TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

Step-by-Step Textbook Solutions for Class 10 Telugu Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas)

Access comprehensive textbook solutions for Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas) using the official curriculum guides for Class 10 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas) Textbook Solutions PDF

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

ఆలోచించండి – చెప్పండి – I (పాఠం ప్రారంభం)

Question 1: ఈ పద్యం ఎవరు రాశారు ? ఏ శతకంలో ఉన్నది ?

Answer:

కాకుత్సం శేషప్పకవి. నరహరి శతకములోనిది.

Exam Tips:

a) ‘కవి పేరు + శతకం పేరు’ రెండింటినీ ఒకే వాక్యంలో రాయండి (కాకుత్సం శేషప్ప – నరసింహ శతకం).
b) శతకం పేరు అడిగినప్పుడు మకుటం (‘నరసింహా’) ప్రస్తావిస్తే జవాబు బలపడుతుంది.

 

Question 2: ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు ?

Answer:

చెడ్డవారిని సజ్జనులుగా మార్చుట కష్టమని గ్రహించాను.

Exam Tips:

a) పద్యం యొక్క సారాంశాన్ని ఒకే వాక్యంలో ‘గ్రహించాను’ అనే రూపంలో సొంతమాటల్లో రాయండి.

 

Question 3: ఇట్లాంటి పద్యాలు మీకింకా ఏమి తెలుసు ?

Answer:

1. గంగిగోవుపాలు గరిటెడైనచాలు ….. వినుర వేమ ||
2. గాజుం బూస యనర్ఘ రత్నమగునా …….. పార్వతీ వల్లభా | ఈ పద్యాలు చదివాను.

Exam Tips:

a) మీకు తెలిసిన పద్యాల మొదటి పాదం, కవి పేరు (లేదా మకుటం) రాస్తే సరిపోతుంది; కంఠస్థం చేసిన పద్యాలనే రాయండి.

 

Question 4: వీటిని ఎందుకు నేర్చుకోవాలి ?

Answer:

ఇటువంటి మంచి మంచి పద్యాలు నేర్చుకోవడం వలన నీతులు తెలుస్తాయి. మానవ స్వభావాలు అంచనా వేయవచ్చు. మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల నేర్పు వస్తుంది. జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు.

Exam Tips:

a) నీతులు తెలియడం, మంచి ప్రవర్తన, చక్కగా మాట్లాడటం, సమస్య పరిష్కార నేర్పు వంటి ప్రయోజనాలను వరుసగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి – II (T.B. P.No. 69)

Question 1: దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి ? ఎందుకు ?

Answer:

సత్యం, దయ, విశిష్టమైన ఏకాగ్రత (భక్తియోగ విధానం) ఈ విధానాల ద్వారా దైవాన్ని పూజించాలి ఎందుకంటే ఇవి మనిషికి అత్యంత అవసరం.

Exam Tips:

a) పూజకు అవసరమైన మూడు పుష్పాలను (సత్యం, దయ, ఏకాగ్రత) క్రమంగా పేర్కొని ‘ఎందుకు’ అనే భాగానికి కారణం రాయండి.

 

Question 2: ప్రజలు రాజులను ఆశ్రయించ వచ్చునా ? ఎందుకు ?

Answer:

ఆశ్రయించరాదు. తినడానికి భిక్షం పెడతారు. నివాసానికి గుహలున్నాయి. వస్త్రాలు వీథుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని నీరు దొరుకుతుంది. తపస్సు చేసే మునులను రక్షించటానికి శ్రీకాళహస్తీశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు రాజులను ఆశ్రయించాలి (ఆశ్రయించరాదు).

Exam Tips:

a) ‘ఆశ్రయించరాదు’ అని స్పష్టంగా చెప్పి, భిక్ష, గుహలు, వస్త్రాలు, నీరు, తపస్వులను రక్షించే దైవం అనే అయిదు కారణాలను రాయండి.

 

Question 3: సిరిలేకున్నా పండితుడు ఏయే గుణాలవల్ల శోభిస్తాడు ?

Answer:

తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైనవాడు. భుజబలంతో విజయాలను పొందేవాడు. మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

Exam Tips:

a) సిరిలేకున్నా పండితుడిని శోభింపజేసే గుణాలు: గురువందనం, దానం, శ్రద్ధగా వినడం, సత్యం, విజయం, సౌజన్యం – ఈ ఆరింటినీ తప్పక రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి – III (T.B. P.No. 70)

Question 1: రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచెప్పవచ్చు?.

Answer:

దశరథుని కుమారుడు, దయాసముద్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండనం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండల మంతా వినబడేటట్లు చాటి చెప్పవచ్చు.

Exam Tips:

a) ‘ఢంకా మ్రోగిస్తూ ఏనుగు నెక్కి చాటడం’ అనే భావం, ‘రెండవ సాటి దైవం లేడు’ అనే సారాంశం జవాబులో ఉండాలి.

 

Question 2: సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి ?

Answer:

విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షాశనం’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

Exam Tips:

a) ఐదు పనులను (నిందించకపోవడం, భిక్షకు అడ్డుపడకపోవడం, మోసం చేయకపోవడం, మాన్యాలు ఆక్రమించకపోవడం, వర్షాశనం తీయకపోవడం) వాటి ఫలితాలతో జతచేసి రాయండి.

 

Question 3: మోసం ఎందుకు చేయకూడదు ?

