TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

Download TS Board Solutions for Class 10 Telugu Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam

Access comprehensive textbook solutions for Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam using the official curriculum guides for Class 10 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

View or download the dedicated Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 109)

కం. తనకోపమె తన శత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁ
దనసంతోషమె స్వర్గము
తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

Question 1: ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ? ఎందుకు ?

Answer:

ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు. కోపం అంతర్గతమైన శత్రువు. ఇది సకల అనర్థాలను కలిగిస్తుంది. బంధువులను, ఆప్తులను, మిత్రులను దూరం చేస్తుంది. రోగాలను కల్గిస్తుంది.

Exam Tips:

a) కవి ‘కోపం’ అనే అంతః శత్రువును పేర్కొన్నాడని చెప్పి, కారణంగా అది సకల అనర్థాలకు మూలమనీ బంధుమిత్రులను దూరం చేస్తుందనీ రాయండి.
b) పద్యంలోని మొదటి పాదం ‘తనకోపమె తన శత్రువు’ ను ఉదహరించండి.

 

Question 2: శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి ?

Answer:

శాంతి మానవాళికి రక్షణకవచంలా ఉంటుంది. శాంతం ఉంటే మనకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవ మర్యాదలను వృద్ధి పొందింపజేస్తుంది. ఆప్తులను, బంధువులను దూరం చేయదు. పనులు త్వరగా అవుతాయి. ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి. యుద్ధోన్మాదాలు కలుగవు. అందువల్ల శాంతి అనేది కేవలం శరీరానికేకాదు, సకల సమాజానికి రక్షణగా ఉంటుంది. “తనశాంతమె తనకు రక్ష” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పాడు.

Exam Tips:

a) శాంతం రక్షణకవచంలా ఎలా పనిచేస్తుందో రెండు మూడు ప్రయోజనాలతో రాయండి (గౌరవం, ఆప్తులు దూరం కాకపోవడం, పనులు త్వరగా కావడం).
b) ‘తనశాంతమె తనకు రక్ష’ అనే సుమతీ శతక పాదంతో ముగించండి.

 

Question 3: సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు ?

Answer:

మానవునికి సంతోషం స్వర్గంలాంటిది. సంతోషంగా ఉండడంవల్ల సమస్యలు తొలగిపోయి అంతటా ఆనందం వెల్లివిరుస్తుంది. తృప్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అరిషడ్వర్గాలకు లోనుకాడు. అందువల్లనే సంతోషాన్ని స్వర్గంగా కవి భావించాడు. “తన సంతోషమే తన స్వర్గము” అని కవులు చెప్పారు.

Exam Tips:

a) సంతోషం వల్ల కలిగే మార్పులు (సమస్యలు తొలగడం, తృప్తి, ఇంద్రియ నిగ్రహం) స్వర్గసుఖంతో ఎలా సమానమో చెప్పండి.
b) ‘తన సంతోషమె తన స్వర్గము’ అనే పద్య పాదాన్ని ఉదహరించండి.

 

Question 4: కోపంవల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా ? చెప్పండి.

Answer:

కోపం వల్ల ఓర్పు పోతుంది. ఎదుటి వారిని అనకూడని మాటలు అంటాము. దాని మూలంగా పనులు చెడతాయి. అందరూ శత్రువులౌతారు. కోపం వల్ల జరిగే నష్టాన్ని చెప్పే కథ ఒకటి పంచతంత్రంలో ఉంది.
ఒక రైతు తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ముంగిసను తన బిడ్డకు కాపలాగా ఉంచి బయటకు వెళ్ళాడు. ఈలోపు పాము ఇంట్లోకి రావడం చూసి బిడ్డను కాపాడడానికి ముంగిస ఆ పామును కరచి చంపింది. ఇంతలో రైతు ఇంటికి వచ్చాడు. ముంగిస యజమానిని చూసిన ఆనందంలో అతనికి ఎదురు వచ్చింది. దాని నోటికి, ఒంటికి ఉన్న రక్తం మరకలు చూసి, బిడ్డను చంపిందనుకొని కోపంతో రైతు ముంగిసను కర్రతో కొట్టి చంపాడు. ముంగిసను చంపి, ఇంటిలోపలికి వెళ్ళి చూస్తే, బిడ్డ హాయిగా పడుకొని ఉన్నాడు. చచ్చిపడివున్న పాము కనబడింది. తన బిడ్డను రక్షించిన ముంగిసనే ఒళ్ళు తెలియని కోపంతో చంపానని రైతు వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

Exam Tips:

a) పంచతంత్రంలోని రైతు – ముంగిస కథను క్లుప్తంగా, క్రమంగా రాయండి (కాపలా, పాము, రక్తపు మరకలు, కోపంతో చంపడం, పశ్చాత్తాపం).
b) కథ చివర ‘కోపం వల్ల వివేకం నశిస్తుంది’ అనే నీతి రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 111)

Question 1: ప్రాచీనకాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు ?

Answer:

సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాస మహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి.
సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు.

Exam Tips:

a) భిక్షాటనం ధర్మశాస్త్ర విధి అని, సన్యాసులు, బ్రహ్మచారులు దాచుకోకూడదని చెప్పే కారణాలను రాయండి.
b) పంచభిక్ష, ఉపనయనంలో తల్లి నుండి భిక్ష స్వీకరించడం వంటి ఉదాహరణలు జవాబును బలపరుస్తాయి.

 

Question 2: భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలను చర్చించండి.

Answer:

భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్పగంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘారం చేసి, పిండివంటలతో భక్తి విశ్వాసాలతో అతిథులకు పెట్టేవారు.
ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొద్దిమంది మాత్రమే ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోవడం కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దానధర్మాలు బాగా తగ్గిపోయాయి.

Exam Tips:

a) ‘పూర్వం – ఇప్పుడు’ అని రెండు భాగాలుగా తేడాలను వేర్వేరుగా రాయండి.
b) పూర్వం భక్తిశ్రద్ధలు (ముగ్గు, అర్ఘ్యపాద్యాలు, పూజ), నేడు విసుగు, నేరంగా పరిగణించడం అనే అంశాలను తప్పక పేర్కొనండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 113)

Question 1: భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి ?

