TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు

Download TS Board Solutions for Class 9 Telugu Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu)

Review structured textbook solutions for Class 9 Telugu Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

ప్రారంభ ప్రశ్నలు

Question 1: ఈ మాటలు ఎవ్వరంటుండవచ్చు?

Answer:

ఈ మాటలు విదేశాల్లో తమ పిల్లలు ఉంటున్న ముసలి తల్లిదండ్రులు అంటూ ఉండవచ్చు.

Exam Tips:

a) పాఠం ప్రారంభంలోని మాటల సందర్భాన్ని పట్టి ఒక్క వాక్యంలో జవాబు రాయండి.

 

Question 2: పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ?

Answer:

పిల్లలు దగ్గరలో లేకపోవడం వల్ల, వారికి ఆలనాపాలనా చూసే దిక్కు ఉండదు. వారిని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళే దిక్కు ఎవరూ ఉండరు. వారికి కావలసిన వారు ఎవరూ దగ్గరలేక, వారు బెంగతో బాధపడుతూ ఉంటారు. వారు కమ్మని తమ బిడ్డల పలుకరింపుకై, ఎదురుచూస్తూ ఉంటారు.

Exam Tips:

a) ఆలనాపాలనా లేకపోవడం, వైద్యం అందకపోవడం, బెంగ – ఈ మూడు అంశాలు రాయండి.

 

Question 3: మీరు ఇటువంటి వాళ్ళను ఎవరినైనా చూశారా ?

Answer:

మా ప్రక్క ఇంటి తాతగారు, బామ్మగారు ఇలాగే ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారి అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరు. వారి అమ్మాయి జపాన్లో ఒక పెద్ద డాక్టరుకు భార్య. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది.

Exam Tips:

a) ఇది అనుభవ ప్రశ్న – మీ సొంత పరిశీలనను ఒకటి రెండు వాక్యాల్లో రాయండి.

 

Question 4: వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ?

Answer:

వారి పట్ల మనం జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. వారిని తీయగా తాతగారూ, బామ్మగారూ అంటూ పలకరించాలి. అప్పుడప్పుడు వారితో తీయగా కబుర్లు చెప్పాలి. వారి యోగక్షేమాలు తెలిసికోవాలి. వారి అవసరాలను తెలుసుకొని, వాటిని వారికి తెచ్చి పెట్టాలి. ముఖ్యంగా వారిని ప్రేమగా వరుసలు పెట్టి పిలువాలి.

Exam Tips:

a) పలకరించడం, యోగక్షేమాలు తెలుసుకోవడం, అవసరాలు తీర్చడం – మూడు పనులను పేర్కొనండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 127)

Question 1: టి.వి. ప్రకటన చూసి, గంగాధరరావు ఎందుకు ఉలిక్కిపడ్డాడు?

Answer:

తాను కనబడడం లేదనీ, ఎవరికైనా కనబడితే తమకు తెలియజేయమనీ, గంగాధరరావు గురించి టి.వి.లో ప్రకటన వచ్చింది. గంగాధరరావు ఇంటి నుండి భజన్లాల్ నిలయానికి వచ్చి చాలారోజులయ్యింది. తన గురించి తనవారు, చాలాకాలం వరకూ విచారణ చేయించకుండా ఉండడం, గంగాధరరావుకు ఆశ్చర్యం కల్గింది. తనవారు తనపై చూపించే నిర్లక్ష్యానికి, గంగాధరరావు ఉలిక్కిపడ్డాడు.

Exam Tips:

a) తన వారు ఇంతకాలం విచారించకపోవడం, నిర్లక్ష్యం – ఉలిక్కిపాటుకు కారణాలుగా చెప్పండి.

 

Question 2: ఆఫీసరు అంటే ఎట్లా ఉండాలి ?

Answer:

ఆఫీసర్లు సామాన్యంగా అధికారదర్పంతో ఉంటారు. ఆ అధికారదర్పంతో వారు న్యాయాన్యాయాలను గమనింపరు. వారి కళ్ళు పై చూపులేకాని, క్రిందికి చూడవు – కాని గంగాధరరావు వంటి అధికారులు, వారి క్రింది ఉద్యోగులను ఆదరాభిమానాలతో చూసే వారు. వారి కిందివారికి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసేవారు.

Exam Tips:

a) అధికారదర్పం లేకుండా, కింది ఉద్యోగులను ఆదరించే ఆఫీసరే ఆదర్శమని గంగాధరరావు ఉదాహరణతో రాయండి.

 

Question 3: గంగాధరరావు చేసిన పనులను బట్టి అతని వ్యక్తిత్వాన్ని గురించి చెప్పండి.

