TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక

Solutions for Class 10 Telugu: Lesson 12 Bhoomika (Preface)

Review structured textbook solutions for Class 10 Telugu Lesson 12 Bhoomika (Preface). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 10 Telugu Solutions: Lesson 12 Bhoomika (Preface)

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

చదువండి – ఆలోచించి చెప్పండి

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

Question 1: పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?

Answer:

పుస్తకాలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం చదవడం వల్ల మనసుకు ఉత్తేజం కలుగుతుంది.

Exam Tips:

a) జ్ఞానం, ఆలోచనాశక్తి, సృజనాత్మకత, లోకపరిశీలన, జిజ్ఞాస, ఉత్సాహం – ఈ ఆరు ప్రయోజనాలను క్రమంగా రాయండి.
b) జవాబు పై పేరాలోనే ఉంది; పేరాలోని మాటలనే ఉపయోగిస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 2: ఎటువంటి పుస్తకాలను చదువాలి ?

Answer:

మనకు స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదువాలి.

Exam Tips:

a) ‘స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్నిచ్చే’ అనే రెండు లక్షణాలను తప్పక పేర్కొనండి.
b) ఒక ఉదాహరణ పుస్తకం పేరు జోడిస్తే జవాబు బలంగా ఉంటుంది.

 

Question 3: ‘ఏదైనా పుస్తకాన్ని చదువాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది ?

Answer:

పుస్తక పరిచయ వాక్యాలు మనకు ఏదైనా పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కలిగిస్తాయి.

Exam Tips:

a) ‘పుస్తక పరిచయ వాక్యాలు (పీఠిక)’ అనే ముఖ్యమైన మాటను వదలకండి – ఇదే ఈ పాఠానికి కేంద్రం.

 

Question 4: మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.

Answer:

మహాప్రస్థానం (శ్రీశ్రీ), మహాభారతం, రామాయణం, అమృతం కురిసిన రాత్రి (దేవరకొండ బాలగంగాధర తిలక్), పంచతంత్రం కథలు.

Exam Tips:

a) పుస్తకం పేరుతో పాటు రచయిత పేరును కూడా రాయండి; ఉదా: మహాప్రస్థానం – శ్రీశ్రీ.
b) కనీసం నాలుగు పుస్తకాల పేర్లు రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (పేజీ 124)

Question 1: కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి ? మీకు ఏవంటే ఇష్టం ? ఎందుకు ?

Answer:

కథలు సరళభాషలో సాగే వచన రచనలు. విశిష్టమైన వస్తువు, శిల్పంతో కథ సాగుతుంది. కవిత్వం ఛందస్సుతో (లేదా లయతో) ముడిపడి సాగే రచన. ప్రాసలతో, అలంకారాలతో కూడి ఉంటుంది. నాకు కవిత్వం అంటే ఇష్టం. అది వినసొంపుగా, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది; తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెబుతుంది. అందుకని కవిత్వం అంటే నాకు ఇష్టం.

Exam Tips:

a) మొదట భేదం (వచనం – పద్యం/లయ), తర్వాత మీ ఇష్టం, చివర కారణం – ఈ మూడు భాగాలుగా జవాబు రాయండి.
b) ఇది అభిప్రాయ ప్రశ్న; కథ ఇష్టమన్నా సరైన కారణం చెబితే మార్కులు వస్తాయి.

 

Question 2: నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?

Answer:

నాటి హైదరాబాదు రాజ్యంలో నిజాం పాలనలో భూస్వాములు, జాగీర్దార్ల దోపిడీ ఎక్కువగా ఉండేది. ప్రజలకు భూమి, భాష, విద్య వంటి హక్కులు లేవు. దీనిపై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటంలో సుమారు 4 వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై, ప్రజలపై దాడులు చేశారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో చేరలేదు. ఈ కారణాల వల్ల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఉద్యమించి ఉండవచ్చు.

Exam Tips:

a) నిజాం పాలన, భూస్వాముల దోపిడీ, రజాకార్ల దాడులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – ఈ చారిత్రక అంశాలను పేర్కొనండి.
b) 1947 తర్వాత కూడా హైదరాబాదు రాజ్యం విలీనం కాలేదన్న విషయం జోడిస్తే జవాబు సంపూర్ణం.

 

Question 3: హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది ?

Answer:

హైదరాబాదు నగరంలోని ప్రజల జీవితాలను, సంస్కృతిని బాగా పరిశీలించాలి, విశ్లేషించాలి. ఆ పట్టణ ప్రజల మానసిక స్థితిని కూడా అవగాహన చేసుకోవాలి.
సమాజంలో నానాటికి వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి.
ఫ్యూడల్ సమాజంలో ఉండే బాధలు, వ్యతిరేకతలు పరిశీలించాలి.
ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛా వాయువుల హాయిని కూడా పరిశీలించాలి. రకరకాల కులవృత్తులను పరిశీలించాలి.
ఉద్యమాలు, రాజకీయ మార్పులు, సంస్కృతి, గ్రామీణ జీవితం ఇలా అన్ని కోణాలలోనూ హైదరాబాదు నగరాన్ని పరిశీలించాలి. పై వాటినన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వివరించడమే చిత్రించడం. అది తెలుగుభాషలో చేస్తే తెలుగులో చిత్రించడం అంటారని నాకు అర్థమైంది. ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాదు జీవితాన్ని తెలుగు కథల్లో చూపించడం కేశవస్వామి ప్రత్యేకత.

