TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

Download TS Board Solutions for Class 12 Telugu Poem 04 Dundubhi

Review structured textbook solutions for Class 12 Telugu Poem 04 Dundubhi. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: ‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి.

Answer:

దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది.
తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.
దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది.
రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.
తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

Exam Tips:

a) దృశ్యాలను క్రమంగా వివరించండి: తొలకరి వాన–అలల స్నేహం, పేదల గుడిసెలకు జనుము తుంగ, శిల్పి నైపుణ్యంతో పోలిక, గోన బుద్ధారెడ్డి–రంగనాథ రామాయణం, తులసి–మారేడు చెట్లు, పాలపిట్టలు, ఆపై నది ప్రయాణం.
b) ఈ ప్రశ్నకు నది పుట్టుక నుండి విజయపురం వరకు ప్రయాణాన్ని (హైదరాబాదు దగ్గర పుట్టి, మహబూబ్‌నగర్, దేవరకొండ, పలనాడు, ఏలేశ్వరం, విజయపురం) చివర చేర్చడం వల్ల సమాధానం పూర్తవుతుంది.

 

Question 2: దుందుభి గొప్పతనాన్ని తెలుపండి.

Answer:

గంగాపురం హనుమచ్ఛర్మ దుందుభి నది గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు.
కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు దుందుభి ఒడిలో శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొందాయన్నారు. పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.
అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ దుందుభి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతుంది. పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, తాటికమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. దుందుభి పెంచిన కారణంగా తాటిచెట్లపై ప్రేమలు పెరిగాయి.
లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందింది. పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన దుందుభి నదిని బంధించడం పిచ్చి పని. పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కల దుందుభి విషయంలో సాధ్యపడదు.
సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చి తన కారుణ్యాన్ని చూపినందుకు కవి మెచ్చుకున్నాడు.
అలలు అనే చేతులతో ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. దుందుభి ప్రవహించి తెలుగు భూములను పవిత్రంగా మార్చింది. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే దుందుభి పంట భూములకు పాలు ఇవ్వడానికి ప్రవహించింది కావున తన గొప్పతనాన్ని కావ్యంలో పెట్టాడు.

Exam Tips:

a) గొప్పతనాన్ని అంశాలవారీగా రాయండి: స్వార్థపరుల వల్ల చనిపోయిన వారి అస్థిపంజరాలకు శాంతినివ్వడం, చాళుక్యుల రాజ్యానికి ఆశ్రయం, చంద్రునికి జోలపాడే తల్లి, పేదలకు తాటి గుడిసెలు, జైన తీర్థంకరులకు జలం, బంధించరాని స్వేచ్ఛ, శ్రమజీవులకు సీతాఫలాలు.
b) చివరి వాక్యంలో ‘తెలుగు సంస్కృతిని ప్రకాశింపజేసే పాలనది’ అనే భావంతో ముగించండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?

Answer:

తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు. ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.

Exam Tips:

a) కవి అనుభూతి అంటే తొలకరి వాన, అలల స్నేహం, గట్ల పోరాటం వల్ల కలిగిన ఆనందం. సంధ్యారాగం, కోకిలల కూత, మేఘాలు, మెరుపులు వంటి ప్రకృతి దృశ్యాలను తప్పక చేర్చండి.
b) ‘గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చడమే దుందుభి ప్రసిద్ధి’ అనే భావాన్ని స్పష్టంగా రాయండి.

 

Question 2: దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి.

Answer:

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

Exam Tips:

a) కవులతో సంబంధం: గోన బుద్ధారెడ్డి దుందుభి తీరంలోనే రంగనాథ రామాయణాన్ని రాశాడు; తిక్కన హరిహరాద్వైత తత్వం ఈ నదికి సంబంధించినదిగా కవి చెప్పాడు.
b) తులసి, మారేడు వృక్షాలు రెండు ఒడ్డులను నింపడం శివకేశవ అభేదానికి గుర్తు అని వివరించండి.

 

Question 3: జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?

