యం.
3. మానధనులు మాట తప్పరు.
4. ప్రాణం కంటే మాట విలువైనది.
దానగుణం – నినాదాలు :
1. రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి.
2. అవయవదానం ప్రోత్సహించండి – మరణం తర్వాతా జీవించండి.
3. విద్యాదానం చేయండి – వివేకం పెంచండి.
4. అన్నదానం చేయండి – జన్మను ధన్యం చేసుకోండి.
Exam Tips:
a) నినాదాలు చిన్నవిగా, ప్రాస కలిగి ఉండాలి (‘రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి’).
b) రెండు అంశాలకూ (మాట నిలబెట్టుకోవడం, దానగుణం) వేర్వేరుగా నినాదాలు, సూక్తులు రాయండి.
III. భాషాంశాలు – పదజాలం
Question 1: క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట = మాట ఇచ్చి తప్పుట
ఆ) కుఱుచగుట = పొట్టియగుట
ఇ) చేతులొగ్గు = చేతులు వంచి
Answer:
అ) పలికి లేదనుట కంటె మించిన పాపము లేదు.
ఆ) కుఱుచైనంత మాత్రమున మన విలువేమీ తగ్గదు.
ఇ) కర్ణుడు ఇంద్రునకు చేతులొగ్గి దానం చేసాడు.
Exam Tips:
a) వాక్యం ఇచ్చిన పదానికి అర్థం సరిగ్గా వచ్చేలా ఉండాలి; పదాన్ని వాక్యంలో తప్పక వాడండి.
b) ప్రతి వాక్యం చిన్నదిగా, తప్పులు లేకుండా రాయండి.
Question 2: క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) నీరజభవుడు
ఆ) త్రివిక్రముడు
Answer:
అ) నీరజభవుడు = విష్ణువు నాభికమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మ).
ఆ) త్రివిక్రముడు = మూడడుగులచే ముల్లోకములను కొలిచినవాడు (విష్ణువు).
Exam Tips:
a) వ్యుత్పత్త్యర్థంలో పదం ఎలా ఏర్పడిందో చెప్పాలి: నీరజ (నీటిలో పుట్టినది = పద్మం) + భవుడు (పుట్టినవాడు).
b) త్రి (మూడు) + విక్రమ (అడుగు) అని విడదీసి అర్థం చెప్పండి.
Question 3: క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.
అ) జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.
Answer:
అ) జలము – నీరు, వారి, అంబువు, ఉదకం, పయస్సు, జీవనం, సలిలము, తోయం
ఆ) యశః – కీర్తి, యశస్సు, సమజ్ఞ, భగము, శ్లోకము, ప్రతిష్ఠ, ఖ్యాతి, పేరు
Exam Tips:
a) పర్యాయపదాలు కనీసం ఐదు రాయండి; ప్రశ్నలో గీత గీసిన పదం మాత్రమే తీసుకోండి.
b) పదానికి అర్థం కాని మాటలు (వేరే అర్థాలు) చేర్చకుండా జాగ్రత్త పడండి.
Question 4: క్రిందివాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
అ) సిరి
ఆ) విష్ణువు
ఇ) ధర్మము
ఈ) బ్రహ్మ
Answer:
అ) సిరి (వికృతి) = శ్రీ (ప్రకృతి)
ఆ) విష్ణువు (ప్రకృతి) = వెన్నుడు (వికృతి)
ఇ) ధర్మము (ప్రకృతి) = దమ్మము (వికృతి)
ఈ) బ్రహ్మ (ప్రకృతి) = బమ్మ (వికృతి)
Exam Tips:
a) ప్రకృతి = సంస్కృత/మూల రూపం, వికృతి = తెలుగులో మారిన రూపం అని గుర్తుంచుకోండి (శ్రీ → సిరి, బ్రహ్మ → బమ్మ).
b) ఇచ్చిన పదం ప్రకృతియా వికృతియా గుర్తించి, ఎదుటి రూపాన్ని రాయండి.