Answer:

గంగాధరరావు గారు యోగ్యుడు. అధికారదర్పం లేనివాడు. తన కింది ఉద్యోగులను ఆదరాభిమానాలతో చూసేవాడు. ఆయన న్యాయం తప్పనివాడు. తన కిందివారికి ఎవరికీ అన్యాయం జరుగనిచ్చేవాడు కాదు. గంగాధరరావు దానశీలి. సజ్జనుడు. ఎంతో మందికి సాయం చేశాడు. వారి ఉద్యోగాలు నిలబెట్టాడు.
బంధుప్రియుడు. బావమరది కూతురు పెళ్ళికి కట్నాన్ని తాను ఇచ్చాడు. బీదవాడైన స్నేహితుడి కూతురుని, కోడలుగా చేసుకున్నాడు. ఉభయ ఖర్చులూ పెట్టి ఆ పెళ్ళి చేయించాడు. గంగాధరరావు స్నేహశీలి. మిత్రులకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఈయన సజ్జనుడు.

Exam Tips:

a) దానశీలి, బంధుప్రియుడు, స్నేహశీలి వంటి గుణాలకు ఒక్కొక్క సంఘటనను ఆధారంగా చూపండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 129)

Question 1: గంగాధరరావు ఆశ్రమానికి ఎందుకు ఫోన్ చేశాడు ?

Answer:

గంగాధరరావు పదవీ విరమణ చేసిన ఎక్సైజు కమిషనరు. ఈయన రిటైరయిన తరువాత, ఆయనను ఇంట్లో ఎవరూ పట్టించుకోడం మానివేశారు. కొడుకు, కోడలు, చివరకు భార్య సహితం ఆయనను నిర్లక్ష్యంగా చూసింది. ఆయనకు సమయానికి కాఫీ కూడా వారు ఇవ్వలేదు. దానితో గంగాధరరావు “భజన్లాల్ నిలయం” అనే అనాథాశ్రమంలో చేరిపోదామని నిశ్చయించుకున్నాడు. వివరాలు తెలిసికొనేందుకు, గంగాధరరావు ఆశ్రమానికి ఫోన్ చేశాడు.

Exam Tips:

a) ఇంట్లో నిర్లక్ష్యం → ఆశ్రమంలో చేరాలనే నిర్ణయం → ఫోన్ – ఈ క్రమంలో రాయండి.

 

Question 2: “ఇక స్వంతిల్లేమిటి? స్వజనమేమిటి?” అని గంగాధరరావు అనడంలో ఉద్దేశమేమిటి?

Answer:

గంగాధరరావు ఎక్సైజు కమిషనరుగా పనిచేశాడు. ఉద్యోగం చేసే రోజుల్లో ఆయనకు ఏది కావలసినా, క్షణాల్లో తనవారు ఆయనకు అందించేవారు. ఇప్పుడు ఆయన పదవీవిరమణ చేశాడు.
ఇప్పుడు వేళకు ఆయనకు కాఫీ లేదు. ఇంటి వాళ్ళకు తీరిక ఉన్నప్పుడే భోజనం పెడుతున్నారు. ఒక్కొక్క రోజు స్నానానికి వేడినీళ్ళు కూడా పెట్టడం లేదు.
ఆయనకు దాహం వేస్తున్నా మంచినీళ్ళు సమయానికి తెచ్చి ఇవ్వడం మానివేశారు. ఇంట్లో తనవారందరూ ఉన్నా, ఆయనకు జబ్బు చేస్తే డాక్టర్ని పిలవడానికి వెనుకాడుతున్నారు.
పై పరిస్థితులు చూసి విసుగు వచ్చిన గంగాధరరావు తాను ఉండేది స్వంత ఇల్లు అయినా, తనవారు అందరూ ఇంట్లోనే ఉన్నా ప్రయోజనం లేకపోయిందని బాధతో, నిరుత్సాహంతో ఈమాట అన్నారు.

Exam Tips:

a) ఉద్యోగంలో ఉన్నప్పటి ఆదరణను, విరమణ తర్వాతి నిర్లక్ష్యంతో పోల్చి రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 131)

Question 1: “ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించడానికి ఎవరి తరంకా”దని గంగాధరరావు ఎందుకన్నాడు?

