Official TS Board Solutions for Class 11 Chemistry: Chapter 11 p-Block Elements - Group 14
Explore reliable textbook solutions for Chapter 11 p-Block Elements - Group 14 tailored for Class 11 learners. Utilizing these Chemistry answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Chemistry: Chapter 11 p-Block Elements - Group 14
View or download the dedicated Chapter 11 p-Block Elements - Group 14 solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Chemistry.
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: గ్రూపు 14 మూలకాల ఆక్సీకరణ స్థితులలో మార్పును చర్చించండి.
Answer:
14వ గ్రూపు మూలకాల బాహ్యతమ కర్పరంలో 4 ఎలక్ట్రానులు ఉన్నాయి. ఈ మూలకాలు కనబరచే సాధారణ ఆక్సీకరణ స్థితులు +4, + 2. కార్బన్ ఋణ ఆక్సీకరణ స్థితుల్ని కూడా చూపుతుంది.
+ 4 ఆక్సీకరణ స్థితిలో ఉన్న సమ్మేళనాలు సమయోజనీయ స్వభావం కలవిగా ఉంటాయి. భారతర మూలకాలలో +2 ఆక్సీకరణ స్థితిని చూపే ప్రవృత్తి పెరిగే క్రమం Ge < Sn < Pb. కార్బన్, సిలికాన్లు తరచుగా +4 ఆక్సీకరణ స్థితిని చూపుతాయి. జెర్మేనియం స్థిర సమ్మేళనాలను +4 స్థితిలో ఏర్పరుస్తుంది. టిన్ రెండు (+2, +4) ఆక్సీకరణ స్థితులలోను సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. లెడ్ సమ్మేళనాలు +2 స్థితిలో స్థిరమైనవి.
Exam Tips:
a) సాధారణ ఆక్సీకరణ స్థితులు +4, +2 అని చెప్పి, క్రిందికి వెళ్లేకొద్దీ +2 స్థిరత్వం పెరుగుతుందని (Ge < Sn < Pb) రాయండి.
b) 'జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం' ప్రస్తావిస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Question 2: క్రింది సమ్మేళనాలు నీటితో ఎలా ప్రవర్తిస్తాయి.
a) BCl₃
b) CCl₄
Answer:
a) BCl₃ నీటితో చర్య పొంది H₃BO₃ ను ఏర్పరుస్తుంది.
BCl₃ + 3 H₂O → H₃BO₃ + 3HCl
b) CCl₄ నీటితో చర్య పొందదు. నీటిలో కరుగదు. వేరే ప్రావస్థగా వుంటుంది.
Exam Tips:
a) BCl₃ జలవిశ్లేషణ సమీకరణాన్ని సరిగ్గా తుల్యం చేసి (3 H₂O, 3 HCl) రాయండి.
b) CCl₄ లో C కి d-ఆర్బిటాళ్లు లేకపోవడం వల్ల నీటితో చర్య జరగదని కారణం చెప్పండి.
Question 3: BCl₃, SiCl₄ ఎలక్ట్రాన్ కొరత ఉన్న సమ్మేళనాలా ? వివరించండి.
Answer:
BCl₃ లో బోరాన్ బాహ్య కర్పరంలో ఎలక్ట్రాన్ అష్టకం లేదు. కనుక అది ఎలక్ట్రాన్కొరత గల సమ్మేళనం.
SiCl₄ లోని Si కు బాహ్య కర్పరంలో ఎలక్ట్రాన్ అష్టకం ఉన్నది. అది ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం కాదు.
Exam Tips:
a) ఎలక్ట్రాన్ కొరత = బాహ్య కర్పరంలో అష్టకం లేకపోవడం; BCl₃ లో B కి 6 ఎలక్ట్రాన్లు, SiCl₄ లో Si కి 8 ఎలక్ట్రాన్లు ఉంటాయని చూపండి.
Question 4: క్రింది వాటిలో కార్బన్ సంకరీకరణాన్ని సూచించండి.
a) \( \mathrm{CO_3^{2-}} \)
b) వజ్రం
c) గ్రాఫైట్
d) ఫుల్లరీన్
Answer:
a) \( \mathrm{CO_3^{2-}} \) : sp² సంకరీకరణం
b) వజ్రం : sp³ సంకరీకరణం
c) గ్రాఫైట్ : sp² సంకరీకరణం
d) ఫుల్లరీన్ : sp² సంకరీకరణం
Exam Tips:
a) సంకరీకరణం = (σ బంధాల సంఖ్య + ఒంటరి జంటలు) ఆధారంగా నిర్ణయించండి: CO₃²⁻ (3 σ) → sp², వజ్రం (4 σ) → sp³, గ్రాఫైట్, ఫుల్లరీన్ (3 σ) → sp².
Question 5: CO ఎందుకు విషపూరితమైనది ? (March 2013)
Answer:
CO విషపూరితమైనది. అది రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసి స్థిరమైన సంక్లిష్టం ఏర్పరుస్తుంది. చర్య ఈ విధంగా ఉంటుంది:
\( \mathrm{Hb + CO \longrightarrow Hb{-}CO} \)
హీమోగ్లోబిన్ + CO → కార్బాక్సీ హీమోగ్లోబిన్
కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఆక్సీ హీమోగ్లోబిన్ కన్నా సుమారు 300 రెట్లు అధిక స్థిరమైనది. అందువల్ల హీమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను రవాణా చేయలేదు.
Exam Tips:
a) CO, Hb తో కలిసి కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పరుస్తుందని సమీకరణంతో రాయండి.
b) ఈ సంక్లిష్టం O₂ తో ఏర్పడే సంక్లిష్టం కన్నా సుమారు 300 రెట్లు స్థిరమని తప్పక పేర్కొనండి.
Question 6: రూపాంతర (allotropy) అంటే ఏమిటి ? స్ఫటిక రూపంలోని కార్బన్ భిన్న రూపాంతరాలను తెలపండి. (March 2013)
Answer:
ఒకే మూలకం భిన్న భౌతిక రూపాలలో లభించుటను రూపాంతరత అంటారు. కార్బన్ మూడు స్ఫటిక రూపాంతరాలలో లభిస్తోంది. అవి వజ్రం, గ్రాఫైట్, ఫుల్లరీన్.
Exam Tips:
a) రూపాంతరతకు నిర్వచనం రాసి, కార్బన్ యొక్క మూడు స్ఫటిక రూపాంతరాలు (వజ్రం, గ్రాఫైట్, ఫుల్లరీన్) పేర్కొనండి.
Question 7: కింది ఆక్సెడులను తటస్థ, ఆమ్ల, క్షార, ద్విస్వభావం గల వాటిగా వర్గీకరించండి.
a) CO
b) B₂O₃
c) SiO₂
d) CO₂
e) Al₂O₃
f) PbO₂
g) Tl₂O₃
Answer:
a) CO – తటస్థ
b) B₂O₃ – ఆమ్ల
c) SiO₂ – ఆమ్ల
d) CO₂ – ఆమ్ల
e) Al₂O₃ – ద్విస్వభావ
f) PbO₂ – ద్విస్వభావ
g) Tl₂O₃ – క్షార
Exam Tips:
a) CO తటస్థ ఆక్సైడ్; B₂O₃, SiO₂, CO₂ ఆమ్ల; Al₂O₃, PbO₂ ద్విస్వభావ; Tl₂O₃ క్షార ఆక్సైడ్. మూలకం లోహ స్వభావం పెరిగితే ఆక్సైడ్ క్షారత పెరుగుతుందని గుర్తుంచుకోండి.
Question 8: మనిషి (కృత్రిమంగా) తయారుచేసిన ఏవైనా రెండు సిలికేట్ల పేర్లు రాయండి.
Answer:
1. గాజు
2. సిమెంట్
Exam Tips:
a) గాజు, సిమెంట్ వంటి కృత్రిమ సిలికేట్లను రాయండి; ఆస్బెస్టాస్, మైకా వంటివి సహజ సిలికేట్లు అని కలపకండి.
Question 9: గ్రూపు 14 మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
Answer:
గ్రూపు 14 మూలకాలు కార్బన్ (C); సిలికాన్ (Si); జెర్మేనియం (Ge); టిన్ (Sn) మరియు లెడ్ (Pb).
వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలు:
కార్బన్ : 1s²2s²2p² (Z = 6)
సిలికాన్ : 1s²2s²2p⁶3s²3p² (Z = 14)
జెర్మేనియం : 1s²2s²2p⁶3s²3p⁶3d¹⁰4s²4p² (Z = 32)
టిన్ : 1s²2s²2p⁶3s²3p⁶3d¹⁰4s²4p⁶4d¹⁰5s²5p² (Z = 50)
లెడ్ : 1s²2s²2p⁶3s²3p⁶3d¹⁰4s²4p⁶4d¹⁰4f¹⁴5s²5p⁶5d¹⁰6s²6p² (Z = 82)
గ్రూపు 14 మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns²np².
Exam Tips:
a) ప్రతి మూలకానికి పరమాణు సంఖ్య (Z) సహా పూర్తి విన్యాసం రాసి, చివర సాధారణ విన్యాసం ns²np² అని పేర్కొనండి.
Question 10: గ్రాఫైట్ కందెనలాగా ఎట్లా పనిచేస్తుంది ?
Answer:
గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ పొరలు బలహీనమైన వాన్డర్వాల్ బలాలచే బంధించబడి ఒకదానిపై ఒకటి సులభంగా జారుతూ ఉంటాయి. అందుకనే గ్రాఫైట్ కందెనగా పనిచేస్తుంది.
Exam Tips:
a) గ్రాఫైట్ పొరల మధ్య బలహీన వాన్డర్వాల్ బలాలు ఉండటం వల్లనే పొరలు జారుతాయని కారణం రాయండి.
Question 11: గ్రాఫైట్ మంచి వాహకం – వివరించండి.
Answer:
గ్రాఫైట్ ప్రతి కార్బన్ పరమాణువు వద్ద సంకరీకరణంలో పాల్గొనని p – ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ ఉంది. దీనినే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ అంటారు. ఒక్కొక్క కార్బన్ పరమాణువు మూడు ఆసన్న కార్బన్ sp² సంకర ఆర్బిటాల్లను ఉపయోగించుకొని మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. నాలుగవ ఎలక్ట్రాన్ π బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు మొత్తం పొర అస్థానీకృతం అవుతాయి. ఈ ఎలక్ట్రానులు చలనంలో ఉంటాయి. అందువల్ల గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం.
Exam Tips:
a) sp² సంకరీకరణంలో పాల్గొనని p-ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్ π బంధం ఏర్పరిచి పొర అంతా విస్థానీకృతమవుతుందని వివరించండి.
Question 12: సిలికా నిర్మాణాన్ని వివరించండి.