Question 5: క్రింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కులము
ఆ) క్షేత్రము
ఇ) హరి
ఈ) చిత్రము
Answer:
అ) కులము = వంశం, జాతి, శరీరం, ఇల్లు, సమూహం
ఆ) క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి (పొలం), శరీరం, మనస్సు
ఇ) హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, సింహం, కోతి, సూర్యుడు, చంద్రుడు, యముడు, వాయువు
ఈ) చిత్రము = అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, పదచమత్కారం
Exam Tips:
a) నానార్థాలు అంటే ఒకే పదానికి ఉన్న వేర్వేరు అర్థాలు; పర్యాయపదాలతో కలపకండి.
b) ప్రతి పదానికి కనీసం నాలుగు అర్థాలు రాయండి.
III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు
Question 1: క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి సంధిపేరు రాయండి.
ఉదా : రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది.
అత్యద్భుతం = అతి + అద్భుతం (యణాదేశసంధి)
అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు.
ఆ) అభ్యాగతులకు దానం చేయడం మంచిది.
ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు.
ఈ) అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి.
Answer:
అ) గర్వోన్నతి = గర్వ + ఉన్నతి (గుణసంధి)
ఆ) అభ్యాగతులకు = అభి + ఆగతులకు (యణాదేశ సంధి)
ఇ) వదాన్యోత్తముడు = వదాన్య + ఉత్తముడు (గుణసంధి)
ఈ) అణ్వాయుధాలు = అణు + ఆయుధాలు (యణాదేశ సంధి)
Exam Tips:
a) సంధి విడదీసేటప్పుడు అచ్చుల కలయికను చూడండి: అ + ఉ = ఓ (గుణసంధి), ఇ + ఆ = య్ + ఆ (యణాదేశ సంధి).
b) సంధి పేరు తప్పనిసరిగా రాయండి; విడదీసిన రూపానికి, పేరుకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి.
Question 2: క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.
అ) జీవధనములు
ఆ) యువతీయువకులు
ఇ) దశదిక్కులు
ఈ) భూతప్రేతములు
Answer:
అ) జీవధనములు – జీవమును, ధనమును (ద్వంద్వ సమాసము)
ఆ) యువతీయువకులు – యువతియును, యువకుడును (ద్వంద్వ సమాసము)
ఇ) దశదిక్కులు – దశ సంఖ్యగల దిక్కులు (ద్విగు సమాసము)
ఈ) భూతప్రేతములు – భూతమును, ప్రేతమును (ద్వంద్వ సమాసము)
Exam Tips:
a) విగ్రహవాక్యంలో ‘ను’ ‘ను’ ఉంటే ద్వంద్వ సమాసం, సంఖ్య మొదట ఉంటే ద్విగు సమాసం అని గుర్తుంచుకోండి.
b) సమాసం పేరును పూర్తిగా రాయండి (ద్వంద్వ సమాసము).
Question 3: క్రింది పద్య పాదాలను గణవిభజన చేసి, ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను రాయండి.
అ) తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
ఆ) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా
Answer:
అ)
| గణం | స | భ | ర | న | మ | య | వ |
| గురులఘువులు | IIU | UII | UIU | III | UUU | IUU | IU |
| అక్షరాలు | తెలగా | ణమ్మున | గడ్డిపో | చయును | సంధించెన్ | కృపాణ | మ్ము ! రా |
ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణములు :
1. పై పద్యపాదమున స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా వచ్చినాయి.
2. యతి 1 – 14 (తె – ధి).
3. ప్రాస నియమం కలదు.
4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.
ఆ)
| గణం | న | జ | భ | జ | జ | జ | ర |
| గురులఘువులు | III | IUI | UII | IUI | IUI | IUI | UIU |
| అక్షరాలు | అనయ | ముదోష | మేపరు | లయందు | కనుంగొ | నిపల్కు | నట్టియా |
ఇది చంపకమాల పద్యపాదము.
లక్షణములు :
1. పై పద్యపాదమున న, జ, భ, జ, జ, జ, ర అను గణములు వరుసగా వచ్చినాయి.
2. యతి : 1 – 11 (అ – య).
3. ప్రాస నియమం కలదు.