Answer:

గంగాధరరావు ఆవరణలో తిరగాలని బయటికి వచ్చాడు. నల్లటి మబ్బు ఆకాశమంతా కప్పివేసింది. అంతట్లో గాలికి ఆ నల్లని మబ్బులు విచ్చిపోయి, తెలతెల్లగా, లేత నీలం రంగులో తునాతునకలై పరుగులు తీశాయి. మబ్బులు ప్రళయం ముంచుకు వస్తుందా అన్నట్లు కమ్మి, ఇట్టే తేలిపోయాయి. ఆ ప్రకృతిని, దాని అందాన్ని చూసిన గంగాధరరావు, ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించడం, ఎవరితరం కాదన్నాడు.

Exam Tips:

a) మేఘాల రంగులు, వాటి మార్పులను పాఠంలోని సన్నివేశం నుండి వర్ణించండి.

 

Question 2: “నిజంగా మనిషికి కావలసింది ఏమిటి?” ఆలోచించి చెప్పండి.

Answer:

ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు, నిజంగా మనిషికి కావాలి. ‘తీయటి పలకరింపు’ మనిషికి కావాలి.

Exam Tips:

a) ‘తీయని పలకరింపు’ అనే పాఠం పేరుతో జవాబును ముగించండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: ముసలివారు వృద్ధాశ్రమాలకు వెళ్ళడానికి గల కారణాలు చర్చించండి.

Answer:

నేడు కన్న కొడుకులు, కూతుళ్ళు ముసలివారిని పట్టించుకోడం మానివేశారు.
కోడళ్ళూ, కొడుకులూ వారిని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు.
ముసలివారు తమ ఆస్తిలో భాగం తమకు సరిగా పంచి ఇవ్వలేదనీ, ముసలివారు, ఆస్తులు కూడబెట్టలేదనీ, ముసలివారిని పిల్లలు తప్పుపడుతున్నారు. మనుమలు, మనుమరాండ్రు సహితం, ముసలివారికి చాదస్తం ఎక్కువని, వారివి ఛాందసాచారాలనీ ఈసడిస్తున్నారు.
వారి పిల్లలు విదేశాల్లోనూ, దూరప్రాంతాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ముసలివారు శక్తిలేక, తమ పనులు తాము చేసికోలేకపోతున్నారు. కొడుకులూ, కోడళ్ళూ వారికి సాయపడడంలేదు. వేళకు కొంచెం కాఫీ, భోజనం కూడా వారికి ఇవ్వడం లేదు.
ముసలివారిని డాక్టర్ల వద్దకు పిల్లలు తీసుకువెళ్ళడం లేదు. వారికి కావలసిన మందులు తెచ్చి ఇవ్వడం లేదు. అందువల్లనే ముసలివారు వృద్ధాశ్రమాలకు వెడుతున్నారు.

Exam Tips:

a) నిర్లక్ష్యం, సూటిపోటి మాటలు, ఆస్తి గొడవలు, పిల్లలు దూరంగా ఉండడం – కారణాలను వేర్వేరు పేరాలుగా రాయండి.

 

Question 2: పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరి గురించి చెప్పినవో గుర్తించి, రాయండి.
అ) చెట్టు కింద ఒక్కరూ కూర్చున్నారేం ?
ఆ) సంసార బాధ్యతలు లేవు.
ఇ) ఆ చీరలూ, ఆ నగలూ ఎంత వైభోగంగా బతికింది.
ఈ) ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న పట్టుదల.
ఉ) ఫిక్స్డ్ డిపాజిట్ తనకిస్తే పండుగకు వస్తా.
ఊ) మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి.
ఎ) ఈ జబ్బువస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు ?

Answer:

అ) గంగాధరరావు
ఆ) విమల
ఇ) సావిత్రమ్మ
ఈ) కోడలు
ఉ) కూతురు
ఊ) మనవడు
ఎ) పుత్రరత్నం (కొడుకు)

Exam Tips:

a) పాత్రల పేర్లు/సంబంధాలు (భార్య, కోడలు, కూతురు, మనవడు, కొడుకు) కథలో ఎవరికి వర్తిస్తాయో జ్ఞాపకం చేసుకోండి.