Answer:
సిలికాన్ డై ఆక్సైడును సిలికా అంటారు. సిలికాన్ డై ఆక్సైడ్ సమయోజనీయ, త్రిమితీయ అల్లిక గల ఘనం. ఇందులో సిలికాన్ పరమాణువు సమయోజనీయ బంధంతో టెట్రా హెడ్రల్ రీతిలో నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో కలిసి ఉంటుంది. ప్రతి ఆక్సిజన్ పరమాణువు ఇంకొక సిలికాన్ పరమాణువుతో సమయోజనీయ బంధంతో ఉంటుంది. మొత్తం స్ఫటికాన్ని బృహత్ అణువుగా భావించవచ్చు.
Exam Tips:
a) SiO₄ చతుర్ముఖి యూనిట్, ప్రతి O రెండు Si లతో పంచుకోబడటం (SiO₂ ఫార్ములా) మరియు త్రిమితీయ బృహదణు నిర్మాణం తప్పక రాయండి.
b) నిర్మాణ పటాన్ని గీస్తే అదనపు మార్కులు వస్తాయి.
Question 13: “సంశ్లేషణ వాయువు” అంటే ఏమిటి ?
Answer:
వేడిగానున్న కోక్ మీదకు నీటి ఆవిరిని పంపడం ద్వారా వ్యాపార పద్ధతిలో CO, H₂ ల మిశ్రమాన్ని తయారుచేస్తారు. ఏర్పడిన CO, H₂ ల మిశ్రమాన్ని సంశ్లేషణ వాయువు అంటారు.
Exam Tips:
a) వేడి కోక్ మీద నీటి ఆవిరి పంపితే CO + H₂ మిశ్రమం ఏర్పడుతుందని సమీకరణంతో రాయండి (C + H₂O → CO + H₂).
Question 14: “ప్రొడ్యూసర్ వాయువు” అంటే ఏమిటి ?
Answer:
CO, N₂ ల మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. దీని సంఘటనం CO = 33%, N₂ = 64%, CO₂ మరియు H₂ = 2.5%.
Exam Tips:
a) ప్రొడ్యూసర్ వాయువు = CO + N₂ మిశ్రమం (కోక్ మీద గాలి పంపి తయారవుతుంది); దానికీ జలవాయువుకూ తేడా గుర్తుంచుకోండి.
Question 15: వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. వివరించండి.
Answer:
వజ్రం త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. ప్రతి కార్బన్ sp³ సంకరీకరణం చెందుతుంది. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో sp³ సంకర ఆర్బిటాళ్ళతో బంధాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణం ప్రాదేశికంగా వ్యాపించి కార్బన్ పరమాణువులతో దృఢమైన త్రిమితీయ అల్లికను ఏర్పరుస్తుంది. ఇలా వ్యాపించి ఉన్న సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయడం చాలా శక్తితో కూడుకున్న పని. అందువల్ల వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది.
Exam Tips:
a) వజ్రంలో బంధాలను విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తి కావాలి కాబట్టి ద్రవీభవన ఉష్ణోగ్రత అధికం; 'త్రిమితీయ బృహదణు నిర్మాణం' అనే పదాలు ఉపయోగించండి.
Question 16: కిరణజన్య సంయోగ క్రియలో CO₂ పాత్ర ఏమిటి ?
Answer:
కిరణజన్య సంయోగక్రియ ద్వారా పచ్చటి చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేటులుగా మారుస్తాయి.
\( 6\mathrm{CO_2} + 12\mathrm{H_2O} \xrightarrow{h\nu,\ \text{chlorophyll}} \mathrm{C_6H_{12}O_6} + 6\mathrm{O_2} + 6\mathrm{H_2O} \)
Exam Tips:
a) 6CO₂ + 12H₂O → C₆H₁₂O₆ + 6O₂ + 6H₂O సమీకరణాన్ని (క్లోరోఫిల్, సూర్యకాంతి సమక్షంలో) తప్పక రాయండి.
Question 17: హరిత గృహ ప్రభావాన్ని ఏ విధంగా CO₂ పెంచుతుంది ?
Answer:
శిలాజ ఇంధనాల దహనం పెరగడం, సిమెంట్‌ను ఉత్పత్తి చేయడానికి ఇటీవలి కాలంలో లైమ్ స్టోన్ వినియోగం బాగా పెరగడం వల్ల వాతావరణంలో CO₂ భాగం పెరుగుతోంది. దీనివల్ల హరితగృహ ఫలితం పెరుగుతోంది.
Exam Tips:
a) శిలాజ ఇంధనాల దహనం, సిమెంట్ తయారీలో లైమ్‌స్టోన్ వినియోగం వల్ల CO₂ పెరిగి, అది ఉష్ణాన్ని బంధించడం వల్ల హరితగృహ ప్రభావం పెరుగుతుందని రాయండి.
Question 18: సిలికోన్‌లు అంటే ఏమిటి ?
Answer:
సిలికోన్‌లు ఆర్గానో సిలికాన్ సమ్మేళనాలు. వీటిలో సిలికాన్ కు ఆక్సిజన్, కార్బన్లు బలంగా బంధింపబడి ఉంటాయి.
\( \mathrm{HO{-}SiR_2{-}O{-}[SiR_2{-}O]_n{-}SiR_2{-}OH} \)
Exam Tips:
a) సిలికోన్ల సాధారణ నిర్మాణం (–R₂Si–O–)ₙ ను పటంతో చూపండి; ఇవి ఆర్గానో సిలికాన్ పాలిమర్లు.
Question 19: సిలికోన్ల ఉపయోగాలు వ్రాయండి.
Answer:
సిలికోన్ల ఉపయోగాలు:
1. వాటర్ ఫ్రూఫ్ బట్టలు, కాగితాలను తయారుచేయడానికి వాడతారు.
2. సిలికోన్ రబ్బరు ఉత్తమ విద్యున్నిరోధకం. అందువల్ల ఎలక్ట్రికల్ మోటార్లో ఉపయోగిస్తారు.
3. వీటికి రసాయన జడత్వం ఉన్నది. అందువలన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. ఈ కారణంగా వాటిని పెయింట్లోనూ, పింగాణీలలోనూ ఉపయోగిస్తారు.
4. ద్రవ సిలికోన్ల స్నిగ్ధత ఉష్ణోగ్రతతో మారదు. -40°C వద్ద కూడ ఇవి గడ్డ కట్టవు. అందువలన వీటిని విమానాలలో కందెనగా వాడతారు.
5. సిలికోన్ నూనెలు అధిక స్థిరత్వం కలిగి ఉంటాయి. వేడిచేసినా కూడా ఆవిరి చెందవు. అందువలన వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆయిల్ బాథ్ మరియు అధిక శూన్యత పంపులలోనూ వాడతారు.
ఈ విధంగా ఆధునిక యుగంలో సిలికోన్లను అన్ని రంగాలలో వాడతారు.
Exam Tips:
a) ఉపయోగాలను నంబర్లతో రాయండి: సిలికోన్ రబ్బరు, జలనిరోధక పూతలు, ఉష్ణోగ్రతకు స్థిరమైన కందెనలు, విద్యుత్ బంధకాలు.
Question 20: తగరం (టిన్) మీద నీటి ప్రభావం ఏమిటి ?
Answer:
టిన్ నీటి ఆవిరిని వియోగం చెందించి టిన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ వాయువులను ఏర్పరుస్తుంది.
\( \mathrm{Sn + 2H_2O \xrightarrow{\Delta} SnO_2 + 2H_2} \)
Exam Tips:
a) Sn + 2H₂O → SnO₂ + 2H₂ సమీకరణాన్ని వేడి చేసినపుడు అని షరతుతో రాయండి.
Question 21: SiCl₄ గురించి వ్రాయండి.
Answer:
సిలికాన్ టెట్రా క్లోరైడ్ సిలికాన్‌పై క్లోరిన్ చర్య వల్ల ఏర్పడుతుంది.
Si + 2Cl₂ → SiCl₄
SiCl₄ బాష్పశీలి ద్రవం. నీటి అణువు ఇచ్చే ఒంటరి ఎలక్ట్రాన్ జంటను Si లోని d ఆర్బిటాల్ స్వీకరించి Si(OH)₄ ఏర్పడుతుంది.
\( \mathrm{SiCl_4 + H_2O \xrightarrow{-HCl} SiCl_3(OH) \xrightarrow{+3H_2O,\ -3HCl} Si(OH)_4} \)
(సిలిసిక్ ఆమ్లం)
Exam Tips:
a) Si + 2Cl₂ → SiCl₄ తయారీ, జలవిశ్లేషణలో Si లోని d-ఆర్బిటాల్ నీటి ఒంటరి జంటను స్వీకరించడం అనే యాంత్రికతను రాయండి.
Question 22: CO₂ వాయువు కానీ SiO₂ ఘనపదార్థం – వివరించండి.
Answer:
సిలికాన్ డై ఆక్సైడ్ త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. ప్రతి సిలికాన్ పరమాణువు నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో చతుర్ముఖీయంగా నాలుగు సమయోజనీయ బంధాలతో బంధింపబడి ఉంటుంది. అందువలన SiO₂ ఘనపదార్థంగా ఉంటుంది.
CO₂ రేఖీయ అణువు. ఈ అణువులు విడివిడిగా ఉంటాయి. ఈ అణువుల మధ్య వాన్డర్వాల్ బలాలు ఉంటాయి. అందువలన CO₂ వాయువుగా ఉంటుంది.
Exam Tips:
a) SiO₂ లో సమయోజనీయ త్రిమితీయ అల్లిక (ఘనం) vs CO₂ లో రేఖీయ అణువులు, బలహీన వాన్డర్వాల్ బలాలు (వాయువు) అని పోల్చండి.
Question 23: ZSM – 5 ఉపయోగం వ్రాయండి.
Answer:
జియొలైట్లను ఉత్ప్రేరకాలుగా వాడతారు. ZSM-5 అనే జియోలైట్‌ను ఆల్కహాల్లను నేరుగా గాసోలిన్గా మార్చడానికి ఉపయోగిస్తారు.
Exam Tips:
a) జియోలైట్లు ఉత్ప్రేరకాలు; ZSM-5 ఆల్కహాల్లను నేరుగా గాసోలిన్గా మారుస్తుందని రాయండి.
Question 24: పొడి మంచు ఉపయోగం ఏమిటి ?
Answer:
ఘన CO₂ ను పొడి మంచు అంటారు. ఐస్‌క్రీమ్, అతిశీతలమైన ఆహారపదార్థాల కోసం ప్రశీతకంగా ఉపయోగిస్తున్నారు. బరువైనదీ, దహనానికి దోహదపడనిదీ కనుక దీనిని మంటలను ఆర్పడానికి వాడతారు.
Exam Tips:
a) పొడి మంచు = ఘన CO₂; ప్రశీతకం, అగ్నిమాపకంలో వాడతారు, ఎందుకంటే అది దహనానికి తోడ్పడదు.
Question 25: జలవాయువు (Water gas) ను ఎలా తయారుచేస్తారు ?
Answer:
వేడిగా నున్న కోక్ మీదకు నీటి ఆవిరిని పంపుట ద్వారా వ్యాపార పద్ధతిలో జలవాయువును తయారుచేస్తారు.