Answer:

వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు. వ్యాసుడు కోపించడం ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు.
కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

Exam Tips:

a) ఇది అభిప్రాయ ప్రశ్న; వ్యాసుని పాండిత్యం (వేదవిభజన, పురాణాలు) చెప్పి, అంతటివాడు కోపించడం తగదని కారణాలతో రాయండి.
b) తాపసులు నివ్వరి బియ్యం, కందమూలాలతో జీవించడం వంటి ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 2: “ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది” దీన్ని గురించి మాట్లాడండి.

Answer:

మనిషికైనా, జంతువుకైనా, ఏ ప్రాణికైనా ఆకలి వేసినపుడు తిండి కావాలి. అది శరీరానికి ప్రాథమిక అవసరం. తిండి లేకపోతే కడుపులో మంట వస్తుంది. తలపోటు, చిరాకు, కోపం వస్తాయి. ఆ పరిస్థితులలో మనిషి విచక్షణ కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు.

Exam Tips:

a) ఆకలి శారీరక అవసరమని, తిండి లేకపోతే చిరాకు, కోపం వచ్చి వివేకం పోతుందని వరుసగా రాయండి.
b) వ్యాసుని ఉదాహరణ ఇస్తే జవాబు పాఠానికి అనుసంధానమవుతుంది.

 

Question 3: ఉన్న ఊరును కన్నతల్లితో సమానమని ఎందుకు అంటారు ? (A.P Mar. ’16)

Answer:

కన్నతల్లి మనకు కావలసిన దానిని తాను గుర్తించి మన కడుపు నింపుతుంది.
కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.
అలాగే మనం ఉన్న ఊరు కూడా మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది.
మనం ఉన్న ఊరిలో ప్రజలు అందరూ మనకు తెలిసినవారే ఉంటారు. వారు తోటి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నారు.
కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గంతో సమానం.

Exam Tips:

a) కన్నతల్లి – ఉన్న ఊరు పోలికను రెండు మూడు కారణాలతో వివరించండి (పోషించడం, ప్రేమ, ఆదరణ).
b) ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అనే సూక్తిని తప్పక ఉదహరించండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 114)

Question 1: భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది ?

Answer:

గృహిణి వ్యాసుడిని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు తానొక్కడినే భోజనానికి రానని, శిష్యులు పస్తులుండగా తానొక్కడినే తినడం మంచిది కాదని చెప్పాడు. దీనివల్ల వ్యాసునికి తన శిష్యులపట్ల ప్రేమానురాగాలు కలవని, అందరూ ఆకలితో ఉంటే ఒక్కడినే తినడం మంచిదికాదని వ్యాసుని మాటల వల్ల అర్థమైంది.

Exam Tips:

a) వ్యాసుడు శిష్యులు పస్తుండగా తానొక్కడే తినను అన్న మాటను ఆధారంగా చూపి, అతని ప్రేమ, వ్రతనిష్ఠలను రాయండి.

 

Question 2: ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధాల గురించి వివరించండి.

Answer:

ఈ పాఠం ఆధారంగా అలనాటి గురుశిష్య సంబంధాలు జాతికి ఆదర్శంగా నిలుస్తాయి. శిష్యులు గురువుపై గౌరవాన్ని చూపేవారు. గురువు కూడా శిష్యులపై ప్రేమను, వాత్సల్యాన్ని చూపేవారు. శిష్యులు పస్తులుండగా గురువు ఆహారాన్ని స్వీకరించేవాడు కాదని తెలుస్తుంది.

Exam Tips:

a) గురుశిష్యుల పరస్పర గౌరవం, ప్రేమ, వాత్సల్యం – రెండు వైపులా రాయండి.
b) పాఠంలోని ఘట్టాన్ని (శిష్యులు ఉపవాసం ఉండగా గురువు తినకపోవడం) ఉదహరించండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: క్రింది పద్యం చదవండి. శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకొన్నాడో తెల్పండి.
సీ. వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయవాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాక్రుచ్చు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు
తే.గీ. నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ
మంకితముసేయు వీరభద్రయ్యపేర (కాశీ 1-18)

Answer:

ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.
1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె, ఒక్కొక్కసారి “ఉద్దండ లీల”గా కవిత్వం చెపుతాడు.
2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె “ఉభయ వాక్ప్రౌఢి”తో కవిత్వం రాస్తాడు.
3. ఒకసారి తిక్కన గారి వలె ‘రసాభ్యుచిత బంధము’గా రాస్తాడు.
4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె “సూక్తి వైచిత్రి”ని చూపిస్తాడు.
5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.

Exam Tips:

a) పద్యంలో శ్రీనాథుడు తన కవితను భీమన, నన్నయ, తిక్కన, ఎఱ్ఱనలతో పోల్చుకున్నాడు; ప్రతి కవి పేరుకు ఎదురుగా అతని లక్షణాన్ని (ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తివైచిత్రి) జతచేసి రాయండి.

 

Question 2: ‘అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.

Answer:

‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి. దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది.
ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా, ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది. అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం.

Exam Tips:

a) అన్నదానం గొప్పదనే వాదనకు కారణాలు: తృప్తి, ప్రాణం నిలబడడం, ఇతర దానాలలో తృప్తి ఉండకపోవడం.
b) చర్చ ప్రశ్న కాబట్టి ఆరంభంలో దానం అంటే ఏమిటో చెప్పి, ముగింపులో మీ అభిప్రాయం రాయండి.

 

Question 3: “ఆకంఠంబుగ ….. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!” పదాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని వ్రాయండి. (Mar. ’16)

Answer:

శా.
ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే !
నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ !
భావం : ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది నీకు మంచిదా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ళవద్ద బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువ వాళ్ళా ?

Exam Tips:

a) పద్యాన్ని పాదభంగం లేకుండా పూర్తిగా రాయండి (నాలుగు పాదాలు); తర్వాత భావాన్ని సొంత మాటల్లో రాయండి.
b) పద్యంలో ‘నీవార ముష్టింపచులు, శాకాహారులు, కందభోజులు, శిలోంఛప్రక్రములు’ అనే నాలుగు తాపస రకాలను పేర్కొనండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : ఐదేసి వాక్యాల్లో జవాబులు

Question 1: పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాన్ని వ్రాయండి.