Answer:

అనేక దుర్గుణాల్లో మోసం ఒకటి. మోసం ఎన్నడూ, ఎవరికీ చేయకూడదు. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు. మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. గౌరవం అంతరించిపోతుంది. మానసిక స్పర్థలు కలుగుతాయి. అందువల్ల మోసం అనేది చేయకుండా ఉండాలి.

Exam Tips:

a) మోసం వల్ల కలిగే నష్టాలను (విశ్వాసం కోల్పోవడం, సంబంధాలు దెబ్బతినడం, గౌరవం పోవడం) వరుసగా రాయడం మంచిది.

 

ఆలోచించండి – చెప్పండి – IV (T.B. P.No. 71)

Question 1: కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు ?

Answer:

స్వార్ధం లేనివాడు, త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

Exam Tips:

a) ‘ఘనుడు’ లక్షణాలు: త్యాగదీక్ష, దీనస్థితిని పోగొట్టడం, ఆనందకర జీవితాన్ని పంచడం, దేశ గొప్పతనాన్ని చాటడం – నాలుగూ రాయండి.

 

Question 2: మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది ?

Answer:

మిత్రుని సహాయం చాలా రకాలుగా ఉంటుంది. మంచి పుస్తకంలాగా మంచిని బోధిస్తాడు. కార్యసాధనంలో సంపదలా సహాయపడతాడు. స్వాధీనమైన కత్తిలాగ శత్రుసంహారం చేసేవాడు. రక్షించే మనసులాగ సౌఖ్యాలను ఇచ్చేవాడు నిజమైన మిత్రుడు.

Exam Tips:

a) మిత్రుడిని పుస్తకం, ధనం, కత్తి, నిండు మనస్సు అనే నాలుగు పోలికలతో వివరించండి.

 

Question 3: నరరూప రాక్షసులంటే ఎవరు ?

Answer:

కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే.

Exam Tips:

a) నరరూప రాక్షసుల లక్షణాలను (అసత్యం, మోసం, కులగర్వం, లంచం, దుష్ప్రవర్తన, వావివరుసలు పాటించకపోవడం, తల్లిదండ్రులను వెళ్ళగొట్టడం) పద్యం క్రమంలో రాయండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతాయని భావిస్తున్నారా ? ఎందుకు ?
చర్చించండి.

Answer:

తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. వందల సంవత్సరాల నుండి శతకాలు మానవులలో నైతికతను, సద్గుణాలను, మానవీయ విలువలను, భక్తితత్త్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి. పూర్వపు విద్యావిధానంతో ప్రతి ఒక్క విద్యార్థి శతక పద్యాలను కంఠస్థం చేసేవారు.
శతక పద్యాలు రాని విద్యార్థి ఉండేవాడు కాదు. నేడు అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే భాషను నేర్చుకొనే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల కొందరు మాత్రమే శతకాలు చదువుతున్నారు. అయితే కాలం ఎంత మారినా నేటి సమాజానికి కూడా శతకాలు చదవడం ముఖ్యావసరం అని చెప్పవచ్చు.
ప్రస్తుత పాఠంలోని సర్వేశ్వర శతక పద్యం ద్వారా దేవుని అనుగ్రహం పొందాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదని సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉంటే చాలని తెలుసుకున్నాం. దీని వల్ల నేడు భక్తి పేర జరుగుతున్న వృథా ఖర్చులను తగ్గించుకునే అవకాశం కల్గుతుంది.
కాళహస్తీశ్వర శతకం రాజుల నాశ్రయించవద్దని తెలిపింది. ఇప్పుడు రాజులు లేనప్పటికీ వారి స్థానంలో వచ్చిన ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.పి.ల దగ్గరికి చేరకూడదని గ్రహించవచ్చు.
లోకంలో సంపద లేకపోయినా గురువులకు నమస్కరించడం, సత్యం పలకడం, దానం చేయటం అనే గుణాల వల్ల పండితుడు ప్రకాశిస్తాడు అని చెప్పటం వల్ల డబ్బు కంటే సత్యం, దానం, గురువందనం గొప్పవని మల్ల భూపాలీయ శతకం వల్ల తెలుస్తున్నది. దాశరథీ శతకం వలన శ్రీ రాముని వైభవాన్ని తెలుసుకున్నాం.
నృసింహ శతకం ద్వారా ఏయే పనులు చేయకూడదో గ్రహించవచ్చు.
అందులో చెప్పిన విషయాలు నేటి సమాజంలో కూడా జరుగుతున్నవే.
విశ్వనాథేశ్వర శతకం గొప్పవారు కావాలంటే త్యాగం చెయ్యాలని చెప్పుటయేగాక విద్యార్థులు కూడా దేశం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నది.
లొంకరామేశ్వర శతకం మిత్రుడు పుస్తకం లాంటి వాడని తెలిపి ఈ నాటికి కూడా స్నేహితుల విలువను మనకు గుర్తుకు తెస్తుంది. ఇక వేణుగోపాల శతకంలో చెప్పిన విషయాలు నేడు కూడా జరుగుతున్నా వాటిని చేయకుండా ఉండటానికి ప్రతివిద్యార్థి ప్రయత్నించాలి.

Exam Tips:

a) చర్చ ప్రశ్నలో ‘అవును/కాదు’ అని ముందే చెప్పి, పద్యాల ఆధారాలతో కారణాలు ఇవ్వండి.
b) సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర వంటి శతకాల పేర్లను ప్రస్తావిస్తే మార్కులు పెరుగుతాయి.