4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.
Exam Tips:
a) గణవిభజనలో ప్రతి గణానికి లఘు (I), గురు (U) గుర్తులు వేసి గణం పేరు రాయండి (స, భ, ర, న, మ, య, వ).
b) లక్షణాల్లో గణాల వరుస, యతిస్థానం, ప్రాస నియమం, పాదాల సంఖ్య తప్పక రాయండి.
త్రికసంధి
క్రింది పదాలను గమనించండి.
అ) అచ్చోటు → ఆ + చోటు
ఆ) ఇవ్విధము → ఈ + విధము
ఇ) ఎక్కాలము → ఏ + కాలము
పై పదాలలో పూర్వపదాల్లో ఆ, ఈ, ఏ లు ఉన్నాయి. ఇవి సర్వనామాలు. ఆ, ఈ, ఏ లను ‘త్రికం’ అంటారు. త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.
ఆ + చోటు → ఆ + చ్చోటు
ఈ + విధము → ఈ + వ్విధము
ఏ + కాలము → ఏ + క్కాలము
త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమౌతుంది. ఇలా ద్విత్వం (ద్విరుక్తం) పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది.
అ) ఆ + చ్చోటు → అచ్చోటు
ఆ) ఈ + వ్విధము → ఇవ్విధము
ఇ) ఏ + క్కాలము → ఎక్కాలము
ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమౌతుంది. ఆచ్ఛికం : అచ్చ తెలుగు పదం.
బహుళం : ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యకార్యం రావడం – ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే ‘బహుళం’ అంటారు.
ప్రాజెక్టు పని
Question 1: వివిధ పండుగల సందర్భంగా వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకోండి. సమాచారం సేకరించండి. పట్టికను రాయండి. నివేదిక ప్రదర్శించండి.
| మతం | సందర్భం | దానం |
Answer:
| పండుగ | దానధర్మాల విశిష్టత / ప్రత్యేకత | |
| 1) సంక్రాంతి | పెద్దల పండుగ | బియ్యం దానం చేస్తారు. |
| 2) బోనాలు (మహంకాళి జాతర) | కుండలతో (బోనాలు) విశిష్టత | పూలు, పండ్లు |
| 3) బతుకమ్మ | పార్వతీదేవి, గౌరీదేవి పూజ | – |
| 4) ఎడుపాయల జాతర | మెదక్ జిల్లాలో మహాశివరాత్రినాడు జరుగుతుంది. | – |
| 5) సమ్మక్క – సారక్క జాతర | మేడారం పల్లెలో జరుగుతుంది. వరంగల్ జిల్లాలో జరుగుతుంది. | – |
| 6) శ్రీరామనవమి | భద్రాచలంలో, వాడవాడలా రంగరంగ వైభవంగా జరుగుతుంది | పేదవారికి దానం |
| 7) హోలీ పండుగ | రంగులు జల్లుకుంటారు. వసంతోత్సవం అంటారు. | – |
| 8) రంజాన్ | ముస్లింల పెద్ద పండుగ | పేదవారికి వస్త్రదానం |
Exam Tips:
a) పట్టికలో పండుగ, ఏ మతం, ఏ దానం అనే కాలమ్‌లు స్పష్టంగా ఉండాలి.
b) ప్రతి పండుగకు ఒక్క వాక్యంలో దానధర్మ విశేషం రాసి, చివర నివేదికగా సంక్షిప్తంగా ముగించండి.
విశేషాంశాలు
1. అష్టాదశ పురాణాలు : 1) మత్స్య పురాణం 2) మార్కండేయ పురాణం 3) భాగవత పురాణం 4) భవిష్య పురాణం 5) బ్రహ్మ పురాణం 6) బ్రహ్మవైవర్త పురాణం 7) బ్రహ్మాండ పురాణం 8) విష్ణు పురాణం 9) వరాహ పురాణం 10) వామన పురాణం 11) వాయు పురాణం 12) అగ్ని పురాణం 13) నారద పురాణం 14) పద్మ పురాణం 15) లింగ పురాణం 16) గరుడ పురాణం 17) కూర్మ పురాణం 18) స్కాంద పురాణం.
