TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి

Step-by-Step Textbook Solutions for Class 11 Telugu Poem 05 My name is Praja Koti

Access comprehensive textbook solutions for Poem 05 My name is Praja Koti using the official curriculum guides for Class 11 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Poem 05 My name is Praja Koti Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 11 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

Question 1: ‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి?

Answer:

‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దాశరథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.
కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.
గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజావిజయమౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చే నేర్పు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవుడున్నా వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు.
హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.

Exam Tips:

a) కవి పరిచయం (దాశరథి, 'పునర్నవం' కవితా సంపుటి)తో ప్రారంభించి, మానవతావాదం, అహింస, గతవర్తమానాల సమన్వయం అనే మూడు సందేశాలను వేర్వేరు పేరాల్లో రాయండి.
b) 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అనే నినాదాన్ని పేర్కొనడం మరచిపోకండి.

 

Question 2: అహింస ఆవశ్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి?

Answer:

‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.
“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.
వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తి అహింసకున్నది.
రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గానికున్నది.
“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.
హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్త్రాలను అఖాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవసరమైన నీతి.

Exam Tips:

a) అహింస శక్తిని చూపే పద్య పంక్తులను (వట్టి చేతితో శత్రువుపై దుమికే శక్తి, మాటలనే ఈటెలు) ఉటంకించండి.
b) ముగింపులో 'అహింస జీవిత పరమావధి కావాలి' అనే కవి సందేశాన్ని రాయండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

Question 1: దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?

Answer:

‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.
ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.
వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం.
మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

Exam Tips:

a) కవి సంపుటాల పేర్లను (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం) క్రమంగా రాయండి.
b) గేయరచనలు, కథాకావ్యం, అనువాదాలను వేరుగా పేర్కొంటే ఎక్కువ మార్కులు వస్తాయి.

 

Question 2: యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?

Answer:

‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.
అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”
అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

Exam Tips:

a) అణ్వస్త్రాన్ని అఖాతంలో పడవేయడం, 'కత్తి పట్టి గెలిచినట్టి ఘనుడగు వీరుండెవ్వడు' వంటి పంక్తులను ఉదాహరించండి.
b) యుద్ధం రాక్షసక్రీడ అనే కవి అభిప్రాయాన్ని స్పష్టంగా రాయండి.

 

Question 3: పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?

Answer:

‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి.
గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.
గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.
“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”
అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు. “గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనుబోను భవిష్యత్తు వదులుకోను” అని గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

Exam Tips:

a) గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటినీ సమానంగా చూడాలనే దృష్టిని పద్యపంక్తులతో వివరించండి.
b) 'గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను' అనే పంక్తిని తప్పక రాయండి.

 

Question 4: పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?

Answer:

‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.
కృష్ణమాచార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు.
అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.

Exam Tips:

a) కవి వ్యక్తిత్వాన్ని మానవతావాది, శాంతికాముకుడు, సమన్వయ దృష్టి గలవాడు అనే శీర్షికలతో విశ్లేషించండి.

 

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

Question 1: దాశరథి తల్లిదండ్రులెవరు?

Answer:

దాశరథి తల్లిదండ్రులు వేంకటమ్మ, వేంకటాచార్యులు

Exam Tips:

a) కేవలం తల్లిదండ్రుల పేర్లు (వేంకటమ్మ, వేంకటాచార్యులు) రాస్తే చాలు; ఒక్క వాక్యం సరిపోతుంది.

 

Question 2: దాశరథి ఏ గ్రామంలో జన్మించాడు?

Answer:

వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించాడు

Exam Tips:

a) వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరు గ్రామం అని మూడు వివరాలు రాయండి.

 

Question 3: దాశరథి ప్రసిద్ధ నినాదమేది?

Answer:

“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధ నినాదం.

Exam Tips:

a) నినాదాన్ని కొటేషన్ మార్కులలో రాయండి: 'నా తెలంగాణ కోటి రతనాల వీణ'.

 

Question 4: దాశరథి తన పేరు ఏమని చెప్పుకున్నాడు?

Answer:

నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు.