 

Question 2: కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.
అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడుతాడు.

Answer:

7వ పద్యం – “పొత్తంబై కడునేర్పుతో ………. స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు”

Exam Tips:

a) పద్య సంఖ్య + మొదటి/ముఖ్య పాదం (మిత్రుండు – కృపాణమై…) రాయడం ముఖ్యం; భావం ఏ పాదంలో ఉందో గమనించండి.

 

Question 3: కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.
ఆ) రాముని మించిన దైవం లేడని చాటుతాను.

Answer:

4వ పద్యం – “రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా … చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !”

Exam Tips:

a) ‘రెండవ సాటి దైవమిక లేఁడనుచున్’ అనే పాదాన్ని 4వ పద్యం (దాశరథి శతకం) నుండి ఉదహరించండి.

 

Question 4: విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి. పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ – కాపాడు తల్లివోలె

Answer:

భావం : అనుభవముతో నేర్చుకొన్న చదువు తండ్రిలాగా రక్షించును. ముందు పడిన కష్టాలు గుణపాఠాలుగా మారి తగిన ప్రేరణను ఇస్తాయి. అమ్మలాగా చదువు కాపాడుతుంది అని అర్థం.
శీర్షిక : “చదువు గొప్పతనం” (లేదా) “చదువు వల్ల ప్రయోజనం”.

Exam Tips:

a) భావాన్ని సొంతమాటల్లో రాసి, పద్యం మొత్తం భావాన్ని ప్రతిబింబించే చిన్న శీర్షిక (‘చదువు గొప్పతనం’) ఇవ్వండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి ?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)

Answer:

త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.

Exam Tips:

a) ఐదు వాక్యాల జవాబులో ‘లక్షణాల జాబితా’ కంటే పాఠంలోని పద్యం (విశ్వనాథేశ్వర శతకం) ఆధారంగా ఒక అభిప్రాయ వాక్యం రాయండి.

 

Question 2: త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)

Answer:

నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.
1. అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
2. గొప్ప కోసం చూడడు.
3. కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
4. తన సర్వస్వాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.

Exam Tips:

a) త్యాగి లక్షణాలను అంకెలతో రాసి చివరలో కర్ణుడు, బలి, శిబి వంటి ఉదాహరణలు ఇస్తే పూర్తి జవాబు అవుతుంది.

 

Question 3: మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)

Answer:

మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.
అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు.
కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు.
అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.

Exam Tips:

a) ‘పుస్తకం – స్నేహితుడు’ పోలికను విజ్ఞానం, నీతి, కష్టకాల సహాయం అనే అంశాలతో రాయండి; చివరి వాక్యంలో నిర్ధారణ ఉండాలి.

 

Question 4: పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.)

Answer:

ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.

Exam Tips:

a) చదువుకు కావలసిన గుణాలు (ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, వినయం, క్రమశిక్షణ) కనీసం ఐదింటిని ఒక సూక్తితో కలిపి రాయండి.

 

Question 5: శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి. (పది వాక్యాలలో జవాబు రాయండి.)

Answer:

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….’ అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.
సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగుతుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు. ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.
శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.
‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.

Exam Tips:

a) పది వాక్యాల జవాబులో ప్రతి శతక పద్యాన్ని (సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ…) ఒకటి లేదా రెండు వాక్యాల్లో నేటి జీవితంతో పోల్చండి.
b) ప్రారంభ వాక్యం, పద్యాల విశ్లేషణ, ముగింపు వాక్యం – ఈ మూడు భాగాలు ఉండాలి.

 

Question 6: ఈ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.

Answer:

వరంగల్,
9.6.2018.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువుచున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.
అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు:
1. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
2. రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
3. శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు. 4. మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.
అలవర్చుకోకూడని గుణాలు:
1. విష్ణు భక్తులను నిందించరాదు.
2. భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
3. సజ్జనులను మోసం చేయరాదు.
4. దేవతామాన్యములను ఆక్రమించరాదు.
5. అసత్యాన్ని పలకరాదు.
6. మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.
ఇట్లు, నీ మిత్రుడు, X X X X X. చిరునామా:
యం. యుగంధర్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాసర,
ఆదిలాబాద్ (జిల్లా.)

Exam Tips:

a) లేఖలో తేదీ, ఊరు, సంబోధన, విషయం, ముగింపు, చిరునామా – ఈ క్రమం పాటించండి; మంచి గుణాలు – చెడు గుణాలు రెండు శీర్షికల కింద రాయండి.

 

Question 7: ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.

Answer:

6వ పద్య భావం ఆధారంగా నీతి కథ
త్యాగం : అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరులకు ఇవ్వడం దానం.
తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్టకుండా ఇతరులకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.
చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.
అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.
వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి.
రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.

Exam Tips:

a) నీతికథలో పద్యభావం (ఉదా: త్యాగం), కథ, ముగింపులో నీతి – ఈ మూడు భాగాలు రాయండి; పేరు (రంతిదేవుడు) స్పష్టంగా చెప్పండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) భాసిల్లు = ప్రకాశించు
ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగుల్చు
ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు

Answer:

అ) వినయ విధేయతలతో విద్యార్థులు భాసిల్లాలి.
ఆ) యువకులకు వివేకానందస్వామి ఉద్బోధించాడు.
ఇ) కుచేలుడు దైన్యస్థితిలో జీవనం సాగించాడు.
ఈ) నేడు సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువగా ఉన్నారు.