 

Question 3: కింది వచనకవిత చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
ఇల్లంటే
అమ్మఒడి
ఇల్లంటే
మమతలు పల్లవించే యెద సడి
ఇల్లంటే
ఆత్మీయతల సందడి
ఇల్లంటే
మనల్ని మనం పునశ్చరణ చేసుకునే బడి
ఇల్లంటే
ప్రేమాభిమానాల సెలయేళ్ళ అలజడి
ఇల్లంటే
ఊరడింపుల రాబడి
స్వార్థం ఎండమావులవెంట పరుగులు పెడ్తూ
చలిచెలిమె వంటి
ఇల్లును దూరం చేసుకుంటే
తల్లివంటి ఇల్లు
మనసు చిన్నబుచ్చుకుంటుంది
అక్కడ నీళ్ళింకిపోతే –
తరతరాలకు ఆ తడిలేని జీవితం శాపంగా పరిణమిస్తుంది కొడుకా !
అ) ఇచ్చిన వచన కవితలోని ‘అంత్యానుప్రాస’ పదాలను గుర్తించండి.
ఆ) ఇల్లు ఆత్మీయతల సందడి అంటే…
ఇ) ‘ఇల్లు పునశ్చరణ చేసుకునే బడి’ – ఎందుకంటే ?
ఈ) చలిచెలిమెకు, ఎండమావికీ భేదం
ఉ) మనసు చిన్నబుచ్చుకునేది ఎప్పుడు ?

Answer:

అ) అంత్యానుప్రాసలు: 1. అమ్మఒడి 2. యెదసడి 3. సందడి 4. బడి 5. అలజడి 6. రాబడి
ఆ) ‘ఇల్లు ఆత్మీయతల సందడి’ అంటే, ఇంట్లో ఒకరంటే మరొకరికి అంతులేని అభిమానం, ప్రేమ, వాత్సల్యము, ఆర్ద్రత, ఉంటాయని అర్థం.
ఇ) ‘పునశ్చరణ’ అంటే, మళ్ళీ మళ్ళీ చేయడం అని అర్థము. మనం చేసే తప్పొప్పులను తిరిగి సవరించుకొనే బడివంటిది ఇల్లు. బడిలో మనం గురువు ద్వారా, మన తప్పులను సరిదిద్దుకుంటాము. ఇంట్లో కూడా పెద్దల మాటలను విని, మన తప్పులను మనం దిద్దుకొంటామని భావం.
ఈ) ఇల్లు చలిచెలిమె వంటిది. చలిచెలిమెలో (ఊటబావి) నీరు ఎంత తోడినా, తిరిగి ఊరుతుంది. ఎండమావిలో నీరు ఉన్నట్లు భ్రాంతియే కాని, అసలు నీరు ఉండదు. చలిచెలిమెలో నీరు ఊరినట్లు, ఇంట్లో వారికి పరస్పర ప్రేమ ఊరుతుంది. ఎండమావుల వెంట పరుగులు పెట్టడం అంటే స్వార్థంతో లేని సుఖాల కోసం వెంపర్లాడడం.
ఉ) తల్లివంటి ఇంటిని దూరం చేసుకున్నప్పుడు మనసు చిన్నబుచ్చుకుంటుంది. ఇల్లు ప్రేమ, ఆదరణ అనే నీరు ఊరే చలిచెలిమె వంటిది; దానిని దూరం చేసుకుంటే మనసుకు ఆదరణ అనే తడి లేకుండా పోతుంది.

Exam Tips:

a) కవితలో చివరి పంక్తులు (ఇల్లును దూరం చేసుకుంటే…) ఆధారంగా అర్థం రాయండి.
b) అంత్యానుప్రాస అంటే పాదాల చివర అక్షరాలు ఒకేలా రావడం – ‘-డి’ తో ముగిసే పదాలను వెతకండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: గంగాధరరావు ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో, ఊహించి రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

గంగాధరరావు గారు ఉద్యోగం చేసే రోజుల్లో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బంట్రోతులు ఉండేవారు. కొడుకు, నాన్నగారూ! అంటూ ప్రేమగా పలుకరించి, కావలసిన డబ్బు పట్టుకెళ్ళేవాడు. ఇక, కోడలు ఎంతో ప్రేమను నటిస్తూ, సమయానికి ఆయనకు టిఫిన్లు, కాఫీ వగైరా సమకూర్చేది. మనవడు ఆయన వెంట షికారుకు తోడుగా వెళ్ళేవాడు. కూతురు ఆయన పూజకు కావలసిన పూవులు వగైరా తెచ్చి, పూజాద్రవ్యములు సమకూర్చేది.
భార్య సావిత్రమ్మ భర్తపై ప్రేమ కురిపించేది. ‘హొయలు ఒలకపోస్తూ పట్టు చీరలూ, నగలూ ధరించి భర్తకు సకల సౌఖ్యాలూ అందించేది. ఇంట్లో నౌకర్లు ఆయన కనుసన్నల్లో నడుచుకుంటూ, ఆయనకు కావలసిన సమస్త సౌకర్యాలూ సమకూర్చేవారు. సావిత్రమ్మగారు భర్తకు కావలసిన మందులు దగ్గర ఉండి ఇచ్చేది. ఆయన ధరించే బట్టలు, బూట్లు ఒకరోజు ముందే ఆమె సిద్ధంగా ఉంచేది. ఇంట్లో ఆయనకు ఇష్టమైన కూరలే వండేవారు. ఆయనకు నచ్చే టిఫిన్లు మాత్రమే తయారుచేసేవారు. ఇంటివారు అంతా గంగాధరరావు చుట్టూ తిరిగేవారు.