Exam Tips:

a) కవి తన పేరు 'ప్రజాకోటి' అని, ఊరు 'ప్రజావాటి' అని చెప్పుకున్నాడని కూడా పేర్కొనవచ్చు.

 

Question 5: అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.

Answer:

అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు

Exam Tips:

a) 'అడుసు' అంటే బురద/మలినం అని గుర్తుంచుకోండి; అజ్ఞానాన్ని కడిగివేయాలని కవి భావం.

 

Question 6: దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?

Answer:

“అఖాతం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

Exam Tips:

a) 'అఖాతం' (లోతైన గొయ్యి/సముద్రం) అనే పదాన్ని సరిగా రాయండి.

 

Question 7: కవి కంటికి రుచించేదేమిటి?

Answer:

హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి

Exam Tips:

a) 'హృదయం', 'ఉదయం' అనే రెండు పదాలను జతగా రాయండి.

 

Question 8: కాలాన్ని కవి దేనితో పోల్చాడు?

Answer:

కంఠమాలతో పోల్చాడు.

Exam Tips:

a) 'కాలం నా కంఠమాల' అనే పంక్తి ఆధారంగా సమాధానం రాయండి.

 

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

Question 1: వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.

Answer:

పరిచయం:
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది. సందర్భము :- ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది భావము :- గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

Exam Tips:

a) సందర్భ వ్యాఖ్యల సమాధానాన్ని పరిచయం, సందర్భం, భావం అనే మూడు భాగాలుగా రాయండి.

 

Question 2: వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది

Answer:

పరిచయము :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నా పేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది. సందర్భము :- కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము:
చిన్నపాటి అంకుశంతో గున్న ఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నానని ఇందలి భావం.

Exam Tips:

a) పరిచయంలో కవి పేరు, పాఠం పేరు, 'పునర్నవం' ఖండిక పేరు తప్పక రాయండి; భావంలో అహింస ఆయుధంగా శత్రువును ఎదుర్కొనే శక్తి అని చెప్పండి.

 

Question 3: రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు

Answer:

పరిచయం :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది. సందర్భము :
మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము భావము :- అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

Exam Tips:

a) సందర్భంగా 'మానవులంతా ఒక్కటే' అనే భావాన్ని రాయండి; 'రాక్షసినైనా స్నేహానికి ఆహ్వానిస్తాను' అని భావం ముగించండి.

 

Question 4: ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.

Answer:

పరిచయం:
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది. సందర్భము :- మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :-
కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

Exam Tips:

a) భావంలో 'కత్తితో ఎవరూ గెలవలేదు, మెత్తని హృదయానికి లొంగనివారు లేరు' అనే రెండు అంశాలను చెప్పండి; చివరగా 'ఘర్షణ వల్ల ఆనందం లభించదు' అని ముగించండి.

 

V. సంధులు

1. గతమంత
గతము + అంత = గతమంత సూత్రము – ఉత్వసంధి/ ఉకారసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు
2. అణ్వస్త్రము:
అణు + అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ, ఉ, ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.
3. అణువంత
అణువు+అంత = అణువంత – ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు
4. చేతులెత్తి
చేతులు + ఎత్తి = చేతులెత్తి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
5. రెండంచులు
రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
6. కానిదెవడు
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంధి/ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదులయిత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి,షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము.

VI. సమాసాలు

1. ఎర్రజెండా:
ఎర్రనైన జెండా – విశేషణ పూర్వపద కర్మధారయము.
2. గున్నయేనుగు :
గున్నదైన ఏనుగు – విశేషణ పూర్వపద కర్మధారయము
3. మహాశక్తి:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము
4. మనోజ్ఞభావి:
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము
5. శబ్దధాటి:
శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము
6. అజ్ఞానం :
జ్ఞానము కానిది – నఞ్ తత్పురుష సమాసము
7. భరతభూమి:
భరత అనుపేరుగల భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము
8. ఇలాగోళము :
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం
9. మైత్రీ బంధము:
మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం
10. కంఠమాల :
కంఠమునందలి మాల – సప్తమీ తత్పురుష సమాసం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