Answer:

“భిక్ష” పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరును పరిశీలించగా ఎంతటి వారికయినా ఆకలిబాధ భరించరానిది అని అర్థమవుచున్నది. ఈ ఆకలి బాధచే వేదాలను నాలుగు విధాలుగా విభజించిన వేదవ్యాసుడు కోపానికి లోనయ్యాడు. కోపం వలన మంచి చెడుల విచక్షణను కోల్పోయి కాశీనగరాన్ని శపించబోయాడు.
అంతేగాకుండా సకలశాస్త్రాలను చదివి, వాటి సారాన్ని తెలుసుకున్న వ్యాసుడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకని కారణంగా తీవ్రకోపానికి లోనై తన చేతిలోని భిక్షపాత్రను నేలకేసి విసిరిగొట్టెను.
కనుక కోపం చాలా ప్రమాదకరమయినది. కోపం మానవునికి అంతర్గత శత్రువు. కోపం మన ప్రశాంతతను దెబ్బ తీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలనీ వ్యాసుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు.

Exam Tips:

a) ఐదు వాక్యాల్లో: వ్యాసుని పాండిత్యం → ఆకలి → కోపం → శాపం → నీతి అనే క్రమంలో రాయండి.
b) ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం అవసరమని ముగిస్తే మంచిది.

 

Question 2: “నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? వీటి అంతరార్థమేమిటో వివరించండి.

Answer:

పరిచయం : ఈ మాటలు శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం నుండి గ్రహించిన “భిక్ష” పాఠంలోనివి.
సందర్భం : వ్యాసుడు కాశీనగరాన్ని శపించబోయినప్పుడు ముత్తైదువ వేషంలో ఉన్న పార్వతీదేవి (అన్నపూర్ణ) అతనిని మందలించి, భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు ఆమెతో – శిష్యులు పదివేలమంది ఆకలితో ఉండగా తాను ఒక్కడే వ్రతం తప్పి భుజించలేనని చెపుతూ ఈ మాటలు అన్నాడు.
భావము : ఈ రోజు నిన్నటికి మరునాడే కదా !
అంతరార్థం : అంటే ఈ రోజు నాకు భిక్ష లభించకపోతే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని వ్యాసుని మాటల్లోని అంతరార్థము.

Exam Tips:

a) ఎవరు (వ్యాసుడు), ఎవరితో (పార్వతీదేవి), ఏ సందర్భం (భోజనానికి ఆహ్వానించినప్పుడు) – మూడింటినీ విడిగా రాయండి.
b) అంతరార్థం: ఈ రోజూ నిన్నటిలాగే ఉపవాసం అని స్పష్టంగా చెప్పండి.

 

Question 3: ఆకలి వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు కదా ! “ఆకలి మనిషి విచక్షణను నశింప జేస్తుంది” అనే దాని గురించి రాయండి.

Answer:

వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. కాశీని శపించాలనుకొన్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జయించలేడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి.
తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వాటివలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకొంటాడు. రాక్షసుడుగా మారతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. అందుకే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

Exam Tips:

a) వ్యాసుని ఉదాహరణతో మొదలుపెట్టి, ఆకలి శరీరంలో కలిగించే మార్పులు, వాటి వల్ల విచక్షణ పోవడం, ‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలి’ అనే ముగింపు రాయండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : పది వాక్యాల్లో జవాబులు

Question 1: “భిక్ష” పాఠంలోని కథను సంక్షిప్తంగా వ్రాయండి. (A.P June’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి.

Answer:

వ్యాసమహర్షి శిష్యులతో కూడి కాశీ నగరంలో నివసిస్తున్నాడు. ఒకసారి వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటనకై బయలుదేరాడు. శివుని యోగమాయతో వ్యాసునికి గాని, అతని శిష్యులకు గాని భిక్ష లభించలేదు. ఏ ఇల్లాలు కూడా భిక్షను వేయలేదు.
వాస్తవంగా కాశీ నగరంలోని ఇల్లాండ్రు అన్నపూర్ణా దేవికి చెలికత్తెలు. వారంతా అతిథులను గౌరవిస్తారు. కాని రెండు రోజుల పాటు భిక్ష దొరకలేదు.
వ్యాసుడు తీవ్రమైన కోపాన్ని పొందాడు. కాశీ నగరంలోని ప్రజలను శపించబోయాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీ వలె వ్యాసుని ముందుకు వచ్చింది. అతనితో “మహర్షీ ! నీవు కాశీపై కోపగించుట తగునా ? నీవు శాంత స్వభావం కలవాడివా ? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చే, శాకాహారంతో జీవించే తాపసుల కంటే నీవు గొప్పవాడివా ? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే ధర్మాన్ని మరిచిపోయావా ? ఆకలితో ఉన్న నిన్ను ఇంకా మాటలతో బాధపెట్టడం తగదు. నీవు వెంటనే భోజనానికి రమ్ము. తరువాత నీకు కొన్ని మాటలు చెప్పాలి” అని పలికింది.
వ్యాసుడు ఆ మాటలను విని “అమ్మా ! నా శిష్యులు, ఇతరులు మొత్తం పదివేల మంది ఉన్నారు. వారందరూ తినకుండా నేను భోజనం చేయటం మంచిది కాదు” అని పలికాడు. అది విని అన్నపూర్ణాదేవి “మహర్షీ ! నీతోపాటు నీ శిష్యులు కలసి రావలసినది. విశ్వనాథుని అనుగ్రహంతో మీకందరికీ రుచికరములైన ఆహారాన్ని అందిస్తాను” అని పలికింది. వ్యాసుడు అంగీకరించి శిష్యులతో కలిసి అన్నపూర్ణాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనశాలలో భోజనం చేశాడు.

Exam Tips:

a) కథను సంఘటనల క్రమంలో రాయండి: భిక్ష దొరకకపోవడం → శాపం → పార్వతి మందలింపు → వ్యాసుని సమాధానం → భోజనం.
b) పది వాక్యాలలో ముగించండి; పద్యాలను అలాగే కాపీ చేయకండి.

 

Question 2: కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.