Answer:

కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

Exam Tips:

a) జంతువులు (జింకలు, దుప్పులు) దాహం తీర్చుకోవడం, చేపలు గంతులు వేయడం, పాలపిట్టల జంటలకు మంచి శకునాలు చూపడం అనే మూడు విషయాలను విడివిడిగా రాయండి.
b) ‘ఆదరణ’ అంటే నీరు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం; ఈ రెండింటికి ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 4: దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?

Answer:

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.
ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

Exam Tips:

a) ప్రయాణ క్రమాన్ని తప్పు లేకుండా రాయండి: హైదరాబాదు సమీపంలో పుట్టి → మహబూబ్‌నగర్ జిల్లా (ఆనకట్ట) → నల్లగొండ జిల్లా దేవరకొండ → పలనాడు (బ్రహ్మనాయుడు) → కృష్ణానది దగ్గర ఏలేశ్వరం → ఇక్ష్వాకుల విజయపురం.
b) చివర నాగార్జునుని దర్శనం, తెలుగు నేలను సస్యశ్యామలం చేయడం చెప్పి ముగించండి.

 

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?

Answer:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

Exam Tips:

a) ఒక్క వాక్యంలో రాయండి. కవి స్వగ్రామం, జన్మస్థలం రెండూ ఇవ్వడం సురక్షితం (స్వగ్రామం, జన్మస్థలం వేపూరు).

 

Question 2: దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?

Answer:

దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

Exam Tips:

a) దుందుభి ఒడిలో శాంతి పొందినవి స్వార్థపరుల ఒత్తిడితో ఆకలితో చనిపోయిన వారి ఎండిన అస్థిపంజరాలు. ఈ నేపథ్యాన్ని ఒక వాక్యంలో చెప్పండి.

 

Question 3: జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?

Answer:

దేవాలయాల వికాసం

Exam Tips:

a) జాతి వికాసానికి జీవగఱ్ఱ దేవాలయాల వికాసం. ‘జీవగఱ్ఱ’ అంటే జీవనాధారం అని కూడా రాయవచ్చు.

 

Question 4: హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?

Answer:

గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

Exam Tips:

a) సమాధానం ‘గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం’. ఇది ముద్రణకు నోచుకోని (అముద్రిత) రచన అని గమనించండి.

 

Question 5: దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?

Answer:

చందమామ

Exam Tips:

a) అద్దంలాంటి నీటిలో రూపం దిద్దుకునేది చందమామ. ఈ దృశ్యం 2వ కంఠస్థ పద్యంలో ఉంది.

 

Question 6: తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?

Answer:

సీతాఫలాలను

Exam Tips:

a) తొలి పంటగా దుందుభి ఇచ్చేవి సీతాఫలాలు. శ్రమజీవులైన కష్టజీవులకు ఇచ్చిన కానుకగా చెప్పవచ్చు.

 

Question 7: విజయపురిని ఏలిన వారెవరు ?

Answer:

ఇక్ష్వాకులు

Exam Tips:

a) విజయపురిని ఏలినవారు ఇక్ష్వాకులు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడని గుర్తుంచుకోండి.

 

Question 8: దుందుభి నది ఎక్కడ పుట్టింది ?

Answer:

భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

Exam Tips:

a) దుందుభి భాగ్యనగరం (హైదరాబాదు)కు అత్యంత సమీపంలో పుట్టింది. పాఠ్యభాగ సందర్భంలో షాబాద్ కొండలు అని కూడా చెప్పబడింది.

 

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

Question 1: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో”

Answer:

కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం.
వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని

Exam Tips:

a) ఈ క్రమంలో రాయండి: కవి పరిచయం, సందర్భం, అర్థం, వివరణ. పద్యపాదాన్ని ముందు ఉటంకించండి.
b) సందర్భం: శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలో రాజ్యం చేసిన ఘట్టం. పట్టిన రాయి శిల్పం, పాతిన బండ శాసనం అనే అంశాలను చేర్చండి.

 

Question 2: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై”

Answer:

కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.
వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

Exam Tips:

a) ‘హరిహరాద్వైతం’ అనే మాటను వివరణలో తప్పక వాడండి. తులసి (విష్ణువు), మారేడు (శివుడు) సంకేతాలను రాయండి.
b) ‘అనాసక్తత లేదు’ అంటే శైవ వైష్ణవాల పట్ల తేడా చూపకపోవడం.