C (ఘ) + H₂O (వా) → CO (వా) + H₂ (వా) (473 – 1273 K)
Exam Tips:
a) జలవాయువు = CO + H₂; C + H₂O (473–1273 K) → CO + H₂ అని షరతులతో రాయండి.
Question 26: ప్రొడ్యూసర్ వాయువును ఎలా తయారుచేస్తారు ?
Answer:
కొలిమిని కోక్‌తో నింపి, దాని అడుగు భాగం నుండి వేడి గాలిని పంపుతారు. మొదట CO₂ వాయువు ఏర్పడుతుంది.
CO₂ కోల్ బెడ్ మీదుగా ప్రయాణించి CO గా క్షయకరణం చెందుతుంది.
CO, N₂ ల మిశ్రమం బయటకు వస్తుంది.
C + O₂ → CO₂
CO₂ + C → 2CO
Exam Tips:
a) రెండు దశల చర్యలు: C + O₂ → CO₂, తర్వాత CO₂ + C → 2CO; ఫలిత మిశ్రమం CO + N₂ అని రాయండి.
Question 27: గ్రాఫైట్‌లో C − C బంధ దూరం, వజ్రంలో C – C బంధ దూరం కంటే తక్కువ – వివరించండి.
Answer:
గ్రాఫైట్‌లో C – C బంధ దూరం 141.5 pm. గ్రాఫైట్‌లో కార్బన్ sp² సంకరీకరణం చెంది ఉంటుంది. అందువల్ల మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. నాల్గవ ఎలక్ట్రాన్ π బంధాన్ని ఏర్పరుస్తుంది. ద్విబంధ స్వభావం వల్ల C – C బంధ దూరం తక్కువ.
వజ్రంలో కార్బన్ sp³ ఆర్బిటాళ్ళతో C – C ఏకబంధాలను మాత్రమే ఏర్పరుస్తుంది. అందువల్ల C – C బంధ దూరం 154 pm.
Exam Tips:
a) గ్రాఫైట్ (sp², పాక్షిక ద్విబంధ స్వభావం, 141.5 pm) vs వజ్రం (sp³, ఏకబంధం, 154 pm) అని రెండింటి బంధ దూరాలను పోల్చండి.
Question 28: వజ్రాన్ని అమూల్యమైన రాయిగా వాడతారు – వివరించండి.
Answer:
వజ్రానికి వక్రీభవన గుణకం గరిష్ఠంగా 2.45 ఉన్నది. కాంతి పతనమైనపుడు అధిక వక్రీభవన గుణకం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. అందువల్ల వజ్రం కాంతి పడినపుడు ప్రకాశిస్తుంది. అందువల్ల వజ్రాన్ని అమూల్య రాయిగా వాడతారు.
Exam Tips:
a) వజ్రానికి అధిక వక్రీభవన గుణకం (2.45) ఉండటం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరిగి మెరుస్తుందని రాయండి.
Question 29: కార్బన్ సంయోజకత నాలుగు కంటే ఎక్కువ ఎప్పుడూ చూపించదు. కానీ ఆ కుటుంబంలో మిగతా మూలకాలు సంయోజకత ఆరు వరకు చూపిస్తాయి – వివరించండి.
Answer:
కార్బన్ బాహ్య కర్పరం 2వ కర్పరం. దీనిలో d ఆర్బిటాళ్ళు ఉండవు. అందువల్ల బాహ్య కర్పరంలో నాలుగు ఎలక్ట్రానులను ఉపయోగించుకొని నాలుగు బంధాలను మాత్రమే ఏర్పరుస్తుంది. కావున కార్బన్ సంయోజకత నాలుగుకు మించదు.
మిగిలిన 14వ గ్రూపు మూలకాలు బాహ్య స్థాయిలో ఖాళీ d ఆర్బిటాళ్ళు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అవి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించగలవు. అధిక సమన్వయ సంఖ్యను చూపించగలవు.
Exam Tips:
a) కార్బన్ 2వ కర్పరంలో d-ఆర్బిటాళ్లు లేవు (గరిష్ఠ సంయోజకత 4); Si, Ge మొదలైనవాటిలో ఖాళీ d-ఆర్బిటాళ్లు ఉండి సమన్వయ సంఖ్య 6 వరకు పెరుగుతుంది.
Question 30: ప్రొడ్యూసర్ వాయువు, జల వాయువు కంటె తక్కువ సామర్థ్యం గల ఇంధనం – వివరించండి.
Answer:
ప్రొడ్యూసర్ వాయువులో 33% CO మరియు 65% N₂ ఉన్నాయి. నైట్రోజన్ దహనశీలి కాదు. అందువల్ల దాని కెలోరిఫిక్ విలువ 5439 కి.జౌ./మీ³.
జలవాయువులో CO మరియు H₂ లు దహనశీలి వాయువులు. అందువల్ల జలవాయువులో దహనం చెందగల వాయువుల శాతం ఎక్కువ. దాని కెలోరిఫిక్ విలువ 13,000 కి.జౌ./మీ³.
Exam Tips:
a) ప్రొడ్యూసర్ వాయువులో అదహనశీల N₂ ఎక్కువ (కెలోరిఫిక్ విలువ 5439 kJ/m³), జలవాయువులో CO + H₂ రెండూ దహనశీలి (13,000 kJ/m³) అని విలువలతో రాయండి.
Question 31: \( \mathrm{SiF_6^{2-}} \) తెలుసు కాని \( \mathrm{SiCl_6^{2-}} \) తెలియదు వివరించండి.
Answer:
1. Si⁴⁺ అయాన్ సైజు పరిమితి వల్ల దాని చుట్టూ ఆరు పెద్ద క్లోరైడు అయాన్లకు సరిపడినంత చోటు లేకపోవుట.
2. క్లోరైడు అయాన్ ఒంటరి జంట, Si⁴⁺ ల మధ్య అన్యోన్య చర్య బలహీనమైనది.
Exam Tips:
a) SiF₆²⁻ లో చిన్న F⁻ అయాన్లు ఆరు చేరడానికి చోటు ఉంటుంది; పెద్ద Cl⁻ లకు Si⁴⁺ చుట్టూ చోటు సరిపోదు, అందుకే SiCl₆²⁻ ఏర్పడదు.
లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: నిర్మాణాల ఆధారంగా వజ్రం, గ్రాఫైట్‌ల ధర్మాలలో తేడాలను వివరించండి.
Answer:
గ్రాఫైట్:
1) గ్రాఫైట్ మృదువుగా వుండి, జారుడు స్వభావం కలిగి ఉంటుంది. కందెనగా ఉపయోగించవచ్చు.
కారణం : గ్రాఫైట్ పొరల నిర్మాణం కలిగి ఉండి, ఆ పొరలు ఒకదానిపై ఒకటి బలహీన వాండర్ వాల్ బలాలచే బంధించబడి ఉంటాయి. అందువల్లనే, ఒత్తిడి కలుగచేసినపుడు ఆ పొరలు ఒకదానిపై ఒకటి జారుతాయి. అందువలననే గ్రాఫైట్ మృదువుగా ఉంటుంది.
కందెనగా ఉపయోగిస్తారు.
2) గ్రాఫైట్ ఉత్తమ విద్యుద్వాహకం.
కారణం : గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉంది. అది π బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఎలక్ట్రానులు మొత్తం పొర అంతా అస్థానీకృతం అవుతాయి. ఈ ఎలక్ట్రానులు చలనంలో ఉంటాయి. అందువల్ల గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం.
వజ్రం:
1) వజ్రం కఠినంగా ఉండి అరగదీసే రాయిగా పనిచేస్తుంది.
కారణం : వజ్రంలోని ప్రతి కార్బన్ sp³ సంకరీకరణం చెంది వుంటుంది. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్లతో sp³ – sp³ అతిపాతాల ద్వారా బలమైన బంధాలను ఏర్పరచడం వల్ల త్రిమితీయ బృహదణు నిర్మాణాన్ని పొందుతుంది. ఈ బంధాలను ఛేదించుట కష్టం. అందువల్ల వజ్రం కఠినం.
2) వజ్రం విద్యుద్వాహకం కాదు.
కారణం : వజ్రంలోని కార్బన్ల వద్ద స్వేచ్ఛా ఎలక్ట్రానులు లేవు.
డైమండ్ మరియు గ్రాఫైట్ మధ్య భేదాలు:
| వజ్రం | గ్రాఫైట్ |
| 1) వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు sp³ సంకరీకరణం పొందుతుంది. | 1) గ్రాఫైట్‌లో ప్రతి కార్బన్ పరమాణువు sp² సంకరీకరణం పొందుతుంది. |
| 2) వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు నాలుగు కార్బన్ పరమాణువులతో చతుర్ముఖీయంగా బంధించబడి ఉంటుంది. | 2) ప్రతి కార్బన్ పరమాణువు మూడు కార్బన్ పరమాణువులతో షడ్భుజాకార వలయాలుగా అమర్చబడి ఉంటుంది. |
| 3) త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. | 3) ద్విమితీయ పొరల నిర్మాణం కలిగి ఉంటుంది. |
| 4) కార్బన్ పరమాణువులు బలమైన సమయోజనీయ బంధాలతో బంధించబడి ఉంటాయి. | 4) షడ్భుజాకార కార్బన్ వలయాలు బలహీనమైన వాన్డర్వాల్ బలాలతో బంధించబడి ఉంటాయి. |
| 5) గట్టిగా ఉంటుంది. | 5) మృదువుగా ఉంటుంది. |
| 6) అధమ విద్యుద్వాహకం. | 6) ఉత్తమ విద్యుద్వాహకం. |
Exam Tips:
a) పోలిక తీసుకున్నప్పుడు పట్టిక రూపంలో (సంకరీకరణం, నిర్మాణం, కాఠిన్యం, విద్యుద్వాహకత) రాయండి; ప్రతి ధర్మానికి కారణం ఇవ్వండి.
Question 2: క్రింది వాటిని వివరించండి.
a) PbCl₂, Cl₂ తో చర్య జరిగి, PbCl₄ ఇస్తుంది
b) PbCl₄ ఉష్ణ అస్థిర పదార్ధం
c) లెడ్ PbI₄ ను ఏర్పరచదు
Answer:
a) PbCl₂ లో Pb + 2 ఆక్సీకరణ స్థితిలో ఉన్నది. Cl₂ బలమైన ఆక్సీకారిణి. అందువల్ల అది Pb²⁺ ను Pb⁴⁺ గా ఆక్సీకరణం చేస్తుంది. కనుక PbCl₂ ను Cl₂, PbCl₄ గా ఆక్సీకరణం చేస్తుంది.
b) జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం కారణంగా Pb²⁺, Pb⁴⁺ కన్నా స్థిరమైనది. అంటే PbCl₂, PbCl₄ కన్నా స్థిరమైనది. అందువల్ల వేడి చేసినపుడు PbCl₄ ను వేడి చేస్తే Cl₂ ను కోల్పోయి PbCl₂ గా మారుతుంది.
c) Pb⁴⁺ జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం కారణంగా అస్థిరం. అందువల్ల Pb⁴⁺ మంచి ఆక్సీకారిణి. I– మంచి క్షయకారిణి. అందువల్ల Pb⁴⁺ ను Pb²⁺ గా క్షయీకరిస్తుంది. అందువల్ల PbI₄ ఏర్పడదు.