Answer:

మనం జయించవలసిన మనలోని శత్రువులు ఆరు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవి
1. కామం,
2. క్రోధం,
3. లోభం,
4. మోహం,
5. మదం,
6. మాత్సర్యం.
ఈ ఆరు అంతః శత్రువులను జయించినవాడే మహనీయుడు అవుతాడు. వీటిలో ప్రధానమైన శత్రువు క్రోధం. అదే కోపం. ‘తన కోపమే తన శత్రువు – తన శాంతమే తనకు రక్ష’ అని శతకకర్త ఎప్పుడో చెప్పాడు. ‘కోపమునను ఘనత కొంచెమై పోవును’ అని కూడా మహాకవి చెప్పాడు.
కోపాన్ని జయించి సహనాన్ని, శాంతాన్ని అలవరచుకోవడం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తే తప్ప కోపాన్ని జయించలేం. భృగు మహర్షి, విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి గొప్ప మహర్షులు సహితం ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. కోపాన్ని జయించలేక తమను తాము తగ్గించుకొన్నారు. ఈ కోపం మనిషిని క్షణికావేశానికి లోను చేసి ఎన్నో అనర్థాలకు కారణమౌతుంది.
బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వేదవ్యాస మహర్షి ఆకలి బాధ తాళలేక కోపానికి వశుడై, పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే – కోపం ఎంతటి వారినైనా విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుందనేదానికి నిదర్శనం. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. ప్రతి ఒక్కరూ అంతః శత్రువైన కోపాన్ని జయించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. ఆనాడే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది.
“కోపాన్ని జయించండి – ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి”

Exam Tips:

a) అరిషడ్వర్గాలను (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం) తప్పక జాబితాగా రాయండి.
b) కోపం వల్ల కలిగే నష్టాలకు వ్యాసుని ఉదాహరణ ఇచ్చి, కోపాన్ని జయించాలనే సందేశంతో ముగించండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత : సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయడం

Question 1: భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష… వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత వ్రాయండి.

Answer:

సకల శుభదాయక కల్పవల్లీ
జనులందరికీ జ్ఞాన భిక్ష ప్రసాదించు
నీ కృపారస దృష్టే జనులందరికీ రక్ష
అదే మాకందరికీ జీవన రక్ష.
జీవన పోరాట పరీక్షలెన్నో ఉన్నాయి
పరీక్షలన్నింటిలో నీ రక్షతో గెలవాలి మేము
నవ సమాజంలో ఎన్నో వివక్షలు
కక్షలేని రహదారులు లేవెక్కడ
నిరక్షరాస్యులైన నిర్భాగ్యులెందరో
వారందరినీ చూడుము నిష్పక్షపాతంగా
సమీక్షలు లేని ప్రభుత్వ పథకాలెన్నో
దూరమవుతున్నాయి నిర్భాగ్యులకు
నాగరిక సమాజంలో ఎన్నో వివక్షలు
కనిపించని మానవ నైతిక సంబంధాలు
తల్లీ ! ఇక రక్షించు ! నీవైనా !
మా కందరికీ పంచిపెట్టు జ్ఞానభిక్ష !

Exam Tips:

a) ఇచ్చిన అయిదు పదాలూ (భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష) కవితలో తప్పక ఉపయోగించండి.
b) కవితకు ఒక భావం ఉండాలి; ప్రతి పాదం ప్రాసతో ముగిస్తే చక్కగా ఉంటుంది.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె
ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ
ఈ) ఇవ్వీటిమీద నాగ్రహము తగునె ?
ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.

Answer:

అ) వనిత = మహిళ, స్త్రీ, పడతి, ఉవిద, నారి, పురంధ్రి, అంగన, మగువ
ఆ) పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి, సువర్ణం, కనకము, హిరణ్యము
ఇ) పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సాత్యవతేయుడు
ఈ) ఆగ్రహము = కోపము, క్రోధము, అలుక, ఉద్రేకం, రోషము
ఉ) అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, ప్రభాకరుడు, ఆదిత్యుడు, ఇనుడు

Exam Tips:

a) పర్యాయపదాలు ఒకే అర్థం ఇచ్చే వేర్వేరు పదాలు; గీత గీసిన పదానికే రాయండి.
b) కనీసం నాలుగైదు పదాలు రాయండి.

 

Question 2: క్రింది పదాల అర్థాలను రాయండి.
అ) ద్వాఃకవాటము
ఆ) వీక్షించు
ఇ) అంగన
ఈ) మచ్చెకంటి
ఉ) భుక్తిశాల

Answer:

అ) ద్వాఃకవాటము = ద్వారబంధము
ఆ) వీక్షించు = చూచు
ఇ) అంగన = స్త్రీ
ఈ) మచ్చెకంటి = చేపకనులు గల స్త్రీ
ఉ) భుక్తిశాల = భోజనశాల

Exam Tips:

a) పదానికి సరళమైన అర్థం ఒక్క మాటలో లేదా ఒక్క వాక్యంలో రాయండి.
b) సంధి పదాలను (ద్వాఃకవాటము, భుక్తిశాల) విడదీసి అర్థం ఆలోచిస్తే సులభం.

 

Question 3: క్రింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.
అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. (A.P Mar. ’16)

Answer:

అ) ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
వీడు (నానార్థాలు) :
1. ఈ మనుష్యుడు
2. పట్టణము
3. వదలుట
ఆ) ఈ వాక్యంలో ‘రాజు’ అనే పదం రెండు అర్థాల్లో వాడబడింది.
రాజు (నానార్థాలు) :
1. క్షత్రియుడు (ప్రభువు)
2. చంద్రుడు

Exam Tips:

a) నానార్థాలు: ఒకే పదం వేర్వేరు అర్థాలలో వాడటం; ప్రతి అర్థాన్నీ సంఖ్యతో రాయండి.
b) వాక్యంలో ఆ పదం ఎన్ని సార్లు, ఏ అర్థాలలో వచ్చిందో గమనించండి.