1వ పద్యం:
తెలంగాణలో కోటిధీరులు గళధ్వనినేగాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి
అర్థాలు:
ధీరులు = ధైర్య వంతుల
గళధ్వని = కంఠధ్వని
ఇలాగోళము = భూగోళము
ఎల్లరి = అందరి
భావము:
కోట్ల ప్రజల తెలంగాణ వీరుల (గళాన్ని) గొంతుకను నేను అంతేకాదు ఈ భూమిపై ఉండే ప్రజలందరి ఊపిరిని నేను నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి అని కవి పేర్కొన్నాడని ఇందలి భావం.
2వ పద్యం:
అయినా అణువంతవాణ్ణి
అసలే కనరాని వాణ్ణి
కోట్ల కొలది జనుల మనసు
కొద్దో గొప్పో ఎరుగుదు
అర్థాలు:
అణువంత = అణువంత చిన్నరూపం
కనరాని = కన్పించనటువంటి
ఎరుగుదు = తెలుసుకున్నవాడిని
భావం:
కోట్లకొలది ప్రజలలో నేను అణువంతటివాడిని. అయినా వారందరి మనస్సులను కొద్దోగొప్పో తెలిసినవాడిని.
3వ పద్యం:
గతమే జీవితమనుకొని
వర్తమానమే వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదు.
అర్థాలు:
గతము = గడిచిన కాలం
వర్తమానము = ప్రస్తుతము
వలదని = వద్దని
నడచేవారిని = పయనించేవారిని
వెక్కిరించ = ఎగతాళి గేళి చేసే
కోర్కెలేదు = ఆలోచన కోరిక లేదు.
భావం:
గతించిన కాలమే అసలైన జీవితమనుకొని వర్తమానం వద్దని గతకాలాన్ని గుర్తుకుతెచ్చుకొని బ్రతికేవారిని ఎగతాళి చేసే కోరిక ఏ మాత్రం నాకులేదు.
4వ పద్యం:
గతమంతా బూదికుప్ప
కావాలి మనోజ్ఞభావి
తిరగబడండని అరచే
బిరుసువారి నిందింపను
అర్ధాలు:
గతమంతా = గడిచిన కాలమంతా
బూదికుప్ప = శూన్యం
మనోజ్ఞభావి = ఆనందాన్నిచ్చే భవిష్యత్తు
తిరగబడండి+అని = ఎదురు తిరగమని
అరచే = గొంతెత్తే
బిరుసువారి = తలపొగరు వారిని
నిందింపను = తిట్టను
భావం:
గడిచిన కాలమంతా పనికిరానిది సుందరమైన భవిష్యత్తు కావాలని తిరగబడండి అని అరచే తలబిరుసుగాళ్ళను నేనేమి అనగలను.
5వ పద్యం:
ఇవి రెండూ ఒక కత్తికి
అటూ ఇటూ రెండంచులు.
నే మాత్రం రెండంచులు
సాము చేయగలను లెండి!
అర్థాలు:
ఇవి రెండూ = పూర్వాపరాలు రెండూ
రెండంచులు = రెండువైపులా
నే మాత్రం = నేను మాత్రం
సాము = పరిశ్రమ
భావం:
భూత వర్తమాన కాలాలు రెండూ కత్తికున్న రెండంచులు. నేను మాత్రం రెండింటిని సమంగా చూస్తాను అని ఇందలి భావం.
6వ పద్యం:
గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి
అర్ధాలు:
గతము = గడచిన కాలము
వర్తమానం = గడుస్తున్న కాలం
కంఠమాల = కంఠమందు ధరించేమాల
ప్రజాకోటి = ప్రజలయొక్క సమూహం
ప్రజావాటి = ప్రజల నివాసం
భావం:
గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.