Exam Tips:
a) జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వల్ల Pb²⁺ స్థిరం, Pb⁴⁺ బలమైన ఆక్సీకారిణి అని మూడు భాగాల్లోనూ ఉపయోగించండి.
Question 3: క్రింది వాటిని వివరించండి.
a) సిలికాన్‌ను మిథైల్ క్లోరైడ్‌తో కాపర్ సమక్షంలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయబడింది.
b) SiO₂ ను HF తో చర్య జరపడం
c) గ్రాఫైట్ కందెనగా పనిచేస్తుంది
d) వజ్రం అపఘర్షకంగా ఉంటుంది.
Answer:
a) 573K వద్ద కాపర్ ఉత్ప్రేరకం సమక్షంలో మిథైల్ క్లోరైడ్‌ను సిలికాన్ పైకి పంపితే అనేక రకాలైన మిథైల్ ప్రతిక్షేపిత క్లోరో సిలేనులు (MeSiCl₃, Me₂SiCl₂, Me₃SiCl) మరియు చాలా తక్కువ పరిమాణంలో Me₄Si ఏర్పడతాయి.
ఉదా: \( 2\mathrm{CH_3Cl} + \mathrm{Si} \xrightarrow[573\,K]{Cu} (\mathrm{CH_3})_2\mathrm{SiCl_2} \) (Cu పొడి; డైమిథైల్ డైక్లోరోసిలేన్)
b) SiO₂ ను HF తో చర్య జరపడం
SiO₂ + 4HF → SiF₄ + 2H₂O
సిలికా HF లో కరిగి Silicon టెట్రా ఫ్లోరైడ్‌ను ఏర్పరుస్తుంది.
c) గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణం కలిగి ఉంటుంది. అంతేగాక, ఈ పొరలు ఒకదానిపై ఒకటి జారుతూ ఉంటాయి. అందుకనే గ్రాఫైట్ కందెనగా పనిచేస్తుంది.
d) వజ్రం త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. దీనిలో ప్రతి కార్బన్ పరమాణువు నాలుగు వేరు వేరు కార్బన్లతో బలమైన ఏకబంధాలతో బంధింపబడి ఉంటుంది. అందువల్ల వజ్రం కఠిన పదార్థం. అందువల్ల అపఘర్షకంగా ఉంటుంది.
Exam Tips:
a) Cu ఉత్ప్రేరకంగా 573 K వద్ద CH₃Cl + Si → మిథైల్ క్లోరోసిలేన్లు; SiO₂ + 4HF → SiF₄ + 2H₂O అని సమీకరణాలు తప్పక రాయండి.
Question 4: మీరేమి అర్ధం చేసుకొన్నారు:
a) రూపాంతరత
b) జడజంట ప్రభావం
c) శృంఖలత్వం (catenation)
Answer:
a) రూపాంతరత : ఒకే మూలకం రెండు లేక అంతకన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభించడాన్ని రూపాంతరత అంటారు.
డైమండ్, గ్రాఫైట్లు, కార్బన్ స్ఫటిక రూపాంతరాలు. కోక్, కోల్, అస్ఫటిక రూపాంతరాలు.
b) జడజంట ప్రభావం : బాహ్య కర్పరంలో ns² ఎలక్ట్రాన్ జంట. బంధాలు ఏర్పరచడంలో పాల్గొనకపోవడాన్ని జడజంట ప్రభావం అంటారు. ఈ ప్రభావం కారణంగా తక్కువ విలువ గల ఆక్సీకరణ స్థితి అధిక ఆక్సీకరణ స్థితి కన్నా స్థిరమైనదిగా ఉంటుంది. ఒక గ్రూపు మూలకాలలో పైనుండి క్రిందకు, అల్ప ఆక్సీకరణ స్థితి స్థిరత్వం పెరుగుతుంది.
13వ గ్రూపు మూలకాలలో +3 సాధారణ ఆక్సీకరణ స్థితి కాగా Tl లో +1 స్థితి స్థిరమైనది. అదే విధంగా 14వ గ్రూపు మూలకాలలో +4 సాధారణ ఆక్సీకరణ స్థితి కాగా Pb లో +2 స్థితి స్థిరమైనది.
c) శృంఖలత్వం:
ఏదేని మూలక పరమాణువులు తమలో తాము గొలుసుకట్టుగా ఏర్పడే స్వభావాన్ని శృంఖలత్వం అంటారు. ఈ ధర్మం కార్బన్‌కు అధికం. అందువల్ల కార్బన్ గొలుసులు, వలయాలు ఏర్పడతాయి.
సరళ శృంఖలం: C–C–C–C–C; శాఖాయుత శృంఖలం: నాల్గవ కార్బన్‌కు ఒక C శాఖ ఉన్న గొలుసు; వలయం: ఆరు కార్బన్ల వలయం.
Exam Tips:
a) మూడు భాగాలకు నిర్వచనం + ఉదాహరణ రాయండి: జడజంట ప్రభావానికి Tl (+1), Pb (+2) ఉదాహరణలు; శృంఖలతకు కార్బన్ ఉదాహరణ.
Question 5: సిలికోన్ల తయారీలో RSiCl₃ ప్రారంభ పదార్థంగా వాడితే తయారైన క్రియాజన్యాల నిర్మాణాలను రాయండి.
Answer:
R SiCl₃ + 3H₂O → R Si (OH)₃
జలవిశ్లేషణ ఉత్పన్నం సంఘననం చెందితే త్రిమితీయ సిలికోన్ ఏర్పడుతుంది.
Exam Tips:
a) RSiCl₃ జలవిశ్లేషణ → RSi(OH)₃, సంఘననం ద్వారా అడ్డుగా అనుసంధానమైన త్రిమితీయ సిలికోన్ ఏర్పడుతుందని రాయండి.
Question 6: జియొలైట్ల మీద సంక్షిప్తంగా రాయండి.
Answer:
అల్యూమినియం సిలికేటులను జియొలైట్లు అంటారు. త్రిమితీయంగా అల్లిక గల సిలికాన్ డై ఆక్సైడ్‌లో కొన్ని సిలికాన్ పరమాణువులను అల్యూమినియం పరమాణువులు స్థానభ్రంశం చేస్తే అల్యూమినియం సిలికేట్లు ఏర్పడతాయి. దీనికి రుణావేశం ఉంటుంది. Na⁺, K⁺ లేదా Ca²⁺ కేటయాన్లు రుణావేశాన్ని తుల్యం చేస్తాయి.
ఉదా : ఫెల్డ్స్పర్ జియొలైటులు. పెట్రో కెమికల్ పరిశ్రమల్లో హైడ్రోకార్బన్లను భంజనం చేయడానికి, వాటి సాదృశీకరణ చర్యలకు జియొలైట్లను ఉత్ప్రేరకాలుగా విస్తృతంగా వాడతారు. ఉదా : ZSM-5 ఆల్కహాల్లను నేరుగా గాసోలీన్ గా మార్చడానికి ఉపయోగిస్తారు. కఠినజలం కఠినత్వాన్ని తగ్గించడానికి ఆర్ద్ర జియొలైట్లను అయాన్వినిమయాలుగా ఉపయోగిస్తారు.
Exam Tips:
a) జియోలైట్ = అల్యూమినియం సిలికేట్; Si స్థానంలో Al వల్ల రుణావేశం, Na⁺/K⁺/Ca²⁺ తో తుల్యం; ఉపయోగాలు: ఉత్ప్రేరకం (ZSM-5), కఠినజల మృదూకరణ.
Question 7: సిలికేట్ల మీద సంక్షిప్తంగా వ్రాయండి.
Answer:
సిలికేట్ల మూల నిర్మాణాత్మక యూనిట్ \( \mathrm{SiO_4^{4-}} \). ఇందులో సిలికాన్ పరమాణువు నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో టెట్రాహెడ్రల్ రీతిలో బంధంలో కలిసి ఉంటాయి. సిలికేట్లో ఆక్సిజన్ పరమాణువులను ఇతర యూనిట్లతో
పంచుకోవడం ద్వారా శృంఖల, వలయ, షీట్ లేదా త్రిమితీయ నిర్మాణాలు ఏర్పడవచ్చు.
సిలికేట్ యూనిట్లో రుణావేశం ధనావేశం గల లోహ అయానులతో తటస్థీకరించబడుతుంది. ఒకవేళ, యూనిట్ యొక్క నాలుగు మూలలు ఇతర టెట్రాహెడ్రల్ యూనిట్లతో పంచుకుంటే త్రిమితీయ అల్లిక నిర్మాణాన్ని పొందుతుంది.
SiO₄⁴⁻ చతుర్ముఖి: మధ్యలో Si, నాలుగు మూలల వద్ద O⁻.
Exam Tips:
a) SiO₄⁴⁻ చతుర్ముఖి మూల యూనిట్; మూలలను పంచుకునే విధానం బట్టి శృంఖల, వలయ, షీట్, త్రిమితీయ సిలికేట్లు ఏర్పడతాయని వర్గీకరించండి.
Question 8: సిలికోన్‌లు అంటే ఏమిటి ? అవి ఏ విధంగా పొందుతారు ?
Answer:
1. సిలికోన్‌లు ఆర్గానో సిలికాన్ తరగతికి చెందిన అణుపుంజాలు.
2. సిలికోన్లో అనేక పర్యాయాలు పునరావృతమయ్యే R₂SiO – యూనిట్ ఉంది.
3. సిలికోన్ల తయారీకి ఆల్కైల్ లేదా ఎరైల్ ప్రతిక్షేపిత సిలికాన్ క్లోరైడులు Rₙ SiCl₍₄₋ₙ₎ ప్రారంభ పదార్థాలు. ఇందులో R ఆల్కైల్ లేదా ఎరైల్ సమూహం.
4. 573 K వద్ద కాపర్ ఉత్ప్రేరకం సమక్షంలో మిథైల్ క్లోరైడును సిలికాన్ పైకి పంపితే అనేక రకాలైన మిథైల్ ప్రతిక్షేపిత క్లోరో సిలేనులు ఏర్పడతాయి.
5. డైమిథైల్ డైక్లోరో సిలేన్ (CH₃)₂SiCl₂ జలవిశ్లేషణం చెందగా ఏర్పడిన ఉత్పన్నాలు సంఘననం చెంది పొడవైన గొలుసుల అణుపుంజాలు ఇస్తాయి.