 

Question 4: క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య ( )
క) విదియ
చ) విజ్జ
ట) విద్దె
త) విద్య
ఆ) భిక్ష ( )
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
ఇ) యాత్ర ( )
క) యతర
చ) జాతర
ట) జైత్ర
త) యతనము
ఈ) మత్స్యము ( )
క) మచ్ఛీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
ఉ) రత్నము ( )
క) రతనము
చ) రచ్చ
ట) రచ్చము
త) రత్తము
ఊ) పంక్తి ( )
క) పంతులు
చ) పత్తి
ట) బంతి
త) పంకు

Answer:

అ) ట) విద్దె
ఆ) త) బిచ్చము
ఇ) చ) జాతర
ఈ) ట) మచ్చెము
ఉ) క) రతనము
ఊ) ట) బంతి

Exam Tips:

a) ప్రకృతి = మూల (సంస్కృత) రూపం, వికృతి = తెలుగులో మారిన రూపం (భిక్ష → బిచ్చము, రత్నము → రతనము, యాత్ర → జాతర).
b) సరైన ఎంపిక అక్షరాన్ని (క, చ, ట, త) పదంతో సహా రాయండి.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు

Question 1: కింద గీత గీసిన పదాల్లోని సంధులను గుర్తించి సంధి పేరు రాయండి.
అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె ?
ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య

Answer:

అ)
1. పుణ్య + అంగన = పుణ్యాంగన (సవర్ణదీర్ఘ సంధి)
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
2. భిక్ష + ఇడదయ్యె = భిక్షయిడదయ్యె (యడాగమ సంధి)
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
3. ఇడదయ్యెన్ + కటా = ఇడదయ్యెఁ గటా (ద్రుతప్రకృతిక సంధి / సరళాదేశ సంధి)
సూత్రాలు : 1. ద్రుతప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి. 2. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఆ)
1. కాశి + ఇవ్వీటి = కాశి యివ్వీటి (యడాగమ సంధి)
ఈ + వీటి = ఇవ్వీటి (త్రికసంధి)
త్రికసంధి సూత్రాలు : 1. ఆ, ఈ, ఏ లు త్రికములు. 2. త్రికము మీదున్న అసంయుక్త హల్లునకు ద్విత్వ బహుళంగా వస్తుంది. 3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘానికి హ్రస్వం.
2. ఆగ్రహము + తగునె = ఆగ్రహము దగునె (గసడదవాదేశ సంధి)
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.
ఇ)
1. ముని + ఈశ్వర = మునీశ్వర (సవర్ణదీర్ఘ సంధి)
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
2. వినవు + అయ్య = వినవయ్య (ఉత్వ సంధి)
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది.

Exam Tips:

a) సంధి విడదీసి, ఏ సంధో చెప్పి, సూత్రం రాయండి – మూడూ కలిపి మార్కులు వస్తాయి.
b) అచ్చు + అచ్చు కలిస్తే (పుణ్య + అంగన) సవర్ణదీర్ఘ; వినవు + అయ్య ఉత్వ సంధి; భిక్ష + ఇడదయ్యె యడాగమం అని గుర్తుంచుకోండి.

 

Question 2: పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి.
అ) మునీశ్వర ! ……….. నా గ్రహముదగునె ?

Answer:

1వ పాదం
గణంహభసలహహ
గురులఘువులుUIUIIIIUIUIUI
అక్షరాలుఓ మునీశ్వర !వినవయ్యయున్నయూరుఁ
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
2వ పాదం
గణంహభరహహ
గురులఘువులుUIUIIUIUUIUI
అక్షరాలుగన్నతల్లియునొక్కరూపన్నరీతి
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
3వ పాదం
గణంనతనగహహ
గురులఘువులుIIIUUIIIIUUIUI
అక్షరాలుయటు విశేషించిశివుని యర్ధాంగలక్ష్మి
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
4వ పాదం
గణంహతరనన
గురులఘువులుUIUUIUIUIIIIII
అక్షరాలుకాశియివ్వీటిమీద నాగ్రహముదగునె ?
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య

పై పద్యంలోని ప్రతి పాదంలో ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వరసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం.
ఇది ఉపజాతి.
ప్రాసనియమం ఉండదు.
ఒకటవ గణం మొదటి అక్షరానికి నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.

Exam Tips:

a) ప్రతి పాదంలో గణాల వరుస (1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య) చూపి, యతి, ప్రాస నియమం రాయండి.
b) తేటగీతి లక్షణం: ప్రాస నియమం లేదు; 1వ గణం, 4వ గణం మొదటి అక్షరాలకు యతి.

 

సీసపద్యం

క్రింది తరగతులలో తేటగీతి, ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘సీస పద్య’ లక్షణాలను పరిశీలిద్దాం. క్రింది ఉదాహరణను పరిశీలించండి.
ఉదా :

1వ పాదం
గణంరసలరసలనగనగనహ
గురులఘువులుUIUIIUIUIUIIUIIIIUIIIUIIIUI
అక్షరాలుకాకతీయులకంచుగంటమ్రోగినాడుకరకు రాజులకు తత్తరలుపుట్టె
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య
2వ పాదం
గణంతరరసలసలసలహన
గురులఘువులుUUIUIUUIUIIUIIIUIIIUIUIIII
అక్షరాలుకాపయ్యనాయకుండేపుసూపిననాడుపరరాజులకు గుండెపట్టుకొనియె
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య

సీసపద్య లక్షణం :
ఇందులో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది. రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాసనియమం లేదు.
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.
పై పద్యపాదాల్లో –
1. ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
2. రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
3. యతి, ప్రాస యతులు (కా – గ, ర – ర) (ప – పు, ప – ప) ఉన్నాయి.
4. ప్రాసనియమం లేదు.
వీటిని బట్టి ఇది సీసపద్యం అని గుర్తించవచ్చు.

Question 1: పాఠంలోని సీసపద్యానికి గణవిభజన చేసి లక్షణాలను అన్వయించండి.