Exam Tips:

a) పదాలతో వాక్యాలు రాసేటప్పుడు పదం అర్థానికి సరిపోయే సందర్భంలో ఉపయోగించండి; పదం మార్చకుండా అదే రూపంలో వాడండి.

 

Question 2: క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.
అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.

Answer:

అ) ఏనుగు, గజము, కరి, నాగము.
ఆ) స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.
ఇ) కృపాణం, కత్తి, అసి.
ఈ) కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.

Exam Tips:

a) పర్యాయపదాలు అంటే ఒకే అర్థం ఉన్న వేరే పదాలు; వాక్యంలో పునరావృతమైన భావాన్ని గుర్తించి వాటిని మాత్రమే రాయండి.

 

Question 3: క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించి, వేరు చేసి రాయండి.
అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.

Answer:

అ) దిశ (ప్రకృతి) – దెస (వికృతి)
ఆ) సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)
ఇ) రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

Exam Tips:

a) ప్రకృతి = తత్సమ/సంస్కృత రూపం, వికృతి = తెలుగులో మారిన రూపం (దిశ – దెస, సముద్రం – సంద్రం, రాజు – రాయడు).

 

వ్యాకరణాంశాలు

Question 1: క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.
అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.

Answer:

అ) బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు – రుగాగమ సంధి
ఆ) ఆ + చోట = అచ్చోట – త్రిక సంధి
ఇ) దివ్య + ఔషధం = దివ్యౌషధం – వృద్ధి సంధి
ఈ) సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి
ఉ) సమ + ఐక్యత = సమైక్యత – వృద్ధి సంధి
ఊ) ఏ + కాలము = ఎక్కాలం – త్రిక సంధి

Exam Tips:

a) సంధి పదాలను విడదీసి (పూర్వపదం + పరపదం) రాసి చివరన సంధి పేరు తప్పక రాయండి; ‘ఆలు’ పరమైతే రుగాగమం, ఆ/ఈ/ఏ లు త్రికాలు.

 

Question 2: క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, గురు లఘువులను గుర్తించి, ఏ పద్యపాదమో తెలుపండి. (T.S) June ’16 ; Mar. ’16
అ) భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో

Answer:

భరనభభరవ
UIIUIUIIIUIIUIIUIUIU
భండనభీముఁడార్తజనబాంధవుఁడుజ్జ్వలబాణతూణకో

ఇది ఉత్పలమాల పద్యపాదము.
1. ప్రతి పద్యంలోను నాలుగు పాదాలుంటాయి.
2. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వచ్చాయి.
3. యతి 1 – 10వ అక్షరం (భ – బా).
4. ప్రాస నియమం కలదు (ండ).

Exam Tips:

a) గణ విభజన: పాదాన్ని గణాలుగా విభజించి, ప్రతి గణానికి గురు-లఘువులు (U, I) రాసి, గణం పేరు రాయండి; తరువాత లక్షణాలు (యతి, ప్రాస) రాయండి.
b) ఉత్పలమాల గణాలు: భ ర న భ భ ర వ.

 

Question 3: ఆటవెలది – క్రింది పద్యపాదాలను గమనించండి.
అ) బ్రతుక వచ్చుఁ గాక బహుబంధ నములైన
ఆ) వచ్చుఁ గాక లేమి వచ్చుఁ గాక
ఇ) జీవ ధనము లైనఁ జెడు గాక పడుఁగాక
ఈ) మాట దిరుగ లేరు మాన ధనులు

Answer:

నహహసలసల
IIIUIUIIIUIIIUI
బ్రతుకవచ్చుఁగాకబహుబంధనములైన
హహహహహ
UIUIUIUIUI
వచ్చుఁగాకలేమివచ్చుఁగాక
హనహసలసల
UIIIIUIIIUIIIUI
జీవధనములైనఁజెడు గాకపడుఁగాక
హనహహన
UIIIIUIUIIII
మాటదిరుగలేరుమానధనులు

1. పై పద్యంలో 4 పాదాలున్నాయి.
2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
5. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది. (బ్ర – బ, వ – వ, జీ – జె, మా – మా)
6. ప్రాసనియమం పాటించలేదు.
ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ‘ఆటవెలది’ పద్యం అని అంటారు.
సూర్యగణాలు : నగణం (III), హగణం (UI)
ఇంద్రగణాలు : నల (IIII), నగ (IIIU), సల (IIUI), భ (UII), ర (UIU), త (UUI) లు.

Exam Tips:

a) ఆటవెలది: 4 పాదాలు; 1,3 పాదాల్లో 3 సూర్య + 2 ఇంద్ర గణాలు, 2,4 పాదాల్లో 5 సూర్య గణాలు; యతి 4వ గణ ఆద్యక్షరం (ప్రాస లేదు).

 

Question 4: క్రింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి.
వటుని కాళ్ళుగడుగవర హేమఘటమున

Answer:

నభనలహన
IIIUIIIIIIUIIII
వటునికాళ్ళుగడుగవరహేమఘటమున

1 సూర్యగణము + 2 ఇంద్రగణాలు + 2 సూర్యగణాలు ఉన్న పద్యపాదాన్ని తేటగీతి పద్యపాదం అంటారు.

Exam Tips:

a) తేటగీతి లక్షణం: 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య గణాలు. నగణం, హగణం సూర్యగణాలు; నల, నగ, సల, భ, ర, త ఇంద్రగణాలు.