2. శిబిచక్రవర్తి : గొప్పదాత, దయాగుణం కలవాడు. ఈయన దానగుణాన్ని పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్ని డేగ, పావురాల రూపాలతో వస్తారు. పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి శిబి తన శరీరభాగాన్ని కోసి ఆహారంగా ఇస్తాడు. తన శరీరాన్ని ఎంత కోసి సమర్పించినా అది పావురం బరువుతో సరితూగదు. అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే ఆహారంగా అర్పించుకుంటాడు. అంతటి మహాదాత అయిన శిబిని కీర్తించి ఇంద్రాగ్నులు అతనికి తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు.
సూక్తి : తన ఆకలిని సహించుకునే తపోధనుడి శక్తికన్నా, ఇతరుల ఆకలి తీర్చే దానశీలి శక్తి మిన్న !
ప్రతిపదార్థ తాత్పర్యాలు – పద్యాలు
(పోతన రచించిన భాగవతం, అష్టమ స్కంధంలోని ‘వామన చరిత్ర’ నుండి గ్రహించిన పద్యాలు, వాటి తాత్పర్యాలు)
1. మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు ? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం ; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా !
తాత్పర్యము : దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా ? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
వ. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు యశస్వి క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యిట్లనియె.
తాత్పర్యము : అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలుకోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లన్నాడు.
2. సీ.
నిజమానతిచ్చితి నీవు మహాత్మక ! మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థిలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు ? పలికి లేదనుకంటెఁ బాప మెద్ది ?
‘యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని సత్యహీనుని మోవఁజాల’ ననుచుఁ
తే.
బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరమున నుండి తిరుగకఁ జచ్చుకంటెఁ
బలికి బొంకక నిజమునఁ బరఁగుకంటెఁ
మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె ?
తాత్పర్యము : ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసినవానినైనా భరిస్తాను. కాని ఆడిన మాట తప్పినవానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైనవాళ్ళకు మేలైన మార్గాలు.
3. క.
ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే !
తాత్పర్యము : రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తీ దొరికే అదృష్టం అరుదే కదా !
4. శా.
కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం బొందరే ?
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !
తాత్పర్యము : ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !
5. క.
ఉడుగని క్రతువుల వ్రతములఁ
బొడగనఁ జననట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడి నఁట ననుబోఁటికి
నిడరాదె మహానుభావ ! యిష్టార్థంబుల్
తాత్పర్యము : మహానుభావా ! ఎడతెగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యంకాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడంకంటే నా వంటి వానికి ఇంకేం కావాలి ?
6. మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము. కానిమ్ము పో :
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా ! ధీవర్య! యేటికిన్ ?
తాత్పర్యము : ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?
7. ఆ.
బ్రదుకవచ్చుఁ గాక బహుబంధనములైన
వచ్చుఁ గాక లేమి వచ్చుఁ గాక
జీవధనములైనఁ జెడుఁ గాక పడుఁ గాక
మాట దిరుగలేరు మానధనులు
తాత్పర్యము : మానధనులైన వారు బాగా బ్రతికితే బ్రతకవచ్చు. చాలా చిక్కులైనా ఎదుర్కోవలసి రావచ్చును. దరిద్రం వస్తే రావచ్చు. ప్రాణాలు, సంపద కూడా నాశనం కావచ్చు. మరణం కూడా సంభవించవచ్చు. అయినా ఎట్టి పరిస్థితులలోనూ మాట తప్పరు.
వ. అయ్యవసరమున
(ఆ + అవసరమున = ఆ సమయంలో)
8. ఆ.
దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్లు గడుగ వర హేమఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిగి.
తాత్పర్యము : అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖమూ, మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికై శ్రేష్ఠమైన బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.
వ. అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె.
తాత్పర్యము : అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు.
9. క.
రమ్మా ! మాణవకోత్తమ !