\( 2\mathrm{CH_3Cl} + \mathrm{Si} \xrightarrow[573\,K]{Cu} (\mathrm{CH_3})_2\mathrm{SiCl_2} \)
\( (\mathrm{CH_3})_2\mathrm{SiCl_2} \xrightarrow[-2HCl]{+2H_2O} (\mathrm{CH_3})_2\mathrm{Si(OH)_2} \)
\( 2\,\mathrm{HO{-}Si(CH_3)_2{-}OH} \xrightarrow{-H_2O} \mathrm{HO{-}Si(CH_3)_2{-}O{-}Si(CH_3)_2{-}OH} \)
అణుపుంజీకరణం వల్ల గొలుసు ఏర్పడుతుంది.
\( \mathrm{HO{-}Si(CH_3)_2{-}O{-}[Si(CH_3)_2{-}O]_n{-}Si(CH_3)_2{-}OH} \)
ఉపయోగాలు:
1. వీటిని సీల్ వేసే పదార్థాలుగా, గ్రీజులుగా, విద్యుత్ బంధకాలుగాను ఉపయోగిస్తారు.
2. బట్టలపై జలనిరోధకంగా ఉపయోగిస్తారు.
3. శస్త్రచికిత్స సంబంధమైన, సౌందర్య సాధన ద్రవ్యాల తయారీ పరిశ్రమలలో వాడతారు.
Exam Tips:
a) R₂SiO పునరావృత యూనిట్, (CH₃)₂SiCl₂ జలవిశ్లేషణ, సంఘననం అనే క్రమంలో సమీకరణాలతో రాయండి; ఉపయోగాలు కూడా చేర్చండి.
Question 9: ఫుల్లరీన్ మీద సంక్షిప్తంగా వ్రాయండి.
Answer:
ఫుల్లరీన్ కార్బన్ స్ఫటిక రూపాంతరం
తయారుచేయుట : జడవాయువులైన హీలియం లేదా ఆర్గాన్ల సమక్షంలో గ్రాఫైట్‌ను విద్యుచ్ఛాపంతో వేడి చేసిన ఫుల్లరీన్ తయారవుతుంది.
బాష్పీభవనం చెందిన Cₙ చిన్న అణువులు ఘనీభవించడం వల్ల వచ్చిన మసిలాంటి పదార్థంలో ముఖ్యంగా C₆₀ తక్కువ పరిమాణంలో C₇₀ ఉంటాయి.
350 లేదా అంతకంటే ఎక్కువ కార్బన్ పరమాణువులున్న ఫుల్లరీన్లు లేశమాత్రంగా ఉంటాయి.
ఫుల్లరీన్లు పంజరాన్ని పోలిన అణువులు. C₆₀ అణువుకు సాకర్ బంతిని పోలిన నిర్మాణం ఉండటం వల్ల దీనిని బక్మినిస్టర్ ఫుల్లరీన్ అంటారు. దీనిలో ఆరు కార్బన్లున్న వలయాలు ఇరవై, ఐదు కార్బన్లున్న వలయాలు పన్నెండు ఉంటాయి. ఆరు కార్బన్ల వలయం ఆరు కార్బన్ల వలయం లేదా అయిదు కార్బన్ల వలయంతో సంలీనం చెందుతాయి. కానీ అయిదు కార్బన్ల వలయాలు ఆరు కార్బన్ల వలయాలతో మాత్రమే సంలీనం చెందుతాయి. అన్ని కార్బన్లు sp² సంకరీకరణం చెంది ఉంటాయి.
ప్రతి కార్బన్ ఆసన్న కార్బన్లతో మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. మిగిలిన ఎలక్ట్రాన్ అణు ఆర్బిటాల్ తో అస్థానీకృతమయి అణువుకు ఎరోమాటిక్ స్వభావం చేకూరుస్తుంది. ఈ బంతి ఆకృతి గల అణువుకు 60 శీర్షాలు ఉన్నాయి. ప్రతి శీర్షంను ఒక కార్బన్ పరమాణువు ఆక్రమించి ఉంటుంది. ఈ కార్బన్లకు ఏక, ద్విబంధాలు రెండు ఉండి C – C బంధ దూరాలు 143.5 pm, 138.3 pm లు ఉంటాయి.
Exam Tips:
a) ఫుల్లరీన్: తయారీ (గ్రాఫైట్‌ను జడవాయువులో విద్యుత్ చాపంతో వేడిచేయడం), C₆₀ నిర్మాణం (20 షడ్భుజులు, 12 పంచభుజులు, 60 శీర్షాలు, sp²) తప్పక రాయండి.
Question 10: SiO₂ నీటిలో ఎందుకు కరగదు ?
Answer:
సిలికాన్ డై ఆక్సైడ్ సమయోజనీయ, త్రిమితీయ అల్లిక గల ఘనం. ఇందులో సిలికాన్ పరమాణువు సమయోజనీయ బంధంతో టెట్రాహెడ్రల్ రీతిలో నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో కలిసి ఉంటుంది.
సాధారణ స్థితిలో సిలికా దాదాపు చర్యాశీలత లేనిది. ఎందుకంటే Si – O బంధ ఎంథాల్పీ చాలా ఎక్కువ. అందువల్లనే అది నీటిలో కరగదు.
Exam Tips:
a) Si–O బంధ ఎంథాల్పీ చాలా ఎక్కువ, త్రిమితీయ సమయోజనీయ అల్లిక వల్ల SiO₂ నీటిలో కరగదు.
Question 11: వజ్రం కఠినంగా ఎందుకు వుంటుంది ?
Answer:
డైమండ్ ప్రతి కార్బన్ sp³ సంకరీకరణం చెందుతుంది. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో sp³ సంకర ఆర్బిటాల్లను టెట్రా హెడ్రల్ రీతిలో ఉపయోగించుకొని బంధాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణం ప్రాదేశికంగా వ్యాపించి కార్బన్ పరమాణువులతో దృఢమైన త్రిమితీయ అల్లికను ఏర్పరుస్తుంది. ఇలా వ్యాపించి వున్న సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయడం చాలా శక్తితో కూడుకున్న పని. అందువల్ల డైమండ్ (వజ్రం) కఠినమైనది.
Exam Tips:
a) sp³ సంకరీకరణం, టెట్రాహెడ్రల్ అమరిక, బలమైన C–C సమయోజనీయ బంధాల త్రిమితీయ అల్లిక అనే పాయింట్లను రాయండి.
Question 12: కింది వాటిని వేడి చేసినపుడు ఏమి జరుగుతుంది ?
a) CaCO₃
b) CaCO₃, SiO₂
c) CaCO₃ అధికంగా కోక్
Answer:
a) కాల్షియం కార్బొనేటు విఘటనం చెంది CO₂ విడుదలవుతుంది.
CaCO₃ (ఘ) → CaO (ఘ) + CO₂ (వా)
b) CaCO₃ మరియు SiO₂
CaCO₃ విఘటనం చెందినపుడు ఏర్పడిన CaO తో SiO₂ చర్యపొంది కాల్షియం సిలికేటు ఏర్పడుతుంది.
CaCO₃ → CaO + CO₂
CaO + SiO₂ → CaSiO₃
c) CaCO₃ విఘటనం వల్ల ఏర్పడిన CaO తో కోక్ చర్య పొందుతుంది. కాల్షియం కార్బైడ్ ఏర్పడుతుంది.
CaCO₃ → CaO + CO₂
\( \mathrm{CaO + 3C \longrightarrow CaC_2 + CO} \)
(కాల్షియం కార్బైడ్)
Exam Tips:
a) మూడు భాగాలకూ సమీకరణాలు: CaCO₃ → CaO + CO₂; CaO + SiO₂ → CaSiO₃ (స్లాగ్); CaO + 3C → CaC₂ + CO — ప్రతి దానికి సమీకరణం రాయండి.
Question 13: Na₂CO₃ ద్రావణాన్ని CO₂ వాయువులో సంతృప్తం చేస్తే అవలంబనం అవుతుంది. ఎందువల్ల ?
Answer:
నీటిలో సోడియం బైకార్బొనేటు అల్పద్రావణీయత గలది. స్వల్పంగా కరుగుతుంది. దీనికి బై కార్బొనేటు అయాన్లు హైడ్రోజన్ బంధాల వల్ల పొలిమరీకరణం చెంది ఉంటుంది. Na₂CO₃ ద్రావణంలోకి CO₂ ను పంపితే అల్ప ద్రావణీయత కల సోడియం బై కార్బొనేటు ఏర్పడుతుంది. అందువల్ల NaHCO₃ అవలంబనం చెందుతుంది.
Na₂CO₃ + H₂O + CO₂ → 2 NaHCO₃
Exam Tips:
a) NaHCO₃ నీటిలో అల్ప ద్రావణీయత (HCO₃⁻ అయాన్ల మధ్య హైడ్రోజన్ బంధాలు) వల్ల అవక్షేపంగా వస్తుంది: Na₂CO₃ + H₂O + CO₂ → 2NaHCO₃.
Question 14: ఈ క్రింది చర్యలలో ఏమి జరుగుతుంది ?
a) తడిసున్నం ద్వారా CO₂ను పంపడం
b) CaC₂ ను N₂ తో వేడిచేయడం
Answer:
a) తడిసున్నంలోనికి CO₂ ను పంపితే నీటిలో కరగని CaCO₃ ఏర్పడుతుంది. ద్రావణం పాలవలె మారుతుంది.
Ca(OH)₂ + CO₂ → CaCO₃ + H₂O
CO₂ అధికంగా పంపితే కాల్షియం బైకార్బొనేటు ఏర్పడుతుంది. అందువల్ల CaCO₃ కరుగుతుంది.
CaCO₃ + H₂O + CO₂ → Ca(HCO₃)₂
Ca(HCO₃)₂ నీటిలో కరుగుతుంది.
b) వేడి చేసిన CaC₂ మీదికి నైట్రోజన్ వాయువును పంపితే కాల్షియం సైనమైడ్ మరియు గ్రాఫైట్‌ల మిశ్రమం ఏర్పడుతుంది.
CaC₂ + N₂ → CaCN₂ + C
కాల్షియం సైనమైడ్, గ్రాఫైట్‌ల మిశ్రమాన్ని నైట్రోలిమ్ అంటారు.
Exam Tips:
a) CO₂ ను తడిసున్నంలో పంపితే మొదట పాలలా మారి (CaCO₃), ఎక్కువ CO₂ తో కరిగిపోతుందని రెండు సమీకరణాలు రాయండి; అలాగే CaC₂ + N₂ → CaCN₂ + C (నైట్రోలిమ్).
Question 15: గ్రూపు 14 లో కార్బన్ అసంగత స్వభావాన్ని గురించి వ్రాయండి.
Answer:
ఒక గ్రూపులోని మొదటి మూలకం మిగిలిన మూలకాల కంటే భిన్న ధర్మాలను చూపుతుంది. కార్బన్ కూడా గ్రూపులోని మిగిలిన మూలకాలతో పోలిస్తే భిన్నంగా ప్రవర్తిస్తుంది. దీనికి కారణం కార్బన్‌కు గల తక్కువ పరిమాణం, అధిక ఋణ విద్యుదాత్మకత, అధిక అయనీకరణ ఎంథాల్పీ, d – ఆర్బిటాళ్ళు లేకపోవటం.