Exam Tips:

a) కొడుకు, కోడలు, మనవడు, కూతురు, భార్య – ప్రతి ఒక్కరి ప్రవర్తనను ఒక్కో వాక్యంలో ఊహించి రాయండి.

 

Question 2: ఇల్లు వదిలి, ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టి గంగాధరరావు ఎలాంటివాడో రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

గంగాధరరావు వ్యక్తిత్వమున్న వ్యక్తి. ఆయనకు గృహస్థ సభ్యుల ప్రేమాదరాలు కావాలి. ఇంటిలో అందరూ ఆయన మంచి, చెడ్డలను చూడాలని ఆయన కోరుకొనేవాడు.
తాను సంపాదించిన ధనాన్ని ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఎందరికో సాయం చేశాడు. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్టు చేశాడు. తన డబ్బు తాను దాచుకున్నాడు. కట్టుకున్న భార్య కూడా తన మంచి, చెడ్డలను చూసుకోకపోవడం, ఆయనకు కోపాన్ని తెప్పించింది. కొడుకూ, కోడలూ తాను బ్రతికి ఉండగానే తాను కట్టించిన ఇంటిని వారిపేర రాయమని ఒత్తిడి చేయడం, ఆయనకు బాధ కల్గించింది.
ఆయనను అందరూ పట్టించుకోవాలి కాని ఆయన వారిని పట్టించుకొనేవాడు కాడు. గంగాధరరావు పట్టుదల మనిషి. అందుకే తనవారందరినీ విడిచిపెట్టి, తాను ఆశ్రమానికి చేరాడు. గంగాధరరావుకు తీయని పలకరింపు కావాలి. అది ఆశ్రమంలో ఆయనకు దొరికింది. తనకు వైద్యం అనవసరం అన్న కొడుకు మాట, ఆయనకు నొప్పి కల్గించింది. మొత్తం మీద గంగాధరరావు కాస్త మొండి మనిషి. తాను అనుకున్న పనిని తాను చేసేవాడు. తన ఇంటివారు తనపై చూపిన అనాదరణను, ఆయన సహించలేకపోయాడు.

Exam Tips:

a) ‘పట్టుదల, ఆత్మాభిమానం, తీయని పలకరింపు కోసం తపన’ – ఈ లక్షణాలను ఉదహరించండి.

 

Question 3: పెంచి, పెద్దచేసి, బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకపోవటం సమంజసమేనా ? మీ అభిప్రాయం రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. తమ కడుపు కట్టుకొని పిల్లలకు కావలసినది సమకూరుస్తారు. పిల్లల చదువులకై, పెళ్ళిళ్ళకై, తమకు ఉన్న ఆస్తులను అమ్ముకొని ఖర్చు చేస్తారు. వారికి శక్తి శరీరంలో ఉన్నంత కాలం బిడ్డల అభివృద్ధికే, తమ సర్వస్వాన్ని ధార పోస్తారు. అటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోడం, వారికి తిండిపెట్టకపోడం చాలా అన్యాయము. దుర్మార్గము. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతోనే, తల్లిదండ్రులు తమ సర్వస్వాన్నీ బిడ్డల చదువులకూ, వారి అభివృద్ధికీ వినియోగిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్ధమైనది. అవ్యాజమైనది. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో వారిని పట్టించుకోకపోడం మహాపాపం.
తల్లిదండ్రులను పట్టించుకోని తనయులను కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. తాను తిన్నదే, తల్లిదండ్రులకూ పెట్టాలి. ప్రేమగా వారిని పలుకరించాలి. తల్లిదండ్రులకు తిండికన్న తీయని పలుకరింపు, వాత్సల్యం ముఖ్యమని నా అభిప్రాయం.

Exam Tips:

a) తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తుచేసి, ‘తిండికన్నా తీయని పలకరింపే ముఖ్యం’ అని ముగించండి.