Exam Tips:

a) ‘చిత్రించడం’ అంటే కళ్ళకు కట్టినట్లు వర్ణించడం అనే అర్థాన్ని స్పష్టంగా రాయండి.
b) ప్రజల జీవితం, సంస్కృతి, ఉద్యమాలు, రాజకీయ మార్పులు వంటి కోణాలను పేర్కొనండి.

 

ఆలోచించండి – చెప్పండి (పేజీ 125)

Question 1: అపార్థాలు ఎందుకు వస్తాయి ?

Answer:

అవగాహనా లోపం వలన అపార్థాలు వస్తాయి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, వారి ఆలోచనా విధానం నచ్చకపోయినా అపార్థాలు తలెత్తుతాయి. ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు విభిన్నంగా ఉండటం వలన, ఒకరి భాష, సంస్కృతి, మతం గురించి మరొకరికి సరైన అవగాహన లేకపోవడం వలన కూడా అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు మనిషిలోని ఆలోచనా శక్తిని వక్రమార్గంలో నడిపిస్తాయి. మనిషిని భ్రమకు లోనుచేసి వ్యక్తుల మధ్య సంబంధాలను దూరం చేస్తాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని, మాట్లాడుకొని సందేహాలు తొలగించుకోవాలి.

Exam Tips:

a) అవగాహనా లోపం, అభిప్రాయ భేదాలు, ఇతరుల సంస్కృతి తెలియకపోవడం – ఈ కారణాలను పాయింట్లుగా రాయండి.
b) అపార్థాలు తొలగించుకొనే మార్గం (మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం) కూడా చివర రాయండి.

 

Question 2: ‘చార్మినార్’ కథలను ఎందుకు చదువాలి ?

Answer:

చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితంలో సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. కాబట్టి తప్పక చదువాలి.

Exam Tips:

a) ‘సామాజిక పరిణామాల సామాజిక చరిత్ర’ అనే పీఠికలోని ముఖ్య వాక్యాన్ని ఉపయోగించండి.
b) హైదరాబాదు ముస్లిం జీవితం, హిందూ–ముస్లిం సఖ్యత ఈ కథల్లో కనిపిస్తాయని జోడించండి.

 

Question 3: రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి ?

Answer:

11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవనవిధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదానప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించిందని దాని అర్థం.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 127)
అందులో భాగంగా చూసినప్పుడు …………. వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు

Exam Tips:

a) 11వ శతాబ్దం నుండి ముస్లిం వలసలు → భారతీయ సంస్కృతిపై ప్రభావం → ‘సమన్వయ సంస్కృతి’ – ఈ క్రమంలో రాయండి.
b) ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట అనే అర్థాన్ని పేర్కొనండి; భాష, ఆహారం, వస్త్రధారణ వంటి ఉదాహరణలు ఇవ్వవచ్చు.

 

ఆలోచించండి – చెప్పండి (పేజీ 127)

Question 1: హృదయ సంస్కారం అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు చెప్పండి.

Answer:

హృదయ సంస్కారం అంటే మనసులో ఉండే మంచి భావన, ఇతరులను గౌరవించే, ఆదుకునే సంస్కారం. నాకు మా తాతగారు, అమ్మా, నాన్నలు మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని చాలా విషయాలు, కథలు చెబుతుంటారు.
ఉదాహరణకు మా తాతగారు మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. మా తాతగారి చిన్నతనంలో బాల్యవివాహాలు జరిగేవట. ఒకసారి మా గ్రామంలో ఒక 12 సం॥ల అమ్మాయిని పెళ్ళిచూపులు చూసుకొనేందుకు 60 సం॥ల వృద్ధుడు వచ్చాడట. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. డబ్బుకు ఆశపడి వృద్ధుడికిచ్చి పెళ్ళి చేద్దామనుకొన్నారు. వృద్ధుడు అమ్మాయి నచ్చిందన్నాడు.
వాళ్ళడిగిన డబ్బిచ్చాడు. ఆ అమ్మాయిని వృద్ధుడు ‘నేను నీకు నచ్చానా?’ అన్నాడట. భయం భయంగా ‘ఊ’ అందట. ‘మరి, నేను చెప్పినట్లు వింటావా ?’ అన్నాడట, ‘ఊ’ అంది. ‘నీకేమిష్టం ?’ అన్నాడు. ‘చదువు’ అంది అమ్మాయి.
అంతే, వృద్ధుడు పకపకా నవ్వాడట. ‘పెళ్ళి ముహూర్తం పెట్టించమంటారా బాబూ ?’ అని అమ్మాయి తండ్రి అడిగాడట.
‘పెట్టించండి. కానీ, పెళ్ళికి కాదు, దత్తతకు. ఈ రోజు నుండి మీ బంగారుతల్లి నాకు బంగారు తల్లి అయింది. బాగా చదివిస్తాను. మంచి కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాను. రామ్మా ! మనింటికి వెడదాం’ అన్నాడట. ‘అదీ హృదయ సంస్కారం’ అన్నారు మా తాతగారు. ఆ అమ్మాయి తర్వాత బాగా చదువుకొని జిల్లా కలెక్టరైందట. ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపిందట.
పాఠంలో కూడా సొంత కూతురులా ఒక ముజ్రా గాయనిని నవాబు, ఆయన కొడుకు గౌరవించిన తీరు హృదయ సంస్కారానికి ఉదాహరణ.