1. కార్బన్ ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది. మిగతా మూలకాలు ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో దాదాపుగా దొరకవు.
2. కార్బన్లో అందుబాటులో ఉండే d – ఆర్బిటాళ్ళు ఉండవు. మిగతా మూలకాలలో d – ఆర్బిటాళ్ళు అందుబాటులో ఉంటాయి.
3. కార్బన్ అలోహం. దీని పరమాణు సైజు చాలా చిన్నది. అందువలన ఇది అధిక సహసంయోజక (కోవలెంట్) స్వభావం ఉన్న సమ్మేళనాలను ఇస్తుంది.
4. కార్బన్ కెటనేషన్ అనే విశిష్ట లక్షణం చూపిస్తుంది. ఈ లక్షణం కొంతవరకు సిలికాన్‌లో ఉంటుంది.
5. కార్బన్ తన పరమాణువుల మధ్య బహు బంధాలను ఏర్పరచగలదు. అలాగే ఇతర మూలకాలతో కూడా బహు బంధాలను ఏర్పరచగలదు.
6. కార్బన్ యొక్క హైడ్రైడ్లను హైడ్రోకార్బన్లు అంటారు. మిగిలిన మూలకాలు కూడా హైడ్రైడ్లను ఇస్తాయి. ఈ హైడ్రైడ్ స్థిరత్వం క్రమంగా తగ్గుతుంది.
7. కార్బన్ క్షయకరణ సామర్థ్యం చాలా ఎక్కువ. మిగిలిన మూలకాల క్షయకరణ సామర్థ్యం తక్కువ.
8. కార్బన్ – హాలోజన్ సమ్మేళనాలు జల విశ్లేషణం చెందవు. కాని మిగతా మూలకాలు టెట్రాహాలైడ్లు తేలిగ్గా జలవిశేషణం చెందుతాయి.
Exam Tips:
a) కార్బన్ అసంగతతకు కారణాలు (చిన్న పరిమాణం, అధిక ఋణవిద్యుదాత్మకత, d-ఆర్బిటాళ్లు లేకపోవడం) ముందుగా రాసి, తర్వాత ఉదాహరణలు ఇవ్వండి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 1: సిలికోన్‌లు అంటే ఏమిటి ? వాటిని ఏ విధంగా తయారుచేస్తారు ? ఉదాహరణ ఇవ్వండి.
Answer:
సిలికోన్‌లు ఆర్గానో సిలికాన్ సమ్మేళనాలు. వీటిలో సిలికాన్‌కు ఆక్సిజన్, కార్బన్లు బలంగా బంధింపబడి ఉంటాయి. వీటి నిర్మాణాత్మక ఫార్ములా క్రింది విధంగా ఉంటుంది.
\( \mathrm{HO{-}SiR_2{-}O{-}[SiR_2{-}O]_n{-}SiR_2{-}OH} \)
573 K వద్ద కాపర్ ఉత్ప్రేరకం సమక్షంలో మిథైల్ క్లోరైడును సిలికాన్ పైకి పంపితే అనేక రకాలైన మిథైల్ ప్రతిక్షేపిత క్లోరోసిలేనులు ఏర్పడతాయి.
డై మిథైల్ డైక్లోరోసిలేన్ (CH₃)₂ SiCl₂ జల విశ్లేషణ చెందగా ఏర్పడిన ఉత్పన్నాలు సంఘనన అణుపుంజీకరణం చెంది పొడవైన గొలుసుల అణుపుంజాలు ఇస్తాయి.
\( 2\mathrm{CH_3Cl} + \mathrm{Si} \xrightarrow[573\,K]{Cu} (\mathrm{CH_3})_2\mathrm{SiCl_2} \)
\( (\mathrm{CH_3})_2\mathrm{SiCl_2} \xrightarrow[-2HCl]{+2H_2O} (\mathrm{CH_3})_2\mathrm{Si(OH)_2} \)
\( \mathrm{HO{-}Si(CH_3)_2{-}OH} + n\,\mathrm{HO{-}Si(CH_3)_2{-}OH} + \mathrm{HO{-}Si(CH_3)_2{-}OH} \xrightarrow{-H_2O} \mathrm{HO{-}Si(CH_3)_2{-}O{-}[Si(CH_3)_2{-}O]_n{-}Si(CH_3)_2{-}OH} \)
(అణుపుంజీకరణం; ఫలితం: సిలికోన్)
పొలిమర్ శృంఖలం పొడవును (CH₃)₃ SiCl ను కలిపి నియంత్రించవచ్చు.
\( \mathrm{(CH_3)_3Si{-}O{-}[Si(CH_3)_2{-}O]_{n+2}{-}Si(CH_3)_3} \)
ధర్మాలు:
అధ్రువ ఆల్కైల్ సమూహాలతో చుట్టుకొన్న సిలికోన్‌లు జలవికర్షణ స్వభావం ఉన్నవి. వీటికి అధిక ఉష్ణ స్థిరత్వం కలదు. ఆక్సీకరణం, ఇతర రసాయన చర్యలను నిరోధిస్తాయి.
ఉపయోగాలు:
1. సిలికోన్ రబ్బర్లు తయారీలో వాడతారు.
2. వాటర్ ఫ్రూఫ్ బట్టలు, కాగితాలు తయారుచేయడానికి వాడతారు.
3. విమానాలలో కందెనలుగాను, గ్రీజు తయారీలోను వాడతారు.
4. వీటికి రసాయన జడత్వం ఉన్నది. అందువలన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొంటాయి. కనుక పెయింటులలోను, పింగాణీలలోను ఉపయోగిస్తారు.
5. సీలు వేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు.
6. విద్యుత్ బంధకాలుగా ఉపయోగిస్తారు.
7. −40°C వద్ద కూడా గడ్డ కట్టవు. అందువలన విమానాలలో కందెనగా ఉపయోగిస్తారు.
Exam Tips:
a) సిలికోన్ల నిర్వచనం, తయారీ (CH₃Cl + Si → (CH₃)₂SiCl₂ → జలవిశ్లేషణ → పాలిమరీకరణ), ధర్మాలు, ఉపయోగాలు అనే క్రమంలో పటాలతో రాయండి.
b) శృంఖల పొడవును (CH₃)₃SiCl తో నియంత్రించవచ్చని మరువకండి.
Question 2: సిలికా నిర్మాణాన్ని వివరించండి. అది
a) NaOH
b) HF తో ఏ విధంగా చర్య జరుపుతుంది ?
Answer:
సిలికాన్ డై ఆక్సైడ్‌ను సాధారణంగా సిలికా అంటారు. ఇది అనేక స్ఫటిక రూపాలలో దొరుకుతుంది. క్వార్ట్జ్, క్రిస్టోబలైట్, ట్రిడిమైట్లు సిలికా యొక్క కొన్ని స్ఫటికాకారాలు. సిలికాన్ ఆక్సైడ్ సమయోజనీయ, త్రిమితీయ అల్లిక గల ఘనం.
సిలికా నిర్మాణం : సిలికాలో ప్రతి సిలికాన్ పరమాణువు నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో ఏక సమయోజనీయ బంధంతో చతుర్ముఖీయంగా అమర్చబడి ఉంటుంది. ప్రతి ఆక్సిజన్ పరమాణువు రెండు సిలికాన్ పరమాణువుల మధ్య బంధింపబడి ఉంటుంది. ఈ విధంగా SiO₂ బలమైన త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. సాధారణ స్థితిలో సిలికా దాదాపు చర్యాశీలత లేనిది. ఎందుకంటే Si – O బంధ ఎంథాల్పీ చాలా ఎక్కువ.
a) NaOH తో చర్య జరిపి సోడియం సిలికేటును ఏర్పరుస్తుంది.
SiO₂ + 2 NaOH → Na₂SiO₃ + H₂O
b) HF తో చర్య జరిపి SiF₄ ను ఏర్పరుస్తుంది.
SiO₂ + 4 HF → SiF₄ + 2H₂O
Exam Tips:
a) సిలికా నిర్మాణం, తర్వాత రెండు చర్యలు: SiO₂ + 2NaOH → Na₂SiO₃ + H₂O, SiO₂ + 4HF → SiF₄ + 2H₂O సమీకరణాలు తప్పక రాయండి.
Question 3: కార్బన్ రూపాంతరాలపై వివరణ వ్రాయండి.
Answer:
కార్బన్ భిన్న రూపాలలో లభిస్తుంది. అవి స్ఫటిక, అస్ఫటిక రూపాలు.
స్ఫటిక రూపాలు : డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరీన్
అస్ఫటిక రూపాలు : కోక్, కోల్ మొదలైనవి.
డైమండ్ మరియు గ్రాఫైట్లు కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు. డైమండ్ త్రిమితీయ బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది.
వజ్రం (డైమండ్) నిర్మాణం : వజ్రంలో ప్రతికార్బన్ పరమాణువు sp³ సంకరీకరణాన్ని పొందుతుంది. దానివలన ప్రతి కార్బన్ పరమాణువు మీద నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి. ప్రతి కార్బన్ పరమాణువులోని నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో బంధాలను ఏర్పరచుకుంటాయి. ప్రతి కార్బన్ పరమాణువు చతుర్ముఖీయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి బంధింపబడి ఉండటం వలన పెద్ద అణువు ఏర్పడుతుంది.
దీనిలో C – C బంధదూరం 1.54 Å, బంధకోణం 109°28′
ఉపయోగాలు:
1. ఆభరణాలలో విలువైన రాళ్ళుగా ఉపయోగిస్తారు.
2. పాలరాయిని కోయడానికి ఉపయోగిస్తారు.
3. టంగ్స్టన్ వంటి లోహాల నుండి అతి సన్నని తీగను తీయుటకు వాడతారు. గ్రాఫైట్ నిర్మాణము : గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణాన్ని కల్గి ఉంటుంది. ఈ నిర్మాణం కార్బన్ పరమాణువులతో కూడిన షడ్భుజాకార వలయాలను కల్గి ఉంటుంది. గ్రాఫైట్‌లో ప్రతి కార్బన్ పరమాణువు sp² సంకరీకరణాన్ని పొంది, మూడు ఇతర కార్బన్ పరమాణువులతో షడ్భుజాకార వలయాలుగా బంధించబడి ఉంటాయి. ఇటువంటి అనేక వలయాలు కలిసి ఒకే తలంలో ఉంటాయి. ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్ ఈ తలానికి లంబంగా ఉంటుంది. ఈ p ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోయి షడ్భుజాకార తలానికి పైన, క్రింద విస్తరించి ఉంటాయి. ఈ వలయాకారాలు ఒకదానిపై ఒకటి బలహీనమైన వాండర్వాల్ బలాలచే బంధించబడి ఉంటాయి. దీనిలో C – C బంధదూరం 1.42 Å, రెండు పొరల మధ్య దూరం 3.34 Å.