 

ప్రాజెక్టు పని

Question 1: 6 నుండి 10 వ తరగతి వరకు చదువుకొన్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు కింది పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి.

Answer:

విద్యార్థి చదివిన శతకాలను బట్టి ఇలా రాయవచ్చు :

క్ర.సం.శతకం పేరుకవి పేరుకాలంకంఠస్థంగా ఉన్న పద్యాల సంఖ్య
1భాస్కర శతకంమారద వెంకయ్య13వ శతాబ్దం2
2సుభాషిత త్రిశతిభర్తృహరి7వ శతాబ్దం4
3సుభాషిత రత్నావళిఏనుగు లక్ష్మణకవి18వ శతాబ్దం3
4దాశరథీ శతకంకంచర్ల గోపన్న (రామదాసు)17వ శతాబ్దం5
5సభారంజన శతకంనీలకంఠ దీక్షితులు (మూలం)
ఏలూరుపాటి అనంతరామయ్య (అనువాదం)
17వ శతాబ్దం
20వ శతాబ్దం
6
1
6శ్రీకాళహస్తీశ్వర శతకంధూర్జటి16వ శతాబ్దం4
7తెలుగుబాల శతకంకరుణశ్రీ20వ శతాబ్దం3

Exam Tips:

a) పట్టికను పూర్తి చేసేటప్పుడు శతకం – కవి – కాలం – కంఠస్థ పద్యాల సంఖ్య అన్ని నిలువు వరుసలు నింపండి.

 

విశేషాంశాలు

Question 1: శతకం అంటే ఏమిటి ? శతక ప్రక్రియ లక్షణాలేవి ?

Answer:

శతకం అనగా ముక్తకం. ముక్తకం స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. శతకం మకుట నియమం కలిగి ఉంటుంది. సంఖ్యా నియమం కల్గి ఉంటుంది. శతకాల్లో సమకాలీన సామాజికాంశాల విమర్శ సాధారణంగా కనిపించే లక్షణం. ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది.

Exam Tips:

a) శతకం లక్షణాలు: ముక్తకం, మకుటం, సంఖ్యా నియమం, సామాజిక విమర్శ – ఈ నాలుగు పదాలు జవాబులో ఉండాలి.

 

Question 2: బృహస్పతి ఎవరు ?

Answer:

బృహస్పతి దేవతల గురువు. అంగీరసుడి కొడుకు. ఉతధ్యుడు, సంవర్తనుడు ఇతడి సోదరులు. బృహస్పతి భార్య తార. ఇతనికి శంయుడు అనే కొడుకున్నాడు. శుక్రనీతి, కణికనీతి లాగా బృహస్పతి నీతిసూత్రాలు ప్రసిద్ధి చెందాయి.

Exam Tips:

a) బృహస్పతి వివరాలు: దేవతల గురువు, అంగీరసుడి కొడుకు, భార్య తార, కొడుకు శంయుడు, బృహస్పతి నీతిసూత్రాలు.

 

Question 3: శైవ కవిత్రయం ఎవరు ?

Answer:

నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.

Exam Tips:

a) శైవ కవిత్రయం: నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన – ముగ్గురి పేర్లు తప్పక రాయండి.

 

Question 4: శైవ పండిత త్రయం ఎవరు ?

Answer:

శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, శివలెంక మంచన. ఈ ముగ్గురిని శైవ పండిత త్రయం అంటారు.

Exam Tips:

a) శైవ పండిత త్రయం: శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, శివలెంక మంచన.

 

Question 5: చింతామణి అంటే ఏమిటి ?

Answer:

కోరిన కోర్కెలను తీర్చే మణి. నాగరాజు శిరస్సు నుంచి ఈ మణిని పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

Exam Tips:

a) చింతామణి = కోరిన కోర్కెలను తీర్చే మణి, నాగరాజు శిరస్సు నుండి లభిస్తుందని నమ్మకం – రెండు విషయాలు రాయండి.

 

Question 6: గంగకు ‘భాగీరథి’, ‘జాహ్నవి’ అనే పేర్లు ఎందుకు వచ్చాయి ?

Answer:

భాగీరథి : గంగ, భగీరథుని ప్రయత్నం చేత భూమి మీదకు తీసుకురాబడినది. అందువల్ల భాగీరథి అయ్యింది.
జాహ్నవి : సగరులకు ఉత్తమ లోకాలు కల్గించడానికి భగీరథుడు తెచ్చిన గంగ జహ్నుమహర్షి యాగాన్ని పాడుచేసింది. జహ్నుమహర్షి కోపించి ఆ గంగను త్రాగివేసాడు. భగీరథుని కోరిక మేరకు (అభ్యర్థన వల్ల) తిరిగి ఎంగిలి కాకుండా తన చెవుల ద్వారా విడిచి పెడతాడు. కాబట్టి జహ్నుమహర్షి చేత త్రాగి విడువబడినది కాబట్టి దానికి జాహ్నవి అనే పేరు వచ్చింది.

Exam Tips:

a) భాగీరథి (భగీరథుడు తెచ్చినందుకు), జాహ్నవి (జహ్నుమహర్షి చెవుల ద్వారా విడిచినందుకు) – పేర్ల కారణాలను విడివిడిగా రాయండి.

 

Question 7: అంతరింద్రియాలు, బాహ్య ఇంద్రియాలు ఏవి ?

Answer:

అంతరింద్రియాలు : మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాల్గింటిని అంతరింద్రియాలు అంటారు.
బాహ్య ఇంద్రియాలు : కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని బాహ్య ఇంద్రియాలు అంటారు.