Exam Tips:

a) మొదట నిర్వచనం రాసి, తర్వాత ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
b) పాఠంలోని ఉదాహరణ (ముజ్రా గాయనిని నవాబు కూతురిలా గౌరవించడం) పేర్కొంటే ఎక్కువ మార్కులు.

 

Question 2: “స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది” – సమర్థించండి.

Answer:

అవును. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా” అని కదా ! స్నేహం మతం, కులం, ప్రాంతం, భాషలను చూడదు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది. “కేవలం మనుషులం” కథలో హుస్సేన్ మీర్జా, మహబూబ్‌రాయ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి స్నేహానికి మతం అడ్డు రాలేదు. ఇది చక్కని కథ. అందుకే స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుందని నేను నమ్ముతాను.

Exam Tips:

a) ‘కేవలం మనుషులం’ కథలోని హుస్సేన్ మీర్జా – మహబూబ్‌రాయ్ సక్సేనాల స్నేహాన్ని ఉదాహరణగా తప్పక రాయండి.
b) ‘సమర్థించండి’ ప్రశ్నకు మొదటే ‘అవును’ అని స్పష్టంగా మీ వైఖరి చెప్పి కారణాలు ఇవ్వండి.

 

Question 3: పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి ? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది ?

Answer:

పేదల కష్టాలు వర్ణించటానికి కూడా వీలుకానివి. సరైన తిండి, బట్ట, ఇల్లు, చదువు, వైద్యం అందక ఆర్థిక, సామాజిక సమస్యలతో అతలాకుతలం అవుతారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలి. పిల్లలకు ఉచిత విద్య అందించాలి. వారికి ప్రభుత్వం విశ్వాసం, భరోసా కల్పించాలి.
కూడు, గుడ్డ, నీడ కల్పిస్తే చాలావరకు వారి జీవితాల్లో వెలుగులు (మార్పులు) వచ్చినట్లే.

Exam Tips:

a) మొదటి భాగం (కష్టాలు), రెండవ భాగం (పరిష్కారాలు) – రెండింటికీ వేర్వేరుగా జవాబు రాయండి.
b) విద్య, ఉపాధి, ఇల్లు వంటి నిర్దిష్ట పరిష్కారాలు రాయండి; సాధారణ మాటలు మాత్రమే రాస్తే మార్కులు తగ్గుతాయి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమాలలో ఏమేం చేస్తారో చెప్పండి.

Answer:

1. సభా నిర్వహణ : అతిథులను, పుస్తక రచయితనూ, సమీక్షకుడినీ వేదికపైకి పిలిచి సభ నిర్వహిస్తారు.
2. పుస్తకావిష్కరణ : ముఖ్య అతిథి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు.
3. పుస్తక సమీక్ష : సమీక్షకుడు పుస్తకంలోని అంశాలను రేఖామాత్రంగా స్పృశిస్తూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
4. ప్రసంగాలు : అతిథులు పుస్తకం గురించి, రచయిత గురించి ప్రశంసిస్తూ మాట్లాడతారు.
5. కవి సత్కారం : పుస్తక రచయితను అందరూ సన్మానిస్తారు.
6. కవి స్పందన : ఈ కార్యక్రమ నిర్వహణపై కవి లేదా రచయిత తన స్పందనను తెలియజేస్తారు.

Exam Tips:

a) కార్యక్రమాన్ని క్రమంలో రాయండి: సభ ప్రారంభం → ఆవిష్కరణ → సమీక్ష → ప్రసంగాలు → సత్కారం → రచయిత స్పందన.
b) ప్రతి అంశానికి చిన్న శీర్షిక పెట్టి రాస్తే జవాబు స్పష్టంగా కనిపిస్తుంది.

 

Question 2: నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.

Answer:

మానవ మనస్తత్వాన్ని, సమాజంలోని కుళ్ళునూ, సమాజపు స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపించే రచయితలు అవసరం. సమాజానికి ప్రతినిధిగా రచయిత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఒక సమస్యను చూపి, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలిగే రచయితలు అవసరం.
సమాజంలోని రుగ్మతలను, మూఢనమ్మకాలను, దురాచారాలను ఖండించగలిగే నిర్భయత్వం గల రచయితలు కావాలి. ఉదాహరణకు వేమన, గురజాడ, శ్రీశ్రీ లాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం.