 

Question 3: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “విమలభాస్వద్రూప శైవాలినీ”

Answer:

కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.
వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

Exam Tips:

a) సందర్భం: దుందుభిని బంధించడం అసాధ్యం అని కవి ప్రశ్నించిన చోటు. నిప్పును మూటలో కట్టడం, నీటిని ఆపడం అసాధ్యం అనే ఉపమానాలు రాయండి.
b) వివరణ: పవిత్ర భావాలను ఆపలేనట్లే దుందుభిని ఆపలేరు.

 

Question 4: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “మముబెంచు తల్లివై మా పాలవెల్లివై”

Answer:

కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.
వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

Exam Tips:

a) సందర్భం: దుందుభి చివరి పయనంలో తెలుగు నేలను పంటలతో నింపి తల్లిగా పాలవెల్లిగా ప్రవహించమని కవి కోరే సందర్భం. నాగార్జునుని దర్శనం, ఆశీస్సులే అక్షతలు అనే విషయాలు చేర్చండి.
b) వివరణ: దుందుభి తెలుగు వారికి తల్లి వంటి పోషకురాలు.

 

V. కంఠస్థం చేయవలసిన పద్యాలు – ప్రతిపదార్థ తాత్పర్యములు

Question 1: ‘పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
పద్యం :
ఉ||
పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు శాసనమ్ములై, కట్టిన దేవళమ్ముల వికాసము జాతికి జీవగఱ్ఱయై, పుట్టువు సార్ధతం బొరయ పొల్పుమిగిల్చిన శ్రీచళుక్య సమ్రాట్టులు నీదు తీరమున రాచరికమ్ముల నోచి రెందరో.
ప్రతిపదార్థం :
పట్టినరాయి = (వారు) పట్టుకున్న ప్రతీ రాయి
శిల్పము + ఐ = శిల్పంగా మరి
పాతిన = భూమిలో నిలిపిన
బండలు = రాళ్లు అన్ని
శాసనమ్ములు + ఐ = శాసనాలుగా మారి
కట్టిన = కట్టించిన
దేవళమ్ముల = దేవాలయాల
వికాసము = అభివృద్ధి
జాతికి = తెలుగు జాతికి
జీవగఱ్ఱయై = జీవనాధారమై
పుట్టువు = జన్మ
సార్ధతంబు ఒరయ = సాఫల్యం చెందగా
పొల్పు మిగిల్చిన = స్థిరత్వాన్ని పొందిన
శ్రీచళుక్య సమ్రాట్టులు శ్రీ చాళుక్య వంశానికి చెందిన చక్రవర్తులు నీదు = నీ యొక్క
తీరమున = తీరంలో
ఎందరో = ఎంతో మంది
రాచరికమ్ములన్ = రాజులుగా
నోచిరి = నోచుకున్నారు, అదృష్టాన్ని పొందారు
తాత్పర్యం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

Exam Tips:

a) ప్రతిపదార్థంలో సంధి పదాలను విడగొట్టండి (ఉదా: శిల్పము + ఐ, శాసనమ్ములు + ఐ). ‘శ్రీచళుక్య సమ్రాట్టులు’ = చాళుక్య చక్రవర్తులు.
b) తాత్పర్యంలో దేవాలయ వికాసం తెలుగు జాతికి జీవనాధారం అయిందని చెప్పండి.

 