7వ పద్యం:
బాంబుల బలం చచ్చి
పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి
స్నేహములో శక్తి హెచ్చి
చిన్నపాటి అంకుశమున
గున్నయేనుగును వంచే
కొత్తరకం పద్ధతికను
“గొన్నానండో రండో!
భరతభూమి నేర్చినదో.
ప్రజాకోటీ నేర్పినదో
నిజం ఏమిటోగాని
వట్టి చేతితో శత్రువు
పై దుమికే శక్తి ఉంది.
అర్ధాలు:
బాంబులు = మారణాయుధాలు
బలంచచ్చి = బలం నశించి
పాములలో = విషసర్పాలలో
విషం చచ్చి = విషంపోయి
ప్రేమములో = ప్రేమభావంలో
బలం హెచ్చి = బలము పెరిగి
స్నేహంలో = మిత్రత్వంలో
అంకుశము = ఏనుగును అదుపుచేసే సాధనం (గోల)
భావము:
మారణాయుధాలలో బలం నశించి పాములలో విషం పోయి, ప్రేమ భావంలో బలం పెరిగి స్నేహానికున్న శక్తి పెరిగి చిన్న పాటి అంకుశముతో గున్న ఏనుగును దారికి తెచ్చుకునే కొత్త పద్ధతిని కనుగొన్నాను. నా భారతభూమి నేర్చినదో, ప్రజాసమూహాలు నేర్పాయో వట్టి చేతులతో అహింస భావనతో శత్రువుపై దూకే శక్తి నాకు లభించింది.
8వ పద్యం:
మాటలనే ఈటెలతో
పోటుపెట్టు బలంవుంది.
సైనికుడిని చూచివెరువ
బోని జగం నన్ను జూచి
భీతిజెంది భక్తి పొంది
చేతులెత్తి దండమిడును.
అర్ధాలు:
మాటలనే = మాటలు అనే
ఈటెలతో = ఆయుధాలతో
పోటు పెట్టు = గాయపరచు
వెరువు = భయం
భీతిజెంది = భయపడి
భావము:
మాటలనే ఈటెలతో ఎదుర్కొనే బలం ఉంది. సైనికుడిని చూసి భయపడని జగతి నన్ను చూసి భయాన్ని భక్తిని పొంది చేతులెత్తి నమస్కరిస్తున్నది. నేనెవరినో తెలుసా అహింసను ప్రేమను
9వ పద్యం:
వినుడీ నా శబ్దధాటి
నా పేరు ప్రజాకోటి
ఒక్క కోటి కాదండో
కోటికోట్ల ప్రాణులకు
మాట బలంతో ఆశా
పాటవమును కలిగిస్తా
అర్ధాలు:
శబ్దధాటి = మాటల యొక్క శక్తి
ఆశాపాటవము = ఆశతో కూడిన నేర్పు
భావము:
నా శబ్దం యొక్క ప్రతాపాన్ని వినండి. నా పేరు ప్రజాకోటి. ఒక్క కోటి కాదండి. కోటానుకోట్ల ప్రాణులకు మాటలనే బలాన్నిచ్చి నైపుణ్యాన్ని కలిగిస్తాను.
10వ పద్యం:
అయితే గప్పాలకోరు.
అనుకోబోకండి మీరు
అర్ధాలు:
గప్పాకోరు = కోతలరాయుడు
భావము:
అలాగని నేను గొప్పలు చెప్పుకునే వాడిని కాదండి.
11వ పద్యం:
మీ గొప్పయే నా గొప్ప మీరు లేకనే చొప్ప
అర్ధాలు:
చొప్ప = నిరుపయోగం
భావము:
మీ గొప్పేనా గొప్పకూడా. మీరు లేకపోతే నేను శూన్యం. నేను లేనేలేను.
12వ పద్యం:
ఎర్రజెండా పట్టుకోని
ఎగసిపోవువాడితోటి
పచ్చజెండా పట్టుకోని
పరుగు తీయువాని తోటి
మైత్రి బంధం కూర్చే
మహాశక్తినాకున్నది
అర్థాలు:
ఎర్రజెండా = కమ్యూనిష్టులు
పచ్చజెండా = జనతావారు