Exam Tips:

a) సమాజంలోని రుగ్మతలను నిర్భయంగా చూపి, పరిష్కారం సూచించే రచయిత కావాలి అనే అంశాన్ని ప్రధానంగా రాయండి.
b) వేమన, గురజాడ, శ్రీశ్రీ వంటి సంస్కరణ రచయితల పేర్లను ఉదాహరణగా ఇవ్వండి.

 

Question 3: ఈ పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.

Answer:

పేరాదేని గురించి వివరించబడింది
1. ఇండియన్ యూనియన్‌లోని …. విశిష్ట స్థానం ఉంది.ఇండియన్ యూనియన్‌లోని జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరిగిందో వివరించారు.
2. యుగాంతం కథ …. సార్థకతను చేకూర్చింది.ఒక యుగాంతాన్ని చిత్రించిన కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంటులా తెలియజేస్తుంది.
3. ఆ సంక్షుభిత …. హృదయం ఉంది.హిందూ ముస్లింల సఖ్యత గురించి చెప్పారు. చార్మినార్ కథల గురించి వివరించారు.
4. భరోసా కథ …. తెలియజేస్తుంది.నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో, భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ చెప్పబడింది.

Exam Tips:

a) పట్టికలో ప్రతి పేరా మొదటి, చివరి మాటలను సరిగ్గా రాసి, ఆ పేరాలోని ప్రధాన విషయాన్ని ఒక వాక్యంలో రాయండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

Answer:

అ) ‘ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. (లేదా) ‘ఒక భాషలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సమాజ స్థితిగతులను గ్రహించవచ్చు’ దీన్ని విశ్లేషించండి.
జవాబు: నెల్లూరి కేశవస్వామి గారి ‘చార్మినార్ కథలు’ చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి దేవిడీల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు, ఆత్మీయతలు, కులమతాలకు అతీతమైన వారి మమతలు తెలుస్తాయి. అలాగే ఆంగ్లసాహిత్యం చదివితే ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బ్రిటిషు కాలంనాటి ఇంగ్లాండు పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి. ప్రేమ్‌చంద్, కిషన్ చందర్ సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ, హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు, వారి సంప్రదాయాలు తెలుస్తాయి. కాబట్టి సాహిత్యం ఆ కాలపు సమాజానికి అద్దం వంటిది.
ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి. (లేదా) తెలంగాణ భాషలోని పలుకుబడులను గురించి విశ్లేషించండి.
జవాబు: పలుకుబడి అంటే ఉచ్చారణము, వచో నిబంధనము, ఒడంబడిక, మాటచెల్లుబడి అని నిఘంటువులో చెప్పబడింది. తెలంగాణ పలుకుబడులు అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే తీరు, మాటల ఉచ్చారణ, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన సామెతలు, జాతీయాలు అని అర్థం. ఏ భాషకైనా పలుకుబడులు, జాతీయాలు గుండెకాయ (ముఖ్యమైనవి) వంటివి. అవి భాషను పదికాలాల పాటు నిలిపి ఉంచుతాయి.
ఉదాహరణలు – సామెతలు:
1. అతి రహస్యం బట్టబయలు.
2. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగుతుందన్నదట.
3. మావోనికి ముప్పై రెండు గుణాలు; మంచివే, రెండే రెండు పాడు – తనకు తెలువది, ఒకడు చెపితే వినడు.
4. చెరువుల పడ్డదాన్ని తీసి బావిలేసినట్లు.
జాతీయాలు (జాతీయం – సందర్భం):
1. అగ్గిబుక్కుట – కోపంతో ఉడికిపోవుట
2. ఉడుంపట్టు – గట్టి పట్టుదల
3. ఒంటికోతి – ఏకాకి, ఒంటరివాడు
4. కడుపు కుటుకుట – ఓర్వలేనితనం
ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమర్థమయిందో తెలుపండి. (లేదా) తెలంగాణ కథల పుట్టుక గురించి, సామాజిక చైతన్యం గురించి రాయండి.
జవాబు: కథ వస్తు, శిల్ప నైపుణ్యంతో ఉంటుంది. తెలంగాణ కథ మొదటి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వచ్చింది. 1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమైంది. పుట్టుకనుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ఉద్యమాలు, పోరాటాలు మొదలైనవి పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు తోడ్పడింది. ఈ విధంగా తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం, ఉద్యమాలు, పోరాటాలను చూపిస్తూ వచ్చిందని నాకర్థమయింది.

Exam Tips:

a) ‘ఐదేసి వాక్యాల్లో’ అన్నారు; ప్రతి ఉప ప్రశ్నకు కనీసం ఐదు వాక్యాలు రాయండి.
b) పలుకుబడుల ప్రశ్నకు నిర్వచనంతో పాటు కనీసం రెండు సామెతలు, రెండు జాతీయాలు ఉదాహరణలుగా ఇవ్వండి.
c) సాహిత్యం సమాజానికి అద్దం అనే ప్రశ్నకు చార్మినార్ కథలతో పాటు మరో భాష రచయితను ఉదాహరణగా పేర్కొనండి.