Question 2: ‘అద్దమువంటి నీజలము లందు స్వరూపము …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
పద్యం :
ఉ||
అద్దమువంటి నీజలము లందు స్వరూపము దిద్దుచున్న యా నిద్దపు చందమామ యొడి నిద్దుర నొందగ కీచురాళ్ళతో దద్దయు జోలబాడిన విధమ్మున, నూగు తరంగడోలికన్ ముద్దుగ నిద్రబుచ్చెదు ప్రపుల్లశరత్తుల మాతృమూర్తివై.
ప్రతిపదార్థం :
అద్దమువంటి = అద్దం లాంటి స్వచ్ఛమైన
నీ జలముల+అందు = నీ నీటిలో
స్వరూపమున్ = తన రూపాన్ని
దిద్దుచున్న = చూసుకుంటున్న, అలంకరించుకుంటున్న
ఆ నిద్దపు = ఆ అందమైన
చందమామ = చందమామ
ఒడి నిద్దురన్ ఒందగ = నీ ఒడిలో నిద్ర పోతున్నప్పుడు
కీచురాళ్ళతో = కీచురాయి కీటకాల శబ్దాలతో
తద్దయు జోల = మంచి జోల పాటలను
పాడిన విధమ్మునన్ = పాడిన తీరుగా
ఊగు = ఊగుతున్న
తరంగ డోలికన్ = అలలు అనే ఉయ్యాలలో
ముద్దుగ = ముద్దుగొలిపే విధంగా
ప్రపుల్ల = ప్రకాశవంతమైన
శరత్తుల = శరత్కాలంలోని వెన్నెలలో
మాతృమూర్తివై = తల్లిలాగ మారి
నిద్రపుచ్చెదు = నిద్రపుచ్చుతున్నావు
తాత్పర్యం : అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

Exam Tips:

a) ఈ పద్యంలో చంద్రుడు నీటిలో రూపం దిద్దుకోవడం, కీచురాళ్ళ జోల, అలల ఊయల, శరత్కాల వెన్నెల అనే నాలుగు దృశ్యాలను తాత్పర్యంలో రాయండి.
b) ‘మాతృమూర్తివై నిద్రపుచ్చెదు’ అనే ముగింపు భావం మరువకండి.

 

Question 3: ‘అలతులు శ్రావ్యమౌ పలుకు లందము …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
పద్యం :
అలతులు శ్రావ్యమౌ పలుకు లందము చిందగ రంగు దిద్దిన ట్టులు తమరెక్క లొప్ప నుదుటుం గొని సచ్ఛకునాళిఁ జూపి మా పొలముల క్రొత్తగింజల బుభుక్షల బాసెడు పాలపిట్ట జంటలఁ గనుగొంచు ముందుకు హుటాహుటి సాగుము రమ్యవాహినీ !
ప్రతిపదార్థం :
రమ్యవాహినీ ! = అందంగా ప్రవహించేదానా!, దుందుభి !
అలతులు = అతి కానివి, చిన్నవి
శ్రావ్యము + ఔ = వినడానికి బాగున్న, విన సొంపైన
పలుకుల = మాటలతో
అందము చిందగ = అందం ఏర్పడగా
రంగు దిద్దినట్టులు = రంగులు వేసినట్లు
తమరెక్కలు + ఒప్ప = తమ రెక్కలు ప్రకాశించగా
ఉదుటుం గొని = గర్వంతో
సత్ + శకున + ఆళిన్ = మంచి శకునాల సమూహాన్ని
చూపి = చూపించి
మా పొలముల = మా పొలాలలోని
క్రొత్తగింజల = కొత్తగా పండిన పంట గింజలను
బుభుక్షల బాసెడు = ఆకలిని తీర్చుకునే
పాలపిట్ట జంటలన్ = పాలపిట్టల జంటలను
కనుగొంచు = చూస్తూ
హుటాహుటి = హడావిడిగా
ముందుకు = ముందు వైపు
సాగుము = సాగిపొమ్ము
తాత్పర్యం : అందంగా ప్రవహించే ఓ దుందుభి! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

Exam Tips:

a) ఈ పద్యంలో పాలపిట్టల జంటలు, శకునాలు, కొత్త పంట గింజలతో వాటి ఆకలి తీరడం ముఖ్యాంశాలు. ‘రమ్యవాహినీ’ సంబోధనకు అర్థం రాయండి.
b) ప్రతిపదార్థంలో ‘హుటాహుటి = హడావిడిగా’, ‘ఉదుటుం గొని = గర్వంతో’ వంటి కష్టమైన పదాల అర్థాలు తప్పక రాయండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 12 Telugu Poem 04 Dundubhi

Accessing Poem 04 Dundubhi Solutions

Review comprehensive exercise answers for Class 12 Telugu Poem 04 Dundubhi. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 12 Telugu

Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Poem 04 Dundubhi with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి in printable PDF format for offline study on any device.