మైత్రిబంధ = స్నేహసంబంధాన్ని
కూర్చే = కలిపే
భావము:
ఎర్రజెండా పట్టుకుని నినదించే కమ్యూనిష్టులను, పచ్చజెండా పట్టుకుని పరుగులు తీసే ప్రజాస్వామ్యవాదులను మైత్రీ బంధంతో ఒకచోటికి ఒక దారికి తెచ్చే శక్తి నాకున్నది. నేను ప్రేమను అహింసను అని ఇందలి భావం.
13వ పద్యం:
ఎవడైనా మానవుడే
ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసినైనా మైత్రికి
రానిత్తును భయం లేదు
అర్థాలు:
ద్వేషించ = అయిష్టంగాచూచు
భావము:
ఈ భూమిమీద ఎక్కడ నివశించినా మానవుడే! అతనిని ద్వేషించటం ఎందుకు? రాక్షస స్వభావం ఉన్న వారినైనా స్నేహహస్తాన్ని అందిస్తాను. నాకు భయం లేదు.
14వ పద్యం:
దేవతనైనాతోడ్కొని
తెత్తును, భేదమ్మురాదు
నాపేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి
భావము:
అహింసతో ప్రేమతో దేవతలనైనా నాతోపాటు తీసుకుని వస్తాను. నా పేరు ప్రజాకోటి ఊరు ప్రజావాటి.
15వ పద్యం:
హృదయం వినా నా దగ్గర
ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నా కంటికి
ఏ వస్తువు రుచింపడు.
అర్థాలు:
ఉదయం = సూర్యోదయకాలం
వినా = తప్ప
భావము:
మంచి హృదయం తప్ప నా దగ్గర ఏ వస్తువూ లభించదు. ఉషోదయం తప్ప నా కంటికి ఏ వస్తువు ఆనందాన్ని కలుగచేయదు.
16వ పద్యం:
అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి
అర్థాలు:
అణ్వస్త్రము = అణుబాంబు
కొనిపోయి = తీసికొనిపోయి
అఖాతాన = భూమిలోపల
పడవేసితి = కప్పేశాను.
ప్రజాకోటి = ప్రజా సమూహాలు
సుఖపడగా = సుఖపడటం కోసం
భావము:
ప్రజలు సుఖపడాలన్న భావనతో అందరికంటే ముందుగా అణ్వస్త్రాన్ని అఖాతంలో పడవేశాడు.
17వ పద్యం:
కత్తిపట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు?
మెత్తని హృదయం దాడికి
తుత్తునియలు కానిదెవరు?
అజ్ఞానపు అడుసు కడిగి
అసలు విషయమెరుంగుడీ
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు
అర్థాలు:
ఘనుడగు = గొప్పవాడైన
మెత్తని హృదయం = మెత్తని మనసు
ధాటికి = దెబ్బకు
తుత్తునియలు = ముక్కలు ముక్కలు
అజ్ఞానపు = తెలివితక్కువ తనపు
అడుసు = మలినము
కడిగి = శుభ్రపరచి
ఘర్షణలో = పోరులో
హర్షం = ఆనందం
భావము:
కత్తి పట్టి విజయం సాధించినవాడు ఒక్కడు కూడా లేడు. మెత్తని ప్రేమ అహింసలను గల హృదయానికి లొంగనివాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఘర్షణ వలన సంతోషం ఏనాటికీ లభించదని తెలుసుకోండి. నాపేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి.