Exam Tips:

a) అంతరింద్రియాలు నాలుగు (మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం), బాహ్య ఇంద్రియాలు ఐదు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం) – సంఖ్యలతో గుర్తుంచుకోండి.

 

Question 8: ఈ పాఠం ఆధారంగా విద్యను గురించిన సూక్తిని రాయండి.

Answer:

తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.

Exam Tips:

a) సూక్తిని ఉన్నది ఉన్నట్లు రాయడం కంటే స్నేహం, మంచిని పంచడం, గురువుల పట్ల విధేయత అనే మూడు అంశాలు ఉండేలా రాయండి.

 

ప్రతిపదార్థ తాత్పర్యాలు – I

Question 1: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
1. మ.
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా.

Answer:

ఈ పద్యము యథావాక్కుల అన్నమయ్యచే రచింపబడిన సర్వేశ్వర శతకము నుండి గ్రహింపబడినది.
ప్రతిపదార్థం:
సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ + ఆర్చన = నీ పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు + ఎన్నన్ = మొదటి పుష్పం
సత్యంబు = సత్యం
రెండవ పుష్పం = రెండవ పుష్పం
దయాగుణం = కారుణ్యమనే గుణం (దయ)
తృతీయ పుష్పము + అది = మూడో పుష్పం
అతి = మిక్కిలి
విశిష్ట = విశిష్టమైన
ఏకనిష్ఠా = ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి = సమానమైనది
అది = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తి సంయుక్తి యోగవిధానం = భక్తియోగ విధానం
అవి = ఈ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)
తాత్పర్యం:
ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !

Exam Tips:

a) ప్రతిపదార్థంలో ప్రతి పదానికి దాని అర్థం ఒక్కొక్క వరుసలో రాయండి; సంధి పదాలను (భవదీయ + ఆర్చన) విడదీసి చూపండి. తరువాత తాత్పర్యం సొంత వాక్యాల్లో రాయండి.

 

Question 2: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
2. శా.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

Answer:

ఈ పద్యము ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి గ్రహింపబడినది.
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవో = లేవా ?
చీరానీకము (చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు = చల్లని, అమృతము వంటి తియ్యని, నిర్మలమైన జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో
పాఱదో (పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో (ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్ = ప్రజలు
రాజులన్ = రాజులను
చేరన్ = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో !
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి అడిగితే ఎవరయినా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతంవంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

Exam Tips:

a) శ్రీకాళహస్తీశ్వర శతకం: ఐదు కారణాలు (భిక్ష, గుహలు, వస్త్రాలు, నీరు, దైవ రక్షణ) చెప్పి ‘రాజులను ఎందుకు ఆశ్రయించాలి’ అనే ప్రశ్నతో ముగించండి.

 

Question 3: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
3. మ.
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !

Answer:

ఈ పద్యము ఎలకూచి బాలసరస్వతిచే రచింపబడిన మల్లభూపాలీయ శతకము నుండి గ్రహింపబడినది.
ప్రతిపదార్థం:
సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి (గురుపాద + ఆనతి) = గురువుగారి పాదాలకు మ్రొక్కుట (నమస్కరించడము)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్రశ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ = ముఖమునందు
స్థిర సత్యోక్తి (స్థిర + సత్య + ఉక్తి) = స్థిరమైన సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సునందు
సన్మనోహర సౌజన్యము : సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్యం
లేకైనన్ (లేక + ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె (విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు
తాత్పర్యం:
నీతిలో బృహస్పతి అంతటి వాడవయిన ఓ సురభిమల్లా ! తలవంచి గురువు పాదాలకు నమస్కరించే వాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

Exam Tips:

a) మత్తేభ పద్యంలో శరీర అవయవాలను గుణాలతో జతచేయండి: శిరస్సు – గురువందనం, చేయి – దానం, చెవులు – శ్రవణం, ముఖం – సత్యం, భుజాలు – విజయం, మనస్సు – సౌజన్యం.

 

ప్రతిపదార్థ తాత్పర్యాలు – II

Question 1: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
4. ఉ.
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!

Answer:

ఈ పద్యము కంచర్ల గోపన్నచే రచింపబడిన దాశరథి శతకము నుండి గ్రహించబడినది.
ప్రతిపదార్థం:
దాశరథీ = దశరథుని కుమారా !
కరుణాపయోనిథీ = దయాసముద్రునివైన ఓ రామా !
భండన భీముడు = నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని
ఆర్తజన = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల = కాంతిమంతమైన
తూణ = అమ్ములపొది
బాణ = బాణాలు
కోదండ = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి దైవము = సాటివచ్చే మరియొక దైవం
ఇకన్ = ఇంక
లేడనుచున్ = లేరని
గడగట్టి = స్తంభము నాటి
భేరికా = ఢంకా యొక్క
దాండడ, డాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను
తాత్పర్యం:
దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో, ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !

Exam Tips:

a) ‘కోదండ కళాప్రచండ భుజతాండవ’ వంటి సమాస పదాలను విడదీసి అర్థం రాయండి; తాత్పర్యంలో ‘ఢంకా మ్రోగించి చాటుతాను’ అనే భావం ఉండాలి.