ఉపయోగాలు:
1. కందెనగా ఉపయోగిస్తారు.
2. లెడ్ పెన్సిళ్ళ తయారీలో ఉపయోగిస్తారు.
3. గ్రాఫైట్ ఉత్తమ విద్యుద్వాహకము. అందువల్ల ఎలక్ట్రోడ్ల తయారీలో ఉపయోగిస్తారు.
ఫుల్లరీన్ : ఫుల్లరీన్ కార్బన్ స్ఫటిక రూపాంతరం తయారుచేయుట : జడవాయువులైన హీలియం లేదా ఆర్గాన్ల సమక్షంలో గ్రాఫైట్‌ను విద్యుచ్ఛాపంతో వేడి చేసిన ఫుల్లరీన్ తయారవుతుంది.
బాష్పీభవనం చెందిన Cₙ చిన్న అణువులు ఘనీభవించడం వల్ల వచ్చిన మసిలాంటి పదార్థంలో ముఖ్యంగా C₆₀, తక్కువ పరిమాణంలో C₇₀ ఉంటాయి. 350 లేదా అంతకంటే ఎక్కువ కార్బన్ పరమాణువులున్న ఫుల్లరీన్లు లేశమాత్రంగా ఉంటాయి.
ఫుల్లరీన్లు పంజరాన్ని పోలిన అణువులు. C₆₀ అణువుకు సాకర్ బంతిని పోలిన నిర్మాణం ఉండటం వల్ల దీనిని బక్మినిస్టర్ ఫుల్లరీన్ అంటారు. దీనిలో ఆరు కార్బన్లున్న వలయాలు ఇరవై, ఐదు కార్బన్లున్న వలయాలు పన్నెండు ఉంటాయి. ఆరు కార్బన్ల వలయం ఆరు కార్బన్ల వలయం లేదా అయిదు కార్బన్ల వలయంతో సంలీనం చెందుతాయి. కానీ అయిదు కార్బన్ల వలయాలు ఆరు కార్బన్ల వలయాలతో మాత్రమే సంలీనం చెందుతాయి. అన్ని కార్బన్లు sp² సంకరీకరణం చెంది ఉంటాయి.
ప్రతి కార్బన్ ఆసన్న కార్బన్లతో మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. మిగిలిన ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లతో అస్థానీకృతమయి అణువుకు ఎరోమాటిక్ స్వభావం చేకూరుస్తుంది. ఈ బంతి ఆకృతి గల అణువుకు 60 శీర్షాలు ఉన్నాయి. ప్రతి శీర్షంను ఒక కార్బన్ పరమాణువు ఆక్రమించి ఉంటుంది. ఈ కార్బన్లకు ఏక, ద్విబంధాలు రెండు ఉండి C – C బంధ దూరాలు 143.5 pm, 138.3 pm లు ఉంటాయి.
అస్ఫటిక రూపాంతరాలు:
కోల్ : భూమిలో కొన్ని శతాబ్దాల క్రితం మట్టితో కప్పబడిపోయిన వృక్ష సంబంధమైన పదార్థాలు ఆక్సిజన్ సమక్షంలో అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద కృశించిపోయినపుడు కోల్ ఏర్పడుతుంది. కోల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటాయి. 60% కార్బన్ ఉన్న కోల్‌ను పీట్ అని, 70% కార్బన్ ఉన్న కోల్‌ను లిగ్నైట్ అని, 78% ను బిట్యూమినస్ అని, 83% ను సెమీ బిట్యూమినస్ కోల్ అని, 90% కార్బన్ ఉన్నదాన్ని ఆంత్రసైట్ అని అంటారు.
కోక్ : కోల్‌ను ఆక్సిజన్ లేని వాతావరణంలో విధ్వంసక స్వేదనం చర్యకు గురి చేసినపుడు బాష్పశీలి పదార్థాలయిన కోల్ గ్యాస్, అమ్మోనియా, బెంజీన్ లు ఏర్పడతాయి. మిగిలిన అవశేషాన్నే కోక్ అంటారు.
ఉపయోగాలు:
1. కోల్‌ను ఇంధనంగా వాడతారు.
2. కృత్రిమ పెట్రోలు తయారీలో వాడతారు.
3. కోక్‌ను స్టీలు పరిశ్రమలో క్షయకారిణిగా వాడతారు.
4. గ్రాఫైట్‌ను, వాటర్ గ్యాస్‌ను తయారుచేయడానికి వాడతారు.
Exam Tips:
a) స్ఫటిక (వజ్రం, గ్రాఫైట్, ఫుల్లరీన్), అస్ఫటిక (కోల్, కోక్) అని వర్గీకరించి ప్రతి దానికి నిర్మాణ పటం, బంధ దూరాలు, ఉపయోగాలు రాయండి.
b) వజ్రం: 1.54 Å, 109°28′; గ్రాఫైట్: 1.42 Å, పొరల మధ్య 3.34 Å గుర్తుంచుకోండి.
Question 4: కిందివాటిపై వివరణ వ్రాయండి.
ఎ) సిలికేట్లు
బి) జియోలైట్లు
సి) ఫుల్లరీన్లు
Answer:
ఎ) సిలికేట్లు : సిలికేట్ల మూల నిర్మాణాత్మక యూనిట్ \( \mathrm{SiO_4^{4-}} \).
ఇందులో సిలికాన్ పరమాణువు నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో టెట్రాహెడ్రల్ రీతిలో బంధంలో కలిసి ఉంటాయి. సిలికేట్లో ఆక్సిజన్ పరమాణువులను ఇతర యూనిట్లతో పంచుకోవడం ద్వారా శృంఖల, వలయ, షీట్ లేదా త్రిమితీయ నిర్మాణాలు ఏర్పడవచ్చు.
సిలికేట్ యూనిట్లో రుణావేశం ధనావేశం గల లోహ అయానులతో తటస్థీకరించబడుతుంది. ఒకవేళ, యూనిట్ యొక్క నాలుగు మూలలు ఇతర టెట్రాహెడ్రల్ యూనిట్లతో పంచుకుంటే త్రిమితీయ అల్లిక నిర్మాణాన్ని పొందుతుంది.
బి) జియోలైట్లు : అల్యూమినియం సిలికేటులను జియొలైట్లు అంటారు.
త్రిమితీయంగా అల్లిక గల సిలికాన్ డై ఆక్సైడ్ కొన్ని సిలికాన్ పరమాణువులను అల్యూమినియం పరమాణువులు స్థానభ్రంశం చేస్తే అల్యూమినియం సిలికేట్లు ఏర్పడతాయి. దీనికి రుణావేశం ఉంటుంది. Na⁺, K⁺ లేదా Ca²⁺ కేటయాన్లు రుణావేశాన్ని తుల్యం చేస్తాయి.
ఉదా : ఫెల్డ్ స్పార్ జియొలైటులు. పెట్రో కెమికల్ పరిశ్రమల్లో హైడ్రోకార్బన్లను భంజనం చేయడానికి, వాటి సాదృశీకరణ చర్యలకు జియొలైట్లను ఉత్ప్రేరకాలుగా విస్తృతంగా వాడతారు. ఉదా : ZSM – 5 ఆల్కహాల్లను నేరుగా గాసోలీన్గా మార్చడానికి ఉపయోగిస్తారు. కఠినజలం కఠినత్వాన్ని తగ్గించడానికి ఆర్ద్ర జియొలైట్లను అయాన్వినిమయాలుగా ఉపయోగిస్తారు.
సి) ఫుల్లరీన్లు : ఫుల్లరీన్ కార్బన్ స్ఫటిక రూపాంతరం తయారుచేయుట : జడవాయువులైన హీలియం లేదా ఆర్గాన్ల సమక్షంలో గ్రాఫైట్‌ను విద్యుచ్ఛాపంతో వేడి చేసిన ఫుల్లరీన్ తయారవుతుంది.
బాష్పీభవనం చెందిన Cₙ చిన్న అణువులు ఘనీభవించడం వల్ల వచ్చిన మసిలాంటి పదార్థంలో ముఖ్యంగా C₆₀, తక్కువ పరిమాణంలో C₇₀ ఉంటాయి.
350 లేదా అంతకంటే ఎక్కువ కార్బన్ పరమాణువులున్న ఫుల్లరీన్లు లేశమాత్రంగా ఉంటాయి.
ఫుల్లరీన్ లు పంజరాన్ని పోలిన అణువులు. C₆₀ అణువుకు సాకర్ బంతిని పోలిన నిర్మాణం ఉండటం వల్ల దీనిని బక్మినిస్టర్ ఫుల్లరీన్ అంటారు. దీనిలో ఆరు కార్బన్లున్న వలయాలు ఇరవై, ఐదు కార్బన్లున్న వలయాలు పన్నెండు ఉంటాయి. ఆరు కార్బన్ల వలయం, ఆరు కార్బన్ల వలయం లేదా అయిదు కార్బన్ల వలయంతో సంలీనం చెందుతాయి. కానీ అయిదు కార్బన్ల వలయాలు ఆరు కార్బన్ల వలయాలతో మాత్రమే సంలీనం చెందుతాయి. అన్ని కార్బన్లు sp² సంకరీకరణం చెంది ఉంటాయి.
ప్రతి కార్బన్ ఆసన్న కార్బన్లతో మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. మిగిలిన ఎలక్ట్రాన్ అణు ఆర్బిటాల్లతో అస్థానీకృతమయి అణువుకు ఎరోమాటిక్ స్వభావం చేకూరుస్తుంది. ఈ బంతి ఆకృతి గల అణువుకు 60 శీర్షాలు ఉన్నాయి. ప్రతి శీర్షంను ఒక కార్బన్ పరమాణువు ఆక్రమించి ఉంటుంది. ఈ కార్బన్లకు ఏక, ద్విబంధాలు రెండు ఉండి C – C బంధ దూరాలు 143.5 pm, 138.3 pm లు ఉంటాయి.
Exam Tips:
a) సిలికేట్లు, జియోలైట్లు, ఫుల్లరీన్లు మూడింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చి, ఒక్కొక్క దానికి నిర్మాణం + ఉదాహరణ + ఉపయోగం రాయండి.
అదనపు ప్రశ్నలు
Question 1: 14వ గ్రూపు మూలకాలలో
1) అధిక ఆమ్ల డై ఆక్సెడును ఏర్పరచేది
2) సాధారణంగా +2 ఆక్సీకరణ స్థితిలో ఏర్పడేది.
3) అర్థవాహక ఉపకరణాలలో ఉపయోగపడేది
Answer:
1) కార్బన్
2) లెడ్
3) సిలికాన్, జెర్మేనియం
Exam Tips:
a) 1) కార్బన్ (CO₂ ఆమ్లం), 2) లెడ్ (+2 స్థిరం), 3) Si, Ge (అర్ధవాహకాలు) — ఒక్కో మూలకం పేరే రాయండి.