లెమ్మా ! నీ వాంఛితంబు లే దన కిత్తుం
దెమ్మా ! యడుగుల నిటు రా
నిమ్మా ! కడుగంగవలయు నేఁటికిఁ దడయన్ ?
తాత్పర్యము : ఓ ఉత్తమ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను. నీ పాదాలు కడుగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి ?
10. క.
సురలోక సముద్ధరణము
నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.
తాత్పర్యము : వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైంది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు.
వ. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు సేసి.
తాత్పర్యము : పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన ‘సంకల్పాన్ని’ చెప్పాడు.
11. శా.
‘విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి’ యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి ‘బ్రహ్మ
ప్రీత మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁ గన్.
తాత్పర్యము : బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. “బ్రాహ్మణుడవూ, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవూ, విష్ణు స్వరూపుడవూ, వేదాల ప్రమాణతను తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.
12. క.
బలి చేసిన దానమునకు
నలినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
గలకల మని దశ దిక్కులు
బళి బళియని పొగడె భూత పంచకమనఘా !
తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులూ, పంచభూతాలూ “బళి బళి” అని పొగిడాయి.
పాఠం నేపథ్యం / ఉద్దేశం
విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తిసామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురౌతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు.
ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. బలి నర్మదానదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట యిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని, దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమత్ భాగవతం, అష్టమ స్కంధంలోని “వామన చరిత్ర” లోనిది.
కవి పరిచయం
కవి పేరు : బమ్మెర పోతనామాత్యుడు.
గ్రహింపబడిన గ్రంథం : బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని ‘వామన చరిత్ర’ లోనిది.
పోతన తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసన
కాలము : 15వ శతాబ్దము.
జన్మస్థలము : బమ్మెర గ్రామము, పూర్వపు వరంగల్ జిల్లా.
ఇతర రచనలు : వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం, ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం.
అంకితం : మానవమాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం ఇవ్వనన్నాడు. భగవంతుడిచ్చిన కవితాశక్తితో రచించిన భాగవతాన్ని శ్రీరామునికే అంకితం ఇస్తానన్నాడు. శ్రీరామచంద్రునికే అంకితం ఇచ్చాడు.
అనువాదం : పోతన కొన్ని భాగాలను పెంచి వర్ణించాడు. కొన్నిటిని ఉన్నవి ఉన్నట్లుగా అనువదించాడు.
బిరుదు : పోతనకు ‘సహజ పండితుడు’ అని బిరుదు కలదు. అంటే పుట్టుకతోనే ఆయనకు పాండిత్యం, కవిత్వము అల్లగల శక్తి ఉన్నాయి. పోతన ‘భక్తకవి’.
ప్రత్యేకత : పండిత పామర జనరంజకంగా బమ్మెర పోతన రచన ఉంటుంది. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం, వామన చరిత్ర మొదలైన వాటిలో పద్యాలు నోటికి రాని తెలుగువారు లేరు.
అలంకారాలు : శబ్దాలంకారాలు ఎక్కువగా ప్రయోగించాడు. అర్థాలంకారాలు కూడా సందర్భానుసారంగా ప్రయోగించాడు.
నివాసం : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామ నివాసి.
వృత్తి : వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాడు. అంతేకాని, రాజాస్థానాలకు వెళ్ళలేదు. సన్మానాలను తిరస్కరించాడు.
ప్రవేశిక
ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తిమేరకు దానం చేయడం, తన యింటికి వచ్చిన అతిథి, అభ్యాగతులను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు.
మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది.
ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ ‘వామనుని’ కోరికమేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం.
ప్రక్రియ – ప్రాచీన పద్యం (పురాణం)
ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం’ అనేవి పురాణ లక్షణాలు. పురాణాలు 18. వీటిలో భాగవత పురాణం ఒకటి. పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 10 Telugu Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam
Textbook Solutions for Class 10 Telugu Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam
Explore reliable textbook solutions for Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 01 Danasheelamu (Generosity of Bali) - Pothana's Bhagavatam with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము in both English and Hindi medium.
Yes, you can download the entire TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము in printable PDF format for offline study on any device.