 

Question 2: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
5. సీ.
హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు గనకకంబపుగుళ్ళు గట్టినట్లు
తే.గీ.
ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలు బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస ! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

Answer:

ఈ పద్యం కాకుత్సం శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకం నుండి గ్రహించబడినది.
ప్రతిపదార్థం:
భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన + చాలు = మోసం చేయకుండా ఉంటే చాలు
ఇంపుగా = చక్కగా
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = బంగారు ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = ఒక ఏడాదికి సరిపడే భోజనం
ముంచకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది
తాత్పర్యం:
అలంకారాల చేత శోభిల్లేవాడా ! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా! నరసింహా ! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడికట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షా శనాన్ని’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

Exam Tips:

a) సీస పద్యంలో 5 పనులు (నిందించకపోవడం, భిక్షకు అడ్డుపడకపోవడం, మోసం చేయకపోవడం, మాన్యం ఆక్రమించకపోవడం, వర్షాశనం పాడుచేయకపోవడం) – ప్రతి దానికి దాని ఫలితం జతచేయండి.

 

ప్రతిపదార్థ తాత్పర్యాలు – III

Question 1: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
6. మ.
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిందపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

Answer:

ఈ పద్యము గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మచే రచింపబడిన విశ్వనాథేశ్వర శతకము నుండి గ్రహించబడినది.
ప్రతిపదార్థం:
విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్షను పూని
సర్వంసహాజన = జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిందపూర్వ = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవారవుతారు
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతారు
తాత్పర్యం:
విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు.

Exam Tips:

a) విశ్వనాథేశ్వర శతకం: ‘ఘనుడెవడు’ అనే ప్రశ్నకు జవాబు పద్యం చివరి భాగంలో ఉంది; ప్రతిపదార్థంలో కీలక పదాలు (దైన్యస్థితి, సంరంభము, ప్రాశస్త్యము) సరిగ్గా రాయండి.

 

Question 2: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
7. శా.
పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు, ప్రో
చ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా !

Answer:

ఈ పద్యం నంబి శ్రీధరరావుగారిచే రచింప బడిన శ్రీలొంక రామేశ్వర శతకము నుండి గ్రహించ బడినది.
ప్రతిపదార్థం:
శ్రీలొంకరామేశ్వరా = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక కార్యసాధనమునన్ = ఒక కార్య సఫలతలో
సంవిత్తంబు + ఐ = విలువైన ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ఆహరించు = సహాయపడతాడు
ప్రోచ్చిత్తంబు + ఐ = నిండు మనస్సై
తగన్ = తగినవిధంగా
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు
తాత్పర్యం:
ఓ లొంకరామేశ్వరా ! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.

Exam Tips:

a) మిత్రుని నాలుగు పోలికలు (పొత్తం, సంవిత్తం, కృపాణం, ప్రోచిత్తం) పద్యంలోని క్రమంలోనే తాత్పర్యంలో రాయండి.

 

Question 3: క్రింది పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.
8. సీ.
కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవావికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
కన్నవారల గెంటుచున్నవాడు
గీ.
పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
కృపనిధీ ధరనాగరకుంటపురి
వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి

Answer:

ఈ పద్యము గడిగె భీమ కవిచే రచింప బడిన వేణుగోపాల శతకము నుండి గ్రహించబడినది.
ప్రతిపదార్థం:
కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపురి = భూమిపై నాగరకుంటపురమునందు కొలువైనవాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + ఒల్లనివాడు = పలకడానికి ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !
తాత్పర్యం:
దయకు నిధివంటివాడా ! శ్రీ రామచంద్రా ! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! ఓ వేణు గోపాల- కృష్ణా ! నా దైవమా ! శ్రీ కృష్ణా ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు. తల్లి తండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవరూపంలో ఉన్న రాక్షసుడే.

Exam Tips:

a) నరరూప రాక్షసుల లక్షణాలను పద్యంలోని క్రమంలో రాసి, చివరి పాదం ‘రాక్షసుడే’ అనే నిర్ధారణతో ముగించండి.

 

పాఠ్యభాగ పరిచయం

Question 1: ‘శతక మధురిమ’ పాఠం ఉద్దేశం ఏమిటి ?

Answer:

సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషిచేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

Exam Tips:

a) పాఠం ఉద్దేశాన్ని ‘సమాజహితం – నైతిక, ఆధ్యాత్మిక విలువలు – శతక కవుల కృషి’ అనే మూడు అంశాలతో రాయండి.

 

Question 2: ‘శతక మధురిమ’ పాఠ్యభాగ వివరాలు తెలపండి.

Answer:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ‘ముక్తకాలు’ అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

Exam Tips:

a) పాఠం పేర్కొన్న 8 శతకాల పేర్లను (సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంకరామేశ్వర, వేణుగోపాల) తప్పక రాయండి.

 

Question 3: ‘శతక మధురిమ’ పాఠ్యభాగ ప్రవేశికను రాయండి.

Answer:

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ? స్నేహితులు ఎట్లా ఉంటారు ? భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి ? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షసగుణాలు ఏవి ? అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి. ఆచరించే ప్రయత్నం చేయండి.

Exam Tips:

a) ప్రవేశికలోని ప్రశ్నలన్నింటినీ (ప్రవర్తన, ఆశ్రయం, స్నేహం, భగవంతుడు, కీర్తిమంతులు, రాక్షసగుణాలు) వరుసగా గుర్తుంచుకోండి.

 

Question 4: శతక ప్రక్రియను గురించి వివరించండి.

Answer:

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘శతకం’ ఒకటి. ఇందులో వంద పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. ఏ పద్యానికాపద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతకాలు నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతీ శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు.