Answer:

సీసపద్యం – గణవిభజన (1వ పాదం)

1వ పాదం
గణంభరసలసలనగసలహహ
గురులఘువులుUIIUIUIIUIIIUIIIIUIIUIUIUI
అక్షరాలుముంగిటగోమయంబునగోముఖముదీర్చికడలునాల్గుగ మ్రుగ్గుకఱ్ఱవెట్టి
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య

6 ఇంద్రగణాలు + 2 సూర్య గణాలు

2వ పాదం

2వ పాదం
గణంనగతరసలరభహహ
గురులఘువులుIIIUUUIUIUIIUIUIUUIIUIUI
అక్షరాలుయతిథినచ్చోనిల్పియర్ఘ్యపాద్యములిచ్చిపుష్పగంధంబులపూజచేసి
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య

6 ఇంద్రగణాలు + 2 సూర్య గణాలు
ఇంద్ర గణాలు : నల, నగ, సల, భ, ర, త
సూర్య గణాలు : న, హ

3వ, 4వ పాదాలు

3వ పాదం
గణంతతనగనలతరనహ
గురులఘువులుUUIUUIIIIUIIIIUUIUIUIIIUI
అక్షరాలుప్రక్షాళితంబైనపసిడిచట్టువముననన్నంబుమీదనెయ్యభిఘురించి
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య
4వ పాదం
గణంసలతనగనగరరహన
గురులఘువులుIIUIUUIIIIUIIIUUIUUIUUIIII
అక్షరాలుఫలపాయసాపూపబహుపదార్థములతోభక్తివిశ్వాసతాత్పర్యగరిమ
గణ రకంఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రఇంద్రసూర్యసూర్య

ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు + 2 సూర్య గణాలు

తేటగీతి – గణవిభజన

1వ పాదం
గణంహసలసలహన
గురులఘువులుUIIIUIIIUIUIIII
అక్షరాలుబెట్టుదురుమాధుకరభిక్షభిక్షుకులకు
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
2వ పాదం
గణంహభతనహ
గురులఘువులుUIUIIUUIIIIUI
అక్షరాలుకంకణంబులతోసూడిగములురాయ
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
3వ పాదం
గణంహనలరనహ
గురులఘువులుUIIIIIUIUIIIUI
అక్షరాలుకమ్రకరములబ్రాహ్మణాంగనలుకాశి
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య
4వ పాదం
గణంహభసలహన
గురులఘువులుUIUIIIIUIUIIII
అక్షరాలునన్నపూర్ణభవానికట్టనుంగుజెలులు
గణ రకంసూర్యఇంద్రఇంద్రసూర్యసూర్య

ప్రతి పాదంలో 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య గణాలు

లక్షణాలు :
1. 4 పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు ఉంటాయి.
3. 3వ గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
4. ప్రాస నియమం లేదు.
5. తేటగీతి దీనికి చివరగా ఉంటుంది.

Exam Tips:

a) సీసపద్యంలో ప్రతి పాదాన్ని రెండు భాగాలుగా చేసి 8 గణాలు (6 ఇంద్ర + 2 సూర్య) గుర్తించండి.
b) చివర తేటగీతి లేదా ఆటవెలది ఉంటుందని, ప్రాస నియమం లేదని రాయండి.

 

ప్రాజెక్టు పని

Question 1: శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు సేకరించండి. (లేదా) కాశీపట్టణ విశేషాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి వినిపించండి.

Answer:

శ్రీనాథుని పద్యాలు (ఉదాహరణలు) :
1. తే.గీ.
ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు
నర్థి దిరుగంగ నేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యానమార్గ జలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు
– భీమఖండము – శ్రీనాథుడు.
2. తే.గీ.
శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగుపెట్టినవాడ వహంకరించి
పొమ్ము ! నిర్భాగ్య మాయూరి పాలము వెడలి
యెచటికేన్ శిష్యులు నీవు నీక్షణంబు
– భీమేశ్వర పురాణము
3. తే.గీ.
గాశికాతీర్థ వాసులఁ గర్మపరులఁ
భూతి రుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణా సమగ్రబుద్ధి
నిట్టులని యానతిచ్చె విశ్వేశ్వరుండు.
కాశీ పట్టణ విశిష్టత : మనదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పరమపావనమైనది, దివ్యమైనది కాశీ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందింది. పరమపావనమైన గంగానది ఇక్కడ ప్రవహిస్తుంది. కాశీలో మరణించినవారికి శివుని సాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది ఎంతో అందమైన ప్రాంతం. నిరంతర వేదఘోష మార్మోగుతుంది. విద్యాలయాలకు నిలయంగా మారింది. అన్నార్తులకు కల్పవల్లిగా విరాజిల్లింది. భారతదేశంలో జన్మించిన ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా కాశీని దర్శించాలని అనుకుంటాడు.
నివేదిక : శ్రీనాథుడు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో కవిసార్వభౌమునిగా గుర్తింపు పొందాడు. కావ్య రచనలో రసపోషణకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చాడు. ఇతనిది వర్ణనాత్మకశైలి. కవిత్వం కొంత ప్రౌఢంగా ఉన్నప్పటికీ కూడా ఆపాతమధురంగా ఉంటుంది. ఇతడు సీసపద్య రచనలో తన విశేష ప్రతిభను ప్రదర్శించాడు.
పాత్రానుగుణమైన శైలి, పదబంధము ఇతని ప్రత్యేకత. ఇతని పద్యాల్లో అంత్యానుప్రాస, ఉత్ప్రేక్ష, రూపకాలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారిలో శ్రీనాథుడినే ప్రథముడుగా చెప్పవచ్చు. ఇతని కవిత్వం ప్రబంధ యుగానికి పునాది వేసింది.

Exam Tips:

a) ప్రాజెక్టు జవాబులో కాశీ విశిష్టత (క్షేత్రం, గంగానది, జ్యోతిర్లింగం) లేదా శ్రీనాథుని పద్యాలు – మీరు ఎంచుకున్నది పూర్తిగా రాయండి.
b) నివేదికలో శీర్షిక, పరిచయం, ముఖ్య విషయాలు, ముగింపు ఉండాలి.