 

Question 2: కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

Answer:

అ) “మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు”. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు” ఎట్లాగో రాయండి. (లేదా) పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకము యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు. దీన్ని సమీక్షించండి.
జవాబు:
1. పీఠిక లేదా సమీక్షను చదివితే పుస్తకానికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి.
2. పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని పుస్తక సమీక్ష సవివరంగా వివరిస్తుంది.
3. ఇది విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
4. పుస్తకంలోని నైతిక విలువలను వివరిస్తుంది.
5. రచన యొక్క సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
6. పాత్రల మనస్తత్వాన్ని, సంఘర్షణను తెలుపుతుంది.
7. ఉదాహరణకు, ఈ పీఠిక చదివితే చార్మినార్ కథలు సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర అని తెలుస్తుంది.
8. పాఠకుడికి మూలగ్రంథాన్ని చదివే తీరిక లేనప్పుడు పుస్తక సమీక్ష కొంతవరకు విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.
9. పుస్తక సమీక్షల ఆధారంగా ఒక్కొక్కసారి ఒక గ్రంథం ప్రజాదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
10. సమీక్ష నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉంటేనే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవటానికి వీలు కలుగుతుంది. పుస్తక సమీక్షను చదివితే ఆ గ్రంథాన్ని పూర్తిగా చదువాలనే ఉత్సాహం, ఉత్సుకత కలుగుతాయి.
(లేదా)
ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. (Mar. ’15) (లేదా) కేశవస్వామి రచనల విశిష్టతలను విశ్లేషించండి.
జవాబు: విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్‌చంద్, కిషన్ చందర్‌లతో పోల్చదగినవారు.
1. తొలి కథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969 ఆగస్టులో వెలువడింది.
2. రెండవ కథా సంకలనం “చార్మినార్ కథలు”. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన ఇది. దీనిలో హైదరాబాద్ రాజ్య చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించారు.
3. “యుగాంతం” కథలో ఇండియా రెండు దేశాలుగా విడిపోయిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ జీవనాన్ని ఎట్లా కుదిపేశాయో, అట్లే హైదరాబాద్ రాజ్యంలో 1946 – 50ల మధ్య పరిస్థితులు ఎలా కొనసాగాయో వివరించారు. సమాజం, మానవ సంబంధాలు ఎలా మారాయో చూపించారు.
4. “వంశాకురం” కథ ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతుందో హృదయ విదారకంగా చిత్రించింది.
5. “కేవలం మనుషులం” కథ హుస్సేన్ మీర్జా, మహబూబ్‌రాయ్ సక్సేనాల మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ.
6. “భరోసా” కథ నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో, భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ.
7. “ఆఖరి కానుక” కథ రోజురోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్‌లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది.
ఈ విధంగా కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం గారు అద్భుతంగా, సజీవంగా, సప్రమాణంగా వ్యాసం రాశారు.

Exam Tips:

a) పది వాక్యాల జవాబు కాబట్టి అంశాలను సంఖ్యలతో పాయింట్లుగా రాయండి.
b) కేశవస్వామి రచనల ప్రశ్నకు పసిడిబొమ్మ, చార్మినార్ కథలు, యుగాంతం, వంశాకురం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరి కానుక – కథల పేర్లు, వాటి విషయం తప్పక రాయండి (మార్చి 2015లో అడిగారు).

 

Question 3: కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.

Answer:

(నమూనా పీఠిక)
వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళామూర్తుల సేవలను స్మరిస్తూ ‘మహిళావరణం’ అనే గ్రంథాన్ని కొందరు రచించారు. దీనికి ముందుమాటను ప్రముఖ వ్యాసకర్తలు రచించారు. సమాజంలో వివిధరంగాల్లో రమణీయమైన సేవలను చేసిన వారి త్యాగాలను, సాహసాలను చక్కగా వివరించారు.
ఎందరో స్త్రీలు ఉద్యమాలు చేశారు. చదువులు చదివారు. రాజకీయ నాయకులైనారు. డాక్టర్లు అయ్యారు. నాటక, క్రీడ మొదలైన రంగాల్లో రాణించారు. అయినా వారికి తగిన గౌరవం చరిత్రలో దొరకలేదు. పురుషాధిక్యంతో స్త్రీల సేవలను చరిత్ర గుర్తించడం లేదు. స్త్రీలు అద్భుతమైన చరిత్ర నిర్మాణానికి ఎంతో మూల్యం చెల్లించారు. ఎన్నో త్యాగాలు చేశారు.
వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన మహిళలను ఎంపిక చేసి, వారి వివరాలు, వారి ఇంటర్వ్యూలను కలిపి ‘మహిళావరణం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆర్థికపరమైన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వందమంది మహిళల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించారు.
వారికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ పుస్తక నిర్మాణంలో ఎందరో తమ సహాయసహకారాలను అందించారు. వారందరి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. రచయితలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Exam Tips:

a) పీఠికలో పుస్తకం పేరు, రచయిత, విషయం, ప్రత్యేకత, పాఠకులకు ప్రయోజనం – ఈ అంశాలు ఉండాలి.
b) మీరు నిజంగా చదివిన కథల పుస్తకం గురించి రాస్తే జవాబు సహజంగా ఉంటుంది; చివర చదవమని సిఫార్సు చేయండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