 

Question 4: పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా విధానం ఎట్లా ఉన్నదో తెలుపండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

ఇల్లిందల సరస్వతీదేవిగారు సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో రచనలు సాగించేవారు. ‘ఈమె తన రచనలో ‘మానవ మనస్తత్వ ధోరణులను చక్కగా విశ్లేషించింది. ఇల్లిందల సరస్వతీదేవి గారి కథాకథనము అద్భుతంగా ఉంది. ప్రస్తుత కథ “తీయని పలకరింపు”లో గంగాధరరావు మనస్తత్వాన్ని రచయిత్రి చక్కగా వెల్లడించింది. గంగాధరరావు మంచితనము, ఉదారగుణము, తోడి ఉద్యోగులతో ఆయన నడవడి ఆయనను ఆదర్శమూర్తిగా నిలబెట్టాయి.
అటువంటి సజ్జనుడిని ఇంట్లో వారు, తలోరీతిగా బాధపెట్టడం, గంగాధరరావు తట్టుకోలేకపోయాడని రచయిత్రి వెల్లడించింది. “ఈ జబ్బు వస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు అనే పుత్రరత్నం” అన్న రచయిత్రి మాటలో హాస్యం తొంగి చూసింది. గంగాధరరావు ఇంట్లో ఆయనను ఇంటి సభ్యులు ఎలా బాధించారో రచయిత్రి చక్కగా చెప్పింది.
గంగాధరరావు భార్యగా మంచి చీరలు, నగలతో వైభోగంగా బతికిన సావిత్రమ్మ, ఆయనను నిర్లక్ష్యం చేయడం చిత్రంగా అనిపిస్తుంది. మానవుల మనస్తత్వాలను అద్భుతంగా ఈ కథ వ్యక్తీకరించింది. వృద్ధాప్యంలో పెద్దవారిని అనాదరంగా చూడడం తప్పని, ఈ కథ ఉపదేశం ఇచ్చింది. అవసరమయితే పెద్దవారు తెగించి వృద్ధాశ్రమాలకు వెళ్ళాలని పెద్దలకు ఈ కథ దారి చూపింది. సరస్వతీదేవిగారి ఈ కథ, చక్కని కథా కథనంతో పాఠకులను ఆకట్టుకుంది.

Exam Tips:

a) సరళత, వాస్తవికత, మానవ మనస్తత్వ విశ్లేషణ – ఈ లక్షణాలను కథలోని ఉదాహరణలతో రాయండి.

 

Question 5: ‘వృద్ధాప్యం మనిషికి శాపం కాకూడదు’ దీని గురించి మీ అభిప్రాయం రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

వయస్సులో ఉన్నప్పుడు శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకుని జీవిస్తున్నప్పుడు, జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. శరీరంలో సత్తువలేనపుడు వారి జీవితం నరకం అయిపోతుంది.
ముసలితనం అందరికీ వస్తుంది. కాబట్టి వయస్సులో ఉన్నప్పుడే ముసలితనానికి సిద్ధం కావాలి. సంపాదించుకొనే మొత్తంలో కొంత డబ్బు, పెన్షన్ ఫండ్లలో మదుపుచేయాలి. వృద్ధాప్యంలో తమ బ్రతుకుకు అవసరమైన డబ్బు నెలనెలా వచ్చేలా చూసుకోవాలి.
అలాగే వారి శరీరానికి చిన్నపాటి వ్యాయామాలు అవసరం. నిత్యం నడుస్తూ, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ, ఆసనాలు వేస్తూ, బలమైన ఆహారం తింటూ ఉంటే, ముసలితనం వారికి నిజంగా శాపం కాదు. అలాగే వృద్ధాప్యంలో దైవ సంబంధమైన పుస్తకాలు చదువుతూ, దైవపూజ చేస్తూ, గుడులకు వెడుతూ ఆధ్యాత్మిక జీవనం సాగించాలి.
వృద్ధుల పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమగా, ఆదరంగా చూడాలి. తాము తల్లిదండ్రులను ఆదరంగా చూస్తే తమ పిల్లలు, తమను ప్రేమగా ఆదరంగా చూస్తారని వారు గుర్తించాలి. యౌవనంలోనే అందరూ వృద్ధాప్య జీవనానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరాలను చక్కని వ్యాయామాలతో, సదాచారాలతో మంచి అలవాట్లతో చక్కదిద్దుకోవాలి.
అలా మంచి ప్రణాళిక ఉంటే, వృద్ధాప్యం మనిషికి నిజంగా శాపం కాదు. మన జీవితాన్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. బిడ్డలను మంచి ప్రవర్తన కలవారిగా, ప్రేమ మూర్తులుగా తీర్చిదిద్దుకోవాలి. అపుడు వృద్ధాప్యం వరప్రసాదం అవుతుంది.