 

విశేషాంశాలు

1. మాధుకరము : మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూలలోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థులు ఇండ్ల నుండి భిక్షను గ్రహించడం. సన్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.
2. బ్రాహ్మీముహూర్తం : సూర్యోదయానికి 90 నిమిషాల ముందుకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి అని కూడా అర్థం. బుద్ధిని పెంపొందించే సమయం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఈ సమయం శ్రేష్ఠమైనది.
3. దేవకార్యము : భగవంతుడికి విశేషంగా చేసే పూజా కార్యక్రమం. రెండోది పితృదేవతా కార్యం. అంటే శ్రాద్ధము. శ్రాద్ధమునాడు భిక్ష సమర్పించరాదనే సంప్రదాయమున్నది.
4. కామధేనువు : (దేవతల ఆవు). కోరిన కోర్కెలను తీరుస్తుంది.
5. కాశి : ప్రపంచంలో అతి పురాతన క్షేత్రం. 5 క్రోశములు వ్యాపించినది. వరుణ, అసి నదుల సంగమ ప్రాంతం కనుక “వారణాసి” అయింది. విశ్వేశ్వరుని ఆలయం కలదు. పార్వతీమాతను అన్నపూర్ణగా కొలుస్తారు. దీనికి మహాశ్మశానమని కూడా పేరు. సప్త మోక్షధామాలలో ఇది ఒకటి.
6. అష్టాదశపురాణాలు : భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద, విష్ణు, వరాహ, వామన, వాయు పురాణాలు.
7. పారణ : ఉపవాసం ఉండి తర్వాత రోజు చేయు భోజనం (ఉపవాసానంతర భోజనం).
8. అతిథి : తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా భోజనానికి వచ్చువాడు.
9. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) పూజకు తగినది. అష్టవిధ అర్ఘ్యములు : 1. పెరుగు, 2. తేనె, 3. నెయ్యి, 4. అక్షతలు, 5. గరిక, 6. నువ్వులు, 7. దర్భ, 8. పుష్పము.
10. పాద్యము : (వ్యుత్పత్తి) పాదములు కడుగుకొనుటకు ఉపయోగించు నీరు.
11. పాపాత్ముని ముఖం చూడడం : దుర్మార్గుల ముఖం చూస్తే చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.
సూక్తి : మేధావి ఎన్నికష్టాలుపడ్డా, శుద్ధమైన నడవడిని, జీవనాన్ని వదలడు. దానివల్లనే అతడు ప్రతిష్టను, ఉత్తమ గతులనూ పొందుతాడు. – మహాభారతం ఉద్యోగపర్వం

ప్రతిపదార్థ తాత్పర్యాలు – పద్యాలు

(శ్రీనాథుడు రచించిన కాశీఖండము, సప్తమాశ్వాసం నుండి గ్రహించిన పద్యాలు, వాటి తాత్పర్యాలు)

1. తే.గీ.
నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.
తాత్పర్యము : విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు, అధికమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. తే.గీ.
వండుచున్నారమను నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
ద్వాఃకవాటంబుఁ దెఱవదు వనిత యొకతె
తాత్పర్యము : ఒక ఇల్లాలు ‘వండుతున్నాం’ అంటున్నది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంటున్నది. ఇంకొకావిడ ఈరోజు వ్రతం (దేవకార్యం) అని చెబుతుంది; వేరొకావిడైతే అసలు తలుపులే తెరవడం లేదు.

3. సీ.
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్య పాద్యము లిచ్చి పుష్పగంధంబులఁ బూజసేసి,
ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తివిశ్వాస తాత్పర్య గరిమఁ
తే.గీ.
బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు
తాత్పర్యము : కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. వారు భిక్షార్థమై వచ్చిన వాళ్ళను సాక్షాత్తు శివుడిగా భావించి, అపురూపంగా ఆదరిస్తారు. వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగంచులూ కలిసేటట్లు ముగ్గుపెట్టి, దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్ళకూ, చేతులకూ నీళ్ళిచ్చి, పూవులతో, గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారుగరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి (వేసి), పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష సమర్పిస్తారు. (అతిథి దేవోభవ ! అనే భారతీయ సంప్రదాయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు కవి).

4. క.
ఆ పరమపురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో ?
తాత్పర్యము : అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వ్యాసుడు.

5. తే.గీ.
ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి
యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ
డెల్లి పారణకైన లేదెట్లు మనకు ?
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల
తాత్పర్యము : సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోదు.

6. వ. అని యా రాత్రి గడపి మఱునాఁడు మధ్యాహ్నకాలంబున శిష్యులుం దాను వేఱువేఱ విప్రభవన వాటికల భిక్షాటనం బొనర్పంబోయి, తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నే మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగులవైచి కోపావేశంబున
తాత్పర్యము : అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్షపెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీథిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు విసిరి ఆవేశంతో.

7. తే.గీ.
ధనము లేకుండెదరు మూఁడు తరములందు
మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున
తాత్పర్యము : ‘ఈ కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడు తరములదాక ధనం, విద్య, మోక్షం లేకుండు గాక’ !

8. వ. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు నవసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం బార్వతి ప్రాకృత వేషంబున
తాత్పర్యము : అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో –

9. ఉ.
వేదపురాణశాస్త్రపదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
తాత్పర్యము : వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె – చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లుమనేట్లు చెయ్యి ఊపుతూ ఓ సంయమివరా ! ఇటురా అని పిల్చింది. (ఒక్క రోజు ఆకలికే తట్టుకోలేని వాడికి నీకేం సంయమనం ఉందయ్యా ! అని వ్యంగ్యంగా అడగడానికే సంయమివరా ! అని సంబోధించింది ఆ ముత్తైదువ.)

10. శా.
ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే !
నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ ! (T.S Mar. ’17)
తాత్పర్యము : ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది నీకు మంచిదా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ళవద్ద బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువ వాళ్ళా ?

11. తే.గీ.
ఓ మునీశ్వర ! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటిమీఁద నాగ్రహము దగునె ?
తాత్పర్యము : ‘ఉన్నఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా ? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా ? అని మందలించింది పెద్దముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి.

12. వ. ఇట్టి కాశికానగరంబుమీఁద భిక్ష లేకుండుట కారణంబుగా నీయంతవాఁడు కటకటంబడి శపియింపందలంచునే ? విశేషించి యాఁకొన్నవాఁడవు గావున నీ యవసరంబున నిన్ను హెచ్చు గుందాడుట మముఁ బోఁటి గృహిణులకు మెచ్చుగాదు. మాయింటికిం గుడువ రమ్ము ! కుడిచి కూర్చున్న పిమ్మటం గొన్నిమాటలు నీతో నాడఁగలనన నమ్మహాసాధ్విం గని, పారాశర్యుం డిట్టులనియె –
తాత్పర్యము : కేవలం భిక్షదొరకలేదని బాధపడి విశిష్టమైన కాశీనగరాన్ని నీలాంటి ఉత్తముడు శపించాలనుకుంటాడా ? చాలా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మావంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికిరా ! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతాను’ అన్న ఆ మహాసాధ్విని చూసి, వ్యాసుడిట్లా అన్నాడు.