Exam Tips:

a) శతకం: వంద పద్యాలు, మకుటం, ముక్తకం (స్వతంత్ర భావం), నీతి-భక్తి-వైరాగ్య బోధ; ఉదాహరణలుగా సుమతీ శతకం, వేమన శతకం.

 

కవుల పరిచయం

Question 1: కవి యథావాక్కుల అన్నమయ్య గురించి రాయండి.

Answer:

కవి : యథావాక్కుల అన్నమయ్య
కాలం : 13వ శతాబ్దం
శైలి : ధారాళమైనది
శతకం పేరు : సర్వేశ్వర శతకం.

Exam Tips:

a) కవి పరిచయంలో కవి పేరు, కాలం, శైలి, శతకం పేరు నాలుగూ ఉండాలి.

 

Question 2: కవి ధూర్జటి గురించి రాయండి.

Answer:

కవి : ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం
శతకం పేరు : శ్రీకాళహస్తీశ్వర శతకం
ఇతర అంశాలు : శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యమనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజుల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం” అని చెప్పిన ధీశాలి.

Exam Tips:

a) ధూర్జటి: 16వ శతాబ్దం, శ్రీకాళహస్తీశ్వర శతకం, అష్టదిగ్గజాల్లో ఒకరు, ‘రాజుల్ మత్తులు…’ అనే మాట – ఈ నాలుగు వివరాలు రాయండి.

 

Question 3: కవి ఎలకూచి బాలసరస్వతి గురించి రాయండి.

Answer:

కవి : ఎలకూచి బాలసరస్వతి
కాలం : 17వ శతాబ్దం
శతకం పేరు : మల్లభూపాలీయ శతకం
ఇతర అంశాలు : నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థానకవి.
రచనలు :
1. తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం “రాఘవ యాదవ పాండ వీయం” ను రాశాడు.
2. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులో అనువదించిన తొలికవి.
విశేషాంశం : ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా, ధారాళంగా ఉంటుంది.

Exam Tips:

a) ఎలకూచి బాలసరస్వతి: 17వ శతాబ్దం, జటప్రోలు సంస్థానం, రాఘవ యాదవ పాండవీయం (త్ర్యర్థి కావ్యం), సుభాషిత త్రిశతి అనువాదం.

 

Question 4: కవి కంచర్ల గోపన్న గురించి రాయండి.

Answer:

కవి : కంచర్ల గోపన్న
కాలం : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి
రచన : దాశరథి శతకం
ఇతర అంశాలు : భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పేర దాశరథి శతకాన్ని రాసాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి.

Exam Tips:

a) కంచర్ల గోపన్న: నేలకొండపల్లి, భద్రాచల రామాలయ నిర్మాత, దాశరథి శతకం, కీర్తనలు, శబ్దాలంకారాలు.

 

Question 5: కవి కాకుత్సం శేషప్ప కవి గురించి రాయండి.

Answer:

కవి : కాకుత్సం శేషప్ప కవి
కాలం : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి
శతకం : నరహరి శతకంతోపాటు, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం) రాశాడు.
ఇతర అంశాలు : ఇతని రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్వికచింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను పాడుకుంటారు.

Exam Tips:

a) కాకుత్సం శేషప్ప: 18వ శతాబ్దం, ధర్మపురి నివాసి, నరహరి (నరసింహ) శతకం, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం).

 

Question 6: కవి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ గురించి రాయండి.

Answer:

కవి : గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాలం : 1934 – 2011
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లా, పోతారెడ్డి పేట
రచన : విశ్వనాథేశ్వర శతకం
ఇతర అంశాలు : 300 పైగా అష్టావధానాలు చేసాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది.
బిరుదులు : అవధాని శశాంక, ఆశు కవితాకేసరి.
ఇతర రచనలు : కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి.

Exam Tips:

a) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ: 1934–2011, పోతారెడ్డిపేట, 300కు పైగా అష్టావధానాలు, బిరుదులు (అవధాని శశాంక, ఆశు కవితాకేసరి).

 

Question 7: కవి నంబి శ్రీధరరావు గురించి రాయండి.

Answer:

కవి : నంబి శ్రీధరరావు
కాలం : 1934 – 2000
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ (వేముగల్లు) నివాసి
రచన : శ్రీలొంక రామేశ్వర శతకం
ఇతర రచనలు : శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహశతకం
బిరుదు : కవిరాజ

Exam Tips:

a) నంబి శ్రీధరరావు: 1934–2000, భీమ్‌గల్, శ్రీలొంక రామేశ్వర శతకం, బిరుదు కవిరాజ.

 

Question 8: కవి గడిగె భీమకవి గురించి రాయండి.

Answer:

కవి : గడిగె భీమకవి
జననం : 14.1.1920
మరణం : 3.4.2010
రచన : వేణుగోపాల శతకం
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామం
ఇతర విషయాలు : వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

Exam Tips:

a) గడిగె భీమకవి: 14-01-1920 – 03-04-2010, నాగరకుంట (షాబాద్ మండలం), వేణుగోపాల శతకం; వీధిబడి చదువు మాత్రమే అయినా పద్యరచనలో నైపుణ్యం.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 10 Telugu Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas)

Textbook Solutions for Class 10 Telugu Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas)

Access structured TS Board textbook solutions for Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas). Designed in alignment with the latest academic curriculum for Class 10 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 07 Sataka Madhurima (Sweetness of Satakas) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ in printable PDF format for offline study on any device.