 

నాపేరు ప్రజాకోటి Summary in Telugu

కవి పరిచయం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పుట్టిన తేదీ : జూలై 22, 1925

పుట్టిన ఊరు : వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు గ్రామం తల్లిదండ్రులు : వెంకటమ్మ, వెంకటాచార్యులు విద్యాభ్యాసం : ఖమ్మంలో హైస్కూలు చదువు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో బి.ఏ

రచనలు :

1. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం మొదలగునవి. 2. “మహాబోధి” కథాకావ్యం

3. నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా గేయరచనలు

4. గాలీబు గీతాలను ఉర్దూ నుండి తెలుగునకు అనువాదం

5. “నవమి” నాటికలసంపుటి

6. దాశరథి శతకం

7. వందలకొలది సినిమాపాటలు

పురస్కారాలు, బిరుదులు :

1. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ కళా ప్రపూర్ణబిరుదులు

2. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ను

3. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలు

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.

మరణం : నవంబరు 5, 1987

“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైక్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశారు.

ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటికల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథి కాలం చేశారు.

పాఠ్యాంశ సందర్భం

కవి అయినవాడు మొదట మానవతావాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే!

మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతం వర్తమానం నిశితంగా పరిశీలించి ముందుకు సాగాలి.

మన దేశం అనాది నుండి శాంతి, అహింసలను అనుసరించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని అందరిలో తనను కలుపుకోవటం భారతీయుల నైజం. చెడునుండి మంచికి చేరుకుని జీవితాలను సార్థకం చేసుకోవాలన్నది ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు. హింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంపై ఎవరూ విజయం సాధించలేరు. అహింస జీవితపరమావధి కావాలని దాశరథి భావించారు. ప్రస్తుత పాఠ్యభాగం నాపేరు ప్రజాకోటి దాశరథి కవితా ఖండిక “పునర్నవం” నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సారాంశం

భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుతూ అహింసే జీవిత పరమావధిగా భారతజాతి జీవనం సాగిస్తున్నది. హింసతో ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించలేరు. అహింస పరమావధికావాలని దాశరథి ఆకాంక్ష.

కోట్ల ప్రజల తెలంగాణ వీరుల గొంతుకనునేను. అంతేకాదు ఈ భూమిపై నివసించే కోటాను కోట్ల ప్రజల ఊపిరిని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.

వారందరిలో నేను అణువంతవాడిని. అయినా వారందరి మనసు కొద్దో గొప్పో తెలిసినవాడిని నేను.

గతించిన కాలమే మంచిదన్న భావన పనికి రాదని గతించిన కాలాన్ని, గుర్తుకు తెచ్చుకుని, ఆనందించే వారిని ఎగతాళిచేసే కోరిక కూడా ఏ మాత్రం వర్తమాన ప్రజలకు ఉండకూడదన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలని అన్నాడు”.

అనాది నుండి భారతదేశం శాంతి అహింసలను ఉపాసించిందని, విశ్వశ్రేయస్సును కోరుకున్నదని తనలో అందరిని కలుపుకోవటం అందరిలో తానై కలసిపోవటం భారతీయ తాత్వికతకు నిదర్శనంగా భావించాలన్నాడు.

ఎర్రజెండా పట్టుకుని ఎగసిపడుతున్నవారిని పచ్చజెండా పట్టుకుని పరుగులు తీస్తున్నవారిని ఏకం చేయగలసత్తా అహింసకు ప్రేమకు సొంతమన్నాడు.

ఈ ప్రపంచంలో జీవించేవారంతా మానవులే! వారిలో కొందరిని ప్రేమించటం ద్వేషించటం తగదు. రాక్షసస్వభావం గల వారితో కూడా స్నేహం చేయగలగాలి. ఉదయము హృదయము తప్ప నాకు ఏదీ రుచింపదు. యుద్ధం వర్తమానానికి ఔట్ డేటెడ్. శాంతి అహింస ప్రేమలు వర్తమాన భవిషత్తులకు ఆదర్శప్రాయాలు. అణ్వస్త్రాలను అందరికంటే ముందుగా అగాధాన పడవేయాలి. అది ప్రజలకు సుఖ సంతోషాలనిస్తుంది. ఈ లోకంలో కత్తిపట్టి నిజమైన విజయాన్ని సాధించనవాడు ఒక్కడూ లేడు. మెత్తని హృదయంతో ప్రేమతో, అహింసతో శత్రువులోని అజ్ఞానాన్ని తొలగించి ఆదర్శభావాలను పెంపొందించాలి. ఘర్షణ వలన ఏనాటికీ ఆనందానుభూతులు లభించవు. ఇది నామాట కాదు ప్రజలమాట అని దాశరథి కృష్ణమాచార్యులు నా పేరు ప్రజాకోటిలో వివరించాడు.

Free study material for Telugu

TS Board Solutions for Class 11 Telugu Poem 05 My name is Praja Koti

Textbook Solutions for Class 11 Telugu Poem 05 My name is Praja Koti

Review comprehensive exercise answers for Class 11 Telugu Poem 05 My name is Praja Koti. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Poem 05 My name is Praja Koti with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Poem 5 నాపేరు ప్రజాకోటి in printable PDF format for offline study on any device.