Exam Tips:

a) ముందు జాగ్రత్తలు (పెన్షన్ నిధి, వ్యాయామం, ఆధ్యాత్మికత), పిల్లల బాధ్యత – రెండు భాగాలుగా రాయండి.

 

Question 6: వృద్ధాప్యంలో మనుషులకు ఏమి కావాలి? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ? (పై ప్రశ్నకు బదులుగా)

Answer:

వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.
పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.
భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో,, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు, వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక, తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.

Exam Tips:

a) అవసరాలు (ఇల్లు, తిండి, వైద్యం, ప్రేమ), కుటుంబ సభ్యుల బాధ్యతలు – రెండు జాబితాలుగా రాయండి.

 

Question 7: తీయని పలకరింపు కథను పొడిగించి ఒక మంచి ముగింపును రాయండి.

Answer:

గంగాధరరావు నిత్యం దైవపూజ చేసేవాడు. ఆశ్రమంలో సభ్యులు అందరూ గంగాధరరావు పట్ల మంచి అభిమానం చూపించేవారు. ఒక రోజున హైకోర్టు నుండి గంగాధరరావును గురించి ఎంక్వైరీ చేస్తూ, ఒక గుమాస్తా వచ్చాడు. ఆశ్రమం సూపర్నెంటును కలిశాడు. గంగాధరరావు మాతామహుడి బాపతు పొలం వంద ఎకరాలు గంగాధరరావుకు సంక్రమించాయని, ఆయన ఆర్డర్లు హైకోర్టు నుండి తెచ్చి ఇచ్చాడు. గంగాధరరావు సంతోషించాడు.
దీన జనసేవలో మునిగిపోయాడు గంగాధరరావు. ఒకసారి కలక్టరు వచ్చి, ఆశ్రమంలో సభ పెట్టి ‘దీనబంధు’ అనే బిరుదును గంగాధరరావుకు ప్రభుత్వం తరపున అందచేశాడు. ఈ వార్త పేపర్లో, టీ.వీ.లలో ప్రముఖంగా వచ్చింది. టీ.వీ. ఎక్కువగా చూసే సావిత్రమ్మ ఆ వార్త చూసి, ఇంట్లో అందరికీ చెప్పింది. తాము తప్పు చేశామని అందరూ తీర్మానించుకొని, వెళ్ళి గంగాధరరావు కాళ్ళపై పడ్డారు.
సావిత్రమ్మ కూడా ఆశ్రమంలోనే భర్తతో ఉండాలని నిశ్చయించుకుంది.
గంగాధరరావు కుటుంబ సభ్యుల పశ్చాత్తాపానికి సంతోషించాడు. వారానికి ఒకరోజు కొడుకు, కోడలు, మనుమడు గంగాధరరావు దంపతులతో ఆశ్రమంలోనే గడుపుతున్నారు. కూతురు, అల్లుడు వచ్చారు. గంగాధరరావు తన ఆస్తిలో సగం ఆశ్రమానికి రాసి ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆనందించారు.

Exam Tips:

a) కథను సుఖాంతం చేయండి; కుటుంబ సభ్యుల పశ్చాత్తాపం, గంగాధరరావు సేవ – ఈ రెండూ కనిపించాలి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: కింది పట్టికను పరిశీలించండి. పట్టిక కింద ఇచ్చిన పదాలకు సరిపోయే పర్యాయపదాలు వెతికి రాయండి.
పట్టిక: వృక్షం, నీరు, నిప్పు, నిశ, కాలం, మంచి, సమయం, రజని, ఆవాసం, గగనం, మహీజం, స్థానం, చంద్రుడు, అంబరం, నిజం, వెలుగు, జలం, కట్టె, నిశీథి, సత్యం, తరువు, రేయి, నెలవు, సూర్యుడు
అ) చెట్టు ఆ) ఆకాశం ఇ) నిలయం ఈ) రాత్రి

Answer:

అ) చెట్టు: 1. వృక్షం 2. తరువు 3. మహీజం
ఆ) ఆకాశం: 1. అంబరం 2. గగనం
ఇ) నిలయం: 1. ఆవాసం 2. స్థానం 3. నెలవు
ఈ) రాత్రి: 1. రజని 2. రేయి 3. నిశ 4. నిశీథి

Exam Tips:

a) పట్టికలోని పదాలలో ఒకే అర్థం ఉన్నవాటిని గుర్తించి, ప్రతి పదానికి వాటిని మాత్రమే రాయండి.

 

Question 2: కింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి.
అ) ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువొందారు.
ఆ) అడిగినవారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు.
ఇ) మా తాతయ్య బోనం చేయనిదే బయటికి వెళ్ళడు.