Answer:

అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
జవాబు: ధ్యాస = దృష్టి, ఆలోచన
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యతతో మెలుగుతారు.
జవాబు: సఖ్యత = స్నేహం
ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
జవాబు: హస్తవాసి = చేతిచలువ
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
జవాబు: ప్రఖ్యాతి = మిక్కిలి ప్రసిద్ధి
ఉ) పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
జవాబు: దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

Exam Tips:

a) అర్థం రాసేటప్పుడు ‘పదం = అర్థం’ రూపంలో రాయండి.
b) వాక్యంలో పదం ఏ అర్థంలో వాడబడిందో చూసి ఆ సందర్భానికి సరిపోయే అర్థమే రాయండి.

 

Question 2: కింది పదాలను వివరించి రాయండి.

Answer:

అ) హృదయసంస్కారం : మనసుకు సంబంధించిన సంస్కారం. ఇది ఎంతో విలువ కలిగినది. ఒక ముజ్రా గాయనిని నవాబు, నవాబు కొడుకు సొంత కూతురులా గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు.
ఆ) సామాజిక పరిణామం : సమాజపరంగా జరిగే మార్పు. ఇది యుగాంతం కథలో వివరించబడింది. మానవ సంబంధాలను, మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు “యుగాంతం” అనే పేరు సార్థకమైంది.
ఇ) భారతీయ సంస్కృతి : ఇది ఎంతో విశిష్టమైంది. 11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లిం వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేశాయి. ఇలా భిన్న సంస్కృతుల సమన్వయమే భారతీయ సంస్కృతి.
ఈ) అతలాకుతలం : విపరీతంగా శ్రమపడడం, క్రింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అనే అర్థంలో దీన్ని వాడతారు. అతలము అనగా ‘పాతాళము’, కుతలము అనగా ‘భూమి’ అని అర్థం.

Exam Tips:

a) పదాన్ని వివరించేటప్పుడు అర్థంతో పాటు పాఠంలో అది ఏ సందర్భంలో వచ్చిందో చెప్పండి.
b) అతలాకుతలం = అతలము (పాతాళం) + కుతలము (భూమి) అనే విభజన రాస్తే పూర్తి మార్కులు.

 

వ్యాకరణాంశాలు

Question 1: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.
అ) దశకంఠుడు ఆ) పీతాంబరుడు ఇ) అరవిందానన ఈ) మృగనేత్ర ఉ) చంచలాక్షి ఊ) మానధనులు ఋ) రాజవదన ౠ) నీరజభవుడు

Answer:

అ) దశకంఠుడు = దశ (పది) కంఠములు కలవాడు – సంఖ్యా పూర్వపద బహువ్రీహి సమాసము
ఆ) పీతాంబరుడు = పీతము (పసుపుపచ్చని) అంబరము కలవాడు – బహువ్రీహి సమాసము
ఇ) అరవిందానన = అరవిందము వంటి ఆననము కలది – బహువ్రీహి సమాసము
ఈ) మృగనేత్ర = మృగము యొక్క నేత్రముల వంటి నేత్రములు కలది – బహువ్రీహి సమాసము
ఉ) చంచలాక్షి = చంచలమైన అక్షులు (కన్నులు) కలది – బహువ్రీహి సమాసము
ఊ) మానధనులు = మానమే ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము
ఋ) రాజవదన = రాజు (చంద్రుని) వంటి వదనము కలది – బహువ్రీహి సమాసము
ౠ) నీరజభవుడు = నీరజము (పద్మము) నందు పుట్టినవాడు (బ్రహ్మ) – బహువ్రీహి సమాసము

Exam Tips:

a) బహువ్రీహి సమాసంలో అన్యపదార్థమే ప్రధానం; విగ్రహవాక్యం ‘…కలవాడు / కలది / కలవారు’తో ముగుస్తుంది.
b) ‘వంటి’ అనే పోలిక ఉన్నప్పుడు (అరవిందానన, రాజవదన) ఉపమాన పూర్వపద బహువ్రీహిగా గుర్తించవచ్చు; సంఖ్య ముందుంటే (దశకంఠుడు) సంఖ్యా పూర్వపద బహువ్రీహి.

 

Question 2: కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.

Answer:

అ) “హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది” అని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రకటించాడు. (ప్రత్యక్షం)
జవాబు: హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైందని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రకటించాడు. (పరోక్షం)
ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు: తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నాడు. (పరోక్షం)
ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు: చార్మినార్ అనే పేరును బట్టే ఆ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు. (పరోక్షం)

Exam Tips:

a) పరోక్ష వాక్యంలో ఉద్ధరణ చిహ్నాలు (“ ”) తొలగించి ‘అని’ని క్రియతో కలిపి ‘…అయిందని, …అవుతుందని’ రూపంలో రాయండి.
b) ప్రత్యక్షంలోని ‘ఈ’ వంటి సమీప సూచక పదాలు పరోక్షంలో ‘ఆ’గా మారుతాయి.