13. తే.గీ.
అస్తమింపఁగఁ జేసినాఁ డహిమకరుఁడు
శిష్యులేఁగాక యయుతంబు చిగురుబోఁడి !
వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు
నేఁడు నిన్నటి మఱునాఁడు నిక్కువంబు
తాత్పర్యము : తల్లీ ! సూర్యుడస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతోపాటు శిష్యులూ ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈ రోజు నిన్నటికి మరునాడేకదా ! (అంటే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం).

14. చ.
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ (A.P June’15)
తాత్పర్యము : అని వేదవ్యాసుడు పల్కగా కొంచెం నవ్వి పద్మముఖియైన ఆ ఇల్లాలు “సరేలే ! మునీంద్రా ! విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా !” అన్నది.

15. వ. అనిన నట్లకాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు శిష్యులంగూర్చుకొని భాగీరథికిం జని యుపస్పర్శం బాచరించి యేతెంచిన –
తాత్పర్యము : అనగా, ‘సరే, మహాప్రసాదం’ అని, వేద వ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని రాగా.

16. తే.గీ.
గొడుగు పాగల గిలకలు గులకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాగించె భుక్తి శాలాంతరమున
తాత్పర్యము : గొడుగు, పావుకోళ్ళ (గొడుగు ఆకారంలోని బుడిపెలున్న పావుకోళ్ళ) గిలకలు మోగుతుండగా చంద్రముఖియైన ఆ ఇల్లాలు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె పంక్తికి వడ్డన సాగించింది.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

వేదవిభజన చేసి, పంచమవేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమపవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశిలో వ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి, శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు, తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం.
ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యాంశం కావ్యప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన ‘కాశీఖండము’ సప్తమాశ్వాసం లోనిది.

కవి పరిచయం

కవి : శ్రీనాథుడు
కాలం : 1380 – 1470
తల్లిదండ్రులు : భీమాంబ, మారయ
మూలగ్రంథం : కాశీఖండం – సప్తమాశ్వాసం
రచనలు : 1. మరుత్తరాట్చరిత్ర 2. శాలివాహన సప్తశతి 3. పండితారాధ్య చరిత్ర 4. శృంగారనైషధం 5. భీమఖండం 6. కాశీఖండం 7. హర విలాసం 8. ధనంజయవిజయం 9. క్రీడాభిరామం 10. శివరాత్రిమాహాత్మ్యం 11. పల్నాటి వీరచరిత్ర 12. నందనందన చరిత్రలు
బిరుదు : కవిసార్వభౌముడు
విశేషాంశాలు : శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థానకవిగా ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారిగా ఉన్నాడు. సుమారు ఇరవై సంవత్సరాలు రాజాశ్రయం పొందాడు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమభట్టు యొక్క కంచుఢక్కను పగులగొట్టాడు. కనకాభిషేక గౌరవాన్ని పొందాడు.
శైలి – రచనా విధానం : ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి శ్రీనాథుని కవితా లక్షణాలు. శ్రీనాథుని కవితావైశిష్ట్యానికి అతని సీసపద్య రచనా వైభవం ఒక నిదర్శనం. శ్రీనాథుడు శివ భక్తుడు. శివార్చన కళాశీలుడు. తెలుగు కవులలో విశిష్ట కవి శ్రీనాథుడు.

ప్రవేశిక

ఈనాడు ‘భిక్ష’ అనే మాట కేవలం ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది కాని, ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆదిభిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు; బౌద్ధులందరికీ అదే జీవనసూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థిజీవనం గడిపేవారు.

భిక్షపెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి, తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి, పూజించి, భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాసమహర్షి కాశీనగరంలో పొందిన అనుభవమేమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి.

ముఖ్య పదాలు – అర్థాలు

అపూప = పిండివంటలు
అభిఘరించు = చల్లు
అర్ధాంగలక్ష్మి = శరీరంలో సగభాగమైన లక్ష్మి
ఆగ్రహం = కోపం
ఈప్సిత = కోరిక
బీటెండ = అధికమైన ఎండ
ద్వాఃకవాటము = ద్వారబంధము
భుక్తిశాల = భోజనశాల
మతిహీనులు = మతిలేనివారు
మచ్చెకంటి = చేపకనులుగల స్త్రీ
సాన్నిధ్యము = సమీపము
క్షుత్పిపాసులు = ఆకలి, దప్పిక బాధతో కూడినవారు
గోమయము = ఆవుపేడ
ప్రక్షాళితం = కడుగబడిన
పసిడి = బంగారం
ముక్కంటి = శివుడు
మోక్షలక్ష్మి = మోక్షము అనెడి లక్ష్మి
పారాశర్యుడు = వేదవ్యాసుడు
కటకటపడు = బాధపడు
సూడిగములు = గాజులు
బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
లెస్స = మేలు
కుందాడుట = బాధపెట్టునట్లు మాట్లాడు
భాగీరథి = గంగానది
బింబాస్య = చంద్రబింబము వంటి ముఖముకలది
ఆరగించుట = తినుట

ప్రక్రియ – కావ్యం (ప్రాచీన పద్యం)

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రబంధం ఒకటి. పురాణ, ఇతిహాసాలనుండి ఒక చిన్న కథను తీసుకొని, దానిని అనేకములైన వర్ణనలతోను, కల్పనలతోను పెంచి పెద్దచేసి వర్ణించే గ్రంథాన్ని ‘ప్రబంధం’ అని అంటారు. ఇందులో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగార రసానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర రసాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైనవాటిని ప్రబంధాలుగా పేర్కొనవచ్చు.

పాఠ్యభాగ సారాంశము

వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.
ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ భవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.
నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.
పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా ! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.
అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.
వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.

Free study material for Telugu

TS Board Solutions for Class 10 Telugu Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam

Chapter Exercise Answers for Class 10 Telugu

Review comprehensive exercise answers for Class 10 Telugu Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 11 Bhiksha (Alms) - Srinatha's Kasikhandam concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 10 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Telugu.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష in printable PDF format for offline study on any device.