Answer:

అ) అచ్చెరువు (వికృతి) – ఆశ్చర్యము (ప్రకృతి)
ఆ) సాయం (వికృతి) – సహాయం (ప్రకృతి)
ఇ) బోనం (వికృతి) – భోజనం (ప్రకృతి)

Exam Tips:

a) ప్రకృతి = సంస్కృత రూపం, వికృతి = తెలుగులో మారిన రూపం – జవాబులో రెండూ చూపండి.

 

వ్యాకరణాంశాలు

Question 1: కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.
అ) రోజులు + ఐనా ఆ) ఆదర + అభిమానాలు ఇ) లేదనక + ఉండ ఈ) వీలు + ఐతే ఉ) కావలసినవి + అన్నీ ఊ) పగలు + పగలు

Answer:

అ) రోజులైనా (ఉత్వసంధి)
ఆ) ఆదరాభిమానాలు (సవర్ణదీర్ఘ సంధి)
ఇ) లేదనకుండ (అత్వసంధి)
ఈ) వీలైతే (ఉత్వసంధి)
ఉ) కావలసినవన్నీ (ఇత్వసంధి)
ఊ) పట్టపగలు (ఆమ్రేడిత సంధి)

Exam Tips:

a) పూర్వపదం చివర ఉ/అ/ఇ ఉంటే వరుసగా ఉత్వ/అత్వ/ఇత్వ సంధి; సవర్ణాచ్చులు కలిస్తే సవర్ణదీర్ఘ సంధి.

 

Question 2: కింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి, సమాసం పేరు రాయండి.
అ) అధికారం చేత దర్పం ఆ) గది యొక్క తలుపులు ఇ) మంచివైన బట్టలు ఈ) పది సంఖ్యగల గంటలు ఉ) న్యాయమూ, అన్యాయమూ

Answer:

అ) అధికారదర్పం – తృతీయా తత్పురుష సమాసం
ఆ) గదితలుపులు – షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) మంచిబట్టలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) పదిగంటలు – ద్విగు సమాసం
ఉ) న్యాయాన్యాయములు – ద్వంద్వ సమాసం

Exam Tips:

a) ‘చేత’ = తృతీయా, ‘యొక్క’ = షష్ఠీ, సంఖ్య పూర్వపదం = ద్విగు, ‘ఉం’/‘ఊ’ తో కలుపుట = ద్వంద్వ.

 

Question 3: కింది వాక్యాల్లో కర్తరి/కర్మణి వాక్యాలను గుర్తించండి. నియమాలతో సరిపోల్చుకోండి.
అ) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. (కర్తరి)
ఆ) ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. (కర్మణి)
ఇ) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. (కర్తరి)
ఈ) వాళ్ళ భాష మార్పు చేయబడలేదు. (కర్మణి)
ఉ) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి, మళ్ళా రమ్మని పంపించారు. (కర్తరి)
ఊ) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి)
ఋ) ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి)
ౠ) గోడలమీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి)
ఎ) దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి)
ఏ) మేం పెద్దలను గౌరవిస్తాం. (కర్తరి)
ప్రతి వాక్యాన్ని రెండవ రూపంలోకి మార్చి రాయండి.

Answer:

అ) రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. (కర్మణి వాక్యం)
ఆ) ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (కర్తరి వాక్యం)
ఇ) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు, యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
ఈ) వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)
ఉ) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)
ఊ) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)
ఋ) ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)
ౠ) గోడలమీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)
ఎ) దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)
ఏ) మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)
నియమం: కర్తరి వాక్యంలో కర్త ప్రథమా విభక్తిలోనూ, కర్మ ద్వితీయా విభక్తిలోనూ ఉంటాయి. కర్మణి వాక్యంలో కర్మ ప్రథమలోనూ, కర్త తృతీయలోనూ ఉండి, క్రియకు ‘బడు’ ధాతువు చేరుతుంది.

Exam Tips:

a) ‘-బడు’ (చేయబడింది, గీయబడ్డాయి) ఉంటే కర్మణి వాక్యం; కర్త ‘-చే’ తో వస్తే కర్మణి.
b) రూపం మార్చినప్పుడు అర్థం మారకుండా చూడండి.

 

Free study material for Telugu

Step-by-Step Textbook Answers: Class 9 Telugu Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu)

Textbook Solutions for Class 9 Telugu Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu)

Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 12 The Sweet Greeting (Teeyani Palakarimpu) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Lesson 12 తీయని పలకరింపు in printable PDF format for offline study on any device.