Question 2: డైమండ్ సమయోజనీయ స్వభావం కలది. అయినప్పటికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఎందుకు ?
Answer:
ధృఢమైన C – C బంధాల అల్లికతో ఉన్న త్రిమితీయ నిర్మాణం డైమండ్‌కు ఉంటుంది. దృఢమైన C – C బంధాలను విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తి కావాలి. అందువల్ల దీని ద్రవీభవన ఉష్ణోగ్రత చాలా అధికం.
Exam Tips:
a) వజ్రంలోని దృఢమైన C–C బంధాల త్రిమితీయ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి అధిక శక్తి అవసరం అని రాయండి.
Question 3: కార్బన్ మోనాక్సైడ్ నిర్మాణం వ్రాయండి.
Answer:
CO అణువులో ఒక సిగ్మా, రెండు π బంధాలు కార్బన్ ఆక్సిజన్ల మధ్య గలవు. :C≡O: కార్బన్ పై ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండటం వలన CO అణువు ఎలక్ట్రాన్ జంట దాతగా పనిచేస్తుంది.
Exam Tips:
a) CO లో ఒక σ, రెండు π బంధాలు (:C≡O:), కార్బన్ మీద ఒంటరి జంట ఉండటం వల్ల ఇది లిగాండ్ (e⁻ జంట దాత)గా పనిచేస్తుందని రాయండి.
Question 4: IV A గ్రూపులో రూపాంతరతను చూపించని మూలకం ఏది ?
Answer:
లెడ్
Exam Tips:
a) IV A గ్రూపులో రూపాంతరత చూపని మూలకం లెడ్ (Pb). ఒక్క పదం సమాధానం చాలు.
Question 5: కార్బన్ మోనాక్సైడ్ యొక్క అనువర్తనాలను రాయండి.
Answer:
1. వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, కోల్ గ్యాస్‌ల వంటి వాయు ఇంధనాలలో CO ముఖ్యమైన అనుఘటకం.
2. అనేక లోహ ఆక్సైడ్లను క్షయకరణం చెందించి లోహాలుగా మారుస్తుంది.
3. మాండ్ పద్ధతిలో Ni నిష్కర్షణలో CO ని లైగాండ్గా వాడతారు.
Exam Tips:
a) CO ఉపయోగాలు: వాయు ఇంధనాలలో భాగం, లోహ ఆక్సైడ్ల క్షయకరణి, మాండ్ పద్ధతిలో Ni శుద్ధి.
Question 6: కార్బన్ డై ఆక్సైడ్ యొక్క అనువర్తనాలను రాయండి.
Answer:
1. ఘనస్థితిలో ఉన్న CO₂ ను డ్రై ఐస్ అంటారు. దీనిని ప్రశీతకంగా వాడతారు.
2. ప్రయోగశాలలో శీతలీకరణిగా వాడతారు.
3. యూరియాను తయారుచేయడానికి, జడవాతావరణాన్ని ఏర్పరచడానికి, క్షారాలను తటస్థీకరించడానికి వాడతారు.
4. అగ్నిమాపక యంత్రాలలో వాడతారు.
Exam Tips:
a) CO₂ ఉపయోగాలు: డ్రై ఐస్ (ప్రశీతకం), అగ్నిమాపకం, యూరియా తయారీ, జడ వాతావరణం.
Question 7: CO₂, SiO₂ ధర్మాలలో భేదాలు వ్రాయండి.
Answer:
| CO₂ | SiO₂ |
| 1) గది ఉష్ణోగ్రత వద్ద వాయువు. | 1) గది ఉష్ణోగ్రత వద్ద ఘన పాలిమర్. |
| 2) రేఖీయ నిర్మాణం కలిగి ఉంటుంది. | 2) పాలిమెరిక్ త్రిమితీయ నిర్మాణం కలిగి ఉంటుంది. |
| 3) C, O ల మధ్య ద్విబంధం ఉంటుంది. | 3) Si, O ల మధ్య ఏకబంధం ఉంటుంది. |
| 4) CO₂ అణువుల మధ్య బలహీనమైన వాన్డర్వాల్ ఆకర్షక బలాలు ఉంటాయి. | 4) SiO₂ లో బలమైన సమయోజనీయ బంధాలు ఉంటాయి. |
| 5) ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. | 5) ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. |
Exam Tips:
a) CO₂ vs SiO₂ పోలికను పట్టికలో (స్థితి, నిర్మాణం, బంధాలు, ద్రవీభవన ఉష్ణోగ్రత) రాయండి.
Question 8: కార్బన్, సిలికాన్ల మధ్య గల పోలికలను రాయండి.
Answer:
| కార్బన్ | సిలికాన్ |
| 1) దీని బాహ్య విన్యాసం 2s²2p² | 1) దీని బాహ్య విన్యాసం 3s²3p² |
| 2) దీని సంయోజకత నాలుగు. | 2) దీని సంయోజకత నాలుగు. |
| 3) ఇది అలోహం. | 3) ఇది అలోహం. |
| 4) కేటనేషన్ సామర్థ్యం ఉన్నది. | 4) కేటనేషన్ సామర్థ్యం ఉన్నది. |
Exam Tips:
a) కార్బన్, సిలికాన్ సారూప్యాలు: బాహ్య విన్యాసం ns²np², సంయోజకత 4, అలోహ స్వభావం, శృంఖలత (కొంతవరకు Si లో).
Question 9: పెన్సిళ్ళ తయారీలో కార్బన్ యొక్క ఏ రూపాంతరాన్ని వాడతారు ?
Answer:
గ్రాఫైట్‌ను పెన్సిళ్ళ తయారీలో వాడతారు.
Exam Tips:
a) పెన్సిళ్లలో వాడేది గ్రాఫైట్ (సీసం కాదు); మృదుత్వం, పొరల జారుడు స్వభావమే కారణం.
Question 10: లెడ్ యొక్క స్థిర ఆక్సీకరణ స్థితి ఏది ? కారణం ఏమిటి ?
Answer:
లెడ్ యొక్క స్థిర ఆక్సీకరణ స్థితి +2. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వల్ల +4 ఆక్సీకరణ స్థితి అస్థిరమైనది.
Exam Tips:
a) Pb స్థిర స్థితి +2; జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వల్ల +4 అస్థిరమని కారణం ఇవ్వండి.
Question 11: కార్బొరండం అనగా ఏమి ? ఇది ఎలా ఏర్పడుతుంది ?
Answer:
సిలికాన్ కార్బైడ్‌ను (SiC) కార్బొరండం అంటారు. విద్యుత్ కొలిమిలో సిలికాన్, కార్బన్లను కలిపి వేడి చేయడం ద్వారా దీనిని తయారుచేస్తారు.
Exam Tips:
a) కార్బొరండం = సిలికాన్ కార్బైడ్ (SiC); ఇది వజ్రం వలె కఠినమైనదని, అపఘర్షకంగా వాడతారని రాయండి.
Question 12: గ్రాఫైట్‌లో రెండు పొరల మధ్య దూరం ఎంత ? కారణం ఏమిటి ?
Answer:
గ్రాఫైట్‌లో రెండు పొరల మధ్య దూరం 3.35 Å. గ్రాఫైట్ పొరల మధ్య బలహీన వాన్ డర్వాల్ బలాలు ఉండటం వల్ల పొరల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది.
Exam Tips:
a) గ్రాఫైట్ పొరల మధ్య దూరం సుమారు 3.35 Å (పొరల మధ్య బలహీన బలాలు కారణం).
Question 13: CO₂మరియు SiO₂ లలో ఉండే సంకరీకరణాలు ఏమిటి ?
Answer:
CO₂ లో sp సంకరీకరణం ఉంటుంది. SiO₂ లో sp³ సంకరీకరణం ఉంటుంది.
Exam Tips:
a) CO₂ → sp (రేఖీయ), SiO₂ → sp³ (చతుర్ముఖీయం) అని సంకరీకరణం ఒకే వాక్యంలో రాయండి.
Question 14: డైమండ్ కఠినంగా ఉండగా గ్రాఫైట్ మృదువుగా ఉంటుంది. ఎందువలన ?
Answer:
డైమండ్‌కు బృహదణు నిర్మాణం ఉంటుంది. అందువలన అది కఠినంగా ఉంటుంది. గ్రాఫైట్‌లో పొరల నిర్మాణం ఉంటుంది. అందువలన అది మృదువుగా ఉంటుంది.
Exam Tips:
a) వజ్రం: త్రిమితీయ బృహదణు నిర్మాణం → కఠినం; గ్రాఫైట్: బలహీనంగా బంధించిన పొరలు → మృదువు.
Question 15: సిలికా ఫార్ములా SiO₂ గా ఎందుకు ఉంటుంది ?
Answer:
Si సిలికా నిర్మాణంలో ప్రతి టెట్రాహెడ్రన్ మూలమీద ఉన్న ఆక్సిజన్‌ను రెండు సిలికాన్ పరమాణువులు పంచుకుంటాయి. ప్రతి సిలికాన్ పరమాణువు శీర్షం వద్ద ఆక్సిజన్‌లో అర్ధ భాగాన్ని మాత్రమే ప్రదానం చేస్తుంది అన్నమాట. అందువలననే సిలికా ఫార్ములా SiO₂ అవుతుంది.
Exam Tips:
a) ప్రతి O ను రెండు Si లు పంచుకోవడం వల్ల ప్రతి Si కి 4 × ½ = 2 O, అందుకే SiO₂ అని లెక్కతో రాయండి.
Question 16: క్వార్ట్జ్ అంటే ఏమిటి ?
Answer:
పరిశుద్ధ సిలికాను క్వార్ట్జ్ అంటారు.
Exam Tips:
a) క్వార్ట్జ్ = స్వచ్ఛమైన స్ఫటిక సిలికా (SiO₂).
Question 17: ఆర్థో సిలికేట్స్, పైరో సిలికేట్స్ మరియు చైన్ సిలికేట్స్లో గల యూనిట్లను తెలపండి.
Answer:
ఆర్థో సిలికేట్లు : \( \mathrm{SiO_4^{4-}} \) యూనిట్లు
పైరో సిలికేట్లు : \( \mathrm{Si_2O_7^{6-}} \) యూనిట్లు
చైన్ సిలికేట్లు : \( \mathrm{SiO_3^{2-}} \) యూనిట్లు
Exam Tips:
a) ఆర్థో SiO₄⁴⁻, పైరో Si₂O₇⁶⁻, చైన్ (SiO₃)ₙ²ⁿ⁻ ఫార్ములాలను గుర్తుంచుకోండి.
Free study material for Chemistry
Free TS Board Textbook Explanations: Class 11 Chemistry Chapter 11 p-Block Elements - Group 14
Accessing Chapter 11 p-Block Elements - Group 14 Solutions
Explore reliable textbook solutions for Chapter 11 p-Block Elements - Group 14 tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Chemistry.
Concept-Driven Answers for Class 11 Chemistry
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Chemistry module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 11 p-Block Elements - Group 14 with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ in printable PDF format for offline study on any device.