 

Question 3: కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

Answer:

అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
జవాబు: పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మ సహానిచేత “తమస్” నవలలో చిత్రించబడ్డాయి. (కర్మణి వాక్యం)
ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు. (కర్తరి వాక్యం)
జవాబు: హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)
ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
జవాబు: నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డాడు. (కర్మణి వాక్యం)

Exam Tips:

a) కర్మణి వాక్యంలో కర్త తర్వాత ‘చేత / చే’ చేర్చి, క్రియకు ‘బడు’ ప్రత్యయం (చిత్రించబడ్డాయి, నెట్టివేయబడింది) కలపాలి.
b) కర్మ బహువచనమైతే క్రియ కూడా బహువచనంలో ఉండాలి (పరిస్థితులు … చిత్రించబడ్డాయి).

 

శ్లేషాలంకారం – కింది వాక్యాలను పరిశీలించండి.
అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక !
1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !
ఆ) మానవ జీవనం సుకుమారం.
1. మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.
2. మా నవ (మా కొత్త) జీవనం సుకుమారమైంది.
పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.
లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

Question 4: కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1. రాజు కువలయానందకరుడు.
2. నీవేల వచ్చెదవు.

Answer:

1. రాజు కువలయానందకరుడు – శ్లేషాలంకారం
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయం = భూమి, కలువపూవు
ఆనందకరుడు = ఆనందింపచేసేవాడు
1వ అర్థములో = ప్రభువు భూమిని (ప్రజలను) ఆనందింపచేసేవాడు.
2వ అర్థములో = చంద్రుడు కలువపూవులను ఆనందింపచేసేవాడు.
అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు.
2. నీవేల వచ్చెదవు – శ్లేషాలంకారం
1. నీవు + ఏల వచ్చెదవు = నీవు ఎందుకు వచ్చెదవు ?
2. నీవు + ఏ వేళ వచ్చెదవు = నీవు ఏ సమయంలో వచ్చెదవు ?
ఇట్లా ఒకే వాక్యంలో రెండు గానీ అంతకుమించి గానీ అర్థాలను కూర్చడమే శ్లేషాలంకారం.

Exam Tips:

a) శ్లేష సమన్వయంలో ప్రతి పదానికి రెండు అర్థాలు రాసి, తర్వాత రెండు వాక్యార్థాలు వేర్వేరుగా రాయాలి.
b) చివర శ్లేషాలంకార లక్షణం (నానార్థాలను కలిగి ఉండేది శ్లేష) తప్పక రాయండి.

 

Question 5: క్రింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.
అ) మావిడాకులు తెచ్చివ్వండి. ఆ) వాడి కత్తి తీసుకోండి. ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.

Answer:

అ) మావిడాకులు తెచ్చివ్వండి.
1. మామిడి ఆకులను తెచ్చి ఇవ్వమని ఒక అర్థం.
2. మా ‘విడాకులను’ తెచ్చి ఇవ్వమని మరొక అర్థం స్ఫురిస్తుంది. ఇది శ్లేషాలంకారం.
ఆ) వాడి కత్తి తీసుకోండి.
1. వాడి యొక్క కత్తిని తీసుకోమని ఒక అర్థం.
2. వాడియైన (పదును గల) కత్తిని తీసుకోమని మరొక అర్థం. ఇది శ్లేషాలంకారం.
ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.
1. ఆమె, లత అనే అమ్మాయి పక్కన నిలుచున్నది (ఒక అర్థం).
2. ఆ మెలత (స్త్రీ) పక్కన నిలుచున్నది (రెండవ అర్థం). ఇది శ్లేషాలంకారం.

Exam Tips:

a) ప్రతి వాక్యానికి రెండు అర్థాలు రాసి, ‘ఇది శ్లేషాలంకారం’ అని గుర్తించండి.
b) పదాన్ని ఎలా విడదీస్తే రెండవ అర్థం వస్తుందో (మావిడాకులు = మామిడి ఆకులు / మా విడాకులు) చూపండి.

 

ప్రాజెక్టు పని

Question 1: వార్తా పత్రికలు లేదా మ్యాగజైన్‌లలో వచ్చిన పుస్తక పరిచయాలను / సమీక్షా వ్యాసాలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

Answer:

బతుకు పుస్తకం అనేది సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోనిది. బతుకు పుస్తకం లక్ష్మణరావుగారి జీవితచరిత్ర. ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది.
‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావు గారు రచించిన ‘అతడు-ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది.
లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.
లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగపడని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.
మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

Exam Tips:

a) నివేదికలో పుస్తకం పేరు, రచయిత, ప్రచురించిన పత్రిక, సమీక్షలోని ముఖ్యాంశాలు, మీ అభిప్రాయం ఉండాలి.
b) సేకరించిన సమీక్షల క్లిప్పింగులను జతచేసి తరగతిలో ప్రదర్శించాలని గుర్తుంచుకోండి.

 

విశేషాంశాలు

1. హైదరాబాద్ రాజ్యం : 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజాం-ఉల్-ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొగలాయీ చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాద్ రాజ్యాన్నే ‘హైదరాబాద్ సంస్థానం’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి.
2. తెలంగాణ రైతాంగ పోరాటం : వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946–51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమికోసం – భుక్తి కోసం – బానిసత్వ విముక్తికోసం పేదరైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
3. దేవిడీ : నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ‘దేవిడీ’లు అనే పేరుతో పిలిచేవారు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాద్ పాతనగరంతోపాటు తెలంగాణలోని పలు పట్టణాలలోనూ పాతబడిన దేవిడీలు కనబడతాయి.
4. పాన్‌దాన్ : తాంబూలం వేసుకునేవారు తమలపాకులతోపాటు సున్నం, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్దిపెట్టుకునేవారు. దానిని ‘పాన్‌దాన్’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది ఉర్దూపదం.
5. కోహినూర్ : గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనులలో దొరికిన ఈ కోహినూర్ వజ్రం కుతుబ్‌షాహీల కాలంలో ప్రసిద్ధి పొందింది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోనే అత్యంత విలువైనది, విశిష్టమైనది.

సూక్తి : మంచిపుస్తకం మంచిమనసుకు మరోపేరు; సొంతపుస్తకం మంచి మనిషికి మరోతోడు.

చదువండి – తెలుసుకొండి: విశ్వకవి ‘గీతాంజలి’

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రుని పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన’ గీతం, ‘గీతాంజలి’. ‘జనగణమన’ గీతం భారత జాతీయగీతంగా గుర్తింపబడింది.
బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా ఇతని లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయగీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు. ‘శాంతినికేతన్’ పేరున ఆదర్శవిద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డాడు. ఈ సంస్థద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించాడు.
కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన ‘గీతాంజలి’. 1913లో దీనికి ‘నోబెల్ సాహిత్య పురస్కారం’ దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు. ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోకి మాత్రమేకాక ఎన్నో విదేశీ భాషలలోకి అనువదింపబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.
‘గీతాంజలి’లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.
1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు చాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు. – చలం
2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన. నా సుఖదుఃఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి. పేదలను కాదనకుండా, అధికారదర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు. నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె. భాగ్యలక్ష్మి

పదాలు – అర్థాలు

భూమిక = పీఠిక, ముందుమాట (స్థానం అనే అర్థం కూడా ఉంది)
సాయుధ = ఆయుధాలతో కూడిన
విరివిగా = ఎక్కువగా
ధ్యాస = ఆలోచన, దృష్టి
విశ్లేషణ = వివరణ
చిత్రించబడ్డాయి = వివరించబడ్డాయి
విజృంభించి = అతిశయించి
దివాన్ = మంత్రి (ప్రధానమంత్రి)
జనాభా = ప్రజల సంఖ్య
కోఠీ = పెద్ద భవనం, మేడ
అంతర్యుద్ధం = ఒకే దేశంలోని వర్గాల మధ్య లోలోపల జరిగే యుద్ధం
ఒప్పందం = ఒడంబడిక
రిటైర్ = పదవీ విరమణ
విశిష్ట స్థానం = ప్రత్యేక స్థానం
సంక్షుభిత = కల్లోలమైన, చిన్నాభిన్నమైన
నిర్దిష్టం = నిర్దేశించబడిన
వెలువడింది = వచ్చింది
అంకితం = ఒక గ్రంథమును వ్రాసి మఱియొకరి పేర కృతి ఇచ్చుట
అపూర్వము = అపురూపము, క్రొత్తది
ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట
నేపథ్యం = వెనుక ఉన్న పరిస్థితి; నాట్య రంగమందు తెర లోపలి ప్రదేశం
తమస్ = చీకటి
పరిణామాలు = మార్పులు
ప్రోగ్రాం = కార్యక్రమము
మహోన్నతము = గొప్పదైన
అతీతంగా = మించి, దాటి
పొడసూపితే = కలిగితే
సున్నితమైన = మృదువైన
అతలాకుతలం = నలుగుట, శ్రమము, చెదరిపోవుట
సౌలభ్యం = సులభత్వం
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

పాఠం ఉద్దేశం

ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘నెల్లూరి కేశవస్వామి ఉత్తమకథలు’ సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.

ప్రక్రియ – పీఠిక

ఈ పాఠం ‘పీఠిక’ ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

రచయిత పరిచయం

రచయిత : గూడూరి సీతారాం
నివాసం : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట
జననం : 18.07.1936; మరణం : 25.09.2011
రచనలు : 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. కొన్ని మాత్రమే ప్రస్తుతం దొరుకుతున్నాయి. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం మొదలైనవి ఇతర రచనలు.
ప్రత్యేకత : తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.
విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్‌చంద్, కిషన్ చందర్‌లతో పోల్చదగినవారు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 10 Telugu Lesson 12 Bhoomika (Preface)

Chapter Exercise Answers for Class 10 Telugu

Access structured TS Board textbook solutions for Lesson 12 Bhoomika (Preface). Designed in alignment with the latest academic curriculum for Class 10 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Lesson 12 Bhoomika (Preface)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 12 Bhoomika (Preface) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 10 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Telugu.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 12th Lesson భూమిక in printable PDF format for